నా జీవితం – ఉద్యమాలు – పోరాటాలు- హిందీ మూలం : ‘హాద్‌సే’ శ్రీమతి రమణిక గుప్తా అనువాదం : డా. టి. (సి) వసంత, ఎమ్‌.ఏ. పిహెచ్‌.డి.

(కొత్త సీరియల్‌ ప్రారంభం)

అంకితం
నాకు అపార నమ్మకాన్ని కలిగించిన
ఆ కార్మికులకు,
పరివర్తనకోసం బలి అయిన
ఆ మహిళా-కార్మికులకు,
నేను అగ్నిపథంలో నడవడానికి ప్రేరేపించిన
నా ఆ శత్రువులకు,
నన్ను నిరాశ-నిస్పృహలకు గురి కానీయకుండా చేసిన
ప్రేమ-ఆశలతో నింపిన ఆ క్షణాలకు,
నన్ను ఏమాత్రం అలసట చెందకుండా ఉంచిన
ఆ కారడవులకు, దీర్ఘయాత్రలకు.
శ్రీమతి రమణిక గుప్తా
జన్మ : ఏప్రిల్‌ 22, 1930, సునామ్‌ (పంజాబ్‌)
విద్య : ఎమ్‌.ఎ. బి.ఎడ్‌.
బీహార్‌ – ఝార్‌ఖండ్‌లకి మాజీ ఎమ్‌.ఎల్‌.ఎ., విధానసభలో మాజీ సదస్సురాలు. ప్రభుత్వానికి చెందని స్వయం సేవా సంస్థలలో కార్యరతులు. ఎన్నో సామాజిక, సాంస్క ృతిక, రాజనైతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆదివాసీల, దళిత మహిళల, పిల్లల హక్కుల కోసం, క్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఎన్నో విదేశాల యాత్రలు చేసారు. ఎన్నో సన్మానాలు జరిగాయి. పురస్కారాలు లభించాయి. దాదాపు 8 కవితా సంకలనాలు, 40 పుస్తకాలు, ఆత్మకథ ప్రచురితం అయ్యాయి.

రమణిక గుప్తా గారి ‘ఆత్మకథ’ ‘హాద్‌సే’ (దుర్ఘటనలు) సమాజానికి ఒక దివిటీ. స్త్రీ-పురుషులిద్దరిని చైతన్యవంతులని చేస్తుంది ఈ ఆత్మకథ. ధనిక భూస్వామ్య కుటుంబం నుండి వచ్చిన రమణిక బాహాటంగా మీటింగులలో వాళ్ళ రెండు ముఖాలను బయట పెట్టారు. విభజన సమయంలో జరిగిన హృదయ విదారక సంఘటనలు చూసి ముస్లిం యువతులవైపు నుండి న్యాయంకోసం, పోరాటం సలిపారు. తను క్షత్రియ కులంలో పుట్టినా కోమట్లయిన వేదప్రకాష్‌ని పెళ్ళి చేసుకుని కుటుంబం, సమాజం వెలివేసినా ధైర్యంగా బతికారు.

దోపిడీ వ్యవస్థని సమూలంగా రూపుమాపాలని కలలు కని శ్రామిక వర్గం హక్కులకోసం ఇరవై నాలుగు గంటలు శ్రమించిన రమణిక గుప్తా, వ్యక్తిగత సుఖాలు కుటుంబాన్ని వదులుకొని ఉద్యమాలు – పోరాటాలు ఏవిధంగా చేసారో, పగలు-రాత్రి అని లేకుండా అడవులలో తన ఆత్మీయ స్త్రీ-పురుష మిత్రులతో ఎన్నో కష్ట-నష్టాలు, అవమానాలను ఓర్చి ఏ విధంగా ముందడుగు వేసారో, రాజకీయ పంకిలాన్ని శుభ్రపరచడానికి ఎంతగా సాహసించారో, బీహార్‌ ఝార్‌ఖండ్‌ బొగ్గు గనులలోని మాఫియాలను ప్రాణాలకు సైతం తెగించి, వాళ్ళు కొట్టినా, తిట్టినా, జుట్టుపట్టి ఈడ్చినా ఏ విధంగా ఎదిరించారో, ఆంధ్రప్రదేశ్‌లో కరువు, కాటకాలు వచ్చినప్పుడు బొగ్గుగనులలో పనిచేసే శ్రామికులకు ఆర్థిక సహాయం ఏవిధంగా అందించారో, అగ్నిపథంలో నడుస్తూ అడవిలోని అగ్నిపూల ఎర్ర రంగును అందరికి ఏ విధంగా చూపించారో ఈ ఆత్మకథ అద్దం పడుతుంది.

ఈ ఆత్మకథ ఒక స్త్రీ చేసిన ‘అలుపెరుగని పోరాటం’ ‘పీడితుల తాడితుల కోసం జరిపిన ఉద్యమం’ ఈ పుస్తకం నుండి ‘స్వేచ్ఛా వాయువుల సుగంధం’ వస్తుంది. రాళ్ళు-రప్పలు, ముళ్ళు-నల్లెళ్ళూ దాటుకుంటూ ఒక స్త్రీ చేసిన ‘రాజకీయ యాత్ర’. ఇందులో ఆరడుగుల అందగాళ్ళు, ఉంగరాల జుట్టు వాళ్ళు, ఊర్వసి, మేనకలు లేరు, నింగికి ఎగరాలనే రంగుల కలలు లేవు. అత్తరులు లేవు, గులాబీల గుబాళింపులు లేవు. ఉన్నదంతా ఈ నేలమీద బతుకుతున్న కష్టజీవులు, దోపిడీకి గురవుతున్న శ్రామిక వర్గం, యూనియన్లు, కార్మికులు,  కోర్టు కేసులు, నిరాహార దీక్షలు, భూస్వామ్య వర్గం, రాజకీయ నాయకులు, యాజమాన్యం మాఫియాలు చేస్తున్న అన్యాయాలు, అత్యాచారాలు, బొగ్గు గనుల దగ్గర కాలే కడుపులతో జీవిస్తున్న ఆదివాసీలు, చెమట, కన్నీళ్ళు-కష్టాలు. ఆనాడు జీవితంలో జరిగిన దుర్ఘటనలే పోరాటం చేయడానికి కలం పట్టడానికి ఆవిడకి ధైర్యాన్ని ఇచ్చాయి.

‘ఆకుపచ్చటి పండుటాకు’ అయిన రమణిక కలంలో ఎంతో బలం ఉంది. ఆవిడలో గొప్ప ఆత్మసౌందర్యమే కాదు, శారీరకంగా కూడా ఆమె ఎంతో సౌందర్య వంతురాలు. ప్రస్తుతం ఈవిడ ఆదివాసీల సాహిత్యాన్ని హిందీలోకి అనువదిస్తున్నారు. అనువాదం చేయిస్తున్నారు. వాళ్ళ గూడాలలో నివసించి వాళ్ళ ఆకలి మంటలను, వారిపై ప్రభుత్వం, ధనిక వర్గం జరుపుతున్న అన్యాయాలను, అక్రమాలను ప్రత్యక్షంగా చూసిన ఈవిడ ఈ వయస్సులో ‘యుద్ధరత్‌ ఆమ్‌ ఆద్‌మీ’ అన్న మాస పత్రికను నడుపుతున్నారు. ఈ పత్రిక పాఠకుల మనస్సును స్పర్శిస్తుంది. మేధస్సును మేలు కొలుపుతుంది. వివిధ భాషలలోని దళిత సాహిత్యాన్ని పాఠకులకు అందించడానికి ఆవిడ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు.

రమణిక స్త్రీ వాదానికి ఒక కొత్త పరిభాషను ఇచ్చారు. స్త్రీ విముక్తి కోసం స్త్రీలు పురుషద్వేషులు కాకూడదు. మిత్రులుగా ఉంటూ ఇద్దరి విముక్తి కోసం పోరాటం చేయాలి.

‘మైల్‌ ధోతా భారత్‌’ అన్న పేరన పాకీవాళ్ళ నికృష్ట జీవితాలు సమస్యల గురించిన వివిధ రచయితల వ్యాసాలను ప్రచురించారు. స్త్రీ స్వేచ్ఛను కోరిన గుడిపాటి వెంకటచలంగారు, పీడన-తాడన బానిసత్వంలేని మరో ప్రపంచాన్ని నిర్మించాలనుకొన్న విప్లవ రచయిత శ్రీ శ్రీ గారు ఈనాడు ఉండి ఉంటే రమణిక గారికి షేక్‌హాండ్‌ ఇచ్చేవారు.

(1) స్త్రీ ఆత్మాభిమాని అయితే…

స్త్రీ అభిమానవతి, పంజాబీ భాషలో చెప్పాలంటే ‘ఆప్‌హదరీ’, అయితే ఆమెకి అందరితోనూ శతృత్వం తప్పదు. ఒకవేళ ఆమె రాజకీయాలలో ఉంటే లతలా కాకుండా చెట్టులా ఆమె దృఢంగా ఉండాలనుకుంటే ఏవిధంగానైనా సరే ఆమెను తలవంచేలా చేయడానికి శత్రువులు ఎన్నో ఎన్నెన్నో ఉపాయాలు ఆలోచిస్తారు. కుతంత్రాలు, కుటిల రాజకీయాలను ప్రయోగిస్తారు. ఉచ్చులో పడేలా ప్రయత్నాలు చేస్తారు. అసలు ఆమె నామ రూపాలను లేకుండా చేయడమే వాళ్ళ ఉద్దేశ్యం. ఇది పదహారణాల సత్యం. ఒకవేళ ఆమె ట్రేడ్‌ యూనియన్‌లలో  పనిచేస్తే, వైట్‌కాలర్‌ యూనియన్‌లలో కాకుండా బొగ్గు గనులలో పనిచేస్తే, బ్లూ కలర్‌ కూలీలను సంఘటిత పరిచి వాళ్ళ హక్కులకోసం ఉద్యమాలను నడపకల శక్తి ఉంటే ఇక చెప్పేదేముంది మిత్రులు సైతం ఆమెపై బురద చల్లటానికి వెనుకాడరు. ఇక శత్రువుల సంగతి చెప్పేదేముంది! అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆమె వలన వాళ్ళకి ఏమైనా నష్టం కలుగుతుందా అంటే అదీ లేదు. నిజానికి ఇదే కారణం అయితే స్త్రీ-పురుషులిద్దరికి ఇది సమానంగా వర్తిస్తుంది. కాని కారణం ఇది కాదు, స్త్రీ అయి ఉండి ఇంతమందిని తనవైపు ఎట్లా మలచుకో గలిగింది? అసలు వాళ్ళ సహాయం లేకుండా ఇంతగా ఎట్లా ఎదగ గలిగింది? ఇంకేముంది ఆమె గురించి తమ ఇష్టం వచ్చినట్లు కథలు అల్లుతారు. కొంతమంది చొంగకారుస్తూ వింటూ ఉంటారు. చెప్పడానికి కాని వినడానికి కాని అసహ్యంగా ఉండే ఆ కథలు నలువైపులా పాకుతాయి.

నిజానికి రాజకీయాలలో ఎప్పటికీ ఎవరూ శత్రువులుగా ఉండరు మిత్రులుగానూ ఉండరు. సమీకరణాలు మారుతూ ఉంటాయి. అవకాశవాదులు ఆడే చదరంగంలో ఆడదానికి ముప్పు తప్పదు. ఒకవేళ ఈ పురుషాధిక్య వ్యవస్థ స్త్రీలోని పక్షిలా ఎగిరే మనస్తత్వాన్ని, స్వేచ్ఛా ప్రియత్వాన్ని భరిస్తుంది అని ఎవరైనా అంటే అది ఎంతమాత్రం నిజం కాదు. స్త్రీ తనమీద ఆధారపడి ఉందని, తన నిర్ణయాన్ని తను తీసుకునే శక్తి ఆమెలో లేదు అని నమ్మిననాడే పురుషుడు ఆమెను స్వీకరిస్తాడు లేదా ఆమె దుర్గగా మారి అతడిని భయపెట్టినా పురుషుడు ఇక చేసేది ఏమీలేక భరిస్తాడు. పురుషుడికి పోటీగా మరో పురుషుడు నిలబడితే అంతగా తేడా ఏమీ అనిపించదు కాని అదే స్త్రీ అతడికి పోటీగా నిలిస్తే అందులోనూ ఎవరిపైనా ఆధారపడకుండా తన నిర్ణయాన్ని తనే తీసుకునే శక్తికల ఆడదాన్ని నాలుగడుగులు దూరమే ఉంచుతాడు. అతడిలో ఒక న్యూనతా భావం ప్రవేశిస్తుంది. ఆమెపట్ల ఈర్ష్య అంతా ఇంతా కాదు నెమ్మదిగా ఆమె అతడికి శత్రువైపోతుంది. స్త్రీలో తనలో ఉండే గుణాలన్నీ చూసి స్త్రీ-పురుషులు సమానమే అనే పురుషుడు కూడా ఆమెలో అవతలివాడిని ఆకర్షించే ఏదో శక్తి ఉందని అది తన దగ్గర లేదని ఇది తన పౌరుషానికే సవాల్‌ అని అనుకుంటాడు. ప్రేమించి సమర్పించుకుంటున్న ఆ క్షణాలలో కూడా పురుషుడు తన నిర్ణయమే అది తుది నిర్ణయం అని నిరూపించడానికి సర్వవిధాల ప్రయత్నం చేస్తాడు. పట్టుదలను ససేమిరా వదిలి పెట్టడు. జీవితంలో నేను నా నిర్ణయాన్ని నేనే తీసుకునే సాహసం చేసాను. అందుకే నామీద ఎన్నో అభాండాలు, లేనిపోని కథలు వీటన్నింటిని నేను అధిగమిం చాను. ఈ వివాదాలను, మిధక్‌లను ధైర్యంగా కాలదన్నాను. దీనివలన నాకు ఎంతో ఆనందం కలిగింది. సంతృప్తి కలిగింది.

నేను రాజకీయాలలో ఉన్నాను. అందులోనూ ట్రేడ్‌ యూనియన్ల ఉద్యమాలతో నాకు అవినాభావ సంబంధం ఉంది. బొగ్గు గనులలో తిండి తిప్పలు లేకుండా నలిగిపోతున్న కూలీల హక్కుల పోరాటంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసాను. నేటికి ఈ ఉద్యమం దోపిడీదారులైన యజమానులతో, కాంట్రాక్టర్లతో, వాళ్ళ పహల్‌వాన్లతో, రౌడీలతో భేటీ పడుతూ, రాష్ట్రీయకరణని సాధించినా, యూనియన్లతో పరస్పరంగా లోపల జరిగే పోట్లాటలను భరిస్తూ ఇప్పటికి మాఫియాలతోనూ, లీడర్లతోనూ, చిన్నా చితకా మహాజనులు, వడ్డీ వ్యాపారస్తులతో తల పడుతూనే ఉంది. యజమానుల ఎత్తులకు పై ఎత్తులను చూసి, ఒకవైపునుండే చట్టం ఉండటం చూసి ఇంకా ఈ ఉద్యమకారులు తేరుకోలేకపోతున్నారు. హక్కుల పోరాటంలో గెలిచే శక్తి ఉన్నా ఈ ఉద్యమం పరస్పర విభేదాల వలన, ఎదురవుతున్న ఆటంకాల వలన ఏమీ చేయలేక పోతోంది.

చిన్నప్పటినుండే రాజకీయంగా, సామాజికంగా పరివర్తన రావాలి అన్న ఆలోచనకి నేను ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూనే ఉన్నాను. ఐదు ఆరు క్లాసులలో ఉన్నప్పటి నుండే ‘సత్యార్థ ప్రకాశ్‌’ ని సమర్థిస్తూ విగ్రహపూజకి వ్యతిరేకంగా గంటల తరబడి మాట్లాడు తూనే ఉండేదాన్ని. పటియాలలోని విక్టోరియా స్కూల్‌-కాలేజీలక

ప్రిన్సిపాల్‌ అయిన మిస్‌ సేన్‌ దగ్గరికి నా ఈ చర్చల గురించిన కంప్లైంట్స్‌ వెళ్ళాయి. ఆవిడ నన్ను పిలిచి కోప్పడ్డారు. కొన్ని సం|| తరువాత ఆ కాలేజీలో ఇంటర్‌ చదివేటప్పుడు నేను మళ్ళీ భగవంతుడికి వ్యతిరేకంగా చర్చలు జరపడం మొదలు పెట్టాను. అసలు ఇటువంటి చర్చలలో నాకెంతో ఆనందం కలిగేది. దాదాపు 14 సం||ల వయస్సులో ఉన్నప్పటి నుండి నేను ఆటల-పోటీలలో నాటకాలు వేయడం, పద్యాలు చదవడం మొ|| కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేదాన్ని. చర్చలు జరపడంలో నేను దిట్టని. అన్ని రంగాలలో నేను ముందడుగు వేసేదాన్ని. ఆ సమయంలో నా నిర్ణయాన్ని నేనే తీసుకునేదాన్ని. దీనివలన వచ్చే లాభ-నష్టాలను నేనే భరించేదాన్ని.

పటియాల రియాసత్‌లో కూడా వేశ్యలు ఉండేవారు. నా స్కూల్లో వేశ్య కూతురైన సయిదా అనే అమ్మాయి చదువుతూ ఉండేది. ఒకవేళ ఎవరైనా ఆమె గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా, కించపరిచినా వాళ్ళతో నేను పోట్లాడేదాన్ని. పోట్లాడడమే కాదు తన్ని తగలేసేదాన్ని. అసలు నా దృష్టిలో ఆమె వేశ్య కూతురు అయినా తల్లి వేశ్య అయినా వాళ్ళదేం తప్పులేదు. తప్పంతా సమాజానిదే. వేశ్య కావడం, కాకపోవడాన్ని ఆధారంగా చేసుకుని స్త్రీని పతిత, పతివ్రత అన్న దృష్టితో చూడడం నా ఉద్దేశ్యంలో సరియైనది కాదు. అసలు ఈ పరిభాషను నేను చస్తే అంగీకరించను. ఈనాటికి కూడా ఎవరైనా పతితులైన స్త్రీలు, నిజానికి వీళ్ళ తప్పేం లేకుండా రొంపిలో దింపబడిన స్త్రీలు, నా దగ్గరికి సహాయంకోసం వస్తే నేను ఎవరినీ లెక్క చేయకుండా మా ఇంట్లో నీడనిచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా ప్రోత్సహిస్తాను. అసలు స్త్రీలను పతితులు అంటే నేను ఎంతమాత్రం సహించను. ఎందుకంటే కేవలం వాళ్ళ శీలానికి ముడివేసి అంటే సెక్స్‌ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని పతిత అన్నమాటను ఉపయోగిస్తారు. స్త్రీలో ఉండే తక్కిన గుణాలు, సహృదయత, నమ్మకం, పరస్పర సద్భావనా భావం, సాహసం, నిర్భయత్వం మొ|| వాటికి ఏమాత్రం విలువ ఇవ్వరు.

‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’ నేతల మీద కేసు నడిచింది. అప్పుడు బాలికల విక్టోరియా కాలేజీలో సమ్మె చేయించాను. కొంతవరకు సఫలం అయింది. నేను, సయిదా, మొత్తం క్లాసు సమ్మెలో పాల్గొన్నాము. మొగపిల్లల కాలేజీ వాళ్ళు నాకు మాట ఇచ్చినప్పటికి ఒక్కళ్ళు కూడా సమ్మెలో పాల్గొనలేదు. దొంగతనంగా సమ్మె చేయించడం, మా ఇంటివాళ్ళకు, మహారాజు పటియాలా ప్రభుత్వం వారికి ఒకరకంగా ఛాలెంజే. ప్రిన్సిపాల్‌ నన్ను కొట్టింది. ఇంటివాళ్ళు కోపంతో ఊగిపోయారు. కొట్టారు. పటియాలా రియాసత్‌ మిలిటరీలో మా నాన్నగారు ఆ రోజుల్లో లెఫ్టినెంట్‌ కర్నల్‌ గానూ, డాక్టర్‌ గానూ పనిచేసేవారు. నావలన ఆయనకి నోటీసులు రావడం మొదలు పెట్టాయి. నామీద ఎంత ఒత్తిడి తెచ్చినా నేను రాజకీయాలను వదలలేదు. అప్పటికే స్వాతంత్య్ర సంగ్రామం పట్ల నేను ఆకర్షితురాలనైనాను. గాంధీగారి ప్రభావం నామీద చాలా పడ్డది. 15, 16 సం||ల వయస్సులోనే నేను ఖాదీ కట్టే ప్రయత్నం చేసాను. చిన్నప్పటినుండే నాకు చచ్చే ఆత్మాభిమానం ఉండేది. దీనివలన నాకు కొంత కష్టాలు, నష్టాలు వచ్చినా నేనెప్పుడు దేనికీ బాధపడలేదు. అసలు ఈ గుణం, ఈ పట్టుదల నాలో లేకపోతే బహుశ నేను కేవలం గృహిణిగా జీవితం గడుపుతూ, గుండిగలు గుండిగలు అన్నం వారుస్తూ, రొట్టెలు చేస్తూ ఓ ఏడెనిమిది మంది పిల్లలకు తినిపిస్తూ తృప్తిపడేదాన్నేమో. రాజకీయాలలోకి వచ్చినా కేవలం ఒక లతనై అందరిమీద ఆధారపడి ఉండి ఉంటే ఈ పురుషాధిక్య వ్యవస్థ నన్ను తనలో చేర్చుకునేది. ఇప్పుడు నేను ఏ మెట్టుమీద ఉన్నానో ఆ మెట్టుమీద ఉండేదాన్నే కాదు. అసలు ఈ గమ్యాన్ని చేరుకునే దాన్నే కాదు. రాజకీయాలలోకి వచ్చే స్త్రీలకి నేను చెప్పేదేమిటంటే వీలుంటే నీకు నువ్వే సహాయం చేసుకో లేకపోతే వెతుక్కో. ట్రేడ్‌ యూనియన్లలోకి, రాజకీయాలలోకి వచ్చే స్త్రీలు ధైర్యంగా ఉండాలి. అంటుకోకు ముట్టుకోకు అని అంటే, నన్ను ముట్టుకోకు  నామాల కాకి అంటే ఎంతమాత్రం ఇక్కడ కుదరదు. అగ్నిపథంలో నడిచేశక్తి ఉండాలి. వీస్తున్న గాలికి విరుద్ధంగా నడిచే బలం ఉండాలి. గాలితో పాటు ఎన్నో ఎన్నెన్నో గడ్డిపోచలు ఎగురుతూనే ఉంటాయి. ఈ గాలి దుమారాలకు ఎదురు నిలిచి వేళ్ళతో సహా పెరికి వేయబడకుండా చూసుకోవాలి. వీటన్నింటిని భరించేటప్పుడు ఎప్పుడైనా బలహీన పడినా మనం మనలని రక్షించుకోవాలి. అప్పుడే ఆ స్త్రీలు సమాజంలో గౌరవం పొందుతారు. వాళ్ళ గురించిన చర్చలు జరుగుతాయి.

నా బాల్యం కళ్ళకు కట్టినట్లుగా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆనాడు నా నిర్ణయాన్ని నేనే తీసుకోవడం, ఆ పట్టుదల, అందరికి అయిష్టమైన పనులన్నీ చేయడం మొదలైనవన్నీ నేను ఏనాటికి మరచిపోలేను. నా ఆలోచనలని ఆచరణలో ఎట్లా పెట్టాలి, వ్యవస్థలో వ్యాపించి ఉన్న అర్థం పర్థంలేని ఆచారాలు, నియమ నిబంధనలను ఎట్లా అధిగమించాలి నా ఎదురుకుండా ఈ ప్రశ్నలు ఎప్పుడు తల ఎత్తుతునే ఉండేవి. స్త్రీల గురించిన నా ఆలోచనలు, అభిప్రాయాలు వేరు. అప్పటికి ఇవన్నీ సమాజానికి కొత్తవి. అందువలన వీటిని ఆచరణలో పెట్టడం నాకు ఎంతో కష్టం అయింది. చాలా పోరాటం చేయవలసి వచ్చింది. నేను ఎప్పుడూ సమర్థవంతంగా పనిచేయాలనుకున్నాను. అప్పుడే నా లక్ష్యం నెరవేరుతుందని అనుకున్నాను. సమాజం నా వెనక రావాలి కాని నేను దానివెనక నడవను అన్న పట్టుదల ఆనాటి నుండి ఈనాటి వరకు నాలో ఉంది. రాజకీయాలలో కాని, సంఘపరంగా కాని, వ్యక్తిగత ఆలోచనలలో కాని నేను దారి చూపాలి. అందుకే నేను ముందుగా ప్రచురితంలో ఉన్న నీతి నియమాల మీద, ఆచారాల మీద, సెక్స్‌ సంబంధాల మీద వేటు వేసాను. ఆచారాల విరుద్ధంగా పోరాటం జరపడంలో నాకు ఎంతో ఆనందం కలిగేది. నేను ఇట్లా చేస్తున్నప్పుడు ఆచారాలను పాటించేవారు లోలోపల ఉడుక్కోవడం, అరవడం చూస్తుంటే నాకెంతో సంతోషం కలిగేది.

(2) ఆచారాలకు విరుద్ధంగా నడవాలన్న పట్టుదల

మా కుటుంబం ఫ్యూడల్‌ కుటుంబం. ఆ రోజుల్లో అన్ని ఫ్యూడల్‌ కుటుంబాల వాళ్ళలాగా మా కుటుంబం వాళ్ళు కూడా ఎంతో ఆధునికంగా ఉండాలని పైపైన మెరుగులతో తమదే పై చేయి అన్నట్లుగా ప్రవర్తించేవారు. ఈ కుటుంబాలు పరస్పరం పోటీలు పడాలి. మా నాన్నగారు అమ్మగారు గీతను దాటి మా ఇంట్లో వాళ్ళకి పరదా పాటించనక్కరలేదని చెబుతూ ఉండేవారు. అయినా ఇంట్లో పరదా ప్రథ ఉండేది. మా అమ్మ (దొరసానిలా) మా నాన్నగారి వెంట వెళ్తూ ఉండేది. అయినా కుటుంబంలోని ఆడపిల్లలు మాత్రం తలపై ముసుగు వేసుకోవాలి. టాంగాలో నలువైపులా తెరలు కట్టేవారు.

నేను ఈ కుటుంబపు ఆచారానికి వ్యతిరేకంగా టాంగాలో ముందు సీట్లో నాన్నగారి పక్కన, కారులో తాతయ్య పక్కన కూర్చోవాలని పట్టుబట్టేదాన్ని మా అమ్మ నన్ను కోప్పడేది. గిల్లీ- డండా, క్రికెట్‌, హాకీ, కబడీ ఆడాలంటే నాకెంతో ఇష్టం. మొగపిల్లల పక్కన కూర్చోవాలన్న కోరిక ఉండేది. చిన్నపిల్లనైనా నాన్నగారి సైకిల్‌ని ఎత్తెత్తి కొడుతూ నడిపేదాన్ని. సైకిల్‌ తీసుకుని రోడ్డు మీదకు వచ్చానంటే చాలు ఇంట్లోవాళ్ళు నామీద అరిచేవారు. ఒకరోజు అమ్మతో బయటకి వెళ్తున్నప్పుడు అమ్మ నన్ను తలమీద ముసుగు వేసుకుని నడవమంది. నేను ఆ పని చస్తే చెయ్యను అని అంటే అల్టిమేటమ్‌ ఇచ్చింది, తల మీద ముసుగు వేసుకోకపోతే ముందు ఇరవై అడుగులైనా నడువ లేకపోతే ఇరవై అడుగులైనా నా వెనక నడు. నువ్వు నాతో ఉన్నావని ఎవరు అనుకోరు. నాతో పాటు నడవకు.

ఆనాటి నుండి నేను ఇరవై అడుగులు ముందు నడవడం ప్రారంభించాను. ఆరోజు నుండి నన్ను ఓ విప్లవకారిణిగా చూడడం మొదలు పెట్టారు. ప్రతి పనికి అడ్డు వచ్చేవారు. అయినా ఆరు నూరు అయినా నూరు ఆరైనా నేను మాత్రం నా పంతాన్ని ససేమిరా వదిలేదాన్ని కాదు.

(ఇంకా ఉంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.