23 ఏళ్ళ క్రితం ఒక రోజు పొద్దున్నే (1991 ఆగస్టు 8) న్యూస్ పేపర్లో వార్తతో బాటు ఒక ఫోటో చూశాను. చుండూరులో రెడ్లు, బలిజలు కలిసి ఎనిమిది మంది దళితులను చంపి పంట కాలువలో, తుంగభద్రలో తొక్కి వేసిన కధనం. పత్రికలు కొన్ని విలువలను పాటిస్తున్న రోజులవి. శవాల నోటి మీద ఈగలు చూయించలేదా ఫోటో. భర్తలను, బిడ్డలను కోల్పోయిన దళిత స్త్రీల ఆక్రందనలతో వచ్చిన ఫోటో అది. అప్పటి యువ హృదయాలు కార్పరేట్ చదువులతో ఇంకా మొద్దుబారలేదు. ప్రభుత్వ కళాశాలల్లో ఇంకా మానవ శాస్త్రం, సామాజిక శాస్త్రం, చరిత్ర బతికి ఉన్న రోజులు అవి. రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు, ప్రజాస్వామికవాదులు చుండూరు బాట పట్టారు. కావలి జవహర్ భారతీ దళిత విద్యార్ధులు కూడా ఈ ఘటనను తమ గ్రామ పరిస్థితులతో ఐడెంటిఫై అయ్యారేమో వందలుగా చుండూరు తరలి వచ్చారు. ఆ రైల్లో నేనూ ఉన్నాను. తెనాలి దగ్గర పోలీసులు ఆపేసి లాఠి చార్జీ చేశారు. చుండూరు వెళ్ళకుండానే వెనక్కి తిరగాల్సి వచ్చింది. కొంత కాలానికి చుండూరిని నా లోలోపల సమాధి చేయ ప్రయత్నిం చాను. కానీ నా అంతరంతరాలలో అది నన్ను సలుపుతూనే ఉంది.
ఇంకో పదమూడేళ్ళకు, 2004లో అనుకొంటాను, స్థానిక కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్న చుండూరు దళిత మహిళల ఫోటో ఒకటి పేపర్లో వచ్చింది. కాళ్ళకు చెప్పులు, తలకు సవురు లేని కుడి పైట వేసుకొన్న ఆడోళ్ళు ఎండకు అడ్డంగా చేతులు పెట్టుకొని తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. పాతిపెట్టాననుకొన్న ఆ గాయం మళ్ళీ మొలిచింది.
ఇప్పుడు ఇరవైమూడు సంవత్సరాల తరువాత వెళ్ళగలిగాను చుండూరుకి. పచ్చని పొలాలతో … దారి పొడవునా క్రమశిక్షణతో పారుతున్న పంటకాలువతో సుభిక్షంగా కనిపిస్తుంది పైకి చుండూరు. మాలపల్లెకు కూతవేటు దూరంలో ఉన్న అరటి తోట గడిచిపోయిన ఘటనను వివరిస్తున్న సాక్షి లాగా మూగగా మా వైపు చూస్తుంది. చుండూరు పెద్దగా మారలేదు అన్నారు. ఊరిలో ఒకప్పటి పెంకుటిళ్ళు డాబాలుగా మారాయి. పల్లెలో గుడిసెలు ‘రాజీవ్ గృహాలు’ అయ్యాయి. మాలలకు ఆ ఘటన తరువాత ఇచ్చిన అర ఎకరం పొలం తప్ప భూమి లేదు. వాళ్ళు రైతుల పొలాల్లోకి కూలికి పోక తప్పటం లేదు.
చుండూరు దళిత మహిళలు ఎండకు కాటు బారిన నల్లటి మొహాలతో, రంగులు వెలిసిపోయిన రయికలతో, లుంగలు చుట్టుకు పోయిన పాలియస్టర్ చీరలతో అలాగే ఉన్నారు. 23 ఏళ్ళ క్రితం ఫోటోలో రోదించిన స్త్రీ వీరిలో ఎవరు? లోతుకుపోయిన బుగ్గలతో, ఎండుకుపోయిన ముఖంతో గుండెలు పగిలేలా ఏడ్చిన ఆ తల్లి వీళ్ళల్లో ఒక్కతై ఉంటుందా? లేక అందరి కడుపుకోత ఆమెదై అప్పుడు ఆమె దుఃఖించి ఉంటుందా? ఆ ఫోటో ఇప్పుడిక దొరకదు. కానీ అప్పుడు నాకంటుకొన్న దుఃఖం నా చుట్టూ నిలబడి ఉన్న ఆడోళ్ళ నుండి నన్ను మళ్ళీ తాకి వణికించింది. కన్న పేగును నిలువుగా కోసి పాతేసినా, గురిపెట్టి కాల్చినా దిక్కు దివాణం లేని నిస్సహాయ స్థితిని ఇరవై మూడేళ్ళు మోసిన దుఃఖం. ఈ దేశంలో అణాకాణి విలువ లేనిదని నిరూపించబడిన పేద దళిత స్త్రీ పిచ్చి దుఃఖం అది.
ఆ సంఘటన జరిగినపుడు యువకులు ఇప్పుడు నడికారు మనుషులు. ఆ నాటి తండ్రులు ఇప్పుడు వృద్ధులు. కర్రలు పట్టుకొని గోడలకు చారిగిల పడి కళ్ళు మూసుకొని మీటింగ్‌లో చెబుతున్న వారి మాటలకు తలలు ఊపుతున్నారు. అప్పుడు పుట్టిన పసి పిల్లలు నేటి యువకులు అక్కడ. స్థానిక కోర్టు తీర్పు చెప్పి చేతులు దులుపుకొన్న తరువాత ఆ కోర్టు బిల్డింగ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌గా మారిస్తే అక్కడ చారు నీళ్ళతో అన్నం తిని చదువుకొన్న పిల్లలు. ”ఆ విషయం వింటుంటే ఇప్పటికీ రక్తం మరుగుతుంది.” అంటున్నారక్కడ ఆ కుర్రోళ్ళు.
”భయపడి ఊరొదిలి నెల రోజులు గుంటూర్లో గుడారాల్లో ఉన్నాము. మీకేమి పర్వాలేదు, నాయం జరుగుతుంది, మీ ఊరికి వెళ్ళండని చెప్పి పంపారు. ఇన్నేళ్ళు గడిచినా ఏమి నాయం జరిగింది? అసలేమీ జరగలేదని అంటున్నారు. అసలేమి జరగకపోతే వాళ్ళను సంపినోళ్ళు ఎవరు?” ఊరి నడిబొడ్డున పాతి పెట్టిన బొందలను వేలు పెట్టి చూపిస్తూ అడిగింది యాభైఏళ్ళ పార్వతి.
చుండూరు ఘటన జరిగినపుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆవేశపడిన యువరక్తం ఇప్పుడు మంచి మంచి సాఫ్ట్‌వేరు ఉద్యోగాలు సంపాదించి విదేశాలకు ఎగబాకి స్థిరమైన జీవితాల్లోకి వెళ్ళిన తరువాత ఆ ఘటన వాళ్ళ మనసుల్లో మబ్బు మూసి, మసకబారి దాని ప్రాధాన్యతను కోల్పోయి ఉండొచ్చు. ”ఇరవై మూడు ఏళ్ళు గడిచాయి కదా! అన్నీ మర్చిపోయి ఊరివాళ్ళతో కలిసి మెలిసి (వాళ్ళ పొలాల్లో బాగా పని చేసి) ప్రశాంతంగా బ్రతకండని” ధర్మాసనాలు నీతి సూక్తులు వల్లించవచ్చు.
కానీ ఎదురుగా ఎత్తుగా కప్పిన మట్టి. దాని కింద ఇమ్మాన్యి యేలు, జయరాజు, అనిల్‌కుమార్, మత్తయ్య, సుబ్బారావు, మండ్రు రమేశ్, అంగలకుదురు రాజ్ మోహన్, సంసోను, ఇసాక్ ఉన్నారు. ఒక భౌతిక వాస్తవం. మరుగు పర్చలేని, మర్చిపోలేని కుల రసి కారుతున్న వ్రణాన్ని చుండూరు దళితవాడ, దానితో బాటు ఎనభైవేల దళితవాడలు గుండెగదుల్లో మోస్తూ పెదాలు అదిమి పెట్టి భరిస్తున్నాయి. మీ మనువాద తీర్పులతో ఆ రాచపుండును గెలికితే ఆ బాధ ఏ రూపంలోనైనా ఉబికి వస్తే… అది ఒక అడవిగానో, ఒక తుపాకిగానో మారితే అది ఎవరి తప్పు అవుతుంది?
ప్చ్.. తీర్పు వెలువడిన తర్వాత కూడా ఈ సంఘటనపై స్పందించని వారు చాలా మంది ఉన్నారు దళితజాతిని ఉద్దరిస్తామనే నాయకులు కూడా మౌనం వహించినట్లే ఉంది . హృదయం పిండేసింది రమ గారు.
“మీ మనువాద తీర్పులతో ఆ రాచపుండును గెలికితే ఆ బాధ ఏ రూపంలోనైనా ఉబికి వస్తే… అది ఒక అడవిగానో, ఒక తుపాకిగానో మారితే అది ఎవరి తప్పు అవుతుంది?” చాలా ఆలోచించాలి
కులమత వర్గ వైషమ్యాలకి .. ఈ దేశం నట్టిల్లు అయిందన్న వాస్తవం ఒణికిస్తుంది .
మప్పిదాలు వనజగారు, సరిగ్గా అర్ధం చేసుకొన్నందుకు.