డియర్ సత్యవతి గారూ,
హాట్సాఫ్ టు ”నా అంతరంగ ఆవిష్కరణలు”. మొత్తం అసమాన సమాజ సారాంశాన్ని ఎంత చక్కగా అతి సరళమైన భాషలో ఆవిష్కరించారు. భూమిక చదివితే మీరు సగమే తెలుసు. ఈ కవిత చదివితే మొత్తం తెలిసిపోయారు. సమాజంలోని అన్ని రుగ్మతలకీ అందరికీ పరిష్కారం గురించి తెలుసు కాని మనదాక వచ్చాక అనే మనస్తత్వం, స్వార్ధం, మందపాటి చర్మం అడుగున దాగుండి అరాచక సమాజం రాజ్యమేలుతోంది. అంతమొందించ వలసిన అవసరం బాధితులదే. ఇదే చరిత్ర చెప్పే నగ్న సత్యం. – కె. సీత, హైదరాబాద్.
ప్చ్… తీర్పు వెలువడిన తర్వాత కూడా ఈ సంఘటనపై స్పందించని వారు చాలా మంది ఉన్నారు. దళిత జాతిని ఉద్ధరిస్తామనే నాయకులు కూడా మౌనం వహించినట్లే ఉంది. హృదయం పిండేసింది రమ గారు.
”మీ మనువాద తీర్పులతో ఆ రాచపుండును గెలికితే ఆ బాధ ఏ రూపంలోనైనా ఉబికి వస్తే… అది ఒక అడవిగానో, ఒక తుపాకిగానో మారితే అది ఎవరి తప్పు అవుతుంది?” చాలా ఆలోచించాలి.
కుల మత వర్గ వైషమ్యాలకి… ఈ దేశం నట్టిల్లు అయిందన్న వాస్తవం ఒణికిస్తుంది. – వనజా వనమాలి, ఇ-మెయిల్.
”ఒక రాత్రి – రెండు స్వప్నాలు – ఉమామహేశ్వరి నూతక్కి” గురునాయిడుగారి కథలు నిజాలకు అద్దం పడతాయి. ఇలాంటి రచనలను పరిచయం చేయడం కూడా ఒక సామాజిక సేవ.
– అబ్దుల్ హఫీజ్, ఇ-మెయిల్
”సంపాదకీయం – ఎందుకిలా?” బాగా రాసారు మేడమ్ బాగుంది.
మౌనమా.. మార్చుకో నీ చిరునామా – భవాని ఫణి – బాగుందండి మీ కథ. ఇవాళ ఆంధ్రజ్యోతి నవ్యలో కూడా ఈ మౌనమ్ వీడాలని ఢిల్లీలో జరిగిన సంఘటనగా తన అనుభవాన్ని రాసింది ఒకామె. – మంజరి లక్ష్మి, ఇ-మెయిల్
సత్యవతిగారికి… నమస్కారం!
మహిళోద్యమ స్ఫూర్తిగా భూమికను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నందుకు మీకు శుభాభినందనలు.
పత్రికలో సోదరి శిలాలోలిత గారి ‘వర్తమాన లేఖ’ బావుంటుంది. భూమిక నిర్వహణలో మీ శక్తి మరింత పెరగాలని ఆకాంక్షిస్తూ.. – మురళీకృష్ణ జంపాల, గుంటూరు.
సత్యవతి గారికి నమస్కారం..
మల్లాది సుబ్బమ్మ గారికి నివాళులర్పిస్తూ దోర్నాదుల సుబ్బమ్మ కవిత ప్రచురించడం బావుంది. శ్రీనివాసరెడ్డి గారి కథానిక ఓడిపోనులో మానసిక విశ్లేషణ సామాజిక స్పృహ చక్కగా వున్నాయి. రమా సుందరి గారి వ్యాసం కంటనీరు పెట్టిస్తుంది. కాత్యాయినీ విద్మహే నగ్న సత్యాలను వెలికితీసారు. ఉమా మహేశ్వరి చా..సో.. మనసును, కథను చక్కగా ఆవిష్కరించారు. చలం మైదానానికి లోకేశ్వరిగారు ఇచ్చిన నిర్వచనం, వివరణ స్పష్టంగా హేతుబద్ధంగా ఉన్నాయి. అన్నిటా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న సత్యవతిగారు ప్రశంసార్హులు.
– ఎ.బి. అనంద్, విజయవాడ.