నీతో మాట్లాడి ఎన్నేళ్లయింది… గుండె పాతరను తవ్వి నీ గురుతుల గురుములను కొలుచుకొని ఎన్నాళ్లు గడిచిపోయినాయి… చాన్నాళ్లకు మొన్నొక సారి, ఆ కొండమింద నుంచి దిగి వచ్చిన ముసురుమబ్బు నీ తలపులను మోసుకొచ్చి నన్ను తడిమేసి తడిపేసి పోయింది. నీకు తెలియదేమో, నేనిప్పుడు ఏడాదిగా ఏడుకొండల కాళ్ల దగ్గర కుదురుకొని ఉండాను. ఆ మొయిలు నా చెవిలో గుసగుసలాడేసి పొయినంక నీ నెమరుల్నే నెమకతా తలకాడుకు బయలుదేరినాను. కావేటి ఒడ్డున పరుచుకొన్న ఎడారిలాంటి తలకాడును తలుచుకొంటే చాలు నా ఒళ్లు పులకరిస్తాది. పులకరింతేనా అది? జలదరింపు కూడా కావచ్చు.
కావేరిని ఎన్ని చోట్ల చూసుంటాను – అది పుట్టే తలకావేరి దగ్గర, మొగిలి గుబుర్లు నిండిన రంగన్న తిప్పలను చుట్టు ముట్టి పారే దగ్గర, కబినేరును కౌగలించుకొనే నర్సీపురం దగ్గర, శివసముద్రమై దూకే కొళ్లే గాలం దగ్గర, తాడి లోతున సన్నటి పాయగా పోయే మేకదాటు దగ్గర, రాళ్లమింద పొగలు లేసినట్టుగా దుమికే హొగెనకల్లు దగ్గర, రంగనాయకుడి కాళ్లను కడిగి జరిగే శ్రీరంగం దగ్గర, పదుల చీలికలయి కడలిలో కలిసే పచ్చని తంజపురి దగ్గర – ఎన్ని చోట్ల చూసుంటాను ఈ చిలిపి కావేరిని. కానీ తలకాడు తావున దీని హొయలే వేరు.
ఉయ్యాలలో ఒదిగిన పసిబిడ్డ మాదిరిగా కావేరి ఒడిలో ఒరిగి ఉంటాది కదా తలకాడు. మనిద్దరమూ తొలిసారిగా కలుసుకొనింది మటుకు తలకాడులో కాదు. నాకు అప్పటికి ఆ చోటే తెలియదు కదా. పచ్చని పసరుగాలుల తావిని వెదజల్లే ఆ తావును నాకు నెళవు చేసింది నువ్వే. గురుతుందా నీకు, చెన్నపట్నపు కడలికరలో కూచుని, అలల మింద తేలివచ్చి ఒళ్లు నిమరతా ఉండే కడలి గాలికి మైమరిచి పోతుంటే అన్నావు- ‘ఈ ఉప్పుగాలికే మైమరచిపోతుండావే, అదే మా కావేరమ్మ మోసుకొచ్చి ఇచ్చే మొగలిపూల ఎలగాలి తాకితే ఇంకేమయిపోతావో’ అని. నాకు తెలుసు, నీకు కడలి ఉప్పుగాలి అంటే వెగటని.
‘మీ కావేరమ్మకీ మా ప్రళయకావేరమ్మకీ మొగుడు ఈ కడలయ్యే’ నవ్వతా అంటే ప్రళయకావేరిని చూడాలని పట్టుపట్టినావు.
‘మీ అమ్మకూ మా అమ్మకూ ఎంత వేరిమి ఉందో!’ రెక్కలు చాచుకొని ఎగిరే పాలపిట్టలాంటి ప్రళయకావేరిని చూస్తా, నీ రెండు చేతుల్నీ చెంపలకు ఆనించుకొని అచ్చెరపోతా అన్నావు.
‘ఇదేంది ఇంత నీలం! నింగంత నీలం, కడలంత నీలం, కళ్లనిండా నీలం, కట్ల పువ్వంటి నీలం’ అని నువ్వంటా ఉంటే ఇంత తెలుగును ఎప్పుడు నేర్చుకొన్నావా అని నేను వెలవరపొయినాను. నాకోసం తెలుగును పలికిన నువ్వు, నీ కోసం కన్నడాన్ని నుడివిన నేను.
‘కన్నడం’ అని నేనంటే ఉడుక్కొనే దానివి, ‘కన్నడ’ అనాలనే దానివి. మయిలాపూరులోని నాగేశ్వర్రావుపంతులు పూదోటలో కూచుని ఉండినప్పుడు, ఇదే మాటమింద నువ్వు మూతి ముడుచుకొన్నావు. నేను ప్రాగన్నడంను పలకతా ‘సిరిగన్నడం గెల్గె, సిరిగన్నడం బాళ్గె’ అన్నాను. అని ఊరుకోనుంటే సరే, ‘పంపడి తరి వరకూ కన్నడమే, అన్నెనకనే కన్నడ అయింది’ అని కూడా అనేసినాను. ఆ మాటే నా కొంప ముంచతాదని నేను అనుకోలేదు.
‘ఇంత కన్నడాన్ని ఎప్పుడు నేర్చినావు కణో’ అంటా పట్టలేని ఉవ్వాయితో ముద్దరేసేసినావు. వేసేసి నీ పాటికి నువ్వు ఏమీ ఎరగని దాని మాదిరిగా పొయ్యేసినావు. అనెంక ఎన్ని ఇరవులు ఆ ఎంగిలిచెమ్మ నన్ను ఇక్కట్టు పెట్టిందో నీకేం తెలుసు!
రెండేళ్ల మన చదువు రెప్పపాటులో అయిపోయింది. అవతల నీ దోవన నువ్వు తలకాడుకు పొయ్యేసినావు. అప్పుడే కదా పెను కుదుపులు నా బతుకులో, అమ్మా అబ్బా ఎడమయిపొయి, పాలివాళ్లతో గొడవలు ముదిరి – హత్తుకుని ఓదార్చే ఒక్క ఉల్లం కోసం అల్లాడిపొయిన నాళ్లవి. ఒంటరి తనాన్ని తట్టుకోలేక పరిగెత్తి వచ్చేసినాను తలకాడుకు.
అబ్బ, ఎట్టాంటి ఊరది! ఎట్టాంటి బాట ఆ ఊరికొచ్చేది! బెంగుళూరు నుంచి మైసూరుకు పొయ్యే పట్టేగి (రైలు) నెక్కి మండ్యలో దిగి, మండ్య నుంచి పేరేగిలో నర్సీపురంకు చేరుకొని, అక్కడ నుంచి కొళ్లేగాలంకు పొయ్యే పేరేగిని పట్టుకొని తలకాడుకు చేరుకొనే వరకూ ఆ నూరుమైళ్ల పయనమంతా పచ్చని పంటచేల నడుమనే కదా సాగేది.
పచ్చంటే పచ్చ… అట్టాంటి ఇట్టాంటి పచ్చ కాదు… ఊడిచిన కళ్లం నిండా చిలకలు వాలినట్టుండే పచ్చ…. ఆవుపేడతో అవ్వ అలికిన పడమటింటి లాంటి పచ్చ…. లేగదూడ కొరికే పసరు గరికల పచ్చ… అప్పుడే చేతుల్నిండా పెట్టుకొన్న పచ్చి గోరింటాకు పచ్చ… పాత కోనేటి మెట్లను అబ్బిళించుకొన్న పాచిలాంటి పచ్చ. అన్ని పచ్చల నడుమన తాటిమాను ఎత్తు ఇసక దిబ్బలతో ఎడారిలాంటి తల కాడు. ‘ఎక్కడెక్కడి ఇసకనంతా తెచ్చి ఇక్కడ పోగుపోస్తుంటాది మా కావేరమ్మ’ అబ్బురంగా అన్నావొకసారి.
తలకాడుకు రెండుమైళ్ల దవ్వులోని ఆ మాదిగపల్లెకు పిలుచుకొని పొయినావు నన్ను. అవున్లే నేను అట్ట చెప్పా పెట్టకుండా వచ్చేస్తే నువ్వు మటుకు ఏం చేస్తావు. ఇప్పుడనిపిస్తా ఉంది, అట్ట వచ్చుండకూ డదని. అప్పుడనిపించలేదే. తలకాడు ఇసక దిబ్బల కింద కూరుకొని పొయుండే గుళ్లను చూడడానికి వచ్చేవాళ్లకు వండిపెట్టే ఒకటి రెండు కూటిళ్లు తప్ప పడకిళ్లు లేని తావు అది.
మేల్గేరి (అగ్రహారం) పిల్లవు నువ్వు. కడపదాటి అడుగును బయట పెట్టాలంటే ఎన్నో అడకలకు మారు పలికితే కానీ కుదరదని నాకు తెలుసు. అందుకనే మునిమాపున బయిటికని వచ్చే నీరాక కోసం పగలంతా కావేటి ఒడ్డున పడిగాపులు కాసి, నీతో ఆ కాసేపు గడిపి, ఇరులు కమ్ముకొనే పొద్దుకు నర్సీపురానికో కొళ్లేగాలానికో పొయ్యేవాడిని. ఎన్నాళ్లని డబ్బులిచ్చి పడకిళ్లలో ఉండగలను. ఉండాలేక, నిన్నొదిలి పోనూ పోలేక అలమటిస్తున్నప్పుడు ఆ అటమటను కూడా నువ్వే తీర్చినావు.
అచ్చకన్నడ తావు అనుకొనే ఆ చోటులో అప్పటపు తెలుగును మాట్లాడే మాదిగపల్లెను చూసి అచ్చెరపొయినాను. మాదిగ పల్లెలోని నీ చిన్ననాటి నేస్తుడు ‘చిన్నమాద’ నాకు అన్నదమ్ముడయినాడు. చిన్నమాదడి తల్లి కెంచక్క, ‘అమ్మణ్ణీ నువ్వు దిగులు పడొద్దు. నా కంట్లోనే ఉంటాడు పొయిరా’ అనింది నీతో. ఎట్టాంటి పలుకది! ఎవరయినా ‘నా ఇంట్లో’ అంటారు, కెంచక్క ‘నా కంట్లో’ అనింది. అప్పుడే కాదు, అప్పట్నించీ ఇప్పటి వరకూ ఎన్నో మాదిగ బతుకుల నడుమ బతికినాను. వాళ్ల నోళ్ల నుంచి మటుకే వస్తాయి ఇట్టాంటి మాటలు.
నువ్వు నాకు ఎడమయిపొయినాక ఎసపు (ఉద్యమం)ను నెత్తికెత్తుకొని వేల పల్లెలను తిరిగుంటాను. తెలుగును పలికే అన్ని కుదురులూ నన్ను అక్కున చేర్చుకొన్నవే, కాదనలేను. కాదంటే నాకు పట్టెడు కూడు కూడా పుట్టదు. కానీ అన్ని కుదురులూ ఒకెత్తు, మాదిగ కుదురొక్కటే ఒకెత్తు. కడుపుకు అంత కడి, కాళ్లు చాపుకొని కునికే దానికి అంత తావూ అందరూ ఇచ్చినారు. మాదిగలు మటుకు వాళ్ల బతుకుల్నే ఇచ్చినారు. తమ్ముడా కొడుకా చిన్నోడా బావా అంటా నన్ను నెత్తిన పెట్టుకొని మోసినారు, రెప్పల కింద దాచుకొని కాచినారు.
మాదిగ కుదురుతో నా పొంతు తలకాడు మాదిగ పల్లెతోనే కదా మొదల యింది. అప్పటికే మొగుడ్ని పోగొట్టుకొన్న కెంచక్క పొద్దన్నే లేచి, ఇంటెడు పనినీ చేసి, అయిదారు ముద్దల సంగటిని కెలికి, ఉలవలో ఉర్లగడ్డలో ఏమీ దొరకక పోతే కాశాకో కన్నేకో పెరక్కొచ్చి చారు చేసి, మమ్మల్ని కూతేసేది. నలబయి గొర్రెలుండే దొడ్డి పనిని ముగించేవాడు చిన్నమాదడు. వద్దువద్దంటా ఉండినా చిన్నాచితకా పనుల ను అందుకొనే వాడిని. కెంచక్క కంచాల్లో పెట్టిన చెరొక ముద్దను తిని, ఇంకొక రెండు ముద్దలను తూకుగిన్నెలో వేసుకొని, గొర్రెల ను బయలుకు ఎక్కించేవాళ్లం నేనూ చిన్న మాదడు. కెంచక్క ఊర్లోకో చేన్లకో కూలికి పొయ్యేది.
ఊరికి ఒక పక్కనుండే కావేరి ఒడ్డుకో, ఇంకొక పక్కనుండే ఇసక దిబ్బల మిందకో, తూరుపు పక్కనుండే గుట్టల నడుమకో గొర్రెల వెనకాలపడి పోయేవాళ్లం. గొర్రెల్ని మేపతా చిన్నమాదడు గొంతెత్తి తెలుగు పదాలను పాడేవాడు. పదాల నిండా పచ్చి బూతు మాటలే.
‘మాదా, ఎవురయినా వింటే ఎట్లప్పా’ అని అడిగితే ముసిముసిగా నవ్వతా ‘ఈడ తెలుగు తెలిసినోళ్లు ఎవురన్నా, మా మాదిగపల్లెలో గొర్రెలుండేది మాకే. మావాళ్లు ఎవురూ గొర్రెల మేపుకు వచ్చేలేదు. ఈ కన్నడమోళ్లకు మన తెలుగు తెలిసే లేదు’ అనేసేవాడు. ఎవరి దగ్గర్నో నేర్చిన పాటలు కాదు, అప్పటికప్పుడు కయిగట్టి పాడేవాడు.
వాలేపొద్దులో నన్ను వెతుక్కొంటా వచ్చేదానివి. చిన్నమాదడు గొర్రెలతోపాటు ఉండిపోతే, మనమిద్దరమే నడుచుకొంటా ఏటి అవతలకో గుట్టల నడుమకో పొయ్యేవాళ్లం.
ఇప్పుడు అవన్నీ తవ్వుకోవడం ఎందుకంటావా! తవ్వనియ్యి, ఇంకా ఎన్నాళ్లు లోపల్నే పేరబెట్టుకొనేది చెప్పు. తవ్వి బయటకు తీసెయ్యనీ. తలకాడు దగ్గర వంపు తిరిగిన కావేరిని బతుకంతా చూసినా విసుగు పుట్టదు. నువ్వు కళ్లు మూసుకొంటే నీ కనురెప్పలమింద కూడా అట్టాంటి వంపు తిరిగిన ముడత కనిపించేది నాకు. ఊరి రేవుకు కొంచెం ఎడంగా పోయి ఏటికి అడ్డంబడి దాటి ఆ పక్కకు పోతే నీలమూ పచ్చా కలగలిసిన కలనేత కోక మాదిరిగా ఉండేది ఆ తావు. చిట్టెదురు పొదల పక్కన కూచుని మనం ఊసులాడుకొంటుంటే, పొదల్లోని జెముడుకాకులు ఊఁ కొట్టేవి. కొక్కెర్లు గుంపుగట్టి కారుబారుమంటా రంగన్న తిప్పల మీదకు ఎగిరిపోతా ఉండేవి. పగలంతా కమ్మరకట్టు మాదిరిగా నారసాగిన పొద్దు, ఆ మునిమాపులో మటుకు రెప్పపాటులో కరిగిపొయ్యేది. నేలమ్మ, వన్నెల ఉడుపుల్ని విప్పేసి నల్ల కంబళిని కప్పు కొన్నాక మనం మళ్లా ఏటి ఈ గట్టుకు వచ్చేవాళ్లం. చిన్నమాదడు మనకోసం ఎదురుచూస్తా దారికాస్తా ఉండేవాడు. నేను గొర్రెల్ని మలేసుకొని మాదిగపల్లె తట్టుకు నడిస్తే, వాడు నీకు తోడుగా మీ ఊరి గమిడి వరకూ వచ్చి తిరుక్కొనే వాడు.
కెంచక్క పెట్టిన ఉడుకుడుకు సంగటిని ఊరుబిండిలో అద్దుకొని మింగి, ఇంటి బయటుండే బండమింద కంబళ్లు పరుచుకొనేవాళ్లం. మేము మిన్నును కప్పుకొంటే, మమ్మల్ని కంబళ్లు కప్పుకొనేవి. కుండాసట్టీ ఎగబెట్టి వచ్చిన కెంచక్క, వక్కాకును నమలతా పసరుబాలుని పదము ఎత్తుకొనేది. ‘నీలవేణీ నిత్తె కళ్యాణీ పాలవేణీ పంచకళ్యాణీ…’ అంటా కెంచక్క పాడే పసరు బాలుని పాటకు దిక్కులు కూడా తూగేవి. పసరుబాలుడు, చిన్నపణితి అనే ఇద్దరు పడుచువాళ్ల వలపుకతే ఆ పాట. నాకోసమే పాడినట్టు ఉండేది ఆ పాటను. మాదిగ పల్లెలో నేను ఉండిన ఆ నలబయినాళ్లూ, ఈ కట్టెలో ఉసురాడినన్నాళ్లూ గడ్డకట్టుకొని నిలిచిపోయే ఆనవాళ్లు.
‘అబ్బయ్యా, మాదిగ చిన్నోని వయిన నిన్నెట్ల మెచ్చింది చిన్నఅమ్మణ్ణి?’ ఒకనాటి రెయ్యి పాడే పదానికి నడుమ నన్నడిగింది కెంచక్క. నేను మారాడలేదు. మరునాడు నీతో అంటే ‘ఇక్కడ మాదిగలు తప్ప తెలుగు మాట్లాడే వాళ్లు ఇంకెవరూ లేరు కదా. అందుకే నిన్ను కూడా వాళ్ల చిన్నోడివే అనుకొనిందేమో’ నవ్వతా అన్నావు. అప్పుడు అనిపించలేదు కానీ అవతల ఎన్నోసార్లు అనుకొన్నాను ‘మాదిగ పుట్టక పుట్టాలంటే ఇచ్చిపెట్టి ఉండాల’ అని. అవునా కాదా చెప్పు! అంత గొప్ప తీరు తెన్నులు కలిగిన కుదురు ఇంకొకటి ఉందా?
తీపి తలపులను తోడుకొంటే నెమ్మది కానీ, వెతల కతలను లోడుకోవడం ఎందుకంటావా? చెప్పనియ్యి. ఇమ్ముదు మ్ములు కలిస్తేనే కదా బతుకూబాళూ.
మనం అట్ట చేసుండ కూడదు. నిన్నెందుకులే అనడం, నేనట్ట చేసుండ కూడదు. మునిమాపు చీకట్లు ముసురు కొన్నాక నీ నీడగా నేనే వచ్చుండాల్సింది. చిన్నమాదడిని తోడు పంపించడం ఎంత పొరపాటో అప్పుడు తెలియలేదు నాకు. తలకాడు గుప్పుమనే దాకా తెలియలేదు. గుప్పుమన్న ఊరు నీకూ చిన్నమాదడికి పొంతు కట్టింది.
‘అబ్బయ్యా, ఇంకమీరు ఏమార కూడదు. నిప్పులమింద ఉప్పురాయి మాదిరిగా ఉంది ఊరు. నువ్వు బయిదేరు. కొళ్లేగాలానికి తూరుపున మాదేస్పరుని కొండ ఉంది. ఆడకు పొయి ఉండు. ఈ రెయ్యి మా మాదడు ఎట్లనో అమ్మణ్ణిని ఆడకు తోడుకొని వచ్చేస్తాడు. గుడిలో పెండ్లి చేసుకొని, ఆడ్నించి అట్లే తూరుపుకు దిగబడిపోండి. గోపినత్తం, ఒగెనకల్లుల్ని దాటుకొంటే తమిళునాడులోని పెన్నాగరం వస్తాది. మా తమ్ముడు ఉండాడు ఆడ. వాడు చూసుకొంటాడు’ అంటా ఊదరపెట్టి నన్ను తరిమింది కెంచక్క. నేను నీకు చెప్పి బయలుదేరి ఉండాల్సింది. నువ్వింతగా మోసం చేస్తానని కలలో కూడా అనుకోలేదు కదా. ఇదంతా నువ్వు చెప్పినావనే కదా కెంచక్క చెప్పింది. అందుకనే నమ్మి బయలుదేరాను. కోడికూతకు ముందే, చుక్కపొడుపుకు ముందే మాదిగపల్లెను వదిలేసినాను.
ముందునాటి మాపున కావేరమ్మ ఒడిలోని తడి ఇసకమింద పడిన మన కాలి ముదరలు, మరునాటికి చెరిగిపొయి ఉంటాయి. నువ్వు చేసిన గాయం మటుకు ఇంకా చెరగలేదు నా గుండెల్లో. చెక్కులేసిన పుండు చిరచిరలాడినట్టు అప్పుడప్పుడూ మండతానే ఉంది.
మాదేశ్వరుని కొండకు ఆపొద్దు నడిరేయి చిన్నమాదడు ఒక్కడే వచ్చినాడు. నిన్ను మీ ఇంట్లోవాళ్లు కట్టుదిట్టం చేసేసినారనీ, నువ్వు బయటకు రాలేకపొయినావనీ, నన్ను వెళ్లిపొమ్మన్నావనీ, తడవు చూసుకొని నువ్వే వస్తానన్నావనీ చెప్పినాడు. చేసేదేముంది!
అక్కడి నుంచి వచ్చిన నెలనాళ్లకు చిన్నమాదడి దగ్గర్నుంచి జాబు అందింది. ‘గుండెలు పగిలిపొయినాయి…. బతుకు చీకటయి పొయింది…’ ఈ మాటలు వెగటు పుట్టించేవిగా అనిపిస్తాయి కానీ, జాబును చదివినంక సరిగ్గా అట్టనే అనిపించింది నాకు. నువ్వు నమ్మినా నమ్మకపొయినా నీకు చెప్పే తీరాల. నాకు చచ్చిపోదామని పించింది. గట్టిగా అనుకొనేసినాను కూడా.
నిన్నొక్కసారి కలవాలనిపించి గబగబ బయలుదేరినాను తలకాడుకు. నడిపొద్దుకు నర్సీపురానికి చేరుకొన్నాను. పొద్దు మునిగేవరకూ అక్కడే ఉండి, అనెంక కదిలి రెయ్యి సంగటి పొద్దులో నక్కినక్కి మాదిగపల్లెకు చేరుకొన్నాను.
కెంచక్క లేదు ఇంట్లో. నన్ను చూసిన చిన్నమాదడు వెలవర పొయినాడు. బిరబిర ఎదురొచ్చి విరవిర ఇంట్లోకి లాక్కొని పొయినాడు. ‘ఎందుకొస్తివన్నా?’ అన్నాడు ఆత్రంగా.
‘నువ్వు రాసింది నిజమేనా, ఎప్పుడు జరిగింది పెండ్లి?’ అంతకన్నా ఆత్రంగా అడిగినాను. నేలచూపులు చూస్తా అంతా నిజమేననీ, నీకు పెండ్లయి రెండువారాలు అయిందని, నిన్ను వెంటనే అత్తగారింటికి పంపించేసినారనీ, ఆ ఊరు ఏదో తెలియదనీ అన్నాడు.
‘పొయ్యేముందు నాకేమయినా చెప్పమనిందా?’ అడిగినాను కొతుకుపడిన గొంతుతో. మాదడి గొంతులో అలికిడే లేదు.
ఇంక చెప్పేది ఏముంది? నన్ను ఏమార్చి నీ దోవన నువ్వు పొయ్యేసినావు. ఆ అలమటలోనుంచి ఎట్ట బయటపడినానో నాకే తెలియదు. నన్ను ఆదుకొనింది ఈ ఎసపే. తెలుగు ఎసపును తలకెత్తుకొని ఈ ఇరవయ్యేళ్లూ పిచ్చిగా తిరిగినాను. దాంట్లోనే మునిగిపొయినాను. దాంట్లోనే ఇమిడిపొయినాను. ఇదిగో ఇన్నేళ్లకు, కాస్త తిరిగే ఓపిక తగ్గినాక మళ్లా నీ తలపులు ముసురుకొన్నాయి.
మొన్న ఈడిచికొట్టిన ఎండతరిలో హోసూరుకు పొయినప్పుడు, తలకాడు తలపులు తలలో దూరి తైతక్కలాడినాయి. అప్పుడే తిరుపతినుంచి ఉమన్న అరిచి చెప్పినాడు, ఎండలు బీకరంగా ఉండాయి, నాలుగునాళ్లు తాలి రమ్మని. ఇదే సాకని అక్కడి నుంచి అట్టనే కదిలినాను.
మునిమునిమబ్బులో ఆ మాదిగ పల్లెకు పొయినాకనే తెలిసింది…. ఇరవ య్యేళ్లు గడిచిపొయినాక తెలిసింది… నువ్వు చేసిన అసలు మోసం గురించి.
కట్టెబారి జుట్టు ముగ్గుబుట్టయి పొయిన కెంచక్క నన్ను గురుతుపట్టలేదు. నేనెవరినో గురుతుచేస్తే సుంతసేపు బెప్పర పాటుతో నిలబడిపోయింది. అనెంక నా తలను దగ్గరకు లాక్కొని తన తలకు ఆనించు కొని ‘బాగుండావా కొడుకా’ అంటూ వలవల ఏడిచింది. నా కళ్లు కూడా చెమ్మగిల్లినాయి.
‘చిన్నమాదడు ఎట్టుండాడు కెంచ క్కా, ఇప్పుడు ఎక్కడుండాడు?’ అడిగినాను.
‘ఇంకేడ మాదడు అబ్బయ్యా, వీని వల్లనే అమ్మణ్ణి ఉర్లేసుకొనిందని కడుపులో కంటు పెట్టుకొనిరి వాళ్లు. నువ్వు వచ్చి పోతివంటనే, ఆ మూడోనాడు తెల్లవారి నా కొడుకు పీనిగ ఏటిపక్కన పడి ఉణ్ణింది అబ్బయ్యా. పండగెద్దు కుమ్మి సంపేసిందని చెప్పేసిరి. వాని ఒంటిని ఈటి పోట్లు తూట్లు తూట్లు చేసేసినాయి కొడుకా’ కెంచక్క కీచుగొంతుతో రాగం తీసింది.
నేను కలుబారిపొయినాను. ‘అమ్మణ్ణికి పెండ్లికాలేదా, ఉరేసుకొనిందా?’
‘అయ్యో నీకు తెలవదా? నువ్వు ఈడ్నించి పొయిననాడే వాళ్ల బావకు ఇచ్చి గుట్టుగా కట్టెయ్యబొయిరి. ఆపొద్దే ఉసురు తీసుకొనేసిందే ఆ బిడ్డ. మాదడు నీకు చెప్పనే లేదా? చెప్తే నీ ఉసురు నిలవదను కొన్నాడేమో కొడుకా నా కొడుకు’
చతికిల కూలబడినాను. ఒళ్లంతా చెమటలు పట్టేసినాయి. కళ్లు బూసులు కమ్మినాయి. కెంచక్క గబగబ నాకు కడవలోని నీళ్లను తాగించి, మొకం తుడిచింది. రవంత సేపటికి ఊపిరి ఆడినట్టయింది.
‘కొడుకా ఎట్టుండావు? బిడ్డలు ఎందురు? వాళ్లను కూడా తోడుకొని వచ్చుం డ కూడదా? నాలుగునాళ్లు ఉండేసిపో. నాకు కలిగింది పెడతాను కొడుకా. ఈ కట్టిలో ఉసురాడే వరకూ ఎట్లనో బతకాల కదా. ముందు మాదిరిగా పనికి పోలేక పోతుండా. సూపు బాగా తగ్గింది కొడుకా…’ ఇంకా ఏమేమో చెప్పింది కెంచక్క. నేను అక్కడ ఉండలేక గిరుక్కున తిరుక్కొన్నాను.
‘కొడుకా అంతముద్ద తినిపో కొడుకా’ కెంచక్క బతిమాలతుంటే కూడా వినిపించుకోకుండా వచ్చేసినాను.
ఇదిగో కడాన ఈ మాటను కూడా చెప్పనియ్యి….
‘కెంచక్కా నీకు ఎవురూ లేరు కదా, నాతో వచ్చెయ్యి, నేను చూసుకొంటాను’ అనాలని తోచలేదు నాకు.
మాదిగపుటక కాదు కదా… పైగా మగపుటక…
mElu putaka
తలకాడు తలపులు తలలో దూరి తైతక్కలాడినాయి.