పియమైన సుమతీ,
ఎలా ఉన్నావ్? ఇల్లు ఖాళీచేసి నగరంలోకి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, మనం కలుసుకునే క్షణాలే లేకుండాపోయాయి. నిన్ను చూసి చాల్రోజులు అయిపోయింది. చూడాలనివుంది. కానీ నీ చుట్టూ ఉన్న బాధ్యతల వలయంలో తిరుగుతూనే ఉన్నావు. ఆ వలయం ఆగదు. మనకు కాలం దొరకదు. అంతే సమాధాన పడి పోవాలి.
ఈ మధ్యే ఎందుకో విషాదసన్నివేశాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ‘చేరా’ గారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. నీకు కూడా ఆయన తెల్సుకదా! ప్రపంచంలోని భాషా వేత్తల్లో ప్రముఖమైన వాళ్ళు పదిమంది వుంటే అందులో చేరాగారు ఒకరు. ఆయన రాసిన ‘తెలుగు వాక్యం’ గుర్తుందానీకు ‘చేరాతలు’ శీర్షికతో ఎందరో యువకవుల్ని వెలికి తెచ్చారాయన అక్షరాలా స్త్రీవాద సాహిత్యానికీ, స్త్రీవాదులకు సపోర్ట్‌గా నిలిచారు. ఆయన మరణించినా, అక్షరాలలో నిలిచిపోయే ఉన్నారనిపిస్తుంది. కొందరంతే మరణించిన తర్వాత కూడా ప్రజల నాల్కలపై జీవించే ఉంటారు ‘జాషువా అన్నట్లుగా కదూ!
మొన్నీ మధ్యన మెహబూబ్‌నగర్‌లో ‘గోరటి ఎంకన్న’ పై సెమినార్‌లా పెట్టారు. నేను కూడా వెళ్ళి మాట్లాడి వచ్చాను. వాగ్గేయ కారుడు కదా అతను. అప్పుడు ‘సుభాషిణి’ కనబడింది. నీ గురించి అడిగింది.
‘గాజా’ దారుణం వింటున్నావా సుమతీ! మనకి కన్నీళ్ళు కూడా గడ్డ కట్టుకు పోతున్నాయని పిస్తోంది. ఎంత హింస ఎంత హింస? పసి పిల్లలు బాంబుల వర్షంలో తడుస్తూ, ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో అర్థంకాని అచేతన స్థితిలోనే ప్రాణాలను కోల్పోతున్న వైనాలు. గాజు ముక్క సర్రున కోస్తున్నట్లుగా ‘గాజా’ ముక్క చెక్కలవుతోంది. సుమతీ! మన మెక్కడున్నా విషాదం ఎక్కువైనప్పుడిలాగే మంచు ముక్కలై పోతుంటామేమో!
నిన్న శాంతసుందరిగారు కలిశారు. ఆమె అనువాదం చేసిన ‘అసురుడు’ – ఇచ్చారు. చదవడం మొదలుపెట్టాను. చాలా పెద్దపుస్తకం. పూర్తయ్యాక నీకిస్తాను ఈ మధ్యకాలంలో వచ్చిన అద్భుతమైన పుస్తకమని అందరూ అనుకుంటున్నారుకదా!
రేపు ‘సర్వే’ హడావుడి కదా! మనని మనం కాగితాల్లో వెతుక్కోవడం మొదలుపెట్టాలిక.
ఈ మధ్యే ‘షంఫాద్ మొహమ్మద్’ అనే కవయిత్రి ఈ కిటికీ తెరుచుకునేది ఊహల్లోకే ….. అనే పేరుతో కవితా సంకలనం వేసింది. నేను రిసెర్చ్ చేసే టైమ్‌లో, 90లో అనుకుంటా, ‘పర్సనల్‌లా’ అనే తన పోయెమ్ ‘ఉదయం’లో చదివినట్లు గుర్తు. చాలా పవర్‌ఫుల్‌గా రాసింది. ఫారిన్‌లో సెటిల య్యింది. మళ్ళీ ఇన్నేళ్ళకు కవిత్వమై మన ముందుకువచ్చింది. ‘షాజహానా’ వాళ్ళ అక్కఅట. దిలావర్ గారి అమ్మాయి. స్త్రీలు కుటుంబాల్లో ఎలా ముడుచుకు పోతున్నారో, లోలోన ఎంత పెనుగులాడ్తున్నారో, ఎంత సంఘర్షణకు గురువుతున్నారో చాలా బాగారాసింది. స్త్రీలకు ఊహల్లో సైతం స్వేచ్ఛ లేదనే, వాస్తవాన్ని చెప్పింది. హృదయపు కిటికీ తెరుస్తున్నా అది తిరిగి తిరిగి ఊహల్లోంచి ఊహల్లోకే వెళ్తోందనే వేదనను వెలిబుచ్చింది. ”అమ్మా మందివ్వమ్మా! – అనే కవిత చదవగానే ‘పాటిబండ్ల రజని’ రాసిన ‘పాలింకి పోవడానికి మాత్రలున్నట్లు, మనసింకి పోవడానిక్కూడా, మాత్రలుంటే బాగుండును అన్న కవిత గుర్తొచ్చింది. పిల్లల జీవితాల్లో అమెరికా, ఇండియాలు తెచ్చిన మానసిక సంచలనాలను ఒకచోట కవిత్వీకరించింది. మంచి కవితా నైపుణ్యంతో, కొత్త కొత్త పోలికల్తో చెబ్తూ, స్త్రీల పురోగతిని కాంక్షించిన షంఫాద్ కవిత్వం విలువైంద నిపించింది. ముస్లిం స్త్రీల జీవన చిత్రాల ప్రతి బింబంగా ఈ పుస్తకం కన్పించింది.
రష్మీ, సువర్ణ ఎలా ఉన్నారు? ఉత్తరాలు రాస్తూండు కనీసం అలా ఐనా అక్షరాల్లో ఒకర్నొకరం చూసుకుందాం. స్నేహమెప్పుడూ పచ్చగానే ఉండాలి గుర్తురాగానే చిర్నవ్వుల పుప్పొడులం కావాలి. కానీ, స్నేహం ముసుగులో వెన్నుపోటు పోడిచేవాళ్ళు, ఇతరుల జీవితాల్తో ఆడుకుని ఆనందించే వాళ్ళు, సదా ద్రోహచింతనతో ఉండే వ్యక్తులు ఎదురైనప్పుడు గుండెకు గాయమవుతూ ఉంటుంది కదా! ఐనా, తప్పదు. మిగిలిన కొద్ది మందైనా పరిపూర్ణమైన స్నేహంతో ఎప్పటికీ మిగలాలనే నా ఆకాంక్ష. మరి, ఉండనా ఇప్పటికి నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తూ…
నీ శిలాలోలిత