ఆదివారం పొద్దున్న తొమ్మిది గంటల సమయం… నాన్నమ్మా…. గట్టిగా అరుస్తూ నాన్నమ్మ సీతమ్మను వాటేసుకుంది త్రిష
సీతమ్మ కూడా ఎంతో అనురాగంతో త్రిషను గుండెలకు హత్తుకుని తల నిమిరింది. నాన్నమ్మా నువ్వు ఇక్కడనే ఎందుకు వుండవు? ఆరేళ్ళ త్రిష మాటలకు తలప్ప్రి చూసింది త్రిష తల్లి ఉష. ఎలావుండను? నేనూ ఉద్యోగం చేస్తూ వున్నాను కదా. అయినా నీవు, మీ నాన్న, అమ్మ అందరు పొద్దున లేచి వెళ్లిపోయేవాళ్లే కదా నేనూ ఒంటరిగా వుండిపోవాలి అంది నవ్వుతూ. నీవు ఇంట్లో వుంటే నేను ఇంటికి త్వరగా వచ్చేస్తా నాన్నమ్మ. స్కూల్ తరువాత క్లాసెస్‌కు వెళ్ళను. నాకిష్టం లేదు. నాన్నమ్మ చెయ్యిపట్టుకుని అంది త్రిష. స్టడీ అవర్స్ అని కదా అంటారు. స్టడీ అవర్స్ అయితే చదువు నేర్పిస్తారు నాన్నమ్మా ఇక్కడ ఎవరికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండరో అలాంటి పిల్లలని వాళ్ళు వచ్చి పిక్‌అప్ చేసుకునేవరకు వుంచుకుంటారు. హోం వర్క్ చెయ్యాలనుకో.. అందుకే స్కూల్ తరువాత క్లాసెస్ అన్నమాట అందుకే నీవు ఇంట్లో వుండు నేను స్కూల్ అయిపోగానే ఇంటికి రావచ్చు. నాన్నమ్మకు అర్థం అయ్యేలా చెప్పింది త్రిష. మీ నాన్న చేస్తున్న మంచి ఉద్యోగం పోయిందిగా ముందు ఉద్యోగమే చేస్తుంటే అలాగే వుండేదాన్ని. నాన్నకు ఎందుకు మంచి ఉద్యోగం లేదు ? దీని గురుంచి నేను చాలా చెప్పాను. విసిగించకు త్రిషా. నాన్నమ్మను టిఫిన్ తిననీయి ఉష అంది. నేను తినే వచ్చాను ఉషా. తినేంతవరకు వదలదు రమ్య. కాఫీ ఇవ్వు చాలు..అంది. సరే అయితే కుక్కర్ పెట్టాను అది చల్లారితే వంట చేస్తా మీరు కాఫీ తీసుకోండి అంది కాఫీ ఇస్తూ.. నేను చేస్తాను వంట నీవు వేరే ఏదైనా పని వుంటే చేసుకో అంది గ్యాస్ స్టౌవ్ దగ్గరికి నడుస్తూ వంటచేస్తున్నంత సేపూ కబుర్లు చెబుతూనే వుంది త్రిష. భోజనం కుడా నాన్నమ్మ చేత్తోనే కలిపి పెట్టించుకుంది. నాన్నమ్మ భోజనం అయ్యాక రూంలో నడుం వాలుస్తూ వుంటే పక్కనే దూరుకుంది త్రిష. నాన్నమ్మ నీవు ఉద్యోగం చెయ్యకపోతేనేమి ? నేను ఎప్పుడు ఉద్యోగం చెయ్యలేదే త్రిషా. ఇప్పుడు అవసరం వచ్చింది. నిన్ను పెంచడానికి డబ్బు కావాలిగా అందుకే చేస్తున్నా. ఏమి చేస్తావు అక్కడ? ఒకరి ఇంట్లో చిన్న పాపను చూసుకోవడానికి ఆయాగావుంటున్నా. అక్కడెవరినో చూసుకోవడానికి, వాళ్లకు మనిషి అవసరం. మనకు డబ్బు అవసరం. నిన్ను చూసుకుంటే డబ్బులెలావస్తాయి ? అమ్మ, నాన్న, నీవు అందరూ డబ్బు గురించే మాట్లాడుతారు నాన్నమ్మ నేను ఏమి అడిగినా… బుజ్జి తల్లీ మీ నాన్న ఉద్యోగం ఫ్యాక్టరీ మూత పడినందువల్ల పోయింది. ఇప్పుడేదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. జీతం తక్కువ. మరి మీ అమ్మ ఉద్యోగం చేసి జీతం తెస్తే కదా ఇల్లు గడిచేది. నా బుజ్జి తల్లి మంచి స్కూల్లో చదువుకోవాలి దానికి డబ్బు అవసరం కదా.అందుకే ఈ ఆయా పనికి ఒప్పుకున్నా. అయినా ఆదివారాలు వస్తూనే వున్నా కదా..
నాన్నమ్మా నా మాట ఎవరికీ అక్కరలేదు. స్కూల్ బాగుంది కానీ స్కూల్ తరువాత క్లాస్‌లో వుండటం ఇష్టంలేదు.
అలా అంటే ఎలా తల్లీ మీ అమ్మ వచ్చేసరికి ఆరు దాటుతుంది. మీ నాన్న ఎనమిదింటికి కానీ రాడు. మూడున్నరకి స్కూలు అయిపోతే ఒంటరిగా ఇంట్లో వుండలేవు కదా ఎలా చెప్పు. నాన్నమ్మ చెప్పిన మాటలు నచ్చలేదు త్రిషకు అందుకే జవాబు చెప్పకుండా నాన్నమ్మ మీద చెయ్యి వేసి దగ్గరగా పడుకుంది. సీతమ్మకు నిద్ర పట్టలేదు. ఆయా పనికి వెళుతున్నప్పటి నుండి మధ్యాహ్నం నిద్ర కుదరదు. తను చూసుకునే పాప ఏడాది వయసే కావడంతో టైం ప్రకారం పాలు పట్టడం, నిద్రపుచ్చడం, మేలుకున్నప్పుడు ఆడించడంతో సరిపోతుంది. సాయంకాలం పాప వాళ్ళ అమ్మ రమ్య రాగానే పాపను వాళ్ళకప్పగించి ఇంట్లో పనులు కొన్ని చేయడం జరుగుతుంది. రమ్య ఆమె భర్త ప్రకాశ్ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలతో తీరిక లేక ఇరువైపులా పెద్దవారు ఎవరైనా వచ్చి చూసుకునే వసతి లేకా ఆయా కోసం వెదికారు. అప్పుడే కొడుకు శ్రీధర్ ఉద్యోగం పోవడంతో ఇల్లు గడవటం కష్టంగా వుందనిపించే సమయంలో పక్కింటి వాళ్ళు రమ్య పాపగురించి చెబితే వెంటనే వారిని కలిసింది సీతమ్మ. వాళ్లకు నచ్చడంతో నెలకు అయిదు వేల జీతానికి అక్కడ చేరింది సీతమ్మ.
ఇంట్లో అన్ని పనులకూ సాయంగా వుండే అత్తగారు లేకపోవడం ఉషా ఫీల్ అయితే ఎప్పుడూ నాన్నమ్మ వెంటేె తిరిగే త్రిషకి ఇంకా బాధేసింది. అప్పటి నుండే త్రిషకి ఆరు గంటలదాకా స్కూల్ వుండేటట్లు మాట్లాడి స్కూల్‌లోనే వుంచుతున్నారు. ప్రతి ఆదివారం పొద్దున్న వచ్చి సోమవారం పొద్దుటే వెళ్ళిపోతుంది సీతమ్మ. ఆమె వచ్చే ఆదివారం కోసం ఆత్రుతతో ఎదురు చూస్తుంది త్రిష.
కొన్ని ఆదివారాల తరువాత ఒక ఆదివారం సీతమ్మ వచ్చేసరికి త్రిష ఎగిరి గంతేయలేదు. ముభావంగావుంది. సీతమ్మ త్రిషను ఆప్యాయంగా ముద్దాడింది. వెంటనే త్రిష సీతమ్మను గట్టిగా పట్టుకుని నాన్నమ్మా నీవు పనికి వెళ్లద్దు అని కన్నీళ్లు పెట్టుకుంది ఏమైంది? ఉష కోప్పడిందా? స్కూల్లో మార్కులు తక్కువ వచ్చాయా? ఏమై ఉండవచ్చు తెలియక ఏమైందిరా బుజ్జి తల్లీ అంది బుజ్జగింపుగా.
నీవు ఇంట్లో ఉంటే నేను స్కూల్ అవగానే ఇంటికి వచ్చేస్తాను.
స్కూల్ బాగా లేదు?
నాకు స్కూల్ తరువాత క్లాసులు వద్దు నాన్నమ్మ
సరే మీ అమ్మతో మాట్లాడుతానులే అని అనునయించింది.
మాధ్యాహ్నం భోజనాల తరువాత తన దగ్గర పడుకున్న త్రిషతో మాటలు కలిపింది సీతమ్మ.ఎందుకు స్కూల్ తరువాత క్లాసులు నచ్చలేదు నీకు?
నాన్నమ్మా, స్కూల్ తరువాత క్లాసులు ఆయా మారింది. ఆ టైంలో హోం వర్క్ చేసుకుంటాము లేదా ఆడుకోవచ్చు.
ఆడుకుంటే అల్లరి చేస్తున్నామని అరుస్తుంది. ఎంతసేపూ చదువుకోలేము కదా.
అంతేనా.
అంతేకాదు నాన్నమ్మా బాత్రూం వెళ్ళాల్సి వస్తుంది. బాత్ రూం ఉంది కదా.
వుంది కానీ అందులో లైట్ లేదు. చీకటి అంటే నాకు భయం
ఇన్ని రోజులూ లైట్ ఉండేదా?
లైట్ లేదు కానీ ఆయా వచ్చి బయట నిల్చునేది. ఇప్పుడు ఉన్న ఆయా పో నేను రాను అని తిడుతుంది. మొన్న ఒక అమ్మాయి టీచర్‌కి చెబుతా అంటే కొట్టింది.
అలాగా.
అంతే కాదు నాన్నమ్మా, కొంత మంది చిన్న పిల్లలు బాత్‌రూం వెళితే ఇంతకు ముందు ఉన్న ఆయా శుభ్రం చేసేది. ఇప్పుడు ఉన్న ఆయా బాత్‌రూం వెళితే కడుక్కునేది కూడా రాదా అని అరుస్తుంది. ఆ పిల్లలు ఏడుస్తారు కొంతసేపు. నాకు మాత్రం చీకటిలో పోవడం భయం నాన్నమ్మా.
మరిఎవ్వరూ టీచర్‌కి చెప్పలేదా
చెబితే కొడతాను అంటుంది. మళ్లీ సాయంకాలాలు ఇక్కడే వుండాలి కదా. ఇంటికి వెళితే ఎవరుంటారు.
నిజమే ఇంట్లో వుంచుకోవడానికి వీలుకాకనే కదా స్కూల్లో వుంచేది. ఆలోచనలో పడి కాస్త ఆలస్యంగా లేచింది సీతమ్మ. పక్కన త్రిష లేదు. ఎంత సేపు పడుకుండి పోయానో అనుకుంటూ లేవబోయింది. తెరిచివుంచిన కిటికి అవతల త్రిష గొంతు వినబడింది. ఎవరితో మాట్లాడుతూ వుందో అని చూడబోయింది.
మా ఇంట్లో ఎప్పుడూ కుదరదు వసుధా అంటుంది త్రిష. అది విని దేని గురించి అంటుందో అని ఒక క్షణం ఆగింది సీతమ్మ.
మేము మాత్రం ప్రతి సెలవలకీ ఎక్కడైనా వెళ్ళాల్సిందే
నీవు చాలా లక్కీ వసుధా. నాకు ఎక్కడైనా వెళ్లి తిరగాలని వుంటుంది కానీ ఎక్కడికీ వెళ్ళం. ఎప్పుడైనా అడిగినా డబ్బు దండగ అని కోప్పడుతుంది అమ్మ. అని చెబుతూ ఉన్న త్రిషను తలచుకుని జాలిపడింది సీతమ్మ.
నిజమే…. ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తున్నామే కానీ పిల్ల సరదా పడుతుంది అని యోచన చేస్తామా? ఎంతసేపూ శ్రీధర్ ఉద్యోగం పోయిందే ….. ఎలా తట్టుకోవాలి అని ధ్యాసే తప్ప చిన్నపిల్ల …. దాని ఆలోచనలు ఎలా వుంటాయి అన్న అభిప్రాయాలు ఏనాడు వెలిబుచ్చాము కనుక? ఒక్క సారిగా ఈ విషయాలు సీరియస్‌గా ఆలోచించాల్సినవి అనిపించింది. అలా ఆలోచిస్తూ రాత్రికి ఉషా, శ్రీధర్‌లతో మాట్లాడాలని నిర్ణయించుకుంది సీతమ్మ.
రాత్రి పది గంటలకు త్రిష నిద్రపోయాక ఉషా, శ్రీధర్‌లను పిలిచింది.
త్రిషా స్కూల్ ప్రాబ్లం చెప్పి ఏమి చేెద్దాం అని ప్రశ్నించింది.
ఇప్పటి ఫైనాన్షియల్ పరిస్థితిలో త్రిషను ఇంట్లో వుంచుకోవడానికి కుదరదు అనీ శ్రీధర్‌కి మంచి ఉద్యోగం వస్తే సీతమ్మ ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండి త్రిషను చూసుకోవచ్చు. అప్పటిదాకా ఇంతే అన్నట్లు మాట్లాడారు.
నాకు ఒకటి తోస్తుంది….. అది ఎలా వుంటుందో ఆలోచించండి.
చెప్పండి అత్తయ్య. ఉషకు అత్తగారు అంటే ఎంతో గౌరవం నేను రమ్య వాళ్ళను అడుగుతాను వాళ్ళ పాపను ఇక్కడే చూసుకుంటానని. వాళ్ళు సాయంకాలం ఆఫీసు నుండి వచ్చి పాపను తీసుకెళ్లిపోవచ్చు. అప్పుడు నేను ఇంట్లోనూ వుండవచ్చు, త్రిష కుడా స్కూల్ అయిపోగానే ఇంటికి రావచ్చు. ఒకవేళ రమ్య వాళ్ళు వేరే ఆయాను పెట్టుకుంటాము అంటే ఒక పని చేద్దాము. కొంచెం పెట్టుబడితో నేను ఇంట్లో సాంబారు పొడి, రసం పొడి, చట్నీ పొడి లాంటివి తయారు చేస్తాను. మన కాలనీలోని కిరాణా కొట్లో పెడదాము. బ్రాండెడ్ వాటికన్నా తక్కువ ధర వుంటుంది. కాబట్టి కొందరు ఒకసారి రుచి చూస్తారు. ఆ తరువాత మన పొడులకు డిమాండ్ పెరుగుతుందనే నమ్మకం నాకు వుంది. బాగా జరిగితే జంతికలు, నిప్పట్లు, కారాలు లాంటివి కుడా చెయ్యచ్చు. మన కష్టాలు తీరేవరకు చిన్న పిల్లను ఇబ్బంది పెట్టకూడదు. అది మానసికంగా దెబ్బతింటుంది. దాన్ని మంచి వాతవరణంలో పెంచితే మానసిక ఎదుగుదల బాగుంటుంది.అంతే కాదు పిల్లలకు తల్లి తండ్రులే కాదు స్నేహితులు వుంటారు. వాళ్ళు సరదాలు పంచుకుంటారు. ఈ రోజు త్రిష తన ఫ్రెండ్ వసుధతో మాట్లాడింది విన్నాను. ఎప్పుడైనా సరదాగా పిల్లను బయట తిప్పాలి. చిన్న చిన్న సరదాలు తీర్చాలి. అప్పుడే వాళ్ళకు బాగుంటుంది. డబ్బు సంపాదించి ఎప్పుడో పిల్లను సుఖ పెడదాము అన్నది కాదు ముఖ్యం….. పిల్ల మానసికంగా బాగా ఎదుగుతోందా అని ఆలోచించాలి మనం. మీరూ ఆలోచించండి.
ఉష లేచి అత్తగారి దగ్గరగా కూర్చుని చేతులు పట్టుకుని అత్తయ్యా నేను ఎంత అదృష్టవంతురాలిని. మీరు ఎంత దూరం ఆలోచించారు. మానసిక వైద్య నిపుణులకంటే అద్భుతంగా విశ్లేషించారు. మీ కొడుకు ఉద్యోగం పోగానే సాధారణంగా బ్రతకడానికి డబ్బు ఎలా సంపాదించాలి అన్నది ఆలోచించాము కానీ త్రిషకూ ఇలా ఇబ్బందులు ఉంటాయని ఆలోచించనే లేదు. మీరు వుండబట్టే కదా త్రిష తన ప్రాబ్లమ్స్ మీతో చెప్పింది. అందుకే అత్తయ్యా అంటారు పిల్లలకు అమ్మమ్మలు, నాన్నమ్మలు దగ్గరగా వుండాలని….. కంట్లో నీళ్ళు వచ్చాయి ఉషకు. సీతమ్మ ఉషను దగ్గరగా తీసుకుని
ఉషా, ఉమ్మడి కుటుంబాలు వద్దు అని అత్తగార్లను దూరంగా వుంచే కాలంలో నన్నూ ఎంతో ఆప్యాయంగా నీవు వుంచుకోలేదా? అంది తల నిమిరుతూ.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
మీకధ చాలా బావుంది.సందేశాత్మకంగా ఉంది .
ఏ.హైమవతి
ఎదుగుతున్న పిల్లల మానసిక సమస్యలకు సర్వసమ్మనమైన సత్వర పరిష్సూరము ఎంతబా….గున్నదో!
బావుంది లక్ష్మి గారు . పిల్లల మనసులు వాళ్ళ ఇబ్బందులు కూడా తెలుసుకోవాలి . డబ్బు వైపు పరుగులు పెడుతున్న తరాన్ని చూస్తున్న మనకి ఇలాంటి కథల అవసరం చాలా ఉంది .