31 October రాత్రి ఇఫ్లూ ప్రాంగణంలోని బషీర్ హాస్టల్‌లో ఒక విద్యార్థినిపై జరిగిన దారుణమైన సాముహిక అత్యాచారం మరొక్కసారి ఈ యూనివర్సిటిని వార్తల్లోకి తీసుకొచ్చింది. బాధితురాలు యూనివర్సిటి అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆమెను నవంబర్ 2న పోలీసుల దగ్గరకు పంపారు. నవంబర్2 ,2014న ఇద్దరిని అరెస్టు చేసారు. యూనివర్సిటి ప్రాంగణంలో జరిగిన ఈ లైంగిక దాడి యూనివర్సిటి విద్యార్థులను, అధ్యాపకులను, ఉద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే అంతకంటే ఆందోళన కలిగించే విషయం సంఘటన తరువాత యూనివర్సిటీ పాలక వర్గం అవలంబించిన వైఖరి. యూనివర్సిటీలో హింస, దాడులు లేని వాతావరణం కోసం ప్రయత్నాలు, జెండర్ అవగాహన పెంచటం కోసం కార్యక్రమాలు చేపట్టటం బదులు, అధికారులు కాంపస్‌లో ప్రజాస్వామిక హక్కులని పూర్తిగా అణగదొక్కే అనేక చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక మంది బాధ్యత కలిగిన పౌరులు, స్త్రీల సంఘాలు, పౌరహక్కుల, విద్యార్థుల, మైనారిటీ హక్కుల వేదికలు కలిసి సామూహిక అత్యాచారం సంఘటనపై, ప్రజాస్వామిక హక్కుల అణచివేతపై సమగ్ర విచారణ జరపాలనే డిమాండుతో ‘ఇఫ్లూలో ప్రజాస్వామిక హక్కుల వేదిక’గా ఏర్పడ్డాయి. ఇఫ్లూలో సామూహిక లైంగిక దాడి ఘటనపై, ప్రజాస్వామిక హక్కుల అణచివేతపై వెంటనే సమగ్ర విచారణ జరపించాలనేది మా ప్రధాన డిమాండు.
సంఘటన వెంటనే బాధితురాలు అబ్బాయిల హాస్టల్‌లో ఉందంటూ ఊహాగానాలతో కొన్ని వార్తలు వెలువడ్డాయి. యూనివర్సిటీ అధికారులు, పోలీసులు కావాలని లీకు చేసిన సమాచారంతో ఈ వార్తలన్నీ బాధితురాలి వ్యక్తిత్వాన్ని కించపరిచి, నిందించటమే కాక, ఆమె గురించిన కీలక సమాచారాన్ని బహిర్గతం చేసాయి. ఇటువంటి నీచమైన వాదనలు జరిగిన నేరాన్ని సమర్థించటానికి మాత్రమే పనికొస్తాయి. 1978లో జరిగిన రమీజాబీపై అత్యాచారం నుండి 2012లో జరిగిన నిర్భయపై అత్యాచారం వరకు లైంగిక దాడులను, అత్యాచారాలను బాధితురాలి చరిత్రను, జరిగినప్పుడు ఆమె ఉన్న స్థితిని చూపి సమర్థించటం గర్హనీయమని అందరికీ అర్థమయింది. బాధితురాలి వ్యక్తిత్వాన్ని నీచంగా చూపి ఆమెపై జరిగిన దాడిని తక్కువగా చూపే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
అయితే ఇఫ్లూ అధికారుల చర్యలు వారికి స్త్రీలపై హింస విషయంలో ఏ మాత్రం అవగాహన లేదని, అంతేకాక శ్రద్ధ కూడా లేదని ఇఫ్లులో ప్రజాస్వామిక హక్కుల వేదిక సభ్యులుగా మా భావన. యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ వారు ఈ విషయంపై తెచ్చిన ప్రత్యేక నివేదిక ‘సాక్షం’ ప్రకారం స్త్రీలపై ద్వేష పూరిత వైఖరులు మారటానికి అతి ముఖ్యమైన మార్గం ‘జెండర్ పట్ల అవగాహన పెంచటం’. కొత్తగా పార్లమెంట్‌లో చెయ్యబడిన చట్టం మరియు యుజిసి నియమాల ప్రకారం ప్రతి యునివర్సిటిలోనూ ‘లైంగిక వేధింపుల వ్యతిరేక జెండర్ అవగాహన కమిటి’ని ఏర్పరచాలి. అది వేధింపుల ఫిర్యాదులను స్వీకరించటమే కాక అవగాహనను కూడా పెంచాలి. ఇఫ్లూ ఇప్పటివరకూ ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టకపోవటమే కాక లైంగిక సమానతకు సంబంధించిన ప్రభుత్వ, యుజిసి నియమాలను వుల్లంఘించింది. కమిటి నియమాల ప్రకారం దానిలో ఎన్నుకోబడిన విద్యార్థి ప్రతినిధులు వుండాలి కానీ విద్యార్థుల నుండి ప్రతినిధులని ఎన్నుకోలేదు. అంతే కాక కమిటి గురించిన సమాచారం, సభ్యుల గురించిన సమాచారం, వారి ఫోన్ నంబర్లు విస్తృతంగా ప్రచారం చెయ్యాలి కానీ ఇప్పటివరకూ ఎవరికీ ఆ సమాచారం తెలియదు.
యూనివర్సిటీి మొద్దుబారిన స్పందన :
నవంబర్ 2న సంఘటన జరిగిన వెంటనే యూనివర్సిటీి వైస్ చాన్సలర్ గానీ, రిజిస్ట్రార్ గానీ యునివర్సిటి ప్రాంగణానికి రాక పోవటం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సంఘటనపై అంతర్గత విచారణ జరిపించాలని విద్యార్థులు అడిగినప్పటికీ, అధికారులు విచారణ జరిపించలేదు. పోని ఒక అత్యవసర సమావేశం ఏర్పరిచి విద్యార్థినులలో, మిగిలిన వారిలో నమ్మకం ఏర్పరచాటానికి ప్రయత్నం కూడా చెయ్యలేదు. యూనివర్సిటి పెద్దలు ఎవ్వరితో కూడా ఈ సంఘటన గురించి చర్చలు ప్రారంభించలేదు. వైస్ ఛాన్సలర్ వద్ద నుండి ఉపాధ్యాయులకు వచ్చిన ఒక వుత్తరంలో ‘ఈ సంఘటనని రాజకీయాలు చేయటానికి, ఉత్త లాంఛన ప్రాయమైన మాటలు మాట్లాడటానికి ఉపయోగించకూడదని’ జాగ్రత్తలు వున్నాయి!
మర్నాడు నవంబర్3న అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు విద్యార్థుల కోసమని ఒక మీటింగ్ పెట్టారు. అక్కడికి డిసిపితో పాటు వచ్చిన వి.సి. ఏమీ మాట్లాడలేదు. విద్యార్థులు పిటిషన్ ఇస్తామని అడిగినా వి.సి. వారిని కలవలేదు. అత్యాచారం బయటికొచ్చిన తరువాత స్త్రీల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, ఇతర సంఘాలు వచ్చి వి.సి.ని కలవాలని, బాధితురాలికి కావాల్సిన మద్దతు అందిద్దామని వస్తే వారిని గేటు లోపలికి కూడా రానివ్వలేదు. రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు వస్తే ఆవిడని కూడా గేటు బయట నిలబెట్టారు. మీడియా వారిని కూడా రానివ్వలేదు.
అయితే విద్యార్థుల పట్ల యూనివర్సిటీ పరిపాలనా వర్గం అనుసరించిన వైఖరులని గమనించిన వారికి ఇది పెద్ద ఆశ్చర్యకరంగా అనిపించదు. స్థానిక పోలీసులను చీటికీ మాటికీ పిలవటం వారికి అలవాటయిపోయింది. విద్యార్థులేమడిగినా వారి స్పందన ఇదే. ప్రజాస్వామ్య రీతులన్నా, సంప్రదింపులన్నా వ్యతిరేకత, అణిచివేత పద్ధతులుంటే ప్రేమ, విద్యార్థులని, విద్యార్థులని విడదీయటం- ఇవే ఏ విషయానికైనా వి.సి స్పందనలు. దీనికి అనేకానేక ఉదాహరణలు వున్నాయి. కిందటి సంవత్సరం తమ సమ లైంగిక ఆస్తిత్వ వ్యక్తీకరణత గురించి కొట్టుమిట్టాడుతున్న ఒక విద్యార్థితో, జాగ్రత్తగా, సున్నితంగా వ్యవహరించటానికి బదులు, అతన్ని ‘కౌన్సిలింగ్’ కోసం పోలీసుల దగ్గరికి పట్టుకెళ్ళారు. ఆ విద్యార్థి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థుల నుండి విపరీత నిరసన వ్యక్తమైనా, న్యాయం సిగ్గు పడే విధంగా ఆ సంఘటనకి బాధ్యులైన వ్యక్తులు అదే స్థాయిలో, అధికారంలో అలాగే కొనసాగుతున్నారు.
ఈ సంవత్సరం మొదట్లో, విద్యార్థులందరికీ వున్న ఒకే ఒక లైబ్రరీని 24గంటలు తెరిచి ఉండాలని, అనవసరంగా మూసెయ్యొద్దని అడిగినందుకు ముగ్గురు విద్యార్థులని యూనివర్సిటి నుండి బహిష్కరించారు.
వారిలో ఒక విద్యార్థి థీసిస్‌ని యూనివర్సిటీ స్వీకరించాలని రాష్ట్ర వున్నత న్యాయస్థానం చెప్పినప్పటికీ స్వీకరించలేదు. ఇంకొక విద్యార్థికి ఒక అధ్యాపకునితో రిజర్వేషన్లు అమలు గురించి వాదించినందుకు ఫెలోషిప్‌ని నాలుగు నెలల పాటు ఆపేశారు. హాస్టల్‌లో నీళ్ళు లేవని అడిగినందుకు ఇంకొక విద్యార్థి ఫెల్లోషిప్‌ని రెండు నెలల పాటు ఆపేశారు. వారికి ‘షో కాజ్’ నోటిసులు ఇచ్చి మరొకసారి ఏమన్నా చేస్తే యూనివర్సిటి నుండి బహిష్కరిస్తామని బెదిరించారు. ఎంట్రన్స్, ఇంటర్వ్యులో పాస్ అయినా కానీ ఒక విద్యార్థికి కాంపస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నందుకు రిసెర్చ్‌లో సీట్ ఇవ్వలేదు. ఎంట్రన్స్ ఫలితాల్ని ఇటు అటు చేసి రాజకీయ అవగాహన వున్న విద్యార్థులకి సీట్లు రాకుండా చేస్తున్నారని వివిధ సంఘటనల్లో స్పష్టమయింది. ఇటువంటి శిక్షలకు భయపడి విద్యార్థులు ఎన్నికల్లో కూడా పాల్గొనట్లేదు. సంక్షోభ పరిస్థితుల్లో విద్యార్థులకి ప్రాతినిధ్యం వహించే యూనియన్ లేకుండా పోయింది. దీని బదులు విద్యార్థుల రక్షణ పేరుతో యూనివర్సిటి ప్రాంగణం అంతా, హాస్టళ్ళతో సహా సి సి టీివి కెమేరాలు పెట్టారు. ఇవి విద్యార్థుల చర్యలపై నిఘా కోసం ఉపయోగపడుతున్నాయి.
యూనివర్సిటి అధికారులు స్త్రీ పురుష సమానత్వం, జెండర్ గురించి అవగాహన పెంచే కార్యక్రమాల బదులు కేవలం పరిమితులు విధించటం, పోలీసులను పెట్టటమే జరిగిన విషాద సంఘటనకు పరిష్కారాలుగా చూస్తున్నారు. ఈ రకమైన నిఘా, విభజన, అడ్డంకులు సాక్ష్యం నివేదిక సిఫార్సులకు వ్యతిరేకం. ”యూనివర్సిటిలో రక్షణ కోసం అధికార విధానాలు విద్యార్థులపై నిఘా పెంచటం, ఎక్కువగా పర్యవేక్షణ, పోలీసుల వినియోగం ఎక్కువ చెయ్యకూడదు. కాంపస్‌లో స్వేచ్ఛగా మనగలిగే అవకాశం విద్యార్థులందరికీ, ముఖ్యంగా విద్యార్థినులకు ఉండాలి.”
ప్రజాస్వామిక కార్యక్రమాలపై ఉక్కు పాదం :
యూనివర్సిటి అధికారుల వైఖరి గమనించిన యూనివర్సిటి కమ్యూనిటి ఈ విషయాల పట్ల అవగాహన పెంచే పని తమ నెత్తినే వేసుకున్నారు. వివిధ విద్యార్థి సంఘాలు, అధ్యాపక సంఘం, పూర్వ విద్యార్థుల సంఘం పత్రికా ప్రకటనలు ఇచ్చాయి. విద్యార్థులు ఒక పోస్టర్ ప్రచార కార్యక్రమం చేపట్టి అనేక పోస్టర్లు పెడితే రాత్రికి రాత్రి వాటిని తీసేయించారు. సరే పోనిమ్మని విద్యార్థులు వీధి నాటిక వేస్తే దానిపై నిషేధం విధించారు. కవిత్వ పఠనం చేస్తున్న విద్యార్థులని అడ్డుకున్నారు. యు.జి.సి విద్యార్థులకి వారు కూడా పౌరులే కాబట్టి భావ స్వేచ్చ, మాట్లాడే స్వేచ్చ వుండాలని నిర్ణయిస్తే, ఇఫ్లూ మాత్రం ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని నోటిసులు జారీ చేస్తుంది.
కొంత మంది అధ్యాపకులు ‘ఓపన్ హౌస్’ కార్యక్రమం నిర్వహించారని మేము విన్నాం. విద్యార్థులు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు చాలా చెప్పారు. యూనివర్సిటి పాలనలో పైస్థాయిలో వున్న అనేక మందిలో స్త్రీ ద్వేష భావాలు వున్నాయనే విషయాన్ని బయటికి తీసుకొచ్చారు. ప్రాక్టార్ ఆఫీసు, హాస్టల్ పాలనఅధికారులకు రోజు వారీ విషయాలలో విద్యార్థులతో కనీస మానవ హక్కుల గురించి, స్త్రీల హక్కుల గురించి అవగాహన లేకుండా వ్యవహరిస్తారని చెప్పారు. మరి కొంత మంది విద్యార్థులు హాస్టల్ పాలనా వ్యవస్థలో పై స్థాయిలో వున్న అధికారి విద్యార్థులని ఉద్దేశించి స్త్రీలని కించపరిచే భాష, బూతులు, తిట్లు వాడతారని కూడా చెప్పారు.
అంతే కాదు, ఇంకొక విస్మయం కలిగించే విషయం, ఓపెన్ హౌస్ జరిగిన తరువాత ”తమంతట తాము అవతరించి సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టే అన్ని వేదికల” పైన నిషేధం విధిస్తూ ఒక నోటీసు వెలువడింది. ఇదే నోటీిసు కాంపస్‌లో అన్ని రాజకీయ సంస్థలనూ నిషేదించింది. ఇది యు.జి.సి నియమాలకి పూర్తి విరుద్ధం. ”కాలేజీలు, యూనివర్సిటీలు బహిరంగ చర్చలను, స్వేచ్చాయుత ఆలోచనల పై చర్చలకూ ఎక్కువ చోటు కల్పించాలి ఎందుకంటే అవి విమర్శనాత్మక ద్రుష్టి కోణాన్ని, ప్రశ్నించే సంస్కృతినీ ప్రోత్సాహిస్తాయి. ఏ చట్టాలని ఉల్లంఘించని ప్రసంగాలు, సెమినార్లు, చర్చలపై యూనివర్సిటి అధికారులు అసంబద్ధమయిన, ఏక పక్షమైన, నిరంకుశ అడ్డంకులు విధించకూడదు”.
ఇఫ్లూలో వ్యక్తుల ప్రాథమిక హక్కులకు ప్రతి స్థాయిలో భంగం వాటిల్లుతోందనే విషయం తేటతెల్లంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్త్రీల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు, మేధావులు అందరమూ ఇఫ్లూ కమ్యూనిటితో గొంతు కలిపి అక్కడ జెండర్ పట్ల అవగాహనకు, ప్రజాస్వామ్య హక్కుల పునరుద్దరణకు ఈ క్రింది డిమాండ్లను ముందు పెడుతున్నాం.
డిమాండ్లు :
1. యూనివర్సిటిలో దాడికి గురైన యువతికి కోర్టులో పోరాడటానికి అవసరమైన చట్ట పరమైన, వైద్య పరమైన, ఇతర అన్ని రకాల మద్దతు అందించాలి.2. పోలీసులు నిష్పాక్షికంగా ఈ సామూహిక లైంగిక దాడిపై నిర్భయ చట్టం ప్రకారం విచారణ జరిపి రాజకీయ పార్టీల ప్రమేయాన్ని బహిర్గతం చెయ్యాలి.3. విద్యార్థుల కార్యక్రమాలని అడ్డుకోవటానికి, రోజు వారి యునివర్సిటి కార్యకలాపాలకి పోలీసులను పిలవటం మానెయ్యాలి. చట్ట ప్రకారం ఏర్పరచాల్సిన డిసిప్లినరి, ఫిర్యాదుల కమిటి, విద్యార్థుల వెల్పేర్, మరియు ఇతర కమిటీలు ఏర్పరిచి సమస్యల పరిష్కారానికి మార్గం సులువు చెయ్యాలి. అన్ని అధికార నిర్ణయాలు, యూనివర్సిటినియమాలను ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకతతో తీసుకోవాలి. అన్ని కమిటీలను పూర్తి స్థాయిలో, చట్ట ప్రకారం ఏర్పాటు చెయ్యాలి. వాటిలో ఎన్నుకోబడిన విద్యార్థులు, అధ్యాపకులు వుండాలి. అలా ఏర్పాటు చెయ్యాల్సిన కమిటీలు: జీ ఎస్ కాష్, హాస్టల్ సలహా కమిటీ, విద్యార్థులు- అధ్యాపకుల కమిటీలు, విద్యార్థుల గ్రీవెన్సు కమిటీ, విద్యార్థి సంఘ ఎన్నికలను వెంటనే జరిపించాలి. 4. భావ, ఆలోచన స్వేచ్చను హరించే అన్ని రకాల నోటీసులను నోటిమాటతో జరిపిన నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. కాంపస్‌లో కళాత్మకమైన, సాంస్కృతిక పరమైన సంభాషణలు, సమీకరణాలను చేసే హక్కు విద్యార్థులకి, అధ్యాపకులకి వుందని గుర్తించాలి. ఆ హక్కుని గౌరవించాలి. 5. యు.జి.సి. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు లైంగిక వేధింపులు, కుల వివక్ష, ప్రజాస్వామిక హక్కులపై ఇచ్చిన నియమాలన్నీ వెంటనే అమలు చెయ్యాలి. 6. మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇఫ్లూ కాంపస్‌లోని అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలు, యు.జి.సి మరియు మంత్రిత్వ శాఖ చేసిన నియమాలను వి.సి. ఉల్లంఘించిన తీరుపై తక్షణమే ఒక విచారణ కమిటి వెయ్యాలి.