మౌనమా.. మార్చుకో నీ చిరునామా – భవానీ ఫణి

శ్రావణి అన్య మనస్కంగా వంట చేస్తోంది. ఇందాక శ్రీధర్‌ ఆఫీస్‌ నించి ఫోన్‌ చేసినప్పటి నుండీ ఆమెకి కొంచెం కంగారుగా ఉంది. హరీష్‌కి హాస్టల్‌లో ఏదో సమస్య వచ్చిందనీ రూం వెకేట్‌ చేసి ఇక్కడికి వస్తున్నాడనీ అతని మాటల సారాంశం.

అప్పటివరకు ల్యాండ్‌లైన్‌ లో మాట్లాడి వచ్చిన మాణిక్యాంబ గారు అంది ”హరీష్‌ని హాస్టల్‌లో రాగింగో, జాగింగో ఏదో చేస్తున్నా రుట. ఉండలేకపోతున్నాడుట. ఇలా వచ్చేస్తు న్నాడు. పాపం పిచ్చి వెధవ, అసలే నోట్లో నాలిక లేదు, ఎంత బాధపడ్డాడో ఏమిటో”

శ్రావణి ఆవిడ వైపు చూసింది. ”పోన్లెండి, మంచిపని చేస్తున్నాడు” అంది.

ఆవిడ తల ఊపి పూజ గదిలోకి వెళ్ళిపోయింది.

వంటిగంట అవుతోండగా వచ్చాడు హరీష్‌. పెద్దగా ఏమీ మాట్లాడలేదు. ఆడిగినదానికి సమాధానం చెప్పాడు. భోజనం పెడితే తిన్నాడు. కావాలనే ఇల్లు సర్దే కార్యక్రమం మెల్లగాకానిస్తూ కాస్త ఎక్కువసేపు వంటింట్లోనే ఉండిపోయింది శ్రావణి. హాల్లోంచి మాటలు వినిపిస్తున్నాయి.

”ఏరా, బాగా ఏడిపించారేరా, సన్నాసులు?” అత్తగారు అడుగుతోంది.

హరీష్‌ చాలా తగ్గు స్వరంతో ఏదో చెప్పాడు. శ్రావణికి వినిపించలేదు.

”కాలేజీ చాలా దూరం అన్నావు కదరా ఇక్కడ్నించి, ఎలా వెళ్తావు?”

”పొద్దున్నే ఏడింటికి బయలు దేరితే సరిపో తుంది అమ్మమ్మా, కాలేజ్‌ తొమ్మిదింటికి” ఈ సారి తనకి వినిపించా లని గట్టిగా చెప్పినట్టున్నాడు.

దేవుడి దయవల్ల ఏమీ సమస్యలు రాకుం డా ఉంటే బాగుండును అనుకుంది శ్రావణి.

”ఎలా తయారయ్యావో చూడు, కళ్ళ కింద డార్క్‌ సర్కిల్స్‌ ఎలా పాకి పోయాయో! నెల రోజులు గడిచిపోయాయి. ఇంకా నువ్వు ఆ విషయమే ఆలోచిస్తున్నావా?” స్రవంతి మాటలకి శ్రావణికి ఒక్కసారిగా మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది.

”అది కాదక్కా, మొన్న మా మావగారి ఆబ్దికం అని ఊరు వెళ్లాం కదా, అక్కడ అందరూ నన్నో దోషిలా చూసారు”

”ఎందుకే? నువ్వు బయటి వాళ్ళ గురించి అంతలా అలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు”

”బయటి వాళ్ళు కాదక్కా, అత్తయ్యగారికి నేనంటే చాలా ఇష్టమని అనుకున్నాను ఇంతవరకు, నా పెళ్ళైన ఈ ఏడేళ్ళలో ఆవిడ నన్ను పల్లెత్తు మాట కూడా ఎప్పుడూ అనలేదు. శ్రీధర్‌కి నాకూ మధ్య ఏదైనా గొడవ వచ్చినా ఆయన్నే తిడతారు, అలాంటిది ఇప్పుడు ఏమన్నారో తెలుసా, డబ్బు లేని వాడని హరీష్‌ని మేము లోకువగా చూసామట, నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా” శ్రావణి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.

స్రవంతి అనునయంగా ఆమె భుజం మీద చెయ్యి వేసింది. ”అలా అనుకుంటే అది నీ పొరపాటు చిన్నీ, రక్త సంబంధంపైన కంటే నీ మీద ఎక్కువ ప్రేమ ఉంటుందని ఎలా అనుకున్నావు?”

శ్రావణి ఆమె మాటలేవీ విన్నట్టు లేదు, తన ధోరణిలో తను చెప్పుకు పోతోంది ! ”మా బావగారు ఎంత అభిమానంగా ఉండేవారు! మొన్న కలిసినప్పుడు చాలా ముభావంగా ఉన్నారు. పైగా ”నీకేదో బాగుండటం లేదట కదమ్మా, ఒకసారి డాక్టర్‌కి చూపించుకోక పోయావా” అన్నారు.

”ఎందుకలా అన్నారంటావు” స్రవంతి సందేహంగా అడిగింది.

”వాడివల్లే అక్కా, నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాననీ, వస్తువులు విసిరి కొట్టాననీ, మేడ మీదనించి దూకేస్తానని బెదిరించాననీ చెప్పాడట, వాడేదో చెప్తే వీళ్ళంతా ఎలా నమ్మారని నా బాధ” శ్రావణికి గొంతు పూడుకుపోతోంది.

”అంతే కాదక్కా, వాడికి నేను సరిగా తిండి కూడా పెట్ట లేదట, ఫాన్లు, లైట్లు వెయ్యనిచ్చే దాన్ని కాదట. వాడి కోసం తెల్లారుగట్ల నాలుగింటికి లేచి వంట చేసేదాన్నక్కా, అలా చెప్పడానికి వాడికి నోరెలా వచ్చింది” దుఃఖ భారానికి మాట రాక ఆయాస పడుతోంది శ్రావణి.

స్రవంతి తదేకంగా శ్రావణి వైపు చూసింది. తన చిన్నారి చెల్లెలు అంతగా బాధపడటం ఆమె భరించలేక పోతోంది.

”చూడు చిన్నీ, జరిగిందేమిటో అందరికీ చెబుదామంటే నువ్వు ఒప్పుకోలేదు, ఎవరేమనుకుంటారో, ఎవరు బాధపడతారో అన్నావు వాడికి అనుకూలంగా వాడు చెప్పుకున్నాడు. నువ్వేమీ చెప్పకుండానే అందరూ నిన్ను నమ్మాలి అనుకుంటే ఎలా?”

శ్రావణి మాట్లాడలేదు. ఇదే సరైన సమ యంగా భావించి స్రవంతి కొనసాగించింది.

”ఒక్క మాట చిన్నీ, మన మనసు సాక్షిగా మనం తప్పు చేసామా లేదా అనే మనం ఆలోచించుకోవాలి, మన పొరపాటు ఏమీ లేదని మనకి తెలిసినప్పుడు వేరే వాళ్ళు ఏమనుకున్నా మనం బాధపడాల్సిన పని లేదు. ఎంత గొప్ప వాడైన ప్రపంచంలో ప్రతీ ఒక్కరి చేతా శెభాష్‌ అనిపించుకోలేడు… అయినా నువ్వు సమాధానం చెప్పుకోవాల్సి వస్తే అది శ్రీధర్‌ ఒక్కడికే. అతను నిన్ను నమ్ముతున్నాడు. నీ పక్షాన ఉన్నాడు. అలా అని తన వాళ్లతో పోట్లాడలేడు కదా, నువ్వు ఇలా బాధపడుతూ కూర్చున్నావని అతను ఫోన్‌ చేస్తేనే నేను బయలుదేరి వచ్చాను. ఇలా అవసరం లేని విషయాలు అలోచించి ఆరోగ్యం పాడుచేసు కుంటే రేపు నీ కొడుకుని ఎవరు చూస్తారు? ఇక పిచ్చి ఆలోచనలు మానేసి కొంతసేపు రెస్ట్‌ తీసుకో. పరిస్థితులు కాలంతోపాటు అవే సర్దుకుంటాయి.” స్రవంతి సున్నితంగా మందలించడంతో మాట్లాడకుండా కళ్ళు మూసుకుని పడుకుంది కానీ శ్రావణి ఆలోచనలన్నీ ఆ విషయం మీదే ఉన్నాయి.

తన పెళ్లి నాటికి హరీష్‌కి పదిహేనేళ్ళు ఉంటాయేమో. టెన్త్‌ క్లాస్‌ చదివేవాడు. చాలా పొగరుగా ఉండేవాడు, ఎవరినీ లెక్క చెయ్యకుండా. వాళ్ళు ఉండే ఆ పల్లెటూళ్ళో స్నేహితుల సాంగత్యం వల్ల అలా తయారయి ఉంటాడని అనుకుంది శ్రావణి. తన ఆడపడుచు ఇంట్లో అందరికంటే పెద్ద కావడం వల్ల, అప్పటి పరిస్థితుల్ని బట్టి కొంచెం బీద కుటుంబంలోనే ఆవిడ వివాహం జరిగింది. ఆవిడ భర్త ఒక చిన్న ఊళ్ళో సొసైటీ బ్యాంకులో గుమస్తా. వాళ్లకి హరీష్‌ ఒక్కడే కొడుకు. గారాబం కూడా అతను అలా తయారవడానికి కారణం కావచ్చు అనుకునేది ఆమె.

ఇంటర్‌లోకి వచ్చేసరికి హరీష్‌లో సడన్‌గా చాలా మార్పు వచ్చింది. సైలెంట్‌ అయిపోయాడు. కానీ అతని ప్రవర్తనలో ఏదో తేడా కనిపించేది శ్రావణికి. చేతిలో పని అందుకుని చేస్తున్నట్టు అనిపించినా అందరూ తనని చిన్న చూపు చూస్తున్నారనీ, తన చేత పనులు చేయించుకుంటున్నారనీ అతను ఎప్పుడూ అపోహలో ఉంటాడని ఆమెకి అనిపించేది.పైకి అందరితోను చాలా మంచిగా ఉంటూ పక్కకి వెళ్లి వాళ్ళ మీద చాడీలు చెప్పడం చాలా సార్లు గమనించింది.

అందుకే అతనికి నాగార్జునా యూని వర్సిటీలో ఎమ్‌.ఎస్సీ సీట్‌ వచ్చింది అంటే కొంచెం భయపడింది. అంతసెల్ఫ్‌ పిటీతో ఉండేవాళ్ళని సంతృప్తి పరచడం  చాలా కష్టం అని ఆమె అభిప్రాయం.

అయినా శ్రీధర్‌ చెప్పినా తను కూడా చెప్పక పోతే బాగోదని ఆడపడుచుకి ఫోన్‌ చేసి చెప్పింది. ”హరీష్‌ని మా ఇంట్లో ఉంచండి, ఇక్కడి నుండే కాలేజ్‌కి వెళ్తాడు” అని.

కానీ హరీష్‌ వాళ్ళ నాన్నగారు ఇష్టపడలేదు. ”మీ ఇంటి నించి యూనివర్సి టీకి వెళ్ళాలంటే గంటపైనే పట్టేస్తుంది. అంత దూరం ప్రయాణం చేస్తే అలిసిపోతాడు. హాస్ట ల్‌లో ఉంటాడులే” అనేసారు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది శ్రావణి.

కానీ వారం తిరక్కుండానే రాగింగ్‌ వంకతో తమ ఇంటికి వచ్చేసాడు ఎలా రాగింగ్‌ చేసారని ఒకసారి తను అడిగితే, ”నన్నెవరు ఏమంటారు, అంత ధైర్యం ఎవరికుంది, ఏమీ జరగలేదు” అన్నాడు. ఇక్కడ ఉండటం కోసం అలా అబద్ధం చెప్పానని చెప్పాడు.

పైగా ”వైజాగ్‌ ఆంధ్రా యూనివర్సిటిలో కూడా నాకు సీట్‌ వచ్చింది తెల్సా, అక్కడ జాయిన్‌ అయితే ఇక్కడికి రావడం కుదరదని సీట్‌ దొరకలేదని చెప్పాను” అన్నాడు. ఆ రోజే తను నోరు తెరవాల్సింది. ఎందుకులే చిన్న పిల్లాడు, అయినా జరిగిపోయిన విషయం తవ్వుకోవడం వల్ల ఉపయోగం ఏముందని ఆ మాట ఎవరితోనూ అనలేదు. నిజంగా ఆ రోజు చెప్పినా వాళ్ళు నమ్మి ఉండేవారు కాదని ఇప్పుడు అనిపిస్తోంది.

అత్తగారు తమ దగ్గర ఉన్నంత కాలం అతను కొంచెం బాగానే ఉన్నాడు. ఆవిడ కొన్ని రోజులు ఊళ్ళో ఉండి వస్తానని బావగారి దగ్గరికి వెళ్ళాక శ్రావణికి కష్టాలు మొదలయ్యాయి.

ఆ రోజు అన్నం వడ్డిస్తుంటే ఇంక చాలు అంటూ చెయ్యి పట్టుకున్నప్పుడే మాట్లాడి ఉండాల్సింది. తనే తప్పుగా ఊహిస్తోందేమో అని సరిపెట్టుకుంది.

ఇంకో రోజు ఫోటో వంకతో శ్రీధర్‌ ఎదురుగానే భుజం మీద చెయ్యి వేసినప్పుడైనా వార్నింగ్‌ ఇచ్చి ఉండాల్సింది. అంతకీ భర్తతో అంది. ”అలా భుజం మీద చేతులు వేస్తాడేమిటీ” అని, వాళ్ళకి అలా అలవాటులే అని తేలిగ్గా తీసి పారేసాడు శ్రీధర్‌.

హరీష్‌ చాలా సార్లు చేతులు తగిలించడం, అదే పనిగా తననే చూడటం గమనిస్తూనే ఉంది ఆమె. కానీ అది అనుకోకుండా జరుగుతోందో, కావాలని చేస్తున్నాడో అర్ధం కాక ఏమీ మాట్లాడలేకపోయేది. ఒకవేళ తను పొరపాటు పడుతోందేమో అన్న ఆలోచన ఆమెని మౌనంగా ఉండేటట్లు చేసింది తమ మధ్య ఆరేడు సంవత్సరాల వయసు తేడా ఉంది. తను అతనికి అత్త వరస కూడా. అలా ఎందుకు ప్రవర్తిస్తాడు అని తనకి తనే సర్ది చెప్పుకునేది.

ఆ రోజు తన జీవితాన్ని తల క్రిందులు చేసిన రోజు అతని అసలు రంగు బయట పడింది. ఉదయమే ఆరున్నరకే రెడీ అయి పోయి కూర్చున్నాడు. అదేంటి అని అడిగితే ”కాలేజ్‌కి తొందరగా వెళ్ళాలి” అన్నాడు. ఇంకా శ్రీధర్‌, చిన్నులేవలేదు. వెళ్లి పోతాడేమోనని హడావిడిగా లంచ్‌ బాక్స్‌ సర్డుతోంది వంటింట్లో అతనికోసం.

వెనక నుండి ఎవరో వచ్చి వాటేసు కున్నారు. ఆమె నివ్వెరబోయింది. వెనక్కి తిరిగి చూస్తే హరీష్‌!

వెర్రి ఆవేశంతో కోపంతో గట్టిగా ఒక చెంప దెబ్బ కొట్టింది. ఆక్షణం అతను చూసిన చూపు ఆమె ఎప్పటికీ మరిచిపోలేదు. వెంటనే వేగంగా బుక్స్‌ తీసుకుని కాలేజ్‌కి వెళ్ళిపోయాడు. శ్రావణికి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఈ విషయం భర్తకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూనే ఆ రోజు గడిపేసింది.

కానీ సాయంత్రానికి వాడు వాళ్ళమ్మని వెంట బెట్టుకుని వచ్చాడు. ఎప్పుడు ఫోన్‌ చేసాడో, ఆవిడ ఎప్పుడు ఊరి నుండి బయలు దేరి వచ్చిందో, ఇద్దరూ ఎక్కడ కలుసుకున్నారో తెలీదు. ఆవిడ ఏం అడిగినా సమాధానం చెప్పలేదు. టీ ఇస్తే తాగలేదు. అలా హాల్లోనే కూర్చుని ఉన్నారు ఇద్దరూ. చేసేది లేక వంటింట్లోకి వెళ్లి వంట చేస్తున్నట్టుగా అక్కడే ఉండిపోయింది శ్రావణి. ఆమెకి చాలా భయంగానూ అవమానంగానూ అనిపించింది.

శ్రీధర్‌ ఆఫీస్‌ నించి రాగానే మొదలు పెట్టిన ఆవిడ, ”తమ్ముడూ, నీ పెళ్ళాం ప్రవర్తన ఏమీ బాగా లేదు. హరీష్‌ ఇక్కడ ఉండలేనంటున్నాడు. తీసుకెళ్ళి హాస్టల్‌లో పెడుతున్నాను. ఇంతకంటే వివరాలు అడక్కు” అంటూ

శ్రీధర్‌ తెల్లబోయాడు. ”అదేంటక్కా, వాడికి ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పాలి కదా, శ్రావణి తప్పు ఉంటే నేను తప్పక మందలించేవాడిని, అయినా విషయమేమిటో చెప్పమను” అని అతను ఎంత అడిగినా ఏమీ చెప్పకుండా లగేజ్‌ ప్యాక్‌ చేసుకుని వెళ్ళిపోయారు తల్లీ కొడుకూ.

శ్రావణి కంటికీ మింటికీ ఏకధారగా ఏడ్చింది. అసలు విషయం తెలుసుకుని శ్రీధర్‌ ఆమెని ఓదార్చాడు. వాళ్ళతో ఈ విషయం మాట్లాడతానన్నాడు. వద్దని తన మీద ఒట్టు పెట్టుకుంది. చెబితే ఎవరూ నమ్మరు సరికదా వాడి తప్పు తన మీదకి తోసినా ఆశ్చర్యం లేదనీ, అలాగే గనక జరిగితే తను భరించలేననీ చెప్పి ఆపేసింది. వారం రోజులపాటు ఆమె అసలు మనిషి కాలేకపోయింది.

తను ఇక్కడ వాడిని రాచి రంపాన పెట్టిందనీ, అడ్డమైన చాకిరీ చేయించుకుందనీ ఏవేవో కట్టు కథలు చెప్పాడట అందరికీ. ఇన్నేళ్ళుగా తను ఎలాంటిదో తెలిసి కూడా అత్తింటి వాళ్ళంతా ఆ మాటలే నమ్మారు అని శ్రావణి బాధ.

ఈ ఆలోచనలతో కన్నీటి ధారల్లో తడిసిన తలగడ మీదే పడి నిద్ర పోయింది శ్రావణి.

”అన్నయ్య, అక్క, బావగారు బయలుదేరి వస్తున్నారు” అని ఫోన్‌ చేసాడు శ్రీధర్‌. ఇప్పడిప్పుడే జరిగింది మరిచిపోయి మామూలుగా ఉండే ప్రయత్నం చేస్తోంది ఆమె. మళ్ళీ వీళ్ళు ఎందుకు వస్తున్నారు అనుకుంటూ అతన్ని అదే అడిగింది.

”హరీష్‌ని పోలీసులు అరెస్ట్‌ చేసారట, టీవీలో వస్తోందట న్యూస్‌ చూడు, నేను కూడా వచ్చేస్తున్నాను” అని ఫోన్‌ పెట్టేసాడు.

అన్ని చానల్స్‌లోనూ అదే న్యూస్‌ చూపిస్తున్నారు. ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని ఉన్న హరీష్‌ని పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యం. ఒక అమ్మాయి మీడియాతో మాట్లాడుతున్న క్లిప్పింగ్‌ మార్చి మార్చి చూపిస్తున్నారు.

అ అమ్మాయి చెప్తోంది. ”అతను నా క్లాస్‌మేట్‌, అందరితో మాట్లాడినట్టే వాడితోనూ మాట్లాడాను. ఉన్నట్టుండి ప్రేమిస్తున్నాని వెంటపడటం మొదలు పెట్టాడు. నాకు ఇష్టం లేదని చెప్పినా వినలే. పైగా బెదిరించడం మొదలు పెట్టాడు. ఒప్పుకోకపోతే యాసిడ్‌ పోసేస్తాననీ, అక్కడెక్కడో జరిగినట్టు మా అమ్మా నాన్ననీ చంపేస్తాననీ రక రకాలుగా భయపెట్టాలని చూసాడు. నిన్న కాలేజ్‌ నించి వస్తుంటే చాకుతో పొడిచే ప్రయత్నం చేసాడు. నా అదృష్టం బాగుండి తప్పించుకున్నాను. ఇక లాభం లేదని నా దగ్గర ఉన్న ఎస్‌.ఎం.ఎస్‌. ఆధారంగా పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చా. వెంటనే స్పందించి అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా”.

”ఇలా కంప్లైంట్‌ ఇవ్వడానికి మీకు భయం వెయ్యలేదా” అనే ఒక విలేఖరి ప్రశ్నకి ఆమె చాలా తీవ్రంగా స్పందించింది.

”నేనెందుకు భయపడాలి. తప్పు చేసింది వాడు, పరువు పోతుందని ఇప్పుడు భయపడుతూ కూర్చుంటే రేపు నాకు నా కుటుంబానికి ఏమైనా జరిగితే అప్పుడు తీరిగ్గా బాధపడుతూ కూర్చోవాలి. అయినా ఆడపిల్లలు అలా భయపడటం వల్లే వీడి లాంటి వాళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. నాకేమీ భయం లేదు. నన్ను కూడా మీ చానెల్స్‌ ముఖం బ్లర్‌ చేసి ఏమి చూపియ్య క్కర్లా, డైరెక్ట్‌గానే చూపియ్యండి. చూసి కొంత మంది ఆడ పిల్లలైనా ధైర్యం తెచ్చుకుంటే నాకు చాలా సంతోషం.”

శ్రావణికి ఆమె మాటలు విని చాలా సిగ్గుగా అనిపించింది. ఆ పిల్ల చేసిన ధైర్యంలో వందో వంతు తను చేసి ఉంటే ఇంత బాధపడాల్సి వచ్చేది కాదు. ఎవరేమనుకుంటారో అనే సందేహంతో, ఇలాంటి విషయాలు చెప్పుకోలేని సిగ్గుతో ఎందరు ఆడవాళ్ళు ఎన్ని అవమానాలని మౌనంగా సహిస్తున్నారో! ఇంకా ఘాెరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారో! ఈ అమ్మాయి సాహసం కొంతమంది కళ్ళైనా తెరిపించ గలిగితే మంచిది అనుకుంది ఆమె.

వాళ్ళు ముగ్గురూ ఊరి నుంచి వచ్చే సరికి సాయం కాలమయిపోయింది. శ్రీధర్‌ ఆఫీస్‌ నించి వచ్చేసి రెడీగా ఉండటంతో మగవాళ్ళంతా కలిసి హడావిడిగా స్టేషన్‌కి వెళ్ళిపోయారు. వనజ, శ్రావణి మాత్రమే మిగిలారు ఇంట్లో. శ్రావణి ఓసారి ఆడపడుచు వైపు పరీక్షగా చూసింది. ఆవిడ కళ్ళు బాగా ఏడ్చినట్టుగా వాచిపోయి ఉన్నాయి. కాఫీ కలిపి తెచ్చి ”తీసుకోండి వదినగారూ” అంది. ”ఒక్కక్షణం అలా కూర్చో శ్రావణీ, నీతో మాట్లాడాలి” అందావిడ.

మళ్ళీ ఏం వినాల్సి వస్తుందోనని భయపడుతూనే కూర్చుంది శ్రావణి

”వీలయితే నన్ను క్షమించు శ్రావణీ, వాడు మొన్న సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడే నాకు నిజం తెలిసింది.కానీ కన్న ప్రేమతో కళ్ళు మూసుకుపోయి నేను మౌనంగా ఉండి పోయాను” ఆవిడ తలెత్తి చూడలేకపోతోంది. పిల్లలు చేసిన తప్పుల బాధ్యత తల్లిదండ్రులు స్వీకరించక తప్పదేమో అనుకుంది శ్రావణి.

”నీ గురించి వాడు చెప్పిన మాటలన్నీ నేను నమ్మాను. అప్పుడు నీ మీద చాలా కోపం కూడా వచ్చింది. కానీ మొన్న వాడు ఫ్రెండ్స్‌తో చెబుతున్నప్పుడు నాకు విషయం తెలిసింది. వాడు నన్ను చూసుకోకుండా, చేసిన వెధవ పనిని వినలేని భాషలో గొప్పగా చెబుతున్నాడు వాళ్ళకి. ఊళ్ళో ఏదో ఫంక్షన్‌కి వెళ్ళిన నేను తొందరగా వచ్చెయ్యడంతో వాళ్ళ మాటలు నా చెవినపడ్డాయి. అప్పుడు అర్ధమ యింది తప్పు ఎవరిదో. కానీ మమకారం అడ్డొచ్చి వాడిని ఏమీ అనలేకపోయాను. నాకేమీ తెలీనట్టుగానే ఉండిపోయాను. ఆ రోజే వాడిని మందలించి ఉంటే అన్నయ్యకో, శ్రీధర్‌ కో, వాళ్ళ నాన్నకో చెప్పి నాలుగు చీవాట్లు వేయించి గట్టిగా బుద్ధి చెప్పి ఉంటే  వాడు మళ్ళీ ఇలాంటి పని చేసి ఉండేవాడు కాదు. ఇప్పుడు ఇంత ఆపద వచ్చి ఉండేది కాదు. వాడి జీవితం నాశనమై ఉండేది కాదు. మా పరువు మంటగలిసిపోయేది కాదు” ఆవిడ చెంగు అడ్డం పెట్టుకుని ఏడుస్తోంది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

One Response to మౌనమా.. మార్చుకో నీ చిరునామా – భవానీ ఫణి

  1. Manjari Lakshmi says:

    బాగుందండి మీ కథ. ఇవాళ ఆంధ్రజ్యోతినవ్యలో కూడా ఈ మౌనమ్ వీడాలని ఢిల్లీలో జరిగిన సంఘటనగా తన అనుభవాన్ని రాసింది ఒకామె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.