డా. సి. భవానీదేవి
‘మౌనమూ మాట్లాడుతుంది’ అంటూ నిశ్శబ్ద చైతన్యంతో కవితా రంగప్రవేశం చేసిన ఎన్. అరుణ పాటల చెట్టు, గుప్పెడు గింజలు కవితా సంపుటుల తర్వాత ‘అమ్మ ఒక మనిషి’ అంటూ తనదైన విలక్షణ స్వరాన్ని స్త్రీ పరంగా ప్రకటించారు.
ఇందులోని 40 కవితలు 2005, 2006 సంవత్సరాలలో రాసినవి, ప్రచురితమైనవి.
”విత్తనంలో నిద్రిస్తున్న మొలకలా నాలో ఒక పద్యం” (మౌనమూ మాట్లాడుతుంది) అని స్పందించిన అరుణ ఇప్పుడు మనసు కిటికీలను బార్లా తెరిచి వర్తమాన సమాజ పరిణామాలను గురించి, ప్రపంచీకరణ, గ్రామజీవన విధ్వంసం, అనారోగ్యకర పాశ్చాత్య నాగరికతా ప్రభావం, వ్యవసాయరంగ సంక్షోభం, మానవ సంబంధాల తరుగుదల, దళిత బహుజన స్త్రీ సమస్యలు, ఇలా ప్రతి సమస్యన తన దృక్కోణంలోంచి కవిత్వీకరించారు.
‘లోకానికి అక్షరాలు అప్పుపడ్డాను అందుకే కవిత్వం రాస్తున్నా’ అనేది సరికొత్త అభివ్యక్తి.
‘కవి పుట్టగానే కన్నీళ్ళకు వ్యాఖ్యానాలు పుట్టాయి’ అనటంలో కవి సామాజిక బాధ్యత గుర్తు వస్తుంది.
‘అణచివేతలోంచి పోరాట పుష్పం పూస్తే ఆ పువ్వు కింది కంటకాయుధం – అక్షరం’ అంట సూటిగా అక్షరాన్ని ఆయుధం చేశారు కవయిత్రి.
అరుణ కవిత్వం సహజంగానే పల్లె గురించి పలవరిస్తుంది. స్త్రీ గురించి కలవరిస్తుంది. సాంద్రమైన తాత్వికతలో మునకలు వేస్తుంది. తనలోని తానే వివశంగా ప్రవహించి కవిత్వ తత్త్వాన్ని ప్రేమించి తన్మయమౌతుంది.
ముందుట ‘జీవన వ్యాఖ్యానం’లో డా|| రాచపాళెం ”కవయిత్రి కావ్యం నిండా వేదనామయ జీవన వ్యాఖ్యానాలున్నా” యన్నారు. ప్రపంచీకరణకు ముందు మన గ్రామావలన్నీ స్వర్గతుల్యంగా ఉండేవనీ, ప్రపంచీకరణ, నగరీకరణల వల్ల గ్రామాలు నాశనమై పోతున్నాయని చాలామంది కవులు రాస్తున్నారంటనే గ్రామాల మీద కాల్పనిక వ్యామోహం కూడదంట సకల అసమానతలకు నిలయమైన భారతీయ గ్రామాల్లోని కృత్రిమ ప్రశాంతత, ప్రమాదకర వ్యామోహానికి గురికాని అరుణ కవిత్వాన్ని అభినందించటం విశేషం.
నగరీకరణ గురించిన అరుణ కవిత ‘సాక్ష్యం’లో –
”ఒకప్పుడు
పల్లె బుజాలపై పక్షుల కలకలం
ఇప్పుడు రైతులు
పల్లె విడిచి పోతున్న వలస విహంగాలు”
అంట పల్లెను కాటేసిన నగరానికి సాక్ష్యంగా చెట్టుకు వేలాడుతున్న శవంగా సింబాలిక్‌గా చూపించటంలో కవయిత్రి ప్రతిభ, సెన్సిటివిటీ హృదయన్ని కదిలిస్తుంది.
”వరికంకి వెన్ను వంగితేనే కదా
మనకు తిండి
మరి రైతు వెన్ను విరిగితే
జాతికే వైకల్యం” (వైకల్యం)
రైతన్నల ఆత్మహత్యలు సాధారణ అంశంగా మారిన ఆధునిక సామాజిక నేపధ్యంలో ఈ పంక్తులు మరింతగా ఆలోచింప జేస్తాయి. తెల్లవాడు చల్లిన విత్తనాలకు లభిస్తున్న నల్లని ఫలితాల గురించి ‘విధ్వంసగీతం’ లో
”ఈ రోజున నీళ్ళంటే
అందరికీ నీళ్ళు కాదు
కలిగిన వాడి బొక్కసంలోకి
రూపాయలుగా ప్రవహించటం”
అంటూ కుహనా ప్రగతిని నిరసించారు మనిషి పెదవులపై నుండి రాలిపోయిన,పారిపోయిన చిరునవ్వుల కోసం వెదికిన కవయిత్రి చిరునామా లాంటి చిరునవ్వుల్ని వెతికి తెచ్చుకోవటానికి ఇలా ఆకాంక్షించారు.
”ఈ దారిలోనే అనుకుంటా
నా చిరునవ్వులు
ఎక్కడో రాలి పోయయి
…… అంతా భద్రం
మరి చిరునవ్వులే మిస్సింగు” అని చిరునవ్వుల కోసం కలవరించిన కవయిత్రి ”కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిప్పమంటూ” జీవితాన్ని కోరుకుంటారు.
అరుణ కవిత్వమంతా అనుభతుల ప్రవాహం. జ్ఞాపకాల ఊట. బాల్యంలోకి పరుగులు తీసే అపురప పసితనపు చైతన్యం. చిన్నప్పటి ఊరు గురించి మళ్ళీ వెళ్తే ‘గుండె ఉండగా మారిపోవటం’ నత్న అభివ్యక్తి. ఆ రోజుల్ని మళ్ళీ మళ్ళీ తల్చుకోవటం ఆ ‘నవ్వులపత్ర సంచలనాల’ కి కరిగిపోవటం సున్నిత హృదయు లందరికీ అనుభవమే.
కవయిత్రి ఈ కవితా సంపుటిలో అనేక సంఘటనాత్మక కవితలు అందించారు. సముద్రపు అలలపాట, ముంబయి ఫతుకం, భూకంపం, ఎలిఫెంటా గుహలు వంటి స్థలాల గురించి, సంఘటన గురించి గాఢ అనుభతియుక్తంగా కవితలు రచించారు. కృష్ణానదీ సంగమాన్ని ‘హంసల దీవి’ లో చూసినప్పటి కవిత ‘అలలపాట’ లో
‘రహస్యాలెన్నో లోపలదాచుకున్నా
తీరంలోనే వెతుకులాట
దూరాలెన్ని తిరిగినా
గమ్యంలోనే వలపు పాట’
అంటూ నదిని సముద్రంనుంచి వేరుచేయలేని హృదయంశమ సంగమ గీతాన్ని ఆలపించారు. ‘బాధవర్ణం ఎప్పుడ నలుపే’ నని టూకంప బాధితులకు ‘లోపలి శత్రువు’ గురించి హెచ్చరించారు. ముంబయి పేలుళ్ళ గురించి రాస్త….
‘కొన్నాళ్లకు దృశ్యాలు సి.డి. లైబ్రరీల్లో భద్రంగా ఉంటాయి’ అంటారు. నిజమే, ఎటువంటి విధ్వంసాలు విషాదాలు జరిగినా మనం మాత్రం నిర్లిప్తంగా అలవాటు పడిపోతూ ‘ఇదింతే’ అనుకుంట దైనందిన జీవితంలోకి జారిపోతున్నాం అన్పిస్తుంది. వరదలు, ఉధృతాల్లో టూమిని ”జలచర్మాంబరధారిణీ” అనటం కొత్తపదప్రయోగం. తుఫానులు, ఉప్పెనలు వచ్చినప్పుడు ప్రభుత్వ వైఫల్యం గురించి ఇలా నిరసిస్తారు.
”అధికార పీఠానికి చెవుల్లేవు
ఆహార పొట్లాలు
ఫైళ్ళలోంచి రావాలి
ముసల్దానా ఆగు” (ఆకాశరాకాసి)
స్నేహితురాలి మరణం గురించి ఆవేదనతో రాసిన ఎలిజీ ‘మిత్రమా’ కవితలో అపురపమైన స్మృతులు బాధగా వరటాన్ని చెప్పారు.
సిగ్నల్స్ దగ్గర అడుక్కునే కుర్రాడి గురించి రాసిన కవిత మానవీయ భావనని ఎత్తుకెదిగించింది. అరుణ కవిత్వం స్త్రీకి ఉన్నతస్థానాన్ని సహజంగానే ఇచ్చింది. స్త్రీల అనాది వేదన పెళ్ళి.
‘అపరిచితుడి వేలుపట్టుకొని
శాశ్వతంగా వెళ్ళిపోవడం ఎంత వేదన’ (ఇదీ వలసే)
వలస కూడా స్త్రీల జీవితంలో తప్పనిసరి చేసుకునే అలవాటు. అమ్మని దేవత చేయవద్దనీ మనిషిగా చూస్తే చాలనే కవిత ‘అమ్మ ఒక మనిషి’. ఆడపిల్లల పుట్టుకను స్కానింగు ద్వారా నిరోధించటాన్ని వ్యతిరేకించిన కవయిత్రి ఆడపిల్లలు ఎక్కుపెట్టిన బాణాల్లా లోకం నడిబొడ్డున నిలవాలని పిలుపిచ్చారు. అమ్మ లేనితనం భరిస్తున్న చిన్నారి గురించి రాసిన ‘అమ్మ పాట’ హృదయన్ని కదిలిస్తుంది.
ఆడపిల్లల పుట్టుకనాపటాన్ని ”నిశ్శబ్ద మహా విధ్వంసం” అంట తీవ్ర పదప్రయోగంతో నిరసించారు అరుణ.
బలమైన తాత్విక నేపధ్యం ‘అమ్మ ఒక మనిషి’ సంపుటిలోని ప్రతి కవితలోనూ విస్తరించి విన్పిస్తుంది.
మరణం గురించి రాసిన ‘పునరపి’ కవిత చదువుతుంటే గాఢంగా మనలోకి ఇంకిపోయి మనమే ఆ కవితగా మారిపోతాం.
”మరణమంటే
శరీరం ఆత్మలోకి అదృశ్యమవ్వటమేనా
మరణమంటే
శరీరం ఒక స్మృతిగా మిగిలిపోవటమేనా!
……”
మరణాన్ని ఇలా ప్రత్యేకంగా వ్యక్తీకరించడం అరుణకే సాధ్యమైందనిపిస్తుంది.
‘కాలాన్ని దారాలు చేసుకుని
అల్లుతున్న స్వెట్టర్
ఎప్పటికీ పూర్తికాదు’ (అభావం)
కాలస్వరపం ఎప్పటికీ అభావమే! చాలా కవితల్లో కవయిత్రి కాలం గురించి వైవిధ్యభరితమైన వర్ణనలు చేశారు.
కవయిత్రి ప్రతి కవితలోనూ తనను తాను వ్యక్తీకరింపజేసుకునే లక్షణంగా ప్రథమ పురుషను వాడారు. ప్రతి కవిత చివరి పంక్తుల్లో తనలోకి నడిచివెళ్ళే వ్యక్తీకరణ స్పష్టంగా కన్పిస్తుంది.
”అప్పు తీరదని తెలుసు
అయినా మళ్ళీమళ్ళీ తీరుస్తనే ఉంటాను” (లోకాలోకనం)
నా గీతం కుంటుతుంది. (వైకల్యం)
‘ఇప్పుడది నా వైపు చూస్తుంది
కాబట్టి అది నాదే’ (ఆలాపన)
‘ఒక్కసారి వచ్చి
నాకు చెప్పిపోవూ’ (మిత్రమా)
వంటివి అటువంటి పంక్తులకు ఉదాహరణలు.
కవిత్వాన్ని ప్రేమించి పలకరించటం అరుణ కవిత్వ ప్రత్యేకత.
‘కవిపుట్టగానే’ కవితలో కవి సమాజానికి ఎంత ముఖ్యమైన వ్యక్తో వివరించారు.
‘కవి పుట్టగానే
కన్నీళ్ళకు వ్యాఖ్యానాలు పుట్టాయి’
కవి కష్టజీవి కోసం కలం పడతాడందుకే. సముద్రం ఒక చిన్న గదిలోకి ఒదిగి పద్యంలా వెలగటమే కవి జీవితమన్న భావం హృదయనికి హత్తుకుంటుంది. ఆలాపన, వెనక్కి తిరగని చిత్రాలు బాల్య, గతస్మృతుల నాస్తాల్జియతో కూడినవి.
ఇన్నేళ్ళ జీవితానుభవం, కవితాప్రయణం ఆమె కవిత్వం. వ్యక్తిత్వ అస్తిత్వం, అక్షరాగ్నిని దాచుకున్న అరుణిమ. లోతు కవిత్వంలో సూటిదనం, నిజాయితీ, నిర్మలత్వం కనిపిస్తాయి. భాష సరళ నిర్మలంగా హాయిగా తాకుతుంది. తనదైన కవితాశైలి కన్పిస్తుంది.
”నిజానికి నా అస్తిత్వం ఎప్పుడు కరిగిపోయిందో
దానిని వెతికి తెచ్చి
వ్యక్తిత్వాన్నిచ్చిన అక్షరమా
ఇప్పుడు నువ్వే నేను” (అక్షరమొక పడవ)
అంట అక్షరంతో మమేకమయిన మంచి కవయిత్రి అరుణ. అక్షరం పడవలో అక్షరాలే కాంతికిరణాలుగా, శక్తిచరణాలుగా, జ్ఞానసంచలనాలుగా, మానవతా సౌధ నిర్మాణ ప్రేరణలుగా కవితాప్రయణం సాగిస్తున్నందుకు అభినందిస్తున్నాను.