డా. ఘంటా చక్రపాణి
‘నాకు నేను తలెత్తుకుని బతికేందుకు ఏ అవకాశం వచ్చినా వదులుకోను. ఇప్పుడు ఎంత కష్టం అనిపించినా భవిష్యత్ చింత లేకుండా వుండాలన్నదే నా కల’ అంటోంది యంగు ఫలింగు.
చైనాలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న హాంగ్జ నగరంలో కొత్తగా వెలిసిన ‘హూటర్స్’ రెస్టారెంట్లో ఆమె వెయిట్రెస్‌గా పనిచేస్తోంది.
‘హూటర్స్’ అన్న మాటకు ఒక రకమైన గుడ్లగూబలాంటి పక్షి అనే అర్థం వుంది. ఈ గుడ్లగూబ ప్రపంచంలో యువతులను సెక్స్ సింబల్‌గా వాడుకుని అత్యంత అమానవీయమైన రీతిలో రెస్టారెంట్స్ నిర్వహి స్తున్న అమెరికన్ సంస్థ. అమెరికాలో అనేక విమర్శల నడుమ ప్రారంభమై ఇస్పుడు ‘హూటర్స్’ ప్రపంచంలోని 23 దేశాల్లో దాదాపు 435 రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. మహిళలే మా పెట్టుబడి అని ప్రకటించుకున్న ఈ బహుళ జాతి కంపెనీ మగవాళ్ళను ఆకట్టుకునేందుకు మేం ఆడపిల్లల్ని వాడుకుంటాం అని బహిరంగంగా చెపుతుంటుంది. అందుకోసం తమ రెస్టారెంట్లలో అందమైన, ఆకర్షణీయమైన అమ్మాయిలను మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటుంది. అక్కడ పనిచేసే అమ్మాయిలు ఆ కంపెనీ డ్రెస్‌కోడ్ ప్రకారం అర్ధనగ్న దుస్తులే వేసుకోవాలి. అతిధులను తమ మాటలద్వారా అల రించాలి.తాముచేసే పని అవమానకర మైందని భావించకుండా చిత్తశుద్ధితో చేస్తామని అగ్రిమెంట్‌పై సంతకం చేసి మరీ ఉద్యోగంలో చేరాలి. షాంఘై దగ్గర్లోని ఒక పల్లెటూరికి చెందిన వాంగు కాలేజీ పూర్తవగానే ఉద్యోగం వెతుక్కుంటూ హాంగ్జ చేరింది. ఇరవై ఏళ్ళలోపే వుండే ఆమె కొద్దికాలం చిన్నా చితకా పనులు చేసి హూటర్స్ వెటుట్రెస్‌గా చేరింది. ‘ఊళ్ళో ఉండే అమ్మా నాన్నలకు నేను సిటీలో ఏ ఉద్యోగం చేస్తున్నానో తెలియదు నేను చెప్పలేదు. చెపితే నొచ్చుకుంటారు’ అంటోందామె. సర్ది చెప్పుకుంది. అయినా ఎన్నో ఉద్యోగాలుండగా ఈ పనే ఎందుకు చేస్తున్నావని అడిగితే ” డబ్బు ఎక్కు వస్తుందని” అంటూనే అదొక్కటే కాదు. ఈ రెస్టారెంటుకి రోజూ అనేకమంది విదేశీయులు వస్తుంటారు. వాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడతారు. వాళ్ళతో మాట్లాడడంవల్ల నా ఇంగ్లీషు మెరుగుపడుతుంది. ఒకటి రెండేళ్ళు పని చేసి నా భాషా ప్రావీణ్యం పెంచుకోవాలనే ఇందులో చేరాను. భవిష్యత్తులో ఇంగ్లీషు ట్యూటర్‌గానో ఇంటర్ ప్రిటేటర్‌గానో స్థిరపడాలని నా ఆశ, వివరించింది. నిజమే! చైనాలో మహిళలు, యువతులు, పసితనం తీరని ఎంతోమంది ఆడపిల్లలు ఇలాంటి పనులే చేస్తున్నారు. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, బస్సులు, రైళ్ళు,కాల్‌సెంటర్లు ఇలా అన్ని రకాల వాణిజ్య వ్యాపార కేంద్రాలు ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తారు. మామూలు పల్లెలు, మారుమూల గిరిజన గ్రామాలు మహానగ రాలదాకా అక్కడ మహిళలు పనిలో మునిగి తేలుతున్నారు.
ఇండియ చైనా ఫెలోషిప్‌లో భాగంగా చైనాలో పర్యటించినప్పుడు, క్షేత్ర స్థాయిలో అక్కడి సామాజిక ఆర్ధిక పరిస్థితులను అధ్యయనం చేస్తున్నప్పుడు చైనా ప్రగతికి అక్కడి మహిళల శ్రమే ప్రధాన భూమిక అని అర్థమయ్యింది. న్యూయర్క్‌లోని న్యూస్కూల్ విశ్వవిద్యాలయం భారత చైనా దేశాల్లో ప్రపంచీకరణ అను భవాలను అధ్యయనం చేసేందుకు 2006లో ఇండియ చైనా ఇనిస్టిట్యూట్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ నుంచి అమెరికాకు ప్రవాసం వెళ్ళిన కొందరు ప్రగతిశీల మేధావులు ‘న్యూస్కూల్’ను స్థాపించారు. అది క్రమంగా న్యూయర్క్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయంగా మారింది. పాత సంప్రదాయలకు భిన్నంగా కొత్త వొరవడిలో పరిశోధనలు, అధ్యయనాలు చేయడంలో న్యూస్కూల్ గుర్తింపు పొందింది. ఇండియ చైనా ఇనిస్టిట్యూట్ కూడా ఆ సాంప్రదాయా నికి అనుగుణంగా ప్రతి రెండేళ్ళకోసారి ఐదుగురు భారతీయులు, ఐదుగురు చైనా యువ పరిశోధకులను ఎంపిక చేసి రెండు దేశాల్లో ప్రపంచీకరణ వల్ల తలెత్తిన పరిణామాలను వివిధ కోణాల్లో ఆవిష్కరింపజేసే ప్రయత్నం చేస్తోంది. ఆ ఫెలోషిప్ మొదటి బ్యాచ్‌లో ఎంపికైన భారతీయుల్లో నేనొకడిని కావడంవల్ల నాకు చైనాలో విస్తృతంగా పర్యటించి, చైనా గురించి కొంతయినా తెలుసుకునే అవకాశం లభించాయి. గ్రామాల్లో మాకున్న వ్యక్తిగత ఆసక్తుల మేరకు పర్యటించి వచ్చిన తరువాత నగరాల్లో పరిస్థితుల అధ్యయనంలో బాగంగా మేం హాంగ్జ వెళ్ళాం.
హాంగ్జ అన్ని రకాలుగా మనం హైదరాబాద్‌తో పోల్చవచ్చు. పది పదిహేనేళ్ళ క్రితం దాకా ఒక మాములు నగరంగా 90 వ దశకంలో ఒక మహానగరంగా అవతరించింది. దాదాపు పదివేల ఎకరాల విస్తీర్ణంలో రూపొందించిన ఉన్న హాంగ్జ హైటెక్ సిటీ ఆ నగరాన్ని కంప్యూటర్ ‘టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా చేసింది. తోసిబా ల్యాప్‌టాప్ కంప్యూటర్ల తయరీ కేంద్రం మొదలు మనం సెల్‌ఫోన్లలో, టీవీ ఛానల్స్‌లో చూసే సాప్ట్‌వేర్ చిత్రాల నిర్మాణం దాకా అన్ని రకాల ఐటి ఉత్పత్తులకు హాంగ్జ ఇప్పుడు ప్రధాన కేంద్రం. ఈ పరిశ్రమల మూలంగా పదేళ్ళ క్రితం దాకా నలభై లక్షలలోపున్న నగర జనాభా ఇప్పుడు డెభ్భై లక్షలకు చేరింది. అనేక విదేశీ, బహుళజాతి కంపెనీలు, వాటిలో పనిచేసే వివిధ దేశాల ఉద్యోగులతో ఆ నగరం నిండిపోయింది. వారి అవసరాలకు అనుగుణంగా అక్కడ వందలాది షాపింగు మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు వెలిశాయి. వాటిల్లో వివిధ సేవల కోసం వేలాది మంది వాంగులాంటి యువ తులు పల్లెలోంచి అక్కడికి చేరుకున్నారు. వయసుకు మించిన పనులు చేయడం, నాలుగు డబ్బులు సంపాదించి పల్లెల్లో వున్న తల్లిదండ్రులకు నెల నెలా ఎంతో కొంత పంపించడం, భవిష్యత్తుకు సంబంధించి బంగారు కలలు కనడం, నెరవేరుతాయో లేదో తెలియని అభద్ర తతో అతలాకుతలం కావడం ఇదీ వాళ్ళ వృత్తీ , వ్యాపకం.
పాదాల నుంచి మొదలై…
మా విముక్తి ఉద్యమం పాదాల నుంచి మొదలయ్యింది అంటుంటారు చైనా మహిళలు. చైనా సమాజం కూడా వేల ఏళ్లుగా మహిళలను అణచివేసే అనేక సంప్రదాయలు అమలు చేసింది. సరిగ్గా భారతీయ మహిళల్లాగే చైనా మహిళలు కూడా పురుషాధిక్యత, సాంప్రదాయ ఆచారాలు, అణచివేతల మధ్య వేలాది సంవత్సరాలు రోజులు వెళ్లబుచ్చారు. ఆశ్చర్యం ఏమిటంటే చైనా మహిళల్లో కూడా వరకట్నం ఉండేది. వితంతు పునర్వివాహం ఉండేది కాదు. సతీసహగమనంవంటి కౄరమైన ఆచారాలు అక్కడ కూడా అమల్లో ఉండేవి. వీటన్నింటికి తోడు పుట్టే ఆడపిల్లలకు పొట్టి పాదాలుండాలని గట్టిగా బంధించి వుంచే మూఢాచారం చాలాకాలం అమల్లో ఉండేవి. మూడు ఇంచులకు మించి పాదాలు వుండకూడదని, అలా వుంటే అరిష్టమని, పొట్టి పాదాలుండడం సంపదకు నిదర్శనమని వాళ్ళ నమ్మకం. తాంగు సామ్రాజ్యంలో మొదలైన ఆచారం మింగు, చింగు పాలనలో కూడా కొనసాగింది. పొట్టి పాదాలుంటే అదృష్టం కాబట్టి తల్లిదండ్రులు పనిపిల్లల పాదాలు గట్టిగా బంధించేవారు. పెళ్ళి సందర్భంగా కూడా అత్తింటి వాళ్ళుఆడపిల్లల పాదాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తుండేవారు. ఈ దురాచారం అక్కడి బాలికల్లో ఎన్నో ఆరోగ్య, మానసిక సమస్యలను తెచ్చి పెట్టినప్పటికీ వేల యేళ్ళపాటు సమాజం దాన్నొక సాంప్రదాయలాగా కొనసాగించింది. కొన్ని వందల ఏళ్ళపాటు పోరాడిన చైనా మహిళలు చివరకు ఆ సాంప్రదాయన్ని పూర్తిగా రూపు మాపేలా చేయగలిగారు. ఇప్పటికే పాత కాలపు చైనా మహిళల్ని గమనిస్తే ఈ ముడుచుకుపోయిన పాదాలు మనకు కనిపిస్తాయి. అక్కడ మొదలైన చైనా మహిళల పోరాటం విప్లవోద్యమంలో సగభాగమై ఎదిగింది.
వెసేటుంగు నాయకత్వంలో సాగిన విప్లవోద్యమంలో, లాంగుమార్చ్‌లో మహిళలు తండోపతండాలుగా పాల్గొన్నారు. పిల్లలు, యువతులు, వృద్ధులన్న భేదం లేకుండా వేలాదిమంది ఎర్ర సైన్యంతో పాటు కదిలారు. ఎంతో మంది మైళ్ళ కొద్దీ నడిచి మహిళల్ని చైతన్యవంతుల్ని చేసి కదిలించ గలిగారు. గర్భిణీ స్త్రీలు మార్గమధ్యంలోనే పిల్లల్ని కనడం, తల్లులు పనిపిల్లల్ని వీపులకు కట్టుకుని పోరాట పథంలో సాగిపోవడం లాంటి దృశ్యాలు అక్కడి మ్యూజియంలలో ఇప్పటికీ కనిపిస్తుంటాయి. సుచువాన ప్రావిన్స్‌లో చెగ్ద అనే నగరపు పొలిమేరల్లో ఇలాంటి మ్యూజియంల సముదాయం ఒకటుంది. చుంచువాన్ మ్యూజియం క్లస్టర్ పేరుతో సువిశాలమైన భూబాగంలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు పాన్ చియన్ చువాన్ ‘నవ చైనా’ మ్యూజియం నిర్మించాడు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత చైనాలో చోటు చేసుకున్న పరిణావలు చరిత్రలో అనేక విషయలను దాన్ని ఆవిష్క రిస్తాయి.వాటిని భద్రపరచాలన్న లక్ష్యతో ఈ మ్యూజియంను నా సొంత డబ్బుతో ఇక్కడి చిత్రాలు నిర్మించానని ఫాన్ చియన్ చువాన్ చెప్పారు. గతంలో చంగ్దకు 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణానికి పార్టీ సెక్రటరీగా ఉన్న చువాన్ తను కూడా బెట్టిన సొమ్ములో దాదాపు 250 కోట్ల రూపాయలు ఈ మ్యూజియంకోసం వెచ్చించినట్టు వివరించారు. ఈ మ్యూజి యంలో మహిళల చరిత్రకు సంబంధించి ఒక ప్రత్యేకమైన భవనం వుంది. నాలుగంతస్తుల ఆ విశాలమైన భవనంలో ఉన్న వస్తువులు, చిత్రాలు, పత్రాలు చరిత్రలో చైనా వీరగాధను వివరిస్తాయి.
విప్లవానంతరం మహిళలు రాజకీయ, ఆర్థిక రంగాల్లో సమాన బాగస్వామ్యం పొందేలా మావోసేటుంగు నాయకత్వం లోని కమ్యూనిస్టు ప్రభుత్వం అనేక చట్టాలు తెచ్చి అమలు చేసింది. పురుషు లతో పాటు సమాన రాజ కీయ, ఆర్థిక, సామాజిక సాంస్కృతిక హక్కులతోపాటు సమాన పనికి సమాన వేతనం అందేలా విధానాలు రూపొందించింది. పనిలో, చదువులో సమాన అవ కాశాలు కల్పించింది. అప్పటిదాకా వివాహ వ్యవస్థలో ఉన్న లొసుగులు ఎండగట్టేలా వివాహ కుటుంబ చట్టాలు తెచ్చింది. వరకట్నం రద్దు చేసి పెళ్ళి విషయంలో స్త్రీ పురుషులకు సమాన హక్కులు, ఆస్థి హక్కు, వారసత్వ ఆస్తిలో సమాన వాటా పొందే అధికారం, కుటుంబం సాగు చేసుకునే భూమిలో స్త్రీ పురుషులకు సమాన వాటా కల్పిస్త1950 నాటికే అనేక చట్టాలు రూపొందించి మహిళల స్వేచ్ఛ మార్గదర్శనం చేసింది. మహిళలు సమైక్యంగా ఉత్పత్తిలో, రాజకీయల్లో భాగస్వాములై నప్పుడే వారి విముక్తి సాధ్యమని మావో గట్టిగా నవ్మడు.
చైనా మహిళల విముక్తిలో సాంస్కృ తిక విప్లవం (1966-1976) ఎనలేని ప్రభావం చూపిందని చెప్పవచ్చు. చైనా సమాజాన్ని అతలాకూతలంచేసి అమూ లాగ్రం మార్చి వేసిన ఈ విప్లవం మహిళలను మానసికంగా, శారీరకంగా కూడా మరింత బలోపేతుల్ని చేసింది. మహిళలు పురుషులతో సమానంగా సామాజిక హోదా పొందాలంటే పురుషులతో సమానమైన పనులు చేయలి. సమాన జీవితం గడపాలి. వాళ్ళ అలవాట్లు పద్ధతులు పురుషుల్లాగే వుండాలి అన్నది. సాంస్కృతిక విప్లవ కాలంలో చైనాలో వూరూరా ప్రచారం చేశారు. స్త్రీలు అప్పటిదాకా ధరించే సాంప్రదాయ దుస్తులు రద్దుపరిచారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్యాంట షర్టు రించాలి. అవి కూడా పురుషులు ధరించే డార్క్ కలర్స్ అయివుండాలి. ఆడపిల్లలు జుట్టు పెంచుకుని జడలు వేళ్ళాడేసుకుని వుండకూడదు. పురుషుల్లాగే వెంట్రుకలు పొట్టిగా కట్ చేసుకోవాలి.
అందంగా ఉండాలను కోవడం, అలా మేకప్ చేసుకోవడం మానివేసి సహజంగా వుండాలి. చేతికి అవసరమైతే వాచీ తప్ప గాజులు, కడి యాలు, ముక్కులు చెవులకు నగలు, మెడలో బంగారు గొలుసుల్లాంటివి లేకుండా మహిళలు పురుషుల్లాగే కనిపించాలి. విలాసవంతమైన అభరనాలన్ని ‘బర్జువా’ సంస్కృతికి చిహ్నమని పార్టీ ప్రచారం చేసింది. కేవలం ఆహారంలోనే కాదు, శరీర ధారుడ్యం, అలవాటు, నడక, నడతా అన్ని పురుషుల్లాగే వుండాలి. అందుకోసం స్త్రీలు కఠోరమైన శ్రమ చేయాలి. ”ఆ కాలంలో మేం దృఢంగా ఉండేందుకు, కండరాలు పెంచుకోవాల్సి వచ్చేది. ట్రాక్టర్లు, ట్రక్కులు నడిపించే వాళ్ళు, పెద్ద పెద్ద బరువులు ఎత్తించేవాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళం.మా వూళ్ళో మహిళల కోసం ప్రత్యేకంగా వ్యాయమశాలలు ఏర్పాటు చేసి ప్రతిరోజూ రకరకాల ఎక్సర్‌సైజులు చేయించే వాళ్ళు” అని ఒక గ్రామీణ వృద్ధ మహిళ పేర్కొంది. ‘పని విషయంలో మాకు ఆడపని, మగపని, అన్న తేడా లేదు. మా ఆయన చక్కగా వంట చేసి పెట్టే వాడు’ అని అప్పటి పరిస్థితులు గుర్తు చేసుకుంది.
అయితే ఆధునిక చైనాలో మాత్రం మనకు లింగభేదం స్పష్టంగా కనిపిస్తుంది. మౌనంగా చదువుకున్న, సంపన్న వర్గాల్లో లింగస్పృహ వేష, భాషల్లో వ్యక్తమవుత ఉంటుంది. ‘సంపద ఇప్పుడు అన్ని రకాల బర్జువా విలువల్ని పెంపొంది స్తున్నదని ఒక జర్నలిస్టు మిత్రుడు వాపోయడు. అయితే ఇది గుణాత్మకమైన మార్పుగా అతను పేర్కొన్నారు.
సాంస్కృతిక విప్లవం పాత సాంప్రదాయల్ని వ్యతి రేకించే క్రమంలో మహి ళల్ని ప్రేరేపించే కవిత్వాన్ని, కథల్ని ఇతర సాహిత్య ప్రక్రియలో బాగా వాడు కుంది. మహిళల శక్తి యుక్తుల్ని, సాహసాల్ని పొగుడుత సాహిత్యం కూడా విరివిగా వెలువడింది. మావో రాసిన ఒక చైనా కవితను ఒక మిత్రుడు ఇంగ్లీషులోకి అనువదించాడు. ”అచంచలమైన స్పూరిని, ఆకర్షణన నింపుకున్న ఆమె, ఐదడుగుల రైఫిల్‌తో ఉదయభానుడి తేజోకిరణమై యుద్ధ శిక్షఠణకు నడిచివస్తోంది…చైనా మహిళ ఎంత ధీరోదాత్తం, ఆమె సాంప్రదాయం దుస్తులకన్నా ఇప్పుడు సైనిక యూనిఫాంనే ఇష్టపడుతోంది”అన్నది ఆ కవిత సారాంశం. మావో మాత్రమే కాదు ఆ కాలంలో చైనా సాహిత్యమంతా ఇదే వరుసలో వుండేది.
పాత ఆచారాలన్ని ఇవాళ చైనాలో కనిపించకుండా పోవడానికి, చైనా ఒక ఆధునిక సమాజంగా అవతరించ డానికి సాంస్కృతిక విప్లవం బలమైన పునాదిని వేసింది. అయితే అది ఎంతో కాలం నిలబడలేదన్నది ఇప్పుడు చైనాను చూస్తే అర్ధమవు తుంది. మావోయిజం బలవంతంగా నైనా నేర్పించిన ఈ సాంస్కృతిక విలువలన్నీ ఇప్పుడు క్రమక్రమంగా బలహీన పడిపోతున్నాయి. చైనాలో పెట్టుబడులవెంట పరుగులు పెడుతున్న కమ్యూనిస్టులు ఇప్పుడు శ్రమను తాకట్టుపెట్టి సంపద కూడబట్టే పనిలో పడ్డారు. ఆ మాయ జూదంలో మహిళలే మొదటి పావులై సమిధలవు తున్నారు.
సాంస్కృతిక విప్లవం తరువాత దాదాపు దశాబ్దానికి మొదలైన చైనా ఆర్ధిక సంస్కరణలు ఆ దేశపు రూపురేఖల్ని పూర్తిగా మార్చివేశాయి. కేవలం ప్రజల ఆర్ధిక స్థితిగతులే కాదు సామాజిక కుటుంబ సంబంధాల్లో కూడా ఈ సంస్కరణలు ఎంతో ప్రభావాలు చూపాయి. చూపుతున్నాయి కూడా. 1978లో చైనా ‘రెండో విప్లవం’ పేరుతో ఆర్ధిక సంస్కరణలు చేపట్టింది. ప్రయివేటీకరణతో మొదలైన తతంగం ప్రత్యేక వాణిజ్య మండలాలు, పారిశ్రామిక నగరాల నిర్మాణం, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి పేరుతో భారీ యంత్రీకరణ, విదేశీ పెట్టుబడులు వెరసి చైనా గడిచిన మూడు దశాబ్దాల్లో పూర్తిగా మారిపోయింది. కొత్త నగరాలు, కొత్త పరిశ్రమలు చైనా గ్రామాలను గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను కుప్పకూల్చి వేశాయి. వలసలు వెయ్యిరెట్లు పెరిగి పోయయి. ఇప్పుడు చైనా ప్రపంచపు కర్మాగారంగా మారిపోయింది. అయితే చైనా అంతటా ఈ పరిశ్రమలు, ఈ ఉత్పత్తి, ఈ ఉద్యోగాలు లేవు. చైనా తన భూభాగంలో కొన్ని ప్రాంతాలను ముఖ్యంగా తీర ప్రాంతాలను రేవు పట్టణాలను వ్యాపార, వాణిజ్య ఉత్పత్తుల కర్మాగారాలుగా మార్చి, విదేశీ పెట్టుబడులతో ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్పత్తి కేంద్రంగా మారిపోయింది. ఈ అనూహ్యమైన అభివృద్ధే ఇప్పుడు అక్కడి మహిళలను కష్టాల ఊబిలోకి నెట్టి వేస్తోంది.
సంస్కరణల తరువాత గ్రామీణ చైనా రోజు రోజుకూ సమస్యల్లోకి కూరుకు పోతున్నది. పెరుగుతున్న అసమానతలు, ఆర్ధిక సంక్షోభాలు మహిళపై మరింత భారం మోపుతున్నాయి. చాలా మంది రైతులు వ్యవసాయ పనులు భార్యలపై వదిలేసి పట్టణాలకు వలస వెళ్తున్నారు. సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండి డబ్బులు సంపాదించాలన్న తపనలో బతుకులు వెళ్ళదీస్తున్న వాళ్ళ సంఖ్య అధికారిగా 90 మిలియన్లు. కొందరు ఆర్ధిక శాస్త్రవేత్తలు ఈ సంఖ్యను 130 మిలియన్లుగా లెక్క చెపుతున్నారు. వారిలో దాదాపు సగం మందికి పైగా భార్యలపై కుటుంబ భారం వేస్తున్న వాళ్ళే! ”భర్తలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో తెలియదు. ఏ వూళ్ళో వున్నారో కూడా కొన్నిసార్లు భార్యలకు సమాచారం వుండదు” చాంగుచింగు నగరంలో ఒక సామాజిక కార్యకర్త చెప్పారు. ఇదే విషయంపై ”వి లివ్” అనే పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది.
భర్తలు నగరాల్లోంచి ఫోన్‌లో చెబితే తప్ప గ్రామాల్లో వుండే భార్యలకు ఏ సమాచారం వుండదు. భర్త తల్లిదండ్రులు, పిల్లలు, వ్యవసాయం పనులు చేసిన అప్పులు ఈ వలస బతుకుల్ని వేధిస్తుంటా యి. చైనాలో తలసరి భూమి తగ్గిపోవడం వల్ల మరో వైపు గ్రామాల్లో మార్కెట్ వ్యవస్థ విస్తరించడంవల్ల అక్కడి మహిళలు వ్యవసాయం పనుల్తోపాటు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటారు. కుటుంబ పోషణ, ఆరోగ్య బీమా ఇతరత్రా ఖర్చులకు మహిళలు ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి అక్కడి గ్రామాల్లో వుంది. ఇక సంపాదించ లేకపోతున్నామన్న బెంగ పురుషుల్లో పెరిగిపోతోంది. ఇది గ్రామాల్లో ‘గృహహింస’కు దారి తీస్తోంది. ఈ మధ్యకాలంలో చైనాలో ఒక మహిళా సంస్థ నిర్వహించిన సర్వేలో దాదాపు 50 శాతం మంది మహిళలు తమ భర్తలు తమను కొడుతున్నారని హింస పెడుతున్నారని పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ వివరాల ప్రకారం గ్రామాల్లో మహిళల ప్రచారం అధికమవు తోందని స్పష్టంగా తెలుస్తోంది. పొలం పనులు నిర్వహించే మహిళలపై శ్రమ భారం రోజు రోజుకు పెరిగి పోతోంది. 1940లో 20 శాతం ఉన్న మహిళల శ్రమ వ్యవసాయ రంగంలో 1990 నాటికి రెట్టింపయి 40 శాతానికి చేరింది. ఆ శాతం ఇప్పుడు 70 శాతం అయ్యింది. అంటే వ్యవసాయ రంగంలో చైనా సాధిస్తోన్న ఉత్పత్తి 70 శాతం మహిళలదేనన్నమాట. మొత్తం చైనా శ్రమశక్తిలో 45 శాతం ఉన్న స్త్రీ శక్తి గ్రామాల్లో ఎక్కువ భారం వేస్తున్నట్టు ఈ లెక్కల ద్వారా అర్ధమవుతోంది.
సంస్కరణలు, అభివృద్ధి ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నా అంతకంతకు స్త్రీల శ్రమశక్తిని పీల్చి పిప్పి చేస్తున్నది. కుటుంబ పరిస్థితుతులు, సంపాదించాలన్న తపన, కొత్త అవకాశాలు అందుకోవాలన్న ఆశ, స్వతంత్రంగా బతకాలన్న కోరిక ఇలా కారణాలేవయినా మహిళల్లో చాలా మంది వలస కూలీలుగా మారిపోతున్నారు. నగరాల్లో నానా యతన పడుతున్నారు.
నగరం..నగరకూపం!
చైనా ఆర్ధిక సంస్కరణలు – అభివృద్ధి వాటిద్వారా వచ్చిన పారిశ్రామిక విప్లవం చైనాకు కాసుల వర్షం కురిపించవచ్చు. కానీ అది చైనా మహిళలో ముఖ్యంగా యువతుల్ని పీల్చి పిప్పి చేస్తున్నది. తక్కువ జీతాలకే పనిచేస్తారు, ఎదురు మాట్లాడకుండా కుక్కిన పేనుల్లా పడి వుంటారు.కాబట్టి పరిశ్రమలు మగవాళ్ళకంటే యువతులనే ఎక్కువగా ప్రోత్సహిస్తుంటాయి. స్థిరవేత నాలు, కార్మికచట్టాలు, నిబంధ నలు వర్తించని లక్షలాది బహుళ జాతి కంపెనీలు, విదేశీ కంపె నీలు, సెజ్‌లు మహిళల్ని మాత్రమే ఉద్యోగాల్లో తీసుకుంటు న్నాయి. నెలకు మన కరెన్నీలో 2 నుంచి 3 వేల జీతం ఇచ్చి రోజుకు 8 నుంచి 10 గంటలు పనిచేయించు కోవడం ఈ కంపెనీల్లో కొనసాగు తోంది. చైనాలో దాదాపు నాలుగు కోట్ల మంది ప్రభుత్వ పరిశ్రమల్లో ఐదున్నర కోట్ల దాకా గ్రామీణ పరిశ్రమల్లో మహిళా కార్మికులు పనిచేస్తు న్నారు. ఇక సెజ్‌లు, ప్రత్యేక పారిశ్రామిక కేంద్రాల్లో దాదాపు 3 కోట్ల మంది మహిళలు పనిచేస్తుంటారు. చైనాలో విదేశీ పరిశ్రమలు, సెజ్‌లు మహిళా కార్మికులపట్ల రూపొందిం చిన నియవలు ఎంతో అన్యాయంగా అమానవీయంగా ఉంటాయి.
చైనా పరిశ్రమల్లో, సెజ్‌లలో నూతన పారిశ్రామిక కేంద్రాల్లో మూడొంతులమంది మహిళా కార్మికులే ఉంటారు. ఈ బహుళ జాతి సంస్థలు ముఖ్యంగా దుస్తులు, ఎలక్ట్రానిక్ పరికరాలు తయరు చేసే సంస్థలు ఎక్కువగా గ్రామీణ మహిళల్ని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. వారికి ఫ్యాక్టరీ ఆవరణలో, పరిసరాల్లో వసతి సౌకర్యాలుంటాయి. పెద్ద పెద్ద అపార్టుమెంట్ల వంటి భవనాల్లో డార్మిటరీలు ఏర్పాటు చేసి ఒక్కొక్కగదిలో 4 నుంచి 8 మందిని వుంచుతారు. రైళ్ళలో బెర్తుల మాదిరిగా పడక సౌకర్యం మినహా మరేరకమైన సౌకర్యం వుండదు. కంపెనీల అగ్రిమెంట్లలో 4 సంవత్సరాలదాకా పెళ్ళిల్లు చేసుకోమని, పిల్లల్ని కనమని రాసివ్వాల్సి వుంటుంది. నెలకు 2 నుంచి 4 వేల దాకా జీతం ఇస్తారు. రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు పనిచేయలి. ఆదివారాలు మినహా సెలవులు ఉండవు. సిక్‌లీవ్‌లు కూడా ఉండవు. వాల్ వర్ట్‌లాంటి అమెరికన్ రిటైల్ సంస్థలు రోజుకు 11 గంటలు పనిచేయలని ఒప్పందం చేసుకుంటాయి. ఇట్లా దాదాపు 3 కోట్ల మంది యువతులు నగరాల్లో పారిశ్రామిక వాడల్లో పనిచేస్తున్నారు.
ఈ రకమైన పని పరిస్థితులు మహిళల శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు ఇటీవలి సర్వేల్లో వెళ్లడయ్యింది. ముఖ్యంగా కమ్యూనిస్టు (అధికార)పార్టీకి అనుబంధంగా వున్న అఖిల చైనా మహిళా సమాఖ్య ఈ మధ్య చేసిన సర్వేలో అనేక దిగ్భ్రాంతికర సమస్యలు వెలుగు చూశాయి. కార్మికుల్లో కేవలం 20 శాతం మంది మాత్రమే ఎక్కువ (సరిపొయే) జీతం పొందుతుండగా 40 శాతం మంది కాంట్రాక్టు లేబర్ కార్మికులుగా వున్నారు. మిగతా 60 శాతం మందికి ఎలాంటి కాంట్రాక్టులు లేవు. 23 శాతం మందికి వత్రమే ఆరోగ్య బీమా వుంది. 19 శాతం మంది మాత్రమే వర్క్ ఇంజురీ ఇన్సరెన్స్ అంటే పనిలో ప్రమాదం జరిగితే వైద్య సదుపాయం పొందే అవకాశం వుంది. కేవలం 15 శాతం మాత్రమే పెన్షన్ ఇన్సూరెన్స్ కలిగి వుండగా 6 శాతం మహిళలు మెటర్నిటీ ఇన్సరెన్స్ అంటే పిల్లలు కంటే సెలవు పొందే సౌకర్యం కలిగి వున్నారు. చైనా చట్టాల ప్రకారం మహిళా కార్మికులకు 3 నెలల మెటర్నిటీలీవ్ ఇవ్వాలి. కానీ ఏ ఒక్క పరిశ్రమ కూడా దాన్ని అమలు చేయదు. పనిగంటల పరిమితి కూడా ఈ కంపెనీలు పాటించవు. ఒక్కొక్కసారి 48 గంటలు పనిచేయల్సి వుంటుంది.
చైనాలో కార్మిక సంఘా లకు స్వేచ్ఛ వుండదు. అధికార కమ్యూనిస్టు కార్మిక సంఘం మినహా మరో కార్మిక సంఘ ఏర్పాటుకు అవకాశం లేదు. వీటి కారణంగా మహిళల్లో అనేకమంది ఆరోగ్య సమస్య లతో బాధపడుతున్నట్టు ఈ సర్వే పేర్కొంది. ‘ఎక్కువ పని గంటలు నిలబడి పనిచేయడం, బూట్లు ధరించడం వల్ల మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా సంతాన పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ సమాజ శాస్త్ర విభాగ అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ పనుల ఒత్తిడి వల్ల కార్మికుల్లో చాలామంది వయసుతో పోల్చితే తక్కువ బరువు కలిగి వుంటున్నారని కూడా తేలింది. ఈ మహిళా కార్మికుల్లో దాదాపు 90 శాతం ఎలాంటి సోషల్ సెక్యూరిటీ (విద్య, వైద్యం ఇతర రేషనింగు) స్కీంలో లేరు. ఇవన్ని అక్కడి మహిళా కార్మికులను నిర్వీర్యం చేస్తున్నాయి.
మరోవైపు చైనా పాలకులు మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించినట్టు చెపుతోంది. కేవలం పరిశ్రమలే కాదు. పార్టీలలో, పదవుల్లో కీలక పరిపాలనా వ్యవహారాల్లో మహిళలు దాదాపు 40 శాతం వున్నట్టు లెక్కలు తీస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి, వాణిజ్యం, ఎగుమతులు, విదేశీ పెట్టుబడుల్లో దేదీప్యమానంగా వెలుగొందు తోన్న చైనా అక్కడి మహిళల శ్రమశక్తినే చమురుగా వాడుకొంటోంది. ఇప్పుడు చైనా అకాశంలోనే కాదు, సంపద లోన సగం మహిళలే! అయితే సమస్యల్లో మాత్రం పూర్తిగా వాళ్ళే!!
ఆమెపైనే భారమంతా…!
చైనాలో ‘వన్‌ఛైల్డ్ పాలసీ’ (కొడుకైనా కూతురైనా ఒకరిని మించి కనకూడదు) అమలులో వుండడం మూలంగా ఈ తరం మహిళలపై పెనుభారమే పడుతోంది. కుటుంబంలో భర్త, పిల్లల్తోపాటు భర్త తల్లిదండ్రులు పోషణ భారం అలాగే తన తల్లి దండ్రుల భారం కూడా వారిపై ప్రభావం చపుతోంది. తనను కని, పెంచి, పెద్ద చేసి, చదివించిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవా లన్న తపన యువతలో కనిపిస్తోంది. దీంతో ఆడపిల్లలు వ్యవసాయ పనుల్లో ఇమడరు కాబట్టి నగరాలకు వలస వెళ్తున్నారు. అందిన పని ఏదైనా ఆనందంగా చేస్తున్నారు. నాలుగు డబ్బులు కూడా బెట్టి పెళ్ళి చేసుకునే లోపే తమ తల్లిదండ్రులకు కావాల్సిన సొమ్ములు వెనకేయలని తాపత్రయ పడుతున్నారు.
కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లల పెళ్ళిళ్లకు విముఖంగా ఉంటున్నారు. ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్ళి చేసుకునిపోతే తమ పరిస్థితి ఏమవుతుందో నన్న భయం వారిని వెంటాడుతోంది. యువతుల్లో చాలామంది ఈ కారణం చేతనే పెళ్ళిళ్ళు వాయిదా వేసుకుంటున్నారు.
మరో వైపు పెళ్ళి చేసుకుంటే కంపెనీ ఉద్యోగంలోంచి తొలగిస్తుంది. కాబట్టి చాలామంది యువతులు అనధికారంగా తమ తోటి కార్మికులతో, ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటున్నారు. ఈ సహజీవనం కూడా అనేక చిక్కులు తెచ్చి పెడుతోంది. పిల్లలు కంటే కూడా ఉద్యోగాలు పోతాయి. కాబట్టి అనేక మంది సంతానం వాయిదా వేసుకుంటు న్నారు. దీనివల్ల వారిలో ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. చాలామందికి సంతానం కలిగే అవకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి.
(రచయిత డా. బి.ఆర్. అంబేద్కరు సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సమాజశాస్త్ర విభాగలో అధ్యాపకులు. ప్రస్తుతం న్యూయర్క్‌లోని న్యూస్కూల్‌లో ఇండియా చైనా ఇనిస్టిట్యూట్ ఫెలోగా ప్రపంచీకరణ ప్రభావాలపై పరిశోధన చేస్తున్నారు)
చక్రపాణి గారు
చైనా పై మీరు రాస్తున్న వ్యాసాలు చదువుతున్నాను.
భూమిక మార్చి సంచికలో చీనాలో మహిళల స్థితిగతుల పై రాసిన వ్యాసం కనువిప్పుగా ఉంది.
చైనా లో జరుగుతున్న అభివృద్ది బూటకాన్ని అర్థం చేసుకోగలిగినాము.కృతఓతలు
సత్యవతి గారికి,
నమస్తే!
నేను సింగపూర్ లో ఉంటాను. భూమిక క్రమం తప్పకుండా చదువుతాను. ఈ సంచిక నిజంగా అధ్బతం. డా. ఘంటా చక్రపాణి గారి చైనా కథనం ఎంత బాగుందో! సమాచారం, స్పష్ట్తత, సరళత ఆకట్టుకున్నాయి. మాకు అడపాదడపా కొన్ని విషయాలు తెలుస్తున్నా వ్యాసం చదివి ఎంతో తెలుసుకో గలిగాం. మాకు చైనాలో తిరుగుతూ, చూస్తూ ఉన్న అనుభూతి కలిగింది. డా. చక్రపాణి గారి వ్యాసాలు మిగితా పత్రికల్లో చూస్తున్నాం కానీ భూమికలో అతని కథన శైలి అధ్బుతం! ఇంకా అక్కడి విశేషాలు తెలుసుకోవాలనుంది. కేవలం మహిళల అంశాలే కాకుండా మిగితా విషయాలు కూడా ఒక కాలం లాగా రాయిస్తే మహిళలకు ఒక ప్రాపంచిక ధ్రుక్పథం ఇచ్చిన వాళ్ళు ఔతారు. అలాగే చైనా గురించి కలలు కంటొన్న మార్కెట్ జీవులకు(మాలాంటి వారికి) ఉపయోగంగా ఉంటుంది.
ప్రస్తుతం చక్రపాణి గారు యెక్కడ ఉంటున్నారు. ఫోన్/ఇమెయిల్/ఎడ్రస్ ఇవ్వగలరా?
మా భూమికకు మరోసారి ధన్యవాదాలు.
గొట్టిపాటి శ్రీలత
గుడ్ రీడింగ్ ఆన్ చైనా..భూమిక చాలా బాగుంది ఈసారి..
బాలా బాగా వున్నద్
చక్ర పాణీ గారు ఇలా రాసారెమిటండీ భీ వి రాగవులు నారాయణ గారు కార్య కర్తల తొ కొట్టీంచి చమ్పీ గల్రు. కమ్మిల కు వ్యథి రెకంగ ఇల రస్థరు ఎలాగ. ఎంథ నిజమ ఐన.