ఆదివారం సాయంత్రం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మట్టిపూలు రచయిత్రుల వేదిక, తెలంగాణ మహిళా కో-ఆర్డినేషన్ కమిటి, బహుజనం మాసపత్రిక, ముక్త వుమెన్స్ కలెక్టివ్, మాదిగ మహాశక్తి సంఘాల ఆధ్వర్యంలో ”మహిళలపై అత్యాచారాల ప్రతిఘటనా దినం”గా మాజీ పార్లమెంటు సభ్యురాలు ఫూలన్‌దేవి 51వ జయంతి సభ జరిగింది. మట్టిపూల రచయిత్రి జూపాక సుభద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ఈ క్రింది తీర్మానాలను చేసింది.
1. వ్యవస్థీకృత సామాజిక దురాచారాలు, నేరాలైన బాల్య వివాహాలు, మహిళలు, శ్రామిక కులాలపై లైంగిక, హంతక దాడులు, లింగ, కుల వివక్షలపై తిరుగుబాటు చేసిన మాజీ పార్లమెంటు సభ్యురాలు, దివంగత ఫూలన్‌దేవి జయంతి, వర్ధంతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి.
2. మాజీ పార్లమెంటు సభ్యురాలు ఫూలన్‌దేవి జీవితం, తిరుగుబాటు, సేవలు, సాధించిన విజయాలను దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైస్కూలు విద్యార్థినీ, విద్యార్ధులకు పాఠ్యాంశాలుగా పొందుపరచాలి
3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలకు, అవి చేపట్టే మహిళా సాధికార విధానాలకు, పథకాలకు ఫూలన్‌దేవి పేరు పెట్టాలి.
4. కేంద్ర ప్రభుత్వం ఫూలన్‌దేవి విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టించాలి.
5. ఫూలన్ దేవి పుట్టిన జలాన్ జిల్లాకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ”ఫూలన్‌దేవి జిల్లా”గా నామకరణం చెయ్యాలి.
ఇంకా ఈ సమవేశంలో జోగినీ వ్యవస్థా వ్యతిరేక ఉద్యమ జాతీయ నాయకురాలు ఆజమ్మ, ప్రముఖ మట్టిపూల రచయిత్రులు జ్వలిత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధ్యాపకురాలు ప్రొఫెసర్ వై. స్వరూపరాణి, ముక్త వుమెన్స్ కలెక్టివ్ నాయకురాలు కొల్లాపూర్ విమల, 1969 తెలంగాణ ఉద్యమ నాయకుడు డాక్టర్ చిరంజీవి కొల్లూరి, బహుజనం మాసపత్రిక ఎడిటర్ డప్పోల్ల రమేష్, మాదిగ మహాశక్తి జాతీయ కన్వీనర్ కృపాకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. వాగ్గేయరాజు జయరాజు, మార్పు కళామండలి ఎన్నార్ బృందాలచే ఫూలన్ గీతాలు ఆలపించ బడినాయి. వివిధ మహిళా, ఉద్యోగినీ, దళిత, బిసీ సంఘాల నాయకులు, రచయిత్రులు, మేధావులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.