గుండెకోత- రుక్మిణిగోపాల్‌

ఈ కథాకాలం ఇంకా పూర్తిగా ఆధునికతను అలవరచుకోని సమాజమునాటిది. ఆ రోజు పన్నెండవరోజు. సనాతనాచారాలు పాటించే బ్రహ్మణ కుటుంబం అవటం వల్ల కర్మకాండ అంతా యధావిధిగా జరిగింది. ఆచార ప్రకారం వచ్చిన బంధువులందరు వాళ్ళకు తోచిన ఓదార్పు వ్యాక్యాలు పలికి ఎక్కడివారక్కడికి వెళ్లిపోయారు. బాగా దగ్గర బంధువులైన కొద్దిమంది ఆత్మీయులు మాత్రమే మిగిలారు. రాత్రి అయింది. పగలంతా పనిచేసి ఉండటం వల్ల త్వరగా భోజనాలు ముగించుకుని అందరు నిద్రలోకి జారుతున్నారు. లక్ష్మమ్మకు మాత్రం నిద్రరాలేదు. నిద్ర ఎలా వస్తుంది! ఆమె కళ్ల ముందరే ఆమె కూతురి బతుకు బుగ్గి అయిపోయింది. కూతురైన రాధకు భరించలేని ఘోరమైన వైధవ్యం ప్రాప్తించింది. వయసు చూడొస్తే ఇరువై రెండు సంవత్సరాలు కంటె ఎక్కువలేదు. అప్పుడే దేవుడు దాని మొహాన అన్నీ ఒడిగిన ముసలి దానివలె బతకమని వ్రాశాడు. లక్ష్మమ్మ పక్కనే పడుకున్న రాధమీద చెయ్యి వేసింది. దాని శరీరంలో కలిగిన చిన్న కదలిక వల్ల అది కూడా ఇంక నిద్రపోలేదని తెలిసింది. ‘అవును, నిద్ర ఎలాపడుతుంది? చూస్తున్న తనే భరించలేకపోతోంది. ఇంక అనుభవిస్తున్న దాని మనోభావాలు ఎలా ఉంటాయో తను ఊహించుకోగలదు.’ ఈ పది, పన్నెండు రోజులు ఇంత సావకాశంగా ఆలోచించుకునే అవకాశం ఆమెకు లభించలేదు. ఇంటినిండా చుట్టాలు, రోజూ పరామర్శకు వచ్చే ఊళ్లో వాళ్లు, అందరిదగ్గరా కూతురికి కలిగిన దురదృష్టాన్ని  తలచుకుంటూ ఏడవటం, వీటన్నిటితో మనసుకు ఓ అలసటలాంటిది. కలిగి ఆలోచనలు అంత ఎక్కువగా రాలేదు. ఇప్పుడు ‘ఖాళీగా ఉన్నావు కదా’ అన్నట్లు ఆలోచనలు అన్నీ వచ్చి చుట్టుముట్టాయి. రాధ పెళ్లి నాటి నుంచి గుర్తుకు రాసాగింది. ‘రాధకు పెళ్లి కొద్దిగా ఆలస్యమైంది. పెద్ద కూతురు రమణికి పదహారు ఏళ్లకే పెళ్లి చేసేశారు. ఇప్పుడు అది ఇద్దరు పిల్లల తల్లి. రాధకు అన్ని విధాలా సంతృప్తికరమైన సంబంధం కుదరటానికి కొంచెం ఆలస్యమైంది. తను కొంచెం బెంగపెట్టుకుంది కూడాను. పెళ్లి నాటికి దానికి పద్దెనమిది సంవత్సరాలు నిండాయి. అల్లుడు బి.ఏ.ఎల్‌.ఎల్‌.బి. చేశాడు. తండ్రి లేడు, తల్లి ఉంది. ముగ్గురన్నదమ్ములతో ఇతడు మధ్యవాడు. వాళ్లది పల్లెటూరు. అన్నగారు వ్యవసాయం చూసుకుంటూ అక్కడే ఉంటాడు. ఆ చుట్టు పక్కల ముసబు కోర్టు ఉన్న ఊరులేనందున అల్లుడు చిన్న పట్టణమైన ఈ ఊర్లోనే ప్రాక్టీసు పెట్టవలసి వచ్చింది. తమకు మగ సంతానం లేదు. అందుచేత తను, భర్తా కూడా చాలా సంతోషించారు. పరిస్థితులను బట్టి అతని వేపు వారు కొడుకు  అత్తారింట్లో ఉండటానికి అభ్యంతరం చెప్పలేదు. తల్లి పెద్దకొడుకు దగ్గరే ఉంటుంది. ఎప్పుడైనా వచ్చి నాలుగు రోజులుండి కొడుకుని చూసి వెడుతూ ఉంటుంది. తను, భర్త సంగతి సరిగా తెలియదు కాని, కొడుకులు లేరని కొంచెం బెంగపడేది. ఇప్పుడు అల్లుడు వచ్చి ఇంట్లో ఉండేసరికి తనకు చాలా సంతోషం కలిగింది. రాధకు పెళ్లయిన మూడవ ఏట కొడుకు కలిగాడు. తను సంబరపడిపోయింది. తనకు ఇదివరకే మనవలు కలిగారు. ఆ ఆనందాన్ని అనుభవించింది. కాని ఈ ఆనందంవేరు. రమణి పిల్లలు ఇక్కడ ఉండిపోయే వాళ్లు కాదుగా! ఇప్పుడు ఈ మనవడు ఎల్లకాలం తమ దగ్గరే ఉండిపోతాడు. అందుచేత తన ఆనందానికి పట్టు పగ్గాలు లేకపోయాయి. మొన్నీరుమధ్యే మనవడి మొదటి పుట్టిన రోజు ఘనంగా చేసుకున్నారు. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తోందని చెప్పవచ్చు, కాని ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు. ఓ రోజు కోర్టుకెళ్లిన అల్లుడు బండిమీద తిరిగి వచ్చాడు. ఇద్దరు ముగ్గురు తోటి వకీళ్లు కూడా వచ్చారు. కోర్టులో కేసు వాదిస్తుండగా గుండెలో నెప్పి వాదించలేకపోయాడట. దగ్గరలోనే ఉన్న ఇంకాస్త పెద్ద పట్టణానికి తీసుకెళ్లి ఓ పెద్ద డాక్టరు చూపించటం మంచిదని సలహా ఇచ్చారు. ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెమటలు పట్టి నెప్పితో కొంచెం బాధ పడుతున్న అల్లుణ్ణి మంచం మీద పదుకోబెట్టారు. ఒక వాంతి అయిపోయింది. వెంటనే తను అక్కడ శుభ్రం చేసింది. రాధ మంచం మీద కూర్చుని భర్తకు పట్టే చెమటను పవిట చెంగుతో తుడుస్తూ విసిన కర్రతో విసురుతోంది. ఆకస్మాత్తుగా నెప్పి ఎక్కువయిందో, ఏమో అల్లుడు ఓ పెద్ద కేక పెట్టాడు. తను పరుగెత్తి మంచం దగ్గరకు వెళ్లింది. అతని కళ్లు మూతలు పడ్డాయి. మెడ వాల్చేశాడు. అందరం కంగారుపడి ప్రస్తుతం ఊర్లో ఉన్న గవర్నమెంట్‌ హాస్పటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ డాక్టరు మనిషిని చూడగానే ప్రాణం పోయిందని చెప్పాడంట! కొడుకులు లేరనుకున్న తమకు కొడుకులాంటి అల్లుడు! చాల నెమ్మదస్థుడు అత్తమామలను అభిమానంతో చూసేవాడు. అలాంటి అల్లుడు పోవటం తక్కువ బాధా? కాని అంతకంటె కూడా తనను ఎక్కువగానే వేధిస్తున్న బాధ కూతురుని గురించిన ఆలోచన. ఇప్పుడు దాన్ని బతుకు ఎలా తెల్లవారుతుంది? ఈ వైధవ్య ద్ణుఖాన్ని అనుభవిస్తూ ఎంతకాలం బతకాలి? కూతురిని ఈ అవస్థలో చూస్తూ తాను ఎంతకాలం బతకాలి? ఈ ఆలోచనలో ఆమెకు తెలియకుండానే నిద్రపట్టేసింది.

మర్నాడు తెల్లవారింది. మంచి జరిగినా, చెడు జరిగినా రోజు ఆగదు గదా! దినచర్యలు తప్పవు. లక్ష్మమ్మ లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి వచ్చింది. స్నానం చేసి రాగానే ఆమె చేసే మొదటి పని బొట్టు పెట్టుకోటం. లక్ష్మమ్మ కొంచెం పెద్ద బొట్టే పెట్టుకుంటుంది. అందులో ఎక్కడా వంకర రాకుండా గుండ్రంగా దిద్దుకోటం ఆమెకలవాటు, బొట్టు పెట్టుకుని ఇటు తిరిగే సరికి అక్కడే కూర్చుని ఉన్న రాధ కనుపించింది. తన ముఖవంకే తదేకంగా చూస్తోంది. ఆ కళ్లల్లో అలాంటి అదృష్టానికి తాను దూరమైన బాధ లీలగా గోచరించింది. బొట్టులేని రాధ నుదురు ఆమె వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది. ఏదో తప్పుచేసిన దానిలా మొహందించుకుని అవతలకు వెళ్లిపోయింది లక్ష్మమ్మ. అప్పటి నుంచి ఆమె పట్టిపట్టి బొట్టుదిద్దుకోటం మానేసింది. ఆ మధ్యాహ్నం రెండిళ్ల అవతల ఉన్న వెంకాయమ్మగారు వచ్చారు. ఆమె వయసులో లక్ష్మమ్మ కంటె కొంచెం పెద్ద. అయినా ఇద్దరికీ బాగా పరిచయం. ఇల్లు దగ్గరే కాబట్టి తరచువస్తూ ఉంటుంది. ఆమె విధవరాలు, భర్తపోయి చాలా కాలమయిందట. మన సమాజంలో ఇలాంటి విధవరాళ్లను చూస్తూనే ఉంటాము. అందుచేత కొత్తగా జరిగిన సంఘటన అయితే మినహాయించి వాళ్లను చూసి బాధపడము. అల్లుడుపోయిన తర్వాత ఆమె అప్పుడే రెండు మూడు సార్లు వచ్చి వెళ్లారు. లక్ష్మమ్మ, వెంకాయమ్మగారు కబుర్లలో పడ్డారు. రాధ అక్కడే కూర్చుని ఉంది. సంభాషణ నెమ్మదిగా రాధ విషయంలోకి దారితీసింది. మాటల సందర్భంలో వెంకాయమ్మగారు రాధతో అన్నారు, ”రాధా, ఇంక నువ్వు జరిగిన దానిని గురించి మర్చిపోయేందుకు ప్రయత్నించాలి. దేవుని మీదకు మనసు మళ్లించుకో. మన లాంటివాళ్లకు మిగిలింది ఇంక భగవత్‌ చింతనే” అని. ‘మనలాంటివాళ్లకు’ అన్న ఆ మాట లక్ష్మమ్మ గెండెల్లో గునపంలా గుచ్చుకుంది. పైకి అనకపోయినా ‘అప్పుడే మీ బోటివాళ్లతో రాధను కలిపేసుకున్నారా’ అని ఆ మాతృహృదయం ఆక్రోశించింది. ఏనాటి నుంచో విధవరాలుగా ఉంటున్న వెంకాయమ్మ గారి వైధవ్యానికి ఆమె అలవాటుపడిపోయింది. కాని కొత్తగా కలిగిన కూతురి వైధవ్యాన్ని అప్పుడే అంగీకరించేందుకు ఆమె హృదయం ఇంకా సిద్ధంగా లేదు. రాధకు పూలంటే చాలా ఇష్టం. పెరట్లో మల్లెచెట్టు, జాజి పందిరి ఉన్నాయి. ఇంకా చేమంతులు, కనకాంబరాలు లాంటి పూల మొక్కలు కూడా ఉన్నాయి. మల్లెలు, జాజులు వాటి కాలంలో విరగబూస్తాయి. రాధ మాలలు కట్టి తల నిండా పెట్టుకునేది. లక్ష్మమ్మకు కూడా ఇచ్చేది. వాటి కాలం అయిపోయిన పూత తగ్గిపోయిన రోజులలో కూతురి మనస్సు తెలిసినది కనక ”నాకు ఒకటి రెండు పూలియ్యమ్మా, చాలు, మిగితావి నువ్వు మాల కట్టుకుని పెట్టుకో” అనేది లక్ష్మమ్మ. మల్లెలు, జాజులు లేకపోయినా ఏవో పూలు, ఆఖరికి నందిర్ధనం పూలైనాసరే, తలలో పెట్టుకోకుండా ఉండేది కాదు. తలలో పూలు లేకుండా రాధను లక్ష్మమ్మ ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుతం మల్లెపూలు తెగపూస్తున్నాయి. పెరట్లోకి వెళ్లినప్పుడు వాటిని చూస్తే లక్ష్మమ్మ గుండె బాధతో మెలికలు తిరిగిపోతోంది. ‘తనకే ఇలా ఉంటే వాటిని చూసి రాధ మనసు ఎంత బాధపడుతోందో! అని కూడా ఆమె బాధపడుతోంది. కూతురు మనసు ఎక్కడ బాధపడుతుందోం అని లక్ష్మమ్మ కూడా పూలు పెట్టుకోటం మానేసింది. ఇంట్లో పెద్దామె , అత్తగారు ఉన్నారు. ఆవిడ గమనించింది.  ఓ రోజు ”లక్ష్మీ,పుని స్త్రీ దానివి, పువ్వులు పెట్టుకోటం పూర్తిగా మానెయ్యకూడదు. నువ్వు పూలు ఎందుకు పెట్టుకోటం లేదో నాకు తెలుసు. దాని కర్మ అలా ఉంటే ఎవరేం చెయ్యగలరు? అది అలా అయిపోయనందుకు నాకు మాత్రం బాధ లేదనుకుంటున్నావా? అది నీకు కూతురైతే నాకు మనవరాలు. ‘ఇంత చిన్న వయసులోనే ఎంత దురదృష్టం వచ్చిందో’ అని నేను బాధపడని రోజు లేదు. కాని మనమేం చెయ్యగలం? ఎంత బాధపడ్డా దాని రాతను మార్చగలమా? గుండె రాయి చేసుకోవలిసిందే. ముత్తైదువుగా ఎవరైనా తాంబూలంలో ఇచ్చిన పూలు కూడా నువ్వు పెట్టుకోవటంలేదు. రోజూ పూజ చేసి పూలను ఒకటి రెండింటిని దైవ ప్రసాదంగా తలలో పెట్టుకునేదానివి. ఇప్పుడదీ మానేశావు. తప్పు, అలా చెయ్యకూడదు” అన్నారావిడ కొంచెం మందలింపుగా, ఆవిడ అన్న మాటలు నిజమే అనిపించినా రాధ ఎదురుగా పూలు పెట్టుకుని తిరగటానికి లక్ష్మమ్మ మనసు అంగీకరించటంలేదు. అందుచేత దేవుడికి పూజ చేసిన పూలలోంచి ఓ చిన్న పువ్వు తీసుకుని కళ్లకద్దుకుని పైకి కనపడకుండా తలలో కుక్కేసుకుంటోంది.

ఓ రోజు ఏదో శుభకార్యం నిమిత్తం పిలవటానికి ఎవరో వచ్చారు. ఆవిడ లక్ష్మమ్మకు బొట్టు పెట్టి చెప్పి ”ఇంక ఎవరైనా ఉన్నారండీ” అని అడిగింది. అలా అడగడం మామూలే! ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారమో, వాళ్లను కూడా పిలవాలని’ అలా అడుగుతారు. లక్ష్మమ్మ ఎవరూలేరని చెప్పింది. కాని రాధ గుర్తుకు వచ్చి ఆమె మనస్సు ఎంతో బాధపడింది. ఇంటికి ఎవరైనా వస్తున్నట్లయితే, లేక రాగానే అయినా రాధ లోపలకు వెళ్లిపోతుంది. అందు చేత రాధ ఆ సమయంలో అక్కడ లేదు. లక్ష్మమ్మ పేరంటాలకు వెళ్లటం మానేసింది. ‘పిల్ల మనసు ఎక్కడ బాధపడుతుందో’ అని. కాని పూర్వపు చాదస్తంగల అత్తగారికి నచ్చలేదు. ”పసుపు కుంకాల కోసం పది ఆమడలైనా వెళ్లాలి” అంటారు. పుని స్త్రీదానివి, పేరంటాలకు వెళ్లటం మాన కూడదమ్మా అందులో శ్రావణమాస పేరంటం అసలు మానకూడదు. పక్కింటివాళ్ల కోడలు పిలిచిందిగా, వెళ్లిరా”అంటూ ఓ రోజు ఆవిడ బలవంతం చేసింది. ‘ఆవిడ ఆవేదన ఆవిడది! ఇందులో ఆమెను తప్పుపట్టలేను. కొడుకు క్షేమాన్ని కోరుకునే తల్లిగా మాత్రమే ఆవిడను అర్థం చేసుకోవాలి’ అనుకుంది లక్ష్మమ్మ. భర్త బతికుండగా ఇలా చెయ్యటం తప్పని ఆమెకు తెలుసు. చివరకు మనసు రాయిచేసుకుని పక్కింటికి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి రాధ హాల్లో కూర్చుని ఉంది. చేతిలోని వాయినాన్ని బట్టి ఆమె ఎక్కడకు వెళ్లి వచ్చిందీ గ్రహించుకుంది. అప్రయత్నంగా ఆమె చూపులు తల్లి పాదాల మీదకు మళ్లాయి. రాసిన పసుపుతో పచ్చగా ఉన్న ఆ పాదాల వంక చూస్తూ ఉండిపోయింది. ఆ కళ్లల్లోని నైరాశ్యాన్ని లక్ష్మమ్మ చూచింది. అక్కడ నిలబడలేక గబగబా లోపలకు వెళ్లిపోయింది.

రోజులు గడుస్తున్నాయి. వేసవి సెలవులలో రమణి, పిల్ల వచ్చారు. ఏటా వచ్చి సెలవులన్ని రోజులు ఇక్కడ గడపటం రమణికలవాటే . ఆమె భర్త మాత్రం మధ్యలో ఒకసారి వచ్చి ఓ వారం రోజులుండి వెళ్లిపోతాడు. రమణి వచ్చిన తరువాత రాధ ముఖం కొంచెం తేటపడింది. రమణి కూడా చెల్లెల్ని వదలకుండా కూడాతిరిగేది. ఎప్పుడు ఇద్దరు అలాగే ఉంటారు. కాని ఇప్పుడు చెల్లెలికి వచ్చిన కష్టాన్ని మనసులో ఉంచుకుని రమణి చెల్లెల్ని అసలు వదలటంలేదు. ఏ పని చేసినా ఇద్దరు కలిసే చేస్తున్నారు రాత్రులు ఇద్దరు ఒకే చోట పడుకుంటున్నారు. ఓది పదిహేను, ఇరువైజుల తర్వాత రమణభర్త వచ్చాడు. ఎప్పుడు చేసేటట్లే ఓ గదిని వాళ్లకు కేటాయించారు. రాత్రి అయింది. రాధ దగ్గర లేకుండా చూసి రమణి లక్ష్మమ్మతో అంది”నాకేవిటో గదిలోకి వెళ్లి పడుకోవాలంటే మొహమాటంగా ఉందమ్మా, తన పరిస్థితిని తలుచుకుని రాధ ఏం బాధపడుతుందో అని బాధేస్తుంది” అని, ”ఏం చేస్తామమ్మా, ఇలాంటివి తప్పవు. బాధపడమనే దేవుడు దాని నుదట వ్రాశాడు. నువ్వు గదిలోకి వెళ్లి పడుకోకబోతే అతనికి కోపం రావచ్చు. అంచేత వెళ్లి పడుకోమ్మా” అని కూతురి నచ్చ చెప్పింది లక్ష్మమ్మ. నోటితో ఈ మాటలు అన్నదే కాని ఆమె మనసు ఎంతో బాధపడుతోంది. రోజూ తనతో పడుకునే అక్క ఇవాళ భర్త రాగానే గదిలోకి వెళ్లి పడుకుంటే దాని మాత్రం తెలియదా! అదేం చిన్నపిల్ల కాదుగా! కాని ఇలాంటి పరిస్థితులలో ఎవరు మాత్రం ఏం చెయ్యగలగుతారు? గుండెల్ని రాయి చేసుకోటం మినహాయించి” అనుకుంది. రాత్రి భోజనాలయి పడకల సమయం వచ్చింది. సాధ్యమైనంత వరకు రాధ కంటపడకుండా గదిలోకి వెళ్లాలని రమణ ప్రయత్నం, ఎందుకో రాధ పెరట్లోకి వెళ్లింది. ఇదే సమయమనుకుని మంచి నీళ్ల చెంబుతీసుకుని బయలుదేరింది. ఎందుచేతనో రాధ వెంటనే లోపలికి వచ్చేసింది. రమణి కళ్లు వాలిపోయాయి. అలాగే రాధ వంక చూడకుండా వెళ్లిపోయింది. అక్కడే ఉన్న లక్ష్మమ్మ రాధవంక చూసింది. గదిలోకి వెడుతున్న అక్కను తదేకంగా చూస్తూ నిలబడిపోయింది రాధ. ఆ కళ్లల్లో విపరీతమైదైన్యం స్పష్టంగా కనపడుతోంది. లక్ష్మమ్మ గుండె విలవిలలాడింది.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో