జాతీయస్థాయి పార్ట్‌నర్స్ మీటింగ్‌లో పాల్గొనడం కోసం ఇటీవల కోయంబత్తూర్ వెళ్ళాను. నాతో పాటు భూమిక ప్రెసిడెంట్ ప్రశాంతి కూడా వుంది. రెండు రోజుల పాటు వివిధ అంశాల మీద చర్చలు జరిగాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న అనేక కార్యక్రమాలు, నూతన ప్రయత్నాల మీద పవర్‌పాయింట్ ప్రజంటేషన్స్ ఇచ్చారు. కొన్ని ప్రయత్నాలు చాలా స్ఫూర్తిదాయకంగా కూడా వున్నాయి. నేను వీటి గురించి వివరంగా ఇప్పుడు రాయడం లేదు. మరోసారి అవకాశం వచ్చినపుడు తప్పకుండా రాస్తాను.
మొదటి రోజు కార్యక్రమాలు పూర్తయ్యాక ‘హంగర్’ పేరుతో ‘ఆకలి’ మీద ఒక డాక్యుమెంటరీ ఫిలిం చూపించారు. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలలో వ్యాపించి వున్న ‘ఆకలి’ మీద ఈ డాక్యుమెంటరీ తీసారు. సాయంత్రం డాక్యుమెంటరీ వుంటుందని, ఆసక్తి వున్న ప్రతినిధులు తమ పేరు రాయాలని నిర్వాహకులు కోరినపుడు నేను డాక్యుమెంటరీ టైటిల్ చూసి ”హమ్మో! నావల్ల కాదు ప్రశాంతి! నేను చూడలేను. ఆ ఇమేజెస్ చూసి నేను తట్టుకోలేను” అన్నాను. ”ఫర్వాలేదులే… నువ్వు చూడగలవు. చూద్దాం” అంది ప్రశాంతి. ”చూడగలను కానీ తట్టుకోవడం కష్టం. సరే పద వెళదాం” అని వెళ్ళి హాల్‌లో కూర్చున్నాం. సినిమా మొదలైంది. ‘ఆకలి’ విశ్వరూపం…. ఎముకల పోగులు… మన జార్ఖండ్‌లోని ఆకలి కేకలు…. నీటి ఎద్దడి…. నీళ్ళు లేక… పంటలు లేక, పనిలేక ఆకలి చావులు… సోమాలియా దేశప్రజల ఎముకల గూళ్ళను ఇంతకు ముందు చూసి గుండె చెదిరిపోయి వున్నాం. ఈ డాక్యుమెంటరీలో కెన్యా, హైతీల్లో ప్రజల ఆకలి.. మట్టిని వస్త్రగాలం పట్టి ఆ మెత్తటి మట్టిలో కొంచెం చక్కెర కలిపి చేసిన మట్టికేక్స్‌ని గంపల్లో భద్రపరుచుకునే దృశ్యాలు చూసి కడుపులోంచి తెములుకొచ్చిన దు:ఖం… కేకులు చేసుకుంటున్న ఆమట్టిని, ఆ నీటిని కూడా కొనుక్కుంటున్న దుస్థితి. నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆకలి బీభత్స, భయానక రూపం చూసి విచలితనైపోయాను.
హైతీలోనే కాదు మనదేశంలో కూడా ఆకలి కరాళ నృత్యం వుంది. మన దేశంలో మనం వనరుల్ని ముఖ్యంగా నీళ్ళను దుర్వినియోగం చేసే పద్ధతి గమనిస్తే ఆఫ్రికన్ దేశాల దారుణదుర్భిక్ష పరిస్థితులు మనల్ని చుట్టుముట్టే రోజులు దగ్గరలోనే వున్నాయనిపిస్తుంది. ఇప్పటికే ఒడిసాలోని ‘కలహండి’ జిల్లాలో ఆకలి మరణాలు నిత్యకృత్యాలు, కరువు పీడిత అనంతపూర్, మహబూబ్‌నగర్‌లలో ఆకలిచావులు చూసాం. కడుపు నిండిన నేను కన్నీళ్ళలో కలం ముంచి ఆకలి గురించి రాయగలను కానీ… ఆకలి అంటే ఏంటి? కడుపులో పేగులు లుంగచుట్టుకుపోవడం అంటే ఏంటి… ఆకలి చావంటే ఏంటో అర్థం చేసుకోగలను కానీ… అనుభవించలేను. ఎందుకంటే ఆకలేస్తే తినడానికి అన్నీ అందుబాటులో వుంటాయి. మట్టి కేకులు తినడమంటే ఏంటో హైతీ ప్రజలే చెప్పగలరు. ఆకలేసినపుడు తినడానికి ఏమీ లేకపోవడమంటే ఏంటో మనకి ఎప్పటికీ అనుభవంలోకి రాదు. మనం ఆకలి గురించి కన్నా రుచుల గురించి ఎక్కువ మాట్లాడతాం.
కడుపు నిండిన వాళ్ళు మాట్లాడేది రుచుల గురించి. అన్నీ అందుబాటులో వున్నవాళ్ళు కొత్త కొత్త రుచుల కోసం అర్రులు చాస్తుంటారు. ఆహారమే దొరకని వాళ్ళకి రుచులతో పనిలేదు. రుచుల స్పృహ అవసరం లేదు. మన తిండిని మన నాలుకమీది ‘టేస్ట్ బడ్స్’ నిర్ణయిస్తాయి. మనుష్యులు…. ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వయసు వారైనా స్త్రీలైనా పురుషులైనా… ఎవరైనా సరే… తపించేది…తినాలనుకునేది ‘టేస్ట్‌బడ్స్’ని శాంతింపచేసే తిండినే. రుచికరమైన, భిన్న రుచులతో నిండిన తిండి కోసం తాపత్రయం… రుచులు గతి తప్పితే కోపాలు, అలకలు ఆఖరికి హింసకూడా అమలవుతుంది. కూరల్లో ఉప్పూ కారం సమపాళ్ళలో పడలేదని భార్యల్ని కొట్టే పురుషులు అన్ని దేశాల్లోనూ వున్నారు.
ఎంత విచిత్రం…. ఎంత అమానుషం… ఎంత బీభత్సం….. ప్రపంచంలో ఎక్కువ భాగం టేస్ట్‌బడ్స్‌ని తృప్తిపరచడం కోసం తపిస్తే…. ఎన్నో లక్షల మంది మనుష్యులు తిండి లేని స్థితిని… ఆకలిని అహరహం అనుభవిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలుగా పిలువబడే దేశాలు వ్యర్థపరిచే ఆహారం వేల టన్నుల్లో వుంటుందంటారు. రుచుల కోసం వెంపర్లాడే ప్రపంచం, ఏ రుచులూ తెలియని మట్టి కేకులతో కడుపు నింపుకునే ఆకలి ప్రపంచం వేపు కళ్ళు విప్పి చూసి, చెవులార ఆలకించి, గుండెను తెరిచి సహానుభూతిని వ్యక్తం చెయ్యగలిగితే…. తమ తిండి యావను తగ్గించుకుని కొంతైనా ఆకలి ప్రపంచానికి అందించగలిగితే ప్రపంచంలో ఆకలి చావులుండవు. ఇలా ఆశించడం మహా అత్యాశ…. అందమైన కల…..
Don’t Concentrate on Tastebuds…. Concentrate on Hunger all over the World.
ఈ నినాదాన్ని ఎలుగెత్తుదామా…ఈ దిశగా మన మాటతో, మన పాటతో, మన అక్షరంతో ఉద్యమిద్దామా….