కొండేపూడి నిర్మల
వరంగల్లు జిల్లా, పర్కాల మండలంలోని కంటాత్మకూరు గ్రామంలో చనిపోయిన రోహిణిది బాలింత మరణమా? సహజ మరణమా?
అనే సందేహం అంగనువాడి కార్యకర్తలకి, సపర్వైజులకి వచ్చింది. కారణం చనిపోయిన బాలింత గర్భం రాకముందు నుంచి గుండె జబ్బుతో బాధ పడింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక హటాత్తుగా ఈ జబ్బు మొదలయిందిట.
మూడవసారి ఖచ్చితంగా కొడుకుని కని ఇవ్వాలని భర్త గారి ఆన. అసలు గర్భం రావడమే మంచిది కాదని అది పెద్ద ప్రాణానికి ప్రమాదమని డాక్టరు మందలించింది. వారసుడి కంటే కోడలు ప్రాణం ఎక్కువా ఏమిటి? అనుకున్నారు అత్తింటి బంధువులు. పాపం రోహిణి చావుకి సిద్దపడే గర్భాన్ని వెసింది. అంగనువాడి సెంటరు నుంచి ఇంజక్షన్లు, రేషను, వైద్య సలహాలు అందాయి. కాని డాక్టరు భయపడినట్టే రోహిణి చనిపోయింది. భర్త కూడా భయపడ్డాడు. ఆమె చనిపోయి నందుకు కాదు. మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టినందుకు. కనక వారసుడి కోసం మళ్ళీ పెళ్ళి పీట ఎక్కాడు. ముగ్గురు పసిపిల్లలతో రోహిణి ఒంటరి తల్లి మిగిలిపోయింది. ఈ దేశంలో ఒక సగటు మగవాడు ”సాధారణ” మూర్ఖత్వంతో ఇల్లాలి ప్రాణం తియ్యొచ్చు. పిల్లల్ని అనాధల్ని చెయ్యొచ్చు. ఆ మూర్ఖత్వాన్ని కొనసాగించేందుకు మళ్ళీ పీటలు పరచి పెద్దలు ఆశీర్వదిస్తారు. ఇంకో గర్భసంచి ఇచ్చి వధువు మురిసిపోతుంది.
గర్భం వచ్చిన దగ్గర నుంచీ, కాన్పయి, బిడ్డకు పాలిస్తున్నంత కాలం బలమైన ఆహారం రోజుకి మూడునుంచి నాలుగు సార్లు తినాలని చెప్పడమే కాకుండా, ఇంజక్షన్లు ఇస్త రేషను కూడా ఇస్తోంది ప్రభుత్వం. కానీ ఆ రేషను అందుకోవడానికి భర్తల, అత్తింటి బంధువులు వస్తారు. లబ్దిదారిణి కూలిలోనో, వలసలోనో వుంటుంది. కార్యకర్తకి కంఠశోష మిగులు తుంది. వలస కారణంగా ఇమ్యూనైజేషను అందదు. ఫలితంగా బిడ్డ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఈ దేశంలో సమన్వయ లోపం కొన్ని తరాల పిల్లల అంగవైకల్యానికి కారణమవుతోంది.
పుట్టిన పాపకు ఏడు రోజుల్లోపు స్నానం చేయించరాదని దానివల్ల రక్షక కవచం లాంటి పై చర్మం దెబ్బ తింటుందని, కేవలం దూదితో తుడిచి పొడి బట్టతో చుట్టి తల్లి పొత్తిళ్ళలో వుంచాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మొత్తుకుంటోంది. అయితే ఏ ప్రైవేటు ఆస్పత్రికీ ఈ సూచనలు అందవు. దానికి తోడు పురుడు, ముట్టు, మైల లాంటివి బక్కెట్ల కొద్ది నీళ్ళతో ప్రక్షాళన చెయ్యలనే ఒక బ్రాహ్మణిక భావజాలం, దాన్ని అనుసరించడమే నాగరికత అనుకునే అన్ని కులాల భావ దాస్యం. దీన్ని తప్పుకోవడం కూడా కష్టం. మధ్య తరగతి పాటించని ఏ విధానమూ/విలువా పేద కుటుంబాలు పాటించవు. కాబట్టి రిపోర్టులకీ వాస్తవాలకీ చాలా తేడా వుంటుంది. ఈ దేశం రిపోర్టులు వదిలి అట్టడుగు వాడి మాట ఎప్పుడు నమ్ముతుందో తెలీదు.
కోట్లాది రపాయలు ప్రచారానికి ఖర్చవుతనే వుంటాయి. సగటు అంగనువాడి కార్యకర్త తన జీవితంలో కొన్ని వందల గర్భిణీలకి, బాలింతలకి సలహాల నిస్తనే వుంటుంది. అదే సమయంలో ఇంటికొక టి.వి, ఫైవు స్టారు ఆస్పత్రుల్నీ, పాలపొడి డబ్బాల్ని, బిడ్డ మూత్రాన్ని కూడా హైజాకు చెయ్యగల డైపర్సునీ (మూత్రపు సంచులు) కొంటావా లేదా అని కన్ను కొడుత వుంటుంది.
ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో కావలసినంత మంది నర్సుల్ని ఎందుకు నియమించరో తెలీదు. దానివల్ల నర్సు వేయల్సిన ఎ విటమిను కార్యకర్త వేయల్సి వస్తోంది. అస్సాంలో ఒకసారి మోతాదులో తేడా వచ్చి ఒక శిశువు చనిపోయింది. ఆ భయం అంతర్లీనంగా వుండి తల్లులు విటమిను వేయించడానికి శంకిస్తున్నారు. ఈ దేశం ఇటు నిరుద్యోగుల్నీ అటు నిధుల్ని ఒకే చేత్తో దాచిపెడుతుంది.
ఉప్మాబడి అనే మాటవలన అంగనువాడి సెంటర్లకు పోవడం కష్టం. ఎందుకంటే ఆడుకునేందుకు బొమ్మల, ఆకట్టుకు నేందుకు సంభాషణా నైపుణ్యం సగటు ఉద్యోగిలో ఆశించే హక్కు మనకి లేదు. పిల్లల్ని కూచో పెట్టిన సెంటర్లే పశువుల కొట్టాల మాదిరి వుంటున్నాయి. ఎంత నిరుపేద తల్లి అయినా తన బిడ్డను ఈ కేంద్రానికి పంపడానికి సిద్దపడటం లేదు. అడక్కుండా అప్పుల్లో ముంచెత్తే అనేక పధకాలుండగా ఒకే తల ఎన్ని సార్లయినా తాకట్టు పెట్టుకోవచ్చు. సగటు తల్లి బిడ్డల పరిస్థితిలో మార్పు సాధించడానికి అవినీతి, అలసత్వం పునాదులు కదిలితే తప్ప ప్రయెజనం వుండకపోవచ్చు.
ప్రచారం కోసం అంటించే వాలు పోస్టరు పాటి చెయ్యని హీనమైన జీతాలిస్త, రేషను ఎందుకు కాజేశావనో, పది రకాల కూలి పనులు ఎందుకు చేస్తున్నావనో, రోజుకి ఇరవై గృహ సందర్శనలు ఎందుకు చెయ్యలేదనో ఒక బడుగు జీవిని అడగడానికి ముందు అసలు తల్లీ పిల్లల సంక్షేమం ఎన్ని దశాబ్దాలుగా ఎన్ని ప్రభుత్వాల/అధికారుల చేతుల్లో నలుగుతున్నదో రిపోర్టు తియ్యలి. ఈ దేశం ప్రతి సంక్షేమ పధకాన్నీ పకడ్బందీగా రేవు దాటిస్తుంది.
ప్రతి మూడు సెకన్లకి ఒక శిశువు మరణిస్తోందని తాజా సమీకరణాలు చెబుతున్నాయి. అంటే నేను ఈ ఒక్క వాక్యం రాసేలోపు ఒక పసిమొగ్గ రాలిపోయిందని అర్థం.
అయిదేళ్ళకొక ప్రణాళిక పాము కుబుసంలా రాలుతుంది. కుబుసానికి పేరు నిర్ణయమవుతుంది. ఒక అంతర్జాతీయ కన్సల్టెంటు తెల్లతోలు కప్పుకుని కొన్ని లక్షల డాలర్ల హారరోరియం కోసం పేదరికం కొండ తవ్వి ఎలక (మౌసు) ని బయటికి తీస్తాడు. ఈ దేశంలోని ఏ కథా కథ కంచికి వెళ్లదు. తల్లుల పిల్లల ఇంకోసారి మోసపోవడాన్కి ఎదురు చూస్తారు. అలా ఎదురు చూసేలా మనం శిక్షణ కూడా ఇస్తాం.