పి. సత్యవతి
1980ల తరవాత స్త్రీవాద ఉద్యమ ఉధృతి తగ్గిందనీ, స్త్రీలకి కూడా ఉద్యమంపై ఆసక్తి సన్నగిల్లిందనీ, అటు ఇంటిని నిర్వహిస్తూ, ఇటు తన ఉద్యోగం, వ్యక్తిగత అభిరుచుల క్రియశీల కార్యక్రమాల నిర్వర్తించడం కష్టమని తేలిపోయింది కనుక, అన్నీ కావాలనుకోడం అత్యాశ అవుతుందంటూ పత్రికల నిండా వ్యాసాలు రావడం మొదలైంది.
నిజంగా 60, 70లలో ఉవ్వెత్తున ఎగసిపడిన స్త్రీవాదం పస కోల్పోయి చతికిల పడిందా? స్త్రీలు కోరుకున్న అవకాశాలలో చాలా వరకు సాధించేశారు కనుక ఇక వాళ్ళకి పోరాడే విషయలేమీ లేవా? అంటే చాలా వున్నాయి. వివక్ష వుంది, పదవుల విషయంలో ఉన్నత స్థానాలలో స్త్రీల సంఖ్య చాలా తక్కువ. అయితే 1990వ దశకంలో కొచ్చేసరికి స్త్రీవాదం కొత్త రూపం సంతరించుకుంది. అదే థర్డ్ వేవ్, గర్ల్ పవర్ వగైరా. 60, 70లలో ఉద్యమించిన వారి పిల్లల సంతతి ప్రారంభించిన స్త్రీవాదం అన్నమాట. ప్రముఖ రచయిత ఆలీస్ వాకర్ కూతురు ళీరీ పత్రికలో వ్రాసిన కవిత “I AM THE THIRD WAVE” ఇందుకొక ఉదాహరణ. స్త్రీవాదం అంతరించలేదని వివరిస్తూ, జెన్నిఫర్ బామ్ గార్డ్ నర్, ఏమీ రిచర్డ్స్ ”మానిఫెస్టా, యువతుల, స్త్రీవాద భవిష్యత్తు” అనే గ్రంధం ప్రచురించారు. రాజకీయలలోనూ, విద్యా, సాంస్కృతిక రంగాలలోనూ , స్త్రీవాదం ప్రాముఖ్యత గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. 1990ల తరవాత ప్రబలుతున్న ”గర్లీ కల్చర్” గురించి వాళ్ళు పేర్కొన్నారు. అయితే ఈ సంస్కృతికి సెకండ్ వేవ్ స్త్రీవాదులు వ్యతిరేకులని వారికి అర్ధం అయింది. లిప్‌సిక్ట్ వేసుకోడం, సమష్ఠికన్న వ్యష్ఠికి ప్రాముఖ్య మివ్వడం మాత్రమే స్త్రీవాదం కాదంటారు వీళ్ళు. స్త్రీవాదుల మధ్యంతరాల అంతరాలు మొదలయ్యయి. అసలు థర్డ్ వేవ్ ఫెమినిజం అంటే ఏమిటో చూద్దాం మూడవ దశ స్త్రీవాదులు స్త్రీలకు ఆర్ధిక రాజకీయ, సామాజిక, వ్యక్తిగత స్వాతంత్య్రం కావాలంటారు.
అయితే వీళ్ళు వ్యక్తి సాధికారతకి ఎక్కువ ప్రాముఖ్యమిస్తారు, సమష్ఠి కార్యాచరణకన్నా, ఈ సంక్లిష్ట మానవ జీవన యానంలో స్త్రీలు తాము ఒక అర్ధవంతమైన జీవితాన్ని ఎవరికివారే నిర్మించుకోవాలంటారు. తాము ఇకమీదట పీడితులము కామనీ, దానినుంచి బయటపడ్డామనీ ఆ దిశగా తమని తాము చూసుకోవాలనీ అంటారు. వ్యక్తిగత అభివృద్ధ్దే సమాజాభివృద్ధికి మార్గమంటారు. స్త్రీల లైంగికతకు ఎక్కువ ప్రాముఖ్యమిస్తారు. సంప్రదాయ సిద్ధంగా స్త్రీలకు నిషేధించిన ఆవేశం, కోపం, చొరవ, మనసువిప్పి మాట్లాడడం మొదలైన ”స్త్రీవికాని” అలవాట్లని స్వాగతిస్తారు. గొంతూ మనసూ విప్పమంటారు. జీవితంలో ద్వంద్వ విలువల వైఖరుల వుండకూడదనీ స్త్రీలంతా తమకునచ్చిన విధంగా సౌకర్యంగా జీవించగలగాలనీ ఆశిస్తారు. సెకండ్ వేవ్ స్త్రీవాదులు ఎక్కువగా మధ్యతరగతి, శ్వేతజాతి మహిళల గురించే పట్టించుకున్నారనీ ఇప్పుడు తాము అన్ని జాతుల, వర్గాల మహిళల్నే కాక లెస్బియన్లని గురించికూడా ఆలోచిస్తామనీ అంటారు. సెకండ్ వేవ్ స్త్రీవాదులు, లింగవివక్షను నిర్మలించే చట్టాలకోసం, గర్భస్రావాన్ని న్యాయబద్ధం చేసే చట్టాల కోసం, ఇట్లా అనేక చట్టాల కోసం కార్యాచరణకు కృషిచేశారు. అయితే ఇప్పటి మూడవ దశలో వీరు, ఈక్రియశీల కార్యాచరణ కన్నా వ్యక్తిగత సాధికారతకే పెద్దపీట వేస్తారు. స్త్రీలంతా తమకు నచ్చిన విధంగా తమ ప్రత్యేకతను, తమదైన స్థానాన్నీ సాధించాలంటారు.
ఈ మార్పు స్త్రీవాదోద్యమాన్ని పక్కదారి పట్టించేది కాదని, స్త్రీవాదోద్యమ ఫలాలను నిలుపుకుంటనే మరింత విస్తృతమవుతున్నదనీ అర్థం చేసుకోవాలి. అయితే థర్డ్ వేవ్ స్త్రీవాదం మీద వున్న విమర్శ ఏమిటంటే అది ఒక రాజకీయ ఉద్యమం కాదని, వ్యక్తిగత సాధికారతా సాధనకే పరిమితమై, సమష్టి కార్యాచరణ స్ఫర్తిని కోల్పోయిందనీ, అందువలన సమాజంలో ఆశించిన మార్పు తీసుకు రావటం కష్ట ”మనీ, స్త్రీలను స్త్రీవాదోద్యమ కార్యాచరణనించీ మళ్ళిస్తుందనీ. మరొకటేమిటంటే, ఎవరి ఉన్నతికి వారు ప్రయత్నించటం, విశ్వ శ్రేయస్సు గురించి ఆలోచించక పోవటమేనని. స్త్రీలు తమ లైంగికతనే తమ అధికారంగా శక్తిగా భావిస్తే అది స్త్రీవాదోద్యవనికి మంచికన్నా చెడే ఎక్కువ చేస్తుందనే విమర్శ కూడా వుంది. స్త్రీవాదానికి కాలంచెల్లిందనే మాట అబద్ధం. అది ఇప్పటి యువత జీవన విధానంలో కలసిపోయి మరింత విస్తృతమైంది, అలంకరణ అనేది స్త్రీలను నిర్బంధంలో వుంచడానికని 70లలో స్త్రీవాదులంటే, అది మా యిష్టం, మేం అమ్మాయిల్లాగే వుంటాం అంటారు 60, 70లలో పుట్టిన అమ్మాయిలు. ఎలా అలంకరించుకున్నా తమకొకస్థానాన్ని తామే సంపాదించుకుంటా మంటారు. ఇదంతా పాశ్చాత్య దేశాల విషయంలో. మరి మన సంగతేమిటో తరవాత చూద్దాం.