”పోలికెక్కడ?” – Hyma Srinivas

”రంజనీ! నిన్ను పదివేలు డ్రా చెయ్యమన్నాను, చేశావా?” న్యూస్‌ పేపర్‌ చదువుతూ అడిగాడు ఆనంద్‌.
”లేదండీ! నిన్న తీరలేదు. అయినా ఆన్‌లైన్‌లో బిల్సన్నీ కట్టెయ్యొచ్చుగా, మనీ డ్రా చెయ్యడమెందుకూ?” టిఫిన్‌ ప్రిపరేషన్‌లో ఉన్న రంజని వంట గదిలోంచే సమాధానించింది.
”డబ్బెందుకో నీకన్నీ చెప్తేనే డ్రా చేస్తావన్న మాట ! ఆన్లైన్‌లో కట్టొచ్చని నాకు తెలీదా?” కోపం వాడి కంఠంలో ప్రతిఫలించడం నేను వింటూనే ఉన్నాను….
బయట పూల మొక్కలకు నీళ్ళు పడుతూ..
”ఎందుకిలా అన్నింటికి కోప్పడతారు? ఊరికే గుర్తుచేశానంతే, అదీ తప్పే!”
”ఔన్లే! అన్నీ ఊరికే అంటావు. ఇప్పుడే వెళ్ళి డ్రా చేసుకునిరా పో, నాకు డబ్బు అవసరం.
మా ఫ్రెండ్‌కి చేబదులిస్తానని మాటిచ్చాను. ఆ టిఫిన్లవీ అమ్మ చూస్తుందిలే”
”అత్తయ్య గారి చేత పని చేయించడానికేనా పిలిపించింది? ఎంత, ఒక్క అరగంటలో పనైపోతుంది, వెళ్ళి డ్రా చేసుకొస్తాను.”
నీకు నా మాటంటే గౌరవం పోతున్నది. మొగుడంటేనే నీకు బేఖాతర్‌.”
”ఎందుకండీ ఊరికే ఏదేదో అనేస్తున్నారు.
”ఔను, నాకేం పని లేక, తోచక ఊరికే నీతో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నా నంటావ్‌?అంతేగా!”
”అబ్బబ్బా! మీకీ మధ్యని విసుగూ కోపం ఎక్కువయ్యాయి. అర్థం చేసుకోకుండా ఏదేదో అనేస్తున్నారు. ఏవీ ఆ ఏటియం కార్డ్సు ఇలా ఇవ్వండి వెళ్ళి వస్తాను.”
”నన్నడుగుతావేం? నీవేగా ఎక్కడో పెట్టుకున్నావ్‌?”
”ఆ టేబుల్‌ మీద బిల్సన్నీ ఉన్న పేపర్లతో కలిపి కవర్లో పెట్టాను.”
”ఏంటీ! ఆ టేబుల్‌ మీది పేపర్స్‌తోనా? ఆ కవర్లో నా! అవన్నీ ఉదయాన్నే చెత్తలో వేసేశాగా?”
”వాట్‌ ! చెత్తలో వేసేశారా?”
”ఔను టేబుల్‌ మీది వన్నీ పాత మెడికల్‌ బిల్స్‌, ఇంకా ఇతర బిల్సేగా? అయినా నీ కెన్ని మార్లు చెప్పాను ? అలా కవర్లో క్రెడిట్‌ కార్డు, ఏటియం కార్డు పెట్టొద్దని? బుద్ధ్దుందా అసలు నీకు?
”ఉగ్ర నరసింహునిలా అరుస్తున్నాడు మావాడు ఆనంద్‌.
”ఉదయాన్నే నాబ్యాగ్‌ క్లీన్‌ చేసుకుంటూ పెట్టాను. ఐనా ఎప్పుడూ లేంది మీరెందుకు ఆ స్లిప్‌లన్నీ డస్ట్‌బిన్‌లో వేశారు?”
”ఓహో పనిచేయడం కూడా నేరమే ? చేస్తే వద్దంటావు, ఊరికే ఉంటే కాస్తంత సాయం చేయవచ్చుగా అంటావు?”
”ఊరికే అరవకండి! అత్తయ్యగారి ముందు ఇలా గొడవ పడటం బావుండదు. మెల్లిగా మాట్లాడండి.”
”ఔను నేనే గొడవపడే వాడ్నీ నీవు సుకుమారివీ, సుగుణాలరాసివీనీ, మా అమ్మముందు గారాలుపోయి, బుద్ధ్దిమంతురాలివనే క్రెడిట్‌ కొట్టేద్దామనా! ముందా ఏటియం కార్డ్సు గురించి చూడు చెత్తవాడు పట్టుక పోయుంటాడు. వాటి పిన్‌ కోడ్‌ రాసిన స్లిప్‌ కూడా అక్కడే అఘోరించిందికదా!”
”అయినా అలా రాసి పెట్టవద్దని నేను చెప్తూనే ఉన్నాగా! మీరేగా రాసి స్లిప్‌ కూడా అక్కడే ఆ కార్డుతోనే ఉంచారు?”
”ఔను, రాయకపోతే నీకు అవి గుర్తుండవని రాశాను! మళ్ళా నాకు ఫోన్‌ చేసి అడుగుతావేమోనని! అందుకే రాసి ఉంచాను. అయినా అంతా నా తప్పేనా?
అసలవి అక్కడ ఎందుకు పెట్టావు? పొగరు కాకపోతే?’
”నేను బ్యాగ్‌ సర్దుకుంటూ పెట్టానన్నాను కదా! ఇంతలోనే మీరు అవన్నీ పట్టుకెళ్ళి, చెక్‌ చేయకుండానే, గుమ్మంలో చెత్తవాడు పట్టుకెళ్ళే చెత్త కవర్లో వేస్తారని నేనేం కలగన్నానా? అసలు మీరెందుకా పని చేశారు? పోని ముందు వాటిని విప్పి చూడటమో, నన్నడగటమో చేయచ్చుగా?”
”ఆహా! అన్నీ ఈ మహారాణి నడిగి చేయాలంటావు? మీరిపోకు నీవంటే, నీ వంటావా? జాగ్రత్త! త్రాష్‌ ! రబ్బిష్‌! బ్రెయిన్‌లెస్‌ ఫూల్‌” ”అరవకండి, పోయింది పోగా అత్తయ్య గారు బాధపడతారు.”
”అన్నింటికి అత్తయ్య అత్తయ్యని అమ్మను అడ్డం పెట్టకు., అసలు నీకు డబ్బంటేనే లెక్క లేకుండా ఉంది? నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నానని గర్వమా? ముందు వెళ్ళు, వెళ్ళి ఆ చెత్త వాడెక్కడున్నాడో చూడు కదులూ…”
”కాస్త ఆగండి, బ్యాంకు వాళ్ళకు ఫోన్‌ చేస్తాను.”
”అఘోరించావ్‌! అందాకా ఆ చెత్త వాడు కనీసం కొన్ని లక్షలైనా డ్రా చేసేయడూ!
వెళ్ళి వాడెక్కడున్నాడో చూడు ముందు, ఆచెత్త వ్యానెక్కి వెతుకు, యూ పూల్‌, వేస్ట్‌ క్యాండిడేట్‌వి.”
”నన్ను  కంగారు పెట్టకండి ప్లీజ్‌! కాస్త ఆలోచించుకోనివ్వండి. ఊరికే కేక లేయకండి, చేసింది మీరు తిట్లు నాకూనా?” ”ఏంటే ! మీరిపోతున్నావ్‌? బుల్‌షిట్‌ ” అంటూ నోరు పారేసుకుంటూ అసహ్యంగా తిడుతున్న నా కొడుకు ఆనంద్‌ అసలు రూపం, భార్య పట్ల ప్రవర్తించే తీరూ చూస్తు న్న నాకు అసహ్య మేసింది. ‘ఆడవాళ్ళంటే అసలీ మగ జాతికి ఇంత చులకనెందుకూ? ఆడది లేక పోతే బ్రతకలేరు, తిండికీ, శరీర సుఖానికీ, ఇల్లు చక్కదిద్దనూ అన్నింటికి ఆడదాని అండదండలు కావాలి కానీ ఆడదానికి కాసింత గౌరవం మాత్రం కరువు వీరిచెంత, వీరి మనస్సులు ఎడారులా?
కాస్తంత జాలి జలం వీరి హృదయాలలో ఉండదా!’ నా మనస్సంతా బాధతో నిండిపోయింది.
‘అంతా తండ్రి బుద్ధి, ఆయనా ఇంతే ఎప్పుడూ నన్ను ఏదో ఒకటి అంటూనే ఉండేవారు, అదేమంటే బ్యాంకు ఉద్యోగమని గర్వం, అహకారం అనేవారు.
ఆయన కంటే ఎక్కువ జీతమనీ అసహనమే! వీడూ అంతే ఆ తండ్రి రక్తమేగా? కోడలు వాడికంటే యాభై సహస్రాలు ఎక్కువ సంపాదిస్తుంది, అసలు బాధ అదీ వీడికి, అందుకే ఐన దానికీ కాని దానికి గొడవ పడి కోడల్ని అవమానిస్తూనే ఉంటాడని నాకీ వారం రోజులకే అర్ధమైంది. తల్లీ తండ్రీ లేని పిల్ల, మేనమామ పెళ్ళి జరిపించాడు. బాగా చదువుకుని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో ఉందనీ బాగా సంపాదిస్తుందనీ చేసుకున్నాడు. మేల్‌ ఈగో ఏమైనా అనిపిస్తుంది. పుట్టింటి అండ లేదు కనుక వీడి మాటలన్నింటికీ అణిగి ఉంటున్నదని నాకు అర్ధమవుతున్నది. పాపం మంచి అణకువగల పిల్ల.
భార్యా భర్తల మధ్య తగాదాల్లో తల దూర్చకూడదని నేను పూల మొక్కలకు నీళ్ళు పట్టేనెపంతో బయటే చాటుగా ఉండిపో యాను. అవేవీ విననట్లే.
అసలు కోడల్ని ఆలోచించుకునే వ్యవధానమే ఇవ్వకుండా ఏదేదో అంటూనే ఉన్నాడు.”
” కదులు ముందు , ఈ పాటికి వాడు దగ్గరగా ఉన్న ఏ ఏటిఎం లోనో దూరి ఉంటాడు. వెళ్ళి చూడు.”
”మీరూ రాకూడదూ తోడుగా?” అర్ధింపుగా అడిగింది కోడలు పాపం
”చేసిన నిర్వాకానికి తగుదునమ్మాని నేనూ రావాలా? ఆ చెత్త వ్యానెక్కి ఆ కంపులో వెతకాలా! ఎవరైనా చూస్తే నా పరువేం కాను? ఎంత అవమానం? వెళ్ళు వెళ్ళీ నీ తిప్పలేవో పడి కార్డ్స్‌ అన్నీ ఆ చెత్త కుప్పల్లో వెతుక్కురాపో.” అంటూ ఊదర పెట్టసాగాడు.
ఇహ ఏమీ అనలేక కోడలు జోళ్ళేసుకుని అలాగే నైట్‌ డ్రెస్‌లో బయటికి వచ్చింది.
ఇంతలో ఒక కుర్రాడు వచ్చి ”మేడం గారు! చెత్తంతా మా వ్యాన్‌లో వేశాక, దాన్ని రీ సైకిల్‌ చేసేవీ, మిగిలినవీ వేరు చేస్తాం, అలా ఏరుతున్నపుడు ఈ కవర్‌ కనిపించింది మేడం! దాని మీద మీ పేరుంది, ఏటిఎం కార్డ్స్‌, ఒక పేపర్లో వాటి కోడ్‌ కూడా రాసి వుంది మేడం! ఇవి మీవే కదా? చెక్‌ చేసుకుని అన్నీ ఉన్నాయో లేదో చెప్పండి, దూరంగా వ్యాన్‌ ఆపి వచ్చాను. మీ సొమ్ము నేనేమీ డ్రా చేయలేదు మేడం. మీరు చెక్‌ చేసుకుని ఓకే చేస్తే నేను వెళతాను.” అంటూ, కార్డ్స్‌ అన్నీ ఉన్న కవర్‌ తెచ్చి కోడలి చేతికిచ్చాడు. వెరిఫై చేసి అన్నీ ఉన్నాయని చూసుకున్నాక, వాడి చేతిలో ఐదువందల నోటు పెట్టింది.
”వద్దుమేడం, మీ కష్టార్జితం మీదే ! నేను చెత్త తీసుకెళ్ళినందుకు మీరు ప్రతి నెలా అందరి కంటే అదనంగా వంద ఇస్తున్నారు. చాలు.’ ఊరికే తీసుకున్న సొమ్ము అచ్చిరాదని’, మా అమ్మ చెప్తుండేది మేడం ! ఇప్పుడు మా అమ్మ లేకున్నా అమ్మమాట మాత్రం నేను మరువను, మీరిచ్చే జీతం చాలు.” అంటూ వెళుతున్న ఆ చెత్త తీసుకెళ్ళే కుర్రాడు నా కళ్ళకు ఒక గౌతమ బుద్ధ్దునిలా, ఒక మహాయోగి వేమనలా, వివేకానందు నిలా, ఒక మౌనిలా, ఒక చదువులేని సంస్కా ర మానవునిలా మహోన్నతంగా కనిపిం చాడు. చదువుకూ, సంస్కారానికీ, చేసేపనికీ సంబంధం లేదని వాడి మాటలు, ప్రవర్తన చెప్పకనే చెప్పాయి. పసితనంలో చదువుకోని తల్లి చెప్పిన మాటలకు అంత ప్రాముఖ్య మిచ్చి నిత్య జీవితంలో ఆచరించే ఆ చెత్త తీసుకెళ్ళే పిల్లవానికీి, గొప్ప కళాశాలలో ఇంజనీరింగ్‌ ఎంటెక్‌ చేసిన, చదువుకున్న తల్లి ఉన్న నా కుమారునికీ పోలికెక్కడ?

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో