భూమిక పాఠకులకు, సాహితీ మిత్రులకు అంతర్జాతీయ మహిళాదిన శుభాకాంక్షలు.

భూమికకు పదిహేనేళ్ళు నిండాయి. ఒక సీరియస్‌ స్త్రీల పత్రికకు ఎడిటర్‌గా నాకు పదిహేనేళ్ళు గడిచాయి. నిజానికి ఎంతో ఆనందంగా పదిహేనేళ్ళ పండుగ జరుపుకోవాల్సిన సందర్భం.

 భూమికకు పదేళ్ళు నిండిన సంవత్సరాన్ని ప్రత్యేక సంచికతో ఎంతో ఉత్సాహంతో నిర్వహించుకున్న విషయం మీకు గుర్తు వుండే వుంటుంది. పదిహేనేళ్ళ ప్రస్థానం ముగింపు దిశగా అడుగేయడం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇన్ని సంవత్సరాలు నా జీవితంతో పెనవేసుకుపోయిన భూమిక నా నుండి విడిపోతుందనే ఊహనే నేను భరించలేకపోతున్నాను. ఈ సంపాదకీయం రాస్తుంటే నా కళ్ళు కన్నీటి ప్రవాహాలవుతూ నా అక్షరాలు అలుక్కుపోతున్నాయి. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత నన్ను నిలవనీయడం లేదు. అవును. ఇది నిజం. నమ్మలేని నిజం. భూమిక తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. దాన్నుండి బయట పడే దారుల కోసం అన్వేషిస్తూనే, ఇంతకాలం అండగా నిలిచిన పాఠకులకు వాస్తవాలను వివరించడం నా బాధ్యతగా భావించి ఈ సంపాదకీయం రాస్తున్నాను.

 ఇటీవల ఒక రచయిత్రి మిత్రురాలు భూమిక ఆఫీసుకొచ్చి, ఆర్ధిక ఇబ్బందుల గురించి విని చాలా ఆశ్చర్యపోయి ‘అదేంటి భూమికకు బోలెడు విదేశీ నిధులుంటాయిగా’ అన్నారట. ఆ మాట విన్నాక అందరూ అలాగే అనుకుంటున్నారేమోననే అనుమానం కలిగింది. మిత్రులారా! అలా భ్రమపడకండి. భూమిక ఏ రోజూ విదేశీ నిధులు స్వీకరించలేదు. అలా స్వీకరించే వెసులుబాటు కూడా లేదు. భారత దేశంలో ‘రిజిష్ట్రార్‌ ఆఫ్‌ న్యూస్‌ పేపర్స్‌’ కింద రిజిస్టరు అయిన ఏ పత్రికా విదేశీ నిధులు స్వీకరించకూడదు. ఇది కేంద్ర హొమ్‌శాఖ ఆదేశం. ఈ విషయం విజ్ఞలైన మిత్రులకు , సాహితీపరులకు తెలిసే వుంటుందని నేను భావించాను. భూమిక ఏ రోజూ విదేశీ నిధుల్ని స్వీకరించలేదన్నది నిప్పులాంటి నిజం. చిన్న చిన్న ప్రాజెక్టులు చెయ్యడం ఆ నిధుల్ని భూమిక ప్రచురణకు వాడడం, మిత్రుల విరాళాలు, చందాలు, అడ్వర్‌టైజ్‌మెంట్ల మీద మాత్రమే భూమిక పదిహేనేళ్ళుగా నడుస్తూ వస్తోంది. ‘నిర్ణయ’ అనే సంస్థవారు భూమిక పట్ల ప్రేమతో ఆరు సంవత్సరాలుగా  చిన్న చిన్న ప్రాజెక్టులు ఇవ్వడంద్వారా ఆర్ధికంగా సహకరించారు. ప్రస్తుతం ‘నిర్ణయ’ కూడా నిధుల సమస్యను ఎదుర్కొంటోంది. పరోక్షంగా దాని ప్రభావం భూమిక మీద కూడా పడింది.

మేము భూమిక నిధుల సేకరణలో భాగంగా హెర్బల్‌ డైరీలు ప్రచురించాము. వీటి అమ్మకాల ద్వారా వచ్చే సొమ్ముతో రెండేళ్ళ పాటు భూమిక నడుస్తుందని నేను ఆశించాను. మిత్రులందరికీ పదే పదే విజ్ఞప్తి చేసాను. తలో పది కాపీలు కొనడం ద్వారా సహకరించమని కోరాను. కొంతమంది మిత్రులు పెద్ద మనసుతో ఎక్కువ కాపీలే తీసుకుని అమ్మి పెట్టారు. చాలామంది మాత్రం పట్టనట్టు వుండిపోవడం నాకు చాలా బాధను కల్గిస్తోంది. ప్రింటు చేసిన కాపీలన్నీ నన్ను వెక్కిరిస్తూ నా ఎదురుగానే మిగిలిపోయాయి. ప్రింటర్‌కి మాత్రం డబ్బు చెల్లించాల్సి వచ్చింది. పులి మీద పుట్రలా భూమిక ఆర్ధిక పరిస్ధితిని ఈ పరిణామం చిన్నాభిన్నం చేసింది.

 స్త్రీల పత్రికల పరంగా ఇటీవల జరిగిన రెండు పరిణామాలు కూడా నన్ను భయభ్రాంతులను చేస్తున్నాయి. ఒకటి ‘మానుషి’ మూసివేతూ. రెండోవది మూసివేత దిశగా నడుస్తున్న ”లాయర్స్‌ కలెక్టివ్‌” పత్రిక. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రచురింపబడుతూ, నాలాంటి ఎందరికో స్త్రీల అంశాలపట్ల ఒక స్పష్టమైన వైఖరిని, స్త్రీల పత్రికను ఎలా నడపాలనే దానిమీద ఒక దిశానిర్దేశంగా నిలిచిన ‘మానుషి’ ఆగిపోవడం పెద్ద షాక్‌. ‘మానుషి’ ఆర్ధిక యిబ్బందులవల్ల ఆగిపోతోందని బాధ పడుతూ ఎడిటర్‌ మధుకిష్వర్‌ రాసిన ఉత్తరం నాకు కళ్ళనీళ్ళు తెప్పించింది. ‘లాయర్స్‌ కలెక్టివ్‌’ కూడా ఆగిపోతోందని ఇందిరా జైసింగు ప్రకటించారు. ఈ రెండు పరిణామాలు భారత దేశంలో స్త్రీల ఉద్యమానికి పెద్ద దెబ్బ. గృహహింస నిరోధక చట్టం 2005, రూపకల్పనలో ‘లాయర్స్‌ కలెక్టివ్‌’పాత్ర ఎంతో విలువైంది. అయినప్పటికీ ఆర్ధిక యిబ్బందులు ‘మానుషి’,’లాయర్స్‌ కలెక్టివ్‌’ ని మూత పెట్టెసాయి. ఈ పరిణామాలను గమనించినపుడు ‘భూమిక’ భవితవ్యం పెద్ద ప్రశ్నార్ధకంగా మారింది. ఒక వైపు రంగు రంగుల పేజీలతో పాప్యులర్‌, కమర్షియల్‌ పత్రికలు వెల్లువెత్తుతున్నాయి. వెలిగిపోతున్నాయి. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో, న్యూస్‌ప్రింట్‌తో నడిచే భూమికలాంటి చిన్న పత్రికలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఎన్ని యిబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ‘భూమిక’ను కొనసాగించాలన్నదే నా గాఢమైన ఆకాంక్ష. నా ప్రయత్నాలు నేను చేస్తూనే వుంటాను. సాహితీ మిత్రుల్లారా! భూమిక అభిమానులారా! మీరు కూడా ఆలోచించండి. భూమిక ఆగిపోవడమంటే ప్రత్యామ్నాయ గొంతు మూగపోవడమే. సహృదయ పాఠక మిత్రులు పెద్ద మనసుతో అర్ధం చేసుకొని భూమిక భవిష్యత్తుకోసం తగు సూచనలు యివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. యివ్వగలిగినవారు, భూమిక పట్ల ప్రేమ వున్నవారు విరాళాలు యివ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకాలం కాంప్లిమెంటరీ కాపీలు పొందినవారు సైతం చందాదారులు కావల్సిందిగా మనవి.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ అండ, సహకారం, సహృదయత తోడైతే భూమిక మరో పదేళ్ళు నడుస్తుంది. పాఠకుల సహకారమే ఏ పత్రికకైనా పెట్టుబడి. మనమందరం నిబధ్ధతతో తలుచుకుంటే భూమికను ఏదీ ఏమీ చెయ్యలేదు.
 మిత్రులారా! భూమికను బతికించుకుందాం. మాతో చెయ్యికలపండి!

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.