రాజస్థాన్ అనగానే మనకు రాణాప్రతాప్, రాణీ పద్మిని – భీమసింగ్ మొదలగు క్షత్రియరాజులు, త్యాగశీలి దాయిపన్నా గుర్తుకొస్తారు. కాలం మారింది. సామాన్య ప్రజల జీవన చిత్రణకు చరిత్రలో స్థానం లభించింది.
భన్వరిదేవిది రాజస్థాన్‌లోని భాతరి గ్రామం. ఆమె ఉన్నతకులంలోగాని, కలవారి ఇంటిలోగాని పుట్టలేదు. చదువుకోలేదు. రోజు కూలిపనికెళితేనే కడుపుకింత మేత దొరికేది. ఆమె మదిలో సామాజిక చైతన్యం అంకురించింది. వయసుతోపాటు సామాజిక స్పృహ నెమ్మది నెమ్మదిగా ఎదిగి మహావృక్షమయింది. ఆ చైతన్యమే మహిళల సమస్యల మీద పోరాడే దిశకు ప్రోత్సహించింది. ఆమెలోని సామాజిక స్పృహ అబ్బుర పరచటమే కాక అభినందింపచేస్తుంది. రాష్ట్ర మహిళా వికాస సంస్థలో సభ్యురాలుగా చేరింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు ఆ ఊరిలోని ఆగర్భశ్రీమంతునితో తలపడింది. ఆ కుబేరుని ఇంటిలో కేవలం ఒక సంవత్సరం పిల్లకు వివాహం నిశ్చయమయింది. (ఆ ఘటన జరిగిన సమయంలో వార్తాపత్రికల్లో వచ్చిన సమాచారం అది) ఆ బాల్య వివాహం ఆపాలని భన్వరిదేవి పోలీస్‌స్టేషన్‌లో పిటిషన్ దాఖలు చేసింది. చదువుకు, సంస్కారానికి సంబంధం లేదని భన్వరిదేవి కార్యక్రమాలు నిరూపించాయి. వివాహం జరిగే రోజున పోలీస్ ఆఫీసర్ హాజరయ్యాడు. ఇంద్రభవనాన్ని తలదన్నే ఆ యింటిని, కళ్లుమిరుమిట్లుగొల్పే వివాహ ఏర్పాట్లు చూసి నిర్ఘాంతపోయాడు. నిశ్చేష్టుడయ్యాడు. ఆ శ్రీమంతునిపై కేసు పెట్టే ధైర్యంలేక వెనుదిరిగిపోయాడు.
భన్వరిదేవి పట్టు వదలలేదు. మహిళాసంఘ సాయంతో కోర్టులో కేసు పెట్టింది. డబ్బుతో జరగని పనంటూ మనదేశంలో ఏదీ లేదన్న నగ్నసత్యం అందరికి తెలిసిన విషయమే కదా! ఆ ఆగర్భ శ్రీమంతుడు పోలీస్ అధికారులను, న్యాయవాదులను, చివరకు న్యాయాధీశులవారిని కొనిపారేశాడు. కేసు పెట్టిందన్న కసితో ఉన్నత కులానికి చెందిన అయిదుగురు గుజ్జరులు కలసి భన్వరిదేవిని అత్యాచారానికి గురిచేశారు. ట్రయల్ కోర్టు న్యాయాధీశులవారు ఏమని తీర్పు చెప్పారో చూడండి. ఉన్నత కులాల పురుషులు, తక్కువ కులానికి చెందిన స్త్రీపై అత్యాచారం చేయలేదని, అలాంటి నేరాలలో బాబాయ్-అబ్బాయిలు ఒకరికొకరు సహకరించుకునే అవకాశం లేదని తీర్పు చెప్పారు. అంత నిస్సిగ్గుగా వెలువడిన తీర్పు విని అందరూ విస్తుపోయారు. పచ్చి అబద్ధాల తీర్పు వెలువడగానే దేశమంతటా మహిళాసంఘాల ఆందోళనలు మొదలయ్యాయి. ఆందోళనలు తట్టుకోలేక నిందితులను తాత్కాలికంగా అరెస్టు చేశారు. 1995లో నిందితులందరిని విడుదల చేశారు. అనేక మహిళాసంఘాలు కలసి ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టులో ఫైల్ చేశాయి. సుప్రీంకోర్టు దానిని విచారించి రాజస్థాన్ హైకోర్టుకు పంపింది. ఆ దురాగతం జరిగి దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాలు కాలగర్భంలో కలసిపోయాయి. ఇప్పటికి తీర్పుకు నోచుకోలేదు. రాజస్థాన్ హైకోర్టులో పెండింగ్‌లో పడివుంది.
భన్వరిదేవి నిత్యము కష్టాలు, అవమానాలు ఎదు ర్కొంటూ నిలబడింది. సమాజం నుండి వెలివేశారు. అయినా జంకలేదు. గ్రామం వదలి వెళ్లమని ఆజ్ఞలు జారీ చేశారు. అసమాన ధీరమహిళ భన్వరి వారి ఆజ్ఞలను ధిక్కరించింది. నేను పుట్టి పెరిగిన గడ్డను విడిచేది లేదని ఎదురుతిరిగింది. ఆమెకు ఎటునుంచి ఏ సహాయం అందలేదు. రాష్ట్రప్రభుత్వం నుంచి ఇసుమంత ఆదరణ లభించలేదు. అయినా ఆమె ఎలాంటి నిరాశా-నిస్పృహలకు గురికాలేదు. ఆమెను సామాజిక సేవికరాండ్రు కలిసి మాట్లాడారు. వారితో భన్వరిదేవి తనను ఎవరూ ఇంటర్వ్యూ చేయలేదని చెప్పింది. పోరాటంనుంచి వైదొలగే ప్రసక్తే లేదంది. పోరాటం వలన నాకు కాకపోయినా మిగతా సోదరీమణులకు మేలు జరగవచ్చు అన్నది. భావితరాలవారు బాల్యవివాహాల, సతీసహగమన దురాచారాల నుండి కాపాడబడతారన్న తన దృఢ సంకల్పాన్ని వారికి తెలియపరచింది.
నిరక్షరకుక్షురాలు, మేరునగధీరురాలు భన్వరిదేవి. మొక్కవోని ఆమె ధైర్యసాహసాలకు, పోరాటపటిమకు జేజేలు పలుకుతూ, శిరసు వంచి రెండు చేతులెత్తి నమస్కరిస్తున్న.