వి. ప్రతిమ
ఎవరన్నారట స్త్రీవాదం ఆగిపోయిందని?
… స్త్రీల మీద పెత్త నాలు, ఆధిక్యత, పీడన … స్త్రీల అసహాయత, ఆత్మహత్యల, హత్యల కొనసాగుతున్నంత కాలం స్త్రీవాద సాహిత్యానికి మరణముండదు … పోరాటం ఆగదు.
అయితే అంత మంచి రోజు ఎప్పటికయినా వస్తుందా?
ఏ మాత్రం ఆశ లేదు … యెధులమై పోరాటం చేయడమే, సంకెళ్ళను బద్దలు కొట్టడమే తక్షణ కర్తవ్యమంటుంది సుబ్బమ్మ….
ఆత్మకూరు సుబ్బమ్మంటే సామాజిక సేవ.
దోర్నాదుల సుబ్బమ్మంటే స్త్రీజనాభ్యు దయం.
కవి సుబ్బమ్మంటే స్త్రీల కష్టాలు, కన్నీళ్ళు, చైతన్యం, పోరాటం….
దోర్నాదుల సుబ్బమ్మ కొత్తగా వెలువరించి, ఆవిష్కరించిన కవిత్వసంపుటి ‘మోపు’ …. ఆత్మకూరు చుట్టుపక్కల వున్న అధోజాతి స్త్రీల కష్టాల మోపుని ఆవిడ ఎప్పుడూ మోస్తనే వుంది…
నిజానికి కవిత్వ రూపాన్ని సంతరించుకున్న ‘మోపు’ చాలా చాలా చిన్నది.
ఆమెకి కవిత్వం ఒక ‘పాయ’ మాత్రమే … స్త్రీ జనోద్ధరణే ఆమె జీవితం…
‘సంసారపు సర్కస్‌లో బొమ్మనైన నేను
మరి మనిషినయ్యే దెన్నడు?’ అని ప్రశ్నించే సుబ్బమ్మ చిలకా నువ్వెంత అందమైన గొంతుకతో పలికినా, పంజరంలోనే వున్నానన్న సంగతి మరిచిపోవద్దనీ, కాస్త స్పృహలోకి రమ్మనీ మేల్కొలుపుతుంది తన చుట్ట బంగారు పంజరాల్లో చిలక పలుకులు పలుకుతోన్న స్త్రీలని….
అప్పుడప్పుడ బంగారు పంజరం లోని స్త్రీలను తట్టిలేపుతుందా మరికొన్ని సార్లు వడ్రంగి పిట్టయి అమాయక దళితస్త్రీల మీద ముసుగులలో నుండి అమలవుతోన్న నంగి నంగి పెత్తనాలను తన సూటిముక్కుతో తొలిచేస్తుంది.
ఇంకా కవి సుబ్బమ్మ చాలానే చేస్తుంది.
”వందనాలమ్మా…అమ్మా మీకు వందనాలు
ఉద్యమం కోసం మీ పేగుబంధాల్ని కోసి
ఉరికొయ్య మీద ఆరబోసిందామె
మీ త్యాగాలకు నమస్కరిస్తున్నాం అమ్మా
మీ గాయలకు నమస్కరిస్తున్నాం”
అంటూ తల్లులు బతుకునిస్తేనే వీరు ఉద్యమ వీరులవుతున్నారంటుంది. దేశానికి ఉజ్జ్వలమైన భవిత నివ్వడమే తల్లి ఋణం తీర్చుకోవడమంటుంది.
ఉత్త మట్టిబుర్రలంటూ కొట్టి పారేసిన స్త్రీల మెదడుల్లో ఉండాల్సిన నిప్పురవ్వంత విద్వస్తుని గురించి ప్రస్తావి స్తుంది… ఇప్పుటికయినా పూలకుప్పలన్నీ వలలుగా మారే సమయం కోసం నిరీక్షిద్దాం అంటూ స్త్రీలంతా ఒక ఐక్యసంఘటన అన్న విషయన్ని సూత్రీకరిస్తుంది…
అయితే కేవలం స్త్రీల కష్టాలు, కన్నీళ్ళు మాత్రమే ఈమె కవిత్వ వస్తువులా అరటే మతోన్మాదంతో పెట్రేగిపోయిన గుజరాత్‌ని తలుచుకుని పొగిలి పొగిలి ఏడుస్తుంది…గర్భాల్ని చీల్చే చేతుల్ని నరికేయడానికి ఆయుధంతో సిద్ధమవు తుంది…ఉగ్రవాద భుజంగాల్ని భుజాల కెత్తుకుని విర్రవీగుతోన్న అగ్రరాజ్యాల ప్రమాణాలని కొట్టేస్తుంది…
అంతే కాకుండా యివ్వాళ మనమున్నటువంటి యుద్ధరంగంలోకి, విధ్వంస జీవిత వలయల్లోకి ‘విశ్వజనని’ వారసులు రావాలని వాంఛిస్తోంది… దివినుండి భువికి కాంతిని ప్రసరింపచేస్తోన్న మదర్‌తెరిస్సాని కరుణాకటాక్షకవాటాలు తెరిచి ఉగ్రవాదాన్ని రూంపుమాపమని కోరుకుంటుంది… మొత్తం మీద శాంతి కావాలన్నదే ఆమె ఆశయం.
సాహిత్యమన్నది ఒక జ్వలనం. ఒకసారి దానికి మన హృదయంలో చోటిచ్చామంటే చివరంటా అది మనల్ని దహిస్తూనే వుంటుంది… అయితే ఈ జ్వలిత… జ్వలనగతికల్ని అందిస్తోన్న దోర్నాదుల సుబ్బమ్మకి పాతికేళ్ళేనని మీరనుకుంటే భ్రమపడినట్లే… మా జిల్లా (గర్వించదగిన) రచయిత్రి కాకపోయి వున్నట్టయితే నేన అలాగే పొరపడి వుందునేమొ…
ఆమె అక్షరాల అరవయ్యయిదేళ్ళ స్త్రీమూర్తి.
బ్రతుకుని ఆమూలాగ్రం అనుభవించి శోధించిన విద్వన్మణి కాబట్టే ఆమె కలం నుండి యింత మంచి కవిత్వం జాలువారింది.
ఎవరన్నారు స్త్రీవాదం ఆగి పోయిందని?
రండి…రండి మేధావులారా, కళాకారులారా… అసమ సమాజానికి వ్యతిరేకంగా పోరాడుతోన్న మనుషులారా, ఓ పురుషపుంగవులారా రండి స్త్రీల కష్టాలవెపుని దించడానికి చేతు లందించండి…స్త్రీల కోసం స్త్రీల నుండి వెలువడుతోన్న కవిత్వాన్ని, వారి మనుసులని చదవండి కనీసం….
‘లేదంటే రేపటి ఆకాశం నుండి వాన కురవదు,
నిప్పులు మాత్రమే కురుస్తాయి’
ఈ కవిత్వ సంపుటికి స్త్రీజన పక్షపాతి, కవి ఎండ్లరి సుధాకర్ వ్రాసిన ముందుమాట తగినట్లుగా అమిరింది. ఖాదర్ షరీఫ్ చెప్పినట్లు ‘సమస్త స్త్రీజాతి కష్టాలవెపు ఆవిడ శిరసుపైన’.
మహాభినిష్క్రమణం
రచన : దోర్నాదుల సుబ్బమ్మ
మరిక సెలవు మిత్రమా!
దుఃఖపు వాకిలి మూయబడదు….
మాతృత్వము, మమకారము… సముద్రం కాదు… ఎంత తోడుకున్నా…. తరిగిపోకుండా వుండడాన్కి….
ఒక నిజం….
కన్నీళ్ళు కార్చే అగ్రిమెంట్….కష్టాల స్వరాల అగ్రిమెంట్…. మూడుముళ్ళతో యభై వసంతాల చీకటి అధ్యాయం…. ఒకే ఒక్క అవ్యక్తానుభతికి…. పేగుబంధాన్ని బ్రతుకుబంధంగా వర్చుకొన్న సన్నివేశానికి లొంగిపోయినదాన్ని
నోటికి తాళం పడినదాన్ని
స్వగతంలో ఎంతసేపు కుళ్ళికుళ్ళి ఏడ్వనయ్య….!
ఒక సూర్యోదయం నుంచి మరో సూర్యోదయం కోసం…
ఒక గాయం నుంచి…. మరొక విచ్ఛిన్న సామ్రాజ్యంలోకి అడుగు…
ఆడదంటే ఆజన్మఖైదీగా భావిస్తావ్
ఐదు నిమిషాలు అనుభవించిన తర్వాత… తోసేస్తావ్
ముగ్గేసినంత సునాయసంగా… నీ గమనాన్ని నిర్వచించగలను…
నువ్వు నా బ్రతుకుని శాసిస్తావేందయ్య…
ఆకాశం…భూమి దగ్గరైనట్టే మనమూన…
కొడుకుని నేను నా కళ్ళ కలగానే చూస్కుంటాను
కూతురిలో నీ పోలికుందని సంపద కల్సిందని ఘనతగా చస్కుంటావ్…
ఇంకా నిన్ను నమ్ముకుని అడుగులికి మడుగులొత్తే వోపిక ఎక్కడుంటుంది?
అందుకే మరిక సెలవు మిత్రమా…
నువ్వు నేను లేనితనపు దుఃఖాన్ని నటిస్తూనే
నా వొంటిమీదున్న నగల్ని లెక్కెట్తావ్…
నీ జతతో నా వెంటవచ్చిన దుఃఖపు తరంగాన్ని గమనించనే లేదు…
ఫైవ్‌స్టార్ హోటల్లో కూర్చుని ‘టీ’ తాగినంత సుఖం కాదు సంసారం అంటే
నేను… నా తలపులు వెలిగివెలిగీ ఆరిపోతే బావుణ్ణు….
కానీ మధ్యలోనే బూడిదని చేస్తున్నావ్
నేను పరువాల శిల్పంలా తయరయ్యేది నీకోసమేనని వొప్పుకుంటావ్
మరి నన్ను మంటల్లోకి తోస్తావెందుకు…
ఇక మరోసారి నీకోసం జన్మించను…
ఒకవేళ దేవుడు పక్షపాతం నీవైపే చూపిస్తే…
పుట్టుకతోనే ఒక ఆయుధంతో పుట్తాను
నన్ను నేను రక్షించుకోవాలనుకొంటున్నాను.