ఈ మధ్య ప్రొ|| జయశంకర్ వర్ధంతి సందర్భంగా విద్యావంతుల వేదిక (ఆడ విద్యావంతుల్లేని) నిర్వహించిన మీటింగుకి ముఖ్యఅతిథిగా వచ్చిన అమితాబ్ పాండే ఉత్తరాఖండ్ రిటైర్డ్ అయ్యేయెస్ ఆఫీసర్ చాలా మంచి మాటలు, గొప్ప సంగతులు మాట్లాడిండు. అవి తెలంగాణ మగ విద్యావంతుల చెవికి, మైండ్‌కి యెక్కవు. ఆ ఆఫీసర్ మాట్లాడుతూ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినాక అనుకున్న ఫలితాలు యింకా దక్కలేదు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన వనరుల మీద కార్పోరేట్ కంపెనీల కంట్రోలు వుండకుండా చూడాలి, ప్రభుత్వ ఆధిపత్యముకన్న పనివిధానాలు పెంచాలి ప్రభుత్వపరంగా, అధికారాలు కేంద్రీకరించకూడదు. యింకోటి నవనిర్మాణంలో మహిళా సాధికారత పెంచకుంటే వారి భాగస్వామ్యం లేకుంటే ఆ ప్రభుత్వాలు అభివృద్ధి చెందలేవని మాట్లాడిన మాటలు తెలంగాణ మగ విద్యావంతులకు ఏమాత్రం అర్తమైనయో తెలవవు గానీ తెలంగాణ మహిళలు చాలా సంతోషపడిండ్రు. యీ మాటలు తెలంగాణ ప్రభుత్వం, రాజకీయాలు, నవనిర్మాణ నాయకత్వాలు పరిగణనలోకి తీసుకోవాలి. నిజంగా జెండర్ న్యాయాలు, భాగస్వామ్యాలు వుండడమే తెలంగాణ నవనిర్మాణం అభివృద్ధి అనే మాటలు యిక్కడి మగ గ్రూపులు మాట్లాడ్తలేవు. పైగా మాట్లాడిన మాట్లాడుతున్న మహిళలపట్ల అసహనాలు, హేళనలు చేస్తున్నరు.
వాస్తవాలు, చరిత్రలు మాట్లాడుకోవాలంటే మహిళలు లేకుండానే తెలంగాణ ఉద్యమం సాగిందా, తెలంగాణ వచ్చిందా! స్టేజిల కింద గుంపుగా వున్నది బ్యానర్లు మోసింది, జెండాలు పట్టింది, లాఠీలు తిన్నది, బాష్పవాయువులను ఎదుర్కొన్నది, నినాదాలైంది, కేసులబడ్డవాల్లు, అమరులైనది మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా వున్నరు. ఆ లెక్కలన్నీ యూనివర్సిటీ విద్యార్థినీలను అడిగితే చెప్తరు.
తెలంగాణ నాయకత్వాలు ”మహిళల్లేరు, రాంగ వద్దన్నామా! వాల్లు రాంది మేమేం జేస్తం” అనే బాధ్యతారాహిత్యం మాటలు మాట్లాడ్తున్నారు. మరి బోనాలు, బత్కమ్మలకు లక్షలమంది ఆడోల్లు ఎందుకు వస్తున్నారు. ఏ శక్తుల ప్రోద్బలంతో, ఏ రాజకీయ అవసరాలకు కూడగడ్తుండ్రు? అట్లాంటి కూడగట్టడాలు భాగస్వామ్యాలకు, నాయకత్వాలకు ఎందుకు కూడగడ్తలేరు? సామాజిక న్యాయాలు, ప్రజాస్వామికాలు మాట్లాడ్తున్నము అనుకుంటున్న మగమేధావులు తెలంగాణ మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యాలు అంటే ఎమ్మెల్యే సీట్లు కనీసంగానైనా కేటాయిం చనపుడు, మంత్రులుగా ఒక్క మహిళా అభ్యర్థికి యివ్వనందుకు, ఎమ్మెల్సీలుగా కూడా ఒక మహిళకు అవకాశం యివ్వకుంటే యింకా సలహా సభ్యుల్లో అడ్బయిజరీ బోర్డుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఒక్క తెలంగాణ మహిళను నియమించనప్పుడు, స్టాండింగ్ కమిటీల్లో, కౌన్సిల్స్‌లో మహిళా అడ్వకేట్‌ను కూడా ప్రతిపాదించని యీ సందర్భాల్లో తెలంగాణ మగమేధావులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు, సామాజిక ఉద్యమకారులనుకునేవాళ్ళు ఎందుకు మహిళల తరఫున మాట్లాడడము లేదు? మహిళల తరఫున మాట్లాడ్డం, మహిళల భాగస్వామ్యం గూర్చి మాట్లాడ్డం సామాజిక న్యాయాలు కావా!
సకలజనుల సమ్మెలో, సహాయ నిరాకరణలో కేవలం మగవాళ్ళు మాత్రమే ఉద్యమించారా! నాయకత్వ స్థానాల్లోకి రాకుండా, భాగస్వామ్యాలు యివ్వని అవమానాలు కోకొల్లలు ఎదుర్కున్నరు తెలంగాణ ఉద్యమంలో మహిళలు. పాల్గొనేవరకే ఎట్లాంటి గుర్తింపు గౌరవాలుండవు. తెలంగాణ అన్ని జెఎసిల్లో మహిళలున్నరు. కాని తెలంగాణ సాధించుకున్నాక ఫలితాల్లో వారి ప్రాతినిధ్యాలు కనపించడం లేదు. యిది ఒక లోపంగా ఏ సామాజిక న్యాయవాదులకు, ప్రసాజ్వామికవాదులకు కనబడకపోవడం యాదృచ్ఛికం కాదు. ఉద్యమాల్లో మా భాగస్వామ్య నాయకత్వాల్ని మాట్లాడబోతే, జెండర్ సమన్యాయాలు బోతే.. తెలంగాణకు వ్యతిరేకం అనీ, తెలంగాణ తప్ప ఏం మాట్లాడిన తెలంగాణ పక్కకు బోతదనీ ఏ వివక్షలు మాట్లాడొద్దు అని మా గొంతులు మా గుండెల్లో నొక్కేసిన మగ విధానాలు. ఎంత విషాదం తెలంగాణ మహిళలది. మట్టిమహిళల నుంచి అగ్రకుల మహిళలదాకా యిదే దుస్థితి. నిజానికి తెలంగాణ మహిళా చారిత్రక అస్తిత్వాలు పోరాట అస్తిత్వాలు. కావ్యాలల్లిన మొల్ల అస్తిత్వాలు, రాజ్యాలేలిన రుద్రమ్మ అస్తిత్వాలు, తుపాకులు బట్టి తూటాల మాలలు తొడిగిన యుద్ధ అస్తిత్వాలు ఆదివాసీ సమ్మక్క పోరాటాలు, పాలకుర్తి అయిలమ్మ, సిందెల్లమ్మ, సదాలక్ష్మమ్మ, ఈశ్వరీబాయి అస్తిత్వ వారసులు తెలంగాణ మహిళలు. అట్లాంటి మహిళల అస్తిత్వాలను అణచివేసే క్రమం ఎదుర్కుంటున్నరు తెలంగాణ మహిళలు. యీ మహిళలను అప్రస్తుతం జేసే అన్యాయాల్ని ఎదుర్కునేదానికి మహిళలు యీ మధ్య కూడ్తుండడము, ఒక తెలంగాణ మహిళాశక్తిగా సమాయత్తం కావడం మంచి పరిణామం.