జ్వలిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మరియు లేఖిని.
మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తేది. 22
.2.08న హైద్రాబాద్ రవీంద్రభారతిలో సాయంత్రం గం. 6 నుండి 9 వరకు కవయిత్రుల సదస్సు నిర్వహించబడింది.
ప్రముఖ రచయిత్రి,డా. వాసాప్రభావతి గారి అధ్యక్షతన జరిగిన ఈ సభకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖామాత్యులు నేదురుమల్లి రాజ్యలక్ష్మిగారు ముఖ్యఅతిధిగా విచ్చేశారు.రచయిత్రి, శాసనసభ్యురాలు అయిన పి. స్వర్ణసుధాకర్‌గారు విశిష్టఅతిధిగా హాజరయినారు.ఆత్మీయఅతిధిగా ప్రముఖరచయిత్రి అరుణావ్యాస్ , రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డా రాళ్ళబండి కవితా ప్రసాద్‌గారు, నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మరియు వివిధ ప్రాంతాలనుండి ఆహ్వానించబడిన 12 మంది కవయిత్రులు, సాహితీప్రియులు హాజరయినారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన నేదురుమల్లి రాజ్యలక్ష్మిగారు తమ ప్రసంగంలో తాను కవిని, రచయితను కాకపోయినా ఈ సభకు ఆహ్వానించబడడం తన అదృష్టం అని చెబుతూ, పూలను కట్టిన దారానికి పూల వాసన కొంత అంటుతుందనే స్వార్ధంతో అందర రచయిత్రుల సాంగత్యంతో సాహితీవాసనను అంటించుకోవాలనే ఆశతో వచ్చానని అన్నారు. అరుణావ్యాస్ మాట్లాడుతు స్త్రీలను పూజించే దేశాలలో భారతదేశం ప్రధానమైంది. రెండవ స్థానంలో గ్రీకుదేశం ఉంటుందని వివరిస్తూ, సభకు విచ్చేసిన 12 మంది రచయిత్రులు ”ద్వాదశ ఆదిత్యుల్లా” తమ ఆలోచనలను ప్రసరిస్తున్నారని అభినందించారు.
విశిష్ట అతిధిగా విచ్చేసిన పి. స్వర్ణసుధాకర్ ”గుడిగంటల శబ్దం ముందు-చిరుమువ్వల సవ్వడి ఎంత” అంటూ తాను రచయిత్రిని, తనకు కవిత్వంరాదు అంటూనే కవిత్వ ధోరణి వ్యక్తపరిచారు. శీలాసుభద్రాదేవి గారు ప్రారంభిస్తూ తన సుధీర్ఘకవితలో కాలాన్ని గడియరాన్ని ప్రతీకలుగా, గడియరంలో ముల్లులాగా కవయిత్రి మనిషి సమస్యలను అభివర్ణించారు.
వరంగల్ నుండి వచ్చిన అనిశెట్టి రజిత ”మోహబత్‌కీ మోహఫిల్” అనే తన కవితను తెలంగాణా మామండలికంలో హిందీ, తెలుగు భాషల మేళవింపులతో శాంతి, స్నేహం, ప్రేమతత్వాల ప్రాధాన్యతను తెలిపారు. విజయవాడ నుండి వచ్చిన పాటిబండ్ల రజని ”మా అబ్బాయి సినిమాకెళ్ళాడు” అనే కవితలో నూనూగు మీసాలవాడు నూలు పోగుకాని, నూరు రూపాయలుకానీ, సంపాదించలేని వారు అంటూ సినిమాల దుష్ప్రభావం నేటి యువతపై ఎలావుందో వివరించారు. మహెజబీన్ లుంబినీపార్క్ బాంబుపేలుళ్ళ నేపధ్యంతో స్నేహితుడా అంటూ టెర్రరిస్ట్ మదిలో ప్రేమను, స్నేహాన్ని మొలకెత్తించే ప్రయత్నం చేశారు.
ఖమ్మం నుండి వచ్చిన జ్వలిత ”ఒక జీవన్మరణం జీవదృశ్యం” అనే కవితలో మనని మనమే కోల్పోతున్నపుడు అంటూ.. ఒక జీవన్మరణ సజీవ సాదృశాన్ని కళ్ళముందు ప్రదర్శించారు. ఆకెళ్ళ నాగసత్యబాలభాను అనే కవయిత్రి వినూత్నంగా పద్య కవితా పఠనం చేస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని శ్లాఘించారు.
శరత్‌జ్యోత్స్నారాణి తమ కవితలో మహిళా సమస్యలను స్పృజిస్తూ ప్రతిరోజు ఒక ఆయేషా, ఒక ప్రత్యూష బలిఅవుతున్నారని ఆవేదనను వ్యక్తపరిచారు. శైలజామిత్ర ”అరుణోదయంలో అశాంతి కిరణాలు” అనే కవితలో ఒక రాయిని మరొక రాయి తాకినా, ఒక మనిషితో మరొక మనిషి మాట్లాడినా ఏ మాత్రం పరావర్తనం జరగడం లేదు అంటూ జరగవల్సినది ఇంకేదో ఆగిపోతోందని అభివర్ణించారు. తమిరిశ జానకి ”ఆవేశం ప్రగతికి అవరోధం” అనే కవితలో ఆకలి బాధను కవిత్వంతో కలిపిన ఆవేదనను వ్యక్తపరిచారు.
రేణుకాఅయోల ”ఊరు చిత్రమైనపుడు” అనే కవితలో దూరాన నదితనువులో ఇసుకతిన్నెల చారలు, గుండె తవ్విపోసుకునప్పుడు చెలమల నీటికోసం తీసిన గోతులు అంటూ సొంత ఊరిపై అనుభూతిని కోల్పోతున్న వాతావరణం, రాజకీయాలను ఆవేదనా చిత్రాలుగా చిత్రీకరించారు. ఉషారాణి జోగినీ వ్యవస్థను గురించి అనేక ప్రతీకలతో ప్రతిభావంతంగా చెబుతూ కొరడా దెబ్బలతో నన్ను నేను చైతన్యపర్చుకుని నాతోనే మొదలుపెడతానంటూ ”జోగినికి పోతురాజుతో పెళ్ళి” అనే కవిత వినిపించారు. వాసాప్రభావతి కూడా కరపత్రం అనే కవితను వినిపిస్తూ ధరిత్రీమాతకు తమ కరపత్రాన్ని అందించారు.
చివరగా సాంస్కృతికశాఖ సంచాలకులు డా. రాళ్ళబండి కవితాప్రసాద్ మాట్లాడుతూ అంతవరకు జరిగిన కవితాపఠనంలో కవితలవ్యూహం, ఎత్తుగడలను ప్రశింసిస్తూ, కవిత్వంపై ఒక వర్క్‌షాప్ నిర్వహిస్తే బాగుంటుందని అతి త్వరలో దానిని నిర్వహిస్తామని ప్రకటించారు. అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు. మొత్తంమీద కార్యక్రమమంతా ఆహ్లాదకరంగా పండుగ వాతావరణంలా కొనసాగింది. కవయిత్రులు కవిత్వాన్ని భావవ్యక్తీకరణతో చదివితే ఇంకా ప్రభావితంగా వుండేదనిపించింది. కవిత్వంలో పటుత్వం ఉన్నా కవితాత్మకంగా, భావయుక్తంగా, స్పష్టమైన ఉచ్చారణతో శ్రోతలు ఆనందించే విధంగా పఠించగలిగితే బాగుండేేడిది. మొత్తానికి రెండు తరాల కవయిత్రులను ఆహ్వానించి కొత్త పాతల కలయికలతో కొనసాగిన ఈ సాహితీ సదస్సుకు వేదికపై అందరూ మహిళలే ఉండడం ఒక ప్రత్యేకత. సభకు హాజరైన వారికి ఇది మధుర స్మతి. సభా నిర్వాహకుల ప్రయత్నం అభినందనీయం.