కన్నకడుపు – ఆచార్య మూలె విజయలక్ష్మి

మహిళ మాతృత్వం వరం అనుకొన్నా మాతృత్వం కోసం దేవుని ముందు వరమడిగినా, మాతృత్వం కలిగిందన్న మత్తులో ఉన్నా అది ఆడదాని అష్టకష్టాలకు అసలు కారణమని తెలుసుకొనేలోపే జీవితం మలిసంధ్యకు చేరుకుంటుంది. బిడ్డ పుట్టుకలో సగం పాత్ర ఉన్నా పిల్లల పోషణలో, ఆలనాపాలనలో పాలు పంచుకునే తండ్రులెంతమంది.?

 పశుపక్ష్యాదుల్లో ఆడజాతి కొంత కాలం బిడ్డలను పోషించే బాధ్యత తీసుకుంటుంది. కోడి మూడు నెలలు. ఆ తర్వాత దరిచేరనీయదు వాటి బతుకు వాటిదే. అలాగే పాలిచ్చే జంతువులు కూడ కూనలకు కొద్ది ఎడవయసు వరకే. ఆ దశలో అవి నోరుకట్టుకొనైనా పిల్లలకు తిండిని చేకూర్చుతాయి. కోడి పెట్ట మట్టిలో కెలికి, కెలికి పురుగు పుట్టా, గింజ గిట్టా పొడిచిపొడిచి పొడిచేసి పిల్లల చేత తినిపిస్తుంది. పిచ్చుకలు ఆహారాన్ని సేకరించుకొచ్చి పసిపిట్ట నోట్లో పెట్టే దృశ్యం అందరికీ ఎరుకే. అది ఎంత వరకు? రెక్కలొచ్చేంతవరకే.

 ఆదశలో ఎంత జాగ్రత్తగా కనిపెట్టుకుని కాపాడతాయో చెప్పలేం. ఈనినపులి, పులిపాలు తేవడం వంటి జాతీయాలు ఇందుకు నిదర్శనం. ఆవులు ఈని పసి లేగలున్నపుడు, కొమ్ములు విసురుతాయి. కోడిపెట్టలు పొడవడానికి వెంటబడతాయి. ఆకాశంలో గద్దను చూస్తే కోడిచేసే అరుపులు, హంగామా అంతా ఇంతా కాదు. రెక్కల కింద పొదువుకుంటుంది. పల్లీయులందరికి ఇదిఅనుభవమే. పదిపైగా పందుల్ని కనే ఆడపంది అన్నింటికీ పాలు కుడుపుతుంది. మూడు రోజుల వరకు యజమానిని సైతం శత్రువు గానే భావించి దగ్గరకు రానివ్వదు. తిండికోసం ఆ కొమ్మకు ఈ కొమ్మకు గెంతే కోతిబిడ్డను కడుపుకు అంటకరిపించుకుంటుంది. పశుపక్ష్యాదుల్లో పిల్లల పోషణ, రక్షణ ఆయా జాతులను బట్టి పరిమితకాలమే కాని కొన్ని కుటుంబాల్లో ఆడవాళ్ళు పాలు తాగే వయసు, పరిగెత్తే వయసు, పడచుప్రాయం వరకూ తిండిగుడ్డా చదువులు అన్నీ అమ్మే పట్టించుకోవాల్సి వస్తోంది. ఏ పొరపాటు జరిగినా, బిడ్డ అడ్డదారి పట్టినా నిందించేది తల్లినే. అమ్మ పెంపకం అలా ఏడ్చింది అని ఆడిపోసుకుంటుంది.

 పేద కుటుంబాల్లో ఆర్థిక వెసులుబాటు అంతంత మాత్రమే. పురుషుడు కూలీనాలీ చేసి కుటుంబ పోషణకు డబ్బులు ఇవ్వకుండా తాగితందనాలాడి హారతి కర్పూరం చేసినా, సంపాదనపరుడు కాకపోయినా తన రెక్కలకష్టంతో, కడుపుకట్టుకొని, బిడ్డలకడుపు నింపాలని చూస్తుంది తల్లి. తనకడుపు కాలుతున్నా చన్నుకుడుపుతుంది. కూలీనాలీ చేసైనా, కుండలు కడిగైనా పిల్లలకు కూడు పెట్టటం కోసం నానా అగచాట్లుపడుతుంది. దొంగిలించడానికైనా, కొంగు పరచడానికైనా, కాని పనులు చేయడానికైనా వెనుకాడదు. బిడ్డలకు కడుపు నింపాలని ఆరాటపడుతుంది. పడరాని మాటలు పడుతుంది. ఇలాంటి సందర్భాలు కొన్ని చూద్దాం. నామిని సుబ్రమణ్యం నాయుడు ‘దేముడు మెచ్చిన తప్పు’లో ఓ తల్లి ప్రభుత్వం ఇచ్చినలోనుతో కొనుక్కొన్న ఆవుకు అక్కడ ఇక్కడ అడగా పెట్టకుండా గడ్డీగాదం తెచ్చి పెట్టి, ఆవుపాలతో వచ్చే డబ్బుతో కుటుంబ అవసరాలు గడిపేది. అనుమతి లేకుండాతన చేలో మోసులు(చెరకు మొదలు దగ్గర వచ్చే పిలకలు) పెరుక్కుంటున్న ఆమెను యజమాని నిలదీస్తే చిన్న కథ చెప్పింది. ఓ ఆమె చనిపోతే యముడు వచ్చేటప్పటికే పూల రథంపై ఆయమ్మను శివుడెక్కించుకొని పోవటం చూసి యముడు ”అది చాకలోడికి కొంగు పరిచిన లంజ. దానికి పూల రతమా, సొర్గమా”? అని ప్రశ్నించాడట. దానికి ”ఈ మఖా తల్లికి బ్రమ్మ రెక్కలిచ్చినాడే గాని – కష్టిం జేసుకునే దానికి బూములు బావులిచ్చినాడా? పైగా ఏటా బాలింతనుజేసి ఏడుమంది పిల్లకాయల్నిచ్చినాడు ఘనంగా బూలోకంలో చాకలోళ్లకు మోకాట్లోతు నీళ్లు, మోకాట్లోతు కూడు అని సామెత. మన పిలకాయలకంత సంగటి పెడతాడు గదాని ఈ మఖా తల్లి చాకలాయనకు కొంగు పరిచింది. అంతేగాని నువ్వూ నీ బ్రమ్మా పెట్టింది తిని మదం బట్టి పొయ్‌గాదు” అన్నాడు శివుడు. పల్లెల్లో చాకలి వృత్తి చేసే వాళ్లకు తమ మిరాశీ యిండ్ల యజమానులు రాత్రిపూట అన్నం పెట్టే ఆనవాయితీ ఉంది. రజక మహిళ కానీ పురుషుడు కానీ ఇంటింటికి వెళ్ళి అన్నం, కూరలు గంపలో పెట్టించుకుని వచ్చేవాళ్ళు. యజమానులు తమ కుండలో కలిగింది వారికింత పెట్టేవాళ్ళు. దాంతో వారి కుటుంబ తిండి గడవడమే కాదు మిగిలితే గాడిదలకు వేసేవారు. దీనివల్లనే చాకలి దగ్గర తిండి సమృద్ధిగా ఉంటుందని భావించి, తన ఏడుమంది బిడ్డల కడుపు నింపడం కోసం అతనితో సంబంధం పెట్టుకునిందే కాని ఒళ్ళు బలిసి కాదు.

 మరో స్త్రీ భర్త ఇచ్చే డబ్బు తిండి ఖర్చులకు చాలక, భర్త జేబులో నుంచి తస్కరించి, తన్నులు తింటుంది. పవిత్రంగా భావించే ఖురాన్‌పై ఒట్టేయటానికి కూడా సిద్ధపడింది. ఖదీర్‌ బాబు ”మా జరీనాంటీ స్పెషలు సెలవల కత” లో ఈ విషయం పై పదేపదే అక్క బావల దగ్గర పంచాయితీ. డబ్బు గూర్చి అడిగితే ”ఖురాన్‌ మీద ఒట్టు వేసి నెత్తి మీద పెట్టుకొని మరీ చెబుతా నేతియ్యలా, తియ్యలా అంతే” అంటుంది. మొగుడి జేబులో డబ్బు దొంగతనం ఎందుకు చేస్తున్నావని భర్త లేకుండా బావ నిలదీస్తే  ”అయిదు మందికి పది రూపాయలతో రెండుపూటలా వండి వార్చాలంటే అయ్యే పనేనా. నువ్విచ్చేది సంటిదాని పాలకే సాలవయ్యా.. యింకరొన్ని డబ్బులియ్యయ్యా అని ఎన్నిసార్లు బతిమిలాడినానోఅడుగు. ఎప్పుడడిగినా యివి సామాన్ల డబ్బులు తాకబాక, అవి సామాన్ల డబ్బులు తాకబాక అని అంటాడే కానీ చెయ్యి సాచి యివిగో అంటూ యిచ్చి ఎరిగినాడా? అట్టాంటి మనిషున్నప్పుడు దొంగతనం చేయక బావిలో దూకి సావమంటా?’  అని బోరుమంటుంది. పిల్లల కడుపునింపడానికి తన్నులు తింటుంది. ఒకసారి ఒప్పుకుంటే బిడ్డల కడుపు కాల్చాల్సివస్తుంది. అందుకే దొంగతనం చేయలేదని ఖరాఖండిగా చెప్పింది. కారణమేంటో కనుక్కుంటే విన్నవారి కడుపు తరుక్కు పోతుంది.

 మరో సందర్భం ద్వివేదుల విశాలాక్షి నిండుచూలాలు కథ. బియ్యం మూటను కడుపుకు కట్టుకుని నిండుగర్భిణిలా ప్రయాణం చేస్తూ అక్రమ రవాణా చేస్తుంటుంది. పట్టుకున్న అధికారులతో అదే పని చేస్తున్న మరో ముసలామె ”కడుపున పుట్టిన గుంటెదవలు ఆకలని ఏడుస్తుంటే ఆడకూతురు సెయ్యరాని పని ఏటుంటుదో; సెయ్యలేని పని ఏటుంటుదో ? అడగరానీయమ్మనడుగు. నీకు పిల్లలుంటే నీపెల్లాన్నడుగు” అని ప్రశ్నిస్తుంది.

 బిడ్డల ఆకలి తీర్చడానికి తల్లి చెయ్యరాని, చెయ్యలేని పనులు కూడా చేయాల్సివస్తుందని నిరూపిస్తుందీ కథ. ఏదోరకంగా బిడ్డల కడుపునింపడమే కన్నకడుపు పని. మంచి, చెడు విచక్షణ లేదు. ఎందుకు తల్లికే ఈ అల్లాటం. నిందలు, శిక్షలు, అవమానాలు అన్నీ భరించాల్సివస్తోంది.

 ఆడవాళ్ళకు మాతృత్వం ప్రకృతి సంబంధి అనుకుంటే బిడ్డల సంరక్షణ, పోషణ ఎంత కాలం. స్త్రీకి పాలిచ్చే సామర్థ్యం ఒకటి, ఒకటిన్నర సంవత్సరం, బిడ్డలు ఒక సంవత్సరం వయసుకే ఆహారం తీసుకోగలుగుతారు. పశుపక్ష్యాదులలాగా వాటి తిండి తిప్పలు వాటిపై వదిలినట్లు పసి పిల్లలకు శారీరక సామాజిక పరిస్థితులు అనుకూలంగా లేవు. అలాంటప్పుడు బిడ్డ పుట్టుకకు కారణమైన తల్లిదండ్రులు ఇరువురు సంరక్షణ,పోషణ బాధ్యత వహించాలి. ఈ రెండూ బాధ్యతలు స్త్రీలే నిర్వహిస్తున్న సందర్భాల్లో ఆడవాళ్ళు తమ ఆరోగ్యాన్ని, వ్యక్తిత్వాన్ని, చివరకు జీవితాన్ని పణంగా పెట్తున్నారు. తరతరాలుగా ఆడవాళ్ళకు నూరిపోసిన విలువలా? బయటకు రాలేని సామాజిక చట్రమా?

 పురుషుని పరంగాచూస్తే పురుషుడు తనబాధ్యత కాదనుకుంటూ బలాదూర్‌గా, నిర్లక్ష్యంగా ఉండటానికి కారణ మేమిటి? దుర్వ్యసనాలకు బానిసకావటమో, కుటుంబానికి ఆర్థిక ఆసరా తనేనని భావించటమో, పిల్లల పనులు ఆడవాళ్ళ పనులు అని అనుకోవటమో, పిల్లల పనులకు సహాయంగా ఉండాలను కొన్నా, ఉన్నా తమను చిన్న చూపు చూస్తారనే ధోరణిలోనో చాలామంది దూరంగా ఉంటున్నారు. దాంతో ఆడవాళ్ళు, ఇంకా ఇంటా బయటా పనులు చేసేవాళ్ళు, అనారోగ్యంతో ఉన్న స్త్రీలు పిల్లలు చేతికందివచ్చినంత వరకు సతమతమవుతున్నారు.

 పిల్లల సంరక్షణ, పోషణలో కష్టమో, నష్టమో భార్యా భర్తలిరువురు సమ బాధ్యతలు పంచుకోవడం సామాజికావసరం కాదా?

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.