బూదేవక్కను పెడ్తానికి బూమిమిగల్లే – యం.రత్నమాల

మా పొలానికి పోవాల్నంటె బూదక్క తోటల్నించి బడిపోతే జరంత దూరం నడ్క తగ్గుతది. తోటల్నుంచి కాక బయట్నుంచి పోవాల్నంటే తోట పొడగునా నడిసి అటెంక చెర్వు కట్టెక్కి తూం దాటినాక అంతెత్తు కట్టదిగి కిందికి దిగి కాల్వ పొంటి సానాదూరం నడిస్తేనెగాని మా పొలం సెల్క దానెనుక కంచెకు నడిసి పోయెటల కల్ల

కాళ్లు జువ్వున గుంజుతయి. అరికాళ్లు పచ్చి పుండయితయి. తోట మద్దెన తొవ్వనించి అడ్డదారిన బడి పోతే జరంత దూరం తగ్గి జప్పున పోవచ్చు. బూదక్క పోయి యాడాద్దాటింది. ఇప్పుడు తోట బూదక్కదీ కాదు. బూదక్క బతికుండగానే కొడుకు పొలాలు, చెల్కలు కంచె ఆఖరుకు ఇరగ బూసిన పూల చెట్టు, రకరకాల నిమ్మ, మామిడి, అల్లనేరేడు, జామ, ఊసిరి చెట్లలతో వైబొగంగ ఉండె తోటను పట్నం బోయినంక తెగనమ్ముకున్నాడు. ఇప్పుడు బూదక్క లేదు. తోట మద్దెన ముద్ద మందార చెట్టు కిందున్న మానడిబ్బావ అదే మా బూదక్క పెనిమిటి సమాది లేదు. ఎర్రగన్నేరు కిందున్న మా అత్తమామల సమాదులూ లేవు. తను పోయినంక పెనిమిటి సమాది పక్కనె తన సమాదిని కట్టమని బతికున్నన్నాళ్లు కొడుకు చెవినిల్లు కట్టుకుని పోరిన మాట మర్సి, తప్ప లేదు కనుక తలకొరివైతే పెట్టిండుగాని బూదక్క కొడుకు తల్లి సమాది సంగతి ఊళ్లోళ్లు యాదికి తెచ్చిన గని మాట దాటేసి సమాది కట్టనేలె. తోటంటె పెద్ద తోటేం గాదు నాలుగు మావిండ్లు, రెండు సపోట, ఓ నిమ్మ, దానిమ్మ, చింత, శివచింత ఎర్ర గన్నేరు, ముద్దమం దారం, మాలతి, మల్లె తీగెలు కుడి పక్క కొనకు ఆక్కూరలు, వంకాయ, టమాట, బెండ, గోరు చిక్కుల్లు, ఎడంపక్క బీర, పొట్ల, అనప పందిల్లు పైమూలకు చిన్నుసిరి, పెద్దుసిరి, కరివేపాకు అడిగినోళ్ళ క్కాదనకుండా పెట్టే బూదక్కది నాది అత్తగారిల్లే కాదు అమ్మగారిల్లు ఒక్కటె. బూదక్క మా పెద్ద నాయినకి పెద్దబిడ్డ. నేను మా యింట్ల చిన్న బిడ్డని. బూదక్క నన్ను చిన్నప్పుడు నడుక నేర్వక ముందు సంకెనేసుకుని తిప్పింది నడుకొచ్చినంక చెయ్యిపట్టుకుని తిప్పింది. మా బూదక్కను ఈవూరిచ్చిన ఆరేళ్ళకు బూదక్క చిన్న మరిదికే నన్నిచ్చి పెండ్లి జేసిండ్రు. బూదక్క అసలు పేరు బూదేవి. సిన్నప్పుడు నాకు నోరు తిర్గక బూదక్క – బూదక్క అని పిలిసేదాన్నట అట్ల బూదేవక్క నాకే కాదు అందరికి ఊల్లె సిన్న పెద్ద అందరికి అక్కడా ఇక్కడా బూదక్కే అయ్యింది.

కట్టమీద నుంచి తూం పక్కనుంచి కిందికి దిగబొతుండంగ దూరంగ కన్పిస్తాన్న గట్టు మీన రాములోరి గుడికెయ్యి మర్లి కండ్లు మూసి దండంబెట్టుకున్న. మెడల ఎర్రమందారం దండతో రాములోరి ఇగ్రహం, మెడల ఎర్ర గన్నేరు దండ కొప్పున మల్లె మొగ్గల దండతో సీతమ్మోరు కండ్లల్ల మొదులాడింది. బూదక్కతోనే సీతమ్మకి రాములోరికి నిత్తెపూల వైబోగం పోయింది. ఇప్పుడు దేవుళ్ల మెడలల్ల చెమ్కీ మెరుపు కాయితం దండలు. ఏం జూసిన, యాడ దిరిగిన బూదక్క యాదే. కట్టదిగి తూమ్మీద కుసుండి కాళ్ళు కాల్వల నీల్లల కిడిసి దొసిట్ల నీళ్ళు దీస్కొని మొఖాన నాల్గు దోసిళ్ళ సల్ల నీళ్ళు కొట్టుకు నడిసొచ్చిన అలుపుదీరి పాణం కుదుటబడింది. కాల్వల నీళ్ళు రెండు దొసిట్లా నొట్లె బోసుకున్నంక కడుపుల పేగులు సల్లబడి కాల్లకు సత్తువొచ్చింది లేసి కాల్వగట్టు మీదికెళ్ళి నడుస్తుంటె కాల్వ పొంటి అటిటూన్న పొలాల మీంచి రయ్యనొచ్చి తలిగిన సల్లటి గాలికి బూదక్క మనసంతటి ప్రేమతో ఒల్లంత నిమిరినట్లనిపిచ్చింది. బూదక్కకి తలకొరివి పెట్టి అప్పటికే పొలం, చెల్క అంత కలిపి నలభై నాలుగెకురాలు జాయిదాదు లంకంత ఇల్లు ఇంటి సుట్టూత ఉన్న అరెకరం జాగతొ సహా తెగనమ్ముకున్న కొడుకు తల్లికి తలకొరివి పెట్టి తొమ్మిదొద్దుల్ల బూడిద చెర్ల కలిపి తల్లిని, పుట్టి పెరిగిన ఊరిని ఎన్నడయిన తల్చుకుంటడో లేదోగాని ఊరోళ్లెన్నడు బూదక్క యాదిమర్సలే. రేగుపండ్లు కొంటున్నా, జాంపండ్లు తింటూన్న అడిగినోళ్ళకి కాదనకుంటా దోసిళ్ళతో ఇచ్చె బూదక్కే యాదికొచ్చెది. నామట్టుకు నాకు బూదక్క యాదికి రాని రోజులేదు. సుట్టరికానికి తనకు మరిది పెండ్లాన్నె అయినా వరుసకు యారాల్నెయినా సిన్నాయిన బిడ్డననే సిన్ననాడు ఎత్తుకుని తిప్పిన పావురంతో సొంత చెల్లెకంటె ఎక్కువ అర్సుకున్న ఆత్మగల్ల తల్లి బూదక్క యాది మర్సితే మరుపొచ్చెదా. మరీ తోట ముందటికొస్తె సచ్చె ముందట బూదక్క కొడుకింట్ల పడ్డ గోస, రవుసు యాదికచ్చి కడుపుల పేగులు కలికలయి కదుల్తయి. మన్నుల మన్నయ్యి సెల్కల సెట్టయ్యి చారెడు జాగయిన అమ్ముకోకుంట బూదక్క కాపాడిన జాయిదాదును అమ్ముక పోయి పట్నంల వైబోగం ఎలగబెట్టి బతుకుతున్న కొడుకు తల్లికి తలకొరివి బెట్టిండు బస్‌ అంతే యాడాది మాసికం అన్న జెయ్యలేడంటె లోకం పోకడ దినానికెంత దిగజారి పొతుందో మనిషికి మనిషేం కాకుంట ఎట్లపోతున్నరో తల్సుకుంటె మదిల గోసయితది. పెనిమిటి పోయిన ఒంటరిది ఎంజేస్తదిలే అన్న ధీమంతంలో మా పెద్ద బావ పెట్టిన దాష్ఠికాన్ని అరిగోసను తట్టుకుని ఊళ్ళెందరి కంటె పెద్ద జాయిదాదాను పెనిమిటి పోయినప్పుడు నాలుగేళ్ళున్న పోరి ఎడ బిడ్డను, రెండేళ్ళ సంటి పోరన్ని ఉన్నంతలో గావురంగ ఎవలికి చెయి జాసకుంటా పెంచి పెంచి పెద్దజేసి రంగరంగ వైబోగంగ పెళ్ళిళ్లు, పేరంటాలు ఒంటిచెత్తో ఎట్ల కానిచ్చిందో పైనున్నోడికే కాదు ఊళ్లె సిన్న పెద్ద ఊళ్ళందరికెరుకనే.

ఒక్కగానొక్క బిడ్డ లేకలేక పుట్టిన కొడుకు ముద్దు ముచ్చట్లూ సూడకుంటనే అన్నదమ్ముల గెట్టు కొట్లాటలల్ల బూదక్క పెనిమిటిని అదె మానడిబ్బావను మా పెద్ద బావె సంపించిండంటరు ఊరోళ్ళందరు. పైనకి జూడ గెట్లు కొట్టాటలోలె కన్పడ్డా మాలమాదిగల బతుకులు బాగజెయ్యడానికి మానడిబ్బావ చెసిన పన్లె మా పెద్ద బావ కంట్లె మానడిబ్బావ నలుసైండని అందరంటారు. ఆ దినం ఎప్పటొల్ల్నె ఊరికి దూరంలో చింతల తోపవుతాలున్న మాలమాదిగల గూడెంబయట రాగిసెట్టు గద్దెకాడికి రాత్రిబడి జెప్పెటందుకు బోయి తిరిగొస్తున్న నడిబ్బావ నెత్తుడిమడుగై ఊపిరిడిసిండు. నాలుగేళ్ళ ఎడపోరిని ఎంటెసుకుని రెండేళ్ళ సంటి పొరన్ని సంకనేసుకుని ఉరికచ్చిన బూదక్క నెత్తుటి ముద్దయిన పెనిమిటి శవంమీద పడి ఎడ్చి ఏడ్సి సొమ్మసిల్లింది మళ్ళ లేస్తదనుకొనేలే. రక్తం మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటున్న తండ్రిని ఉలుకు పలుకూ లేక పెనిమిటి శవంమీద పడిపోయిన తల్లిని చూసిన పిల్లల ఏడుపు బూదక్కని చెవుల తాకి లేపింది. అంత శోకంలోనూ బూదక్కన్న మాట వర్సలేంది మళ్లమల్ల యాదికొచ్చెటంత తిరుగులేంది. ఊళ్ళెందరు ఇప్పటికీ పతే పతే యాజ్జేసుకునే నిఖార్సయిన నిజం. ”ఆయన్ని సావగొట్టి ఆయన తలపెట్టిన పన్లు సాగనీయం అనుకుంటూన్నళ్ళకిదే సెప్తున్న ఆయన నెత్తుటి మట్టిమీద ఆన నెత్తుటి ముద్దయిన ఆయన పెయిమీద ఆన సెవొగ్గి ఇనుకొండ్రి కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఆయన పాణం మీద ఒట్టేసి సెప్తున్న ఆయన తలపెట్టిన యన్ని పొల్లుపోకుండ నేను జేసి తీరుత అన్నది. అనడమే కాదు ఆమాట అచ్చరాల జేసి సూపింది. నాలుగేళ్ళ వయసున్న ఆడపిల్లలకి పదారునిండి పెద్దమనిషి కాంగనే జానెడు జాగయిన అమ్మకుంట యవుసాయం మీద జవేసిన సొమ్ములోనే వైబొగంగా పెండ్లి జేసి పంపింది. కొడుకు సక్కంగ సదవలేదు కాని సదివినంత కాలం పట్నంల మంచి వైబోగంగ అడిగినంత పైస బెట్టి సదివిచ్చింది. పట్నంల కొడుకు సదువైతె సక్కంక నెర్వలె గని సరదాలు జల్సాలు నేర్చుకొని పదొతరగతి పాసుగాకుంటనె పల్లె కౖౖెతే తిరిగొచ్చిండుగని, పట్నం మీద మోజు బడి పని పాటు చెయ్యకుంట పట్నానికి పల్లెకి పరుగులు పెట్టడం మానలే. రెండూర్లు దాటి నడిసి పోయి బస్సెక్కి పట్నం బొవుడు కష్టమైతుందని ఆపసొపాలు పడి నానా ఆగడం చేసి బూదక్క మీద ఎదురు తిరిగి లొల్లిపెట్టి మోటారు సైకిలు కొనుక్కున్నడు. మోటారు బండి లేక మునుపు వారానికొపాలి పట్నం పొయ్యెచ్చెటొడు వారానికి నాల్రోజులు పట్నం బొవుడు షురూ చేసిండు. పెండ్లి జెస్తె నన్న ఇంటి పట్టునుండక పోతడా అని కొడుక్కు నచ్చిన పక్కూరి పిల్లనే మాట్లాడి పెండ్లిజేసింది. ఎదిగొచ్చిన కొడుకు యవుసాయం సంగతి సూడకపోతె మానే పెండ్లాం కోసమయినా ఇంటి పట్టు నుంటడనుకుంటే మూడేండ్లల్ల ఇద్దరి పొల్లగాండ్లను గని ఏకంగ పట్నంల్నే కాపురం పెట్టిండు. బూదక్క పని రెట్టింపయింది. యవుసాయంతో పాటు పట్నంల కొడుకు కాపురానికి బియ్యం, పప్పు, పసుపు కారంతో సహా పిల్లగాండ్ల మీద పావురంతో వాండ్ల గొసం అప్పలు, చిరుతిల్లను చేసి పంపుడు మరింత పని పెరిగింది. పట్నం ఎక్కిన కొడుకు ఆ కర్సనీ ఈ కర్సని యాడాది కో ఎకరమొ రెండెకరాలో బూమి అమ్ముకుంట పైసలు పట్టుకపోవడానికి మాత్రం ఇంటికొచ్చి పొయ్యెటాడు తప్ప పండుగలకి పబ్బాలకి బూదక్క పిల్లల మీది పావురంతో చేసిన అప్పలు, అరినెలు అన్ని చేసి పంపటం తప్ప కొడుకు కోడలుఎన్నడు ఇంత ఆసరయింది లేదు. బూమక్కకి ఒంటరి కష్టం ఎన్నడు తీరలేదు.

కండ్లముందె కొడుకు ఉన్నదంత అమ్ముకుండు. బూదక్క నలబై ఎకరాల పొలం నాలుగెకరాలకు మిగిలిందని బూమక్క కుమిలి కుమిలి పోని రోజు లేదు. పసి పిల్లల్ని పెట్టుకుని పాలోల్ల పగలు తట్టుకుంటూ నలభైనాలుగెకరాల జాయిజాదును కుంటెడు చారెడు చెక్కయిన చెయి జారిపోకుండా నిలబెట్టుకొవడానికి బూమక్క పడ్డ కష్టం బూదేవంత ఓర్పు ఊళ్ళె అందరికి ఎరికె, బూదక్క పెనిమిటి పోయినంకే మా పెదబావ బూదక్క పొలంలకి దౌర్జన్యంగ నాగండ్లు తోలి దున్నిస్తుంటె బూదక్క పెనిమిటి పోయిన దు:ఖంలో ఉండి కూడ దైర్యంగా పెదబావ ధాష్టికం మీద తిరగబడ్డ తీరు ఊరి జనం ఇప్పటికి గొప్పగ చెప్పుకుంటరు. ఆరోజు పొద్దున్నె ఇంటి ముంగట్ల సాన్పి సల్లి ముగ్గేద్దామని వాకిట్లకొచ్చిన చెంబుల సాన్పి నీళ్లు సల్ల డానికి చెయ్యెత్తంగ దూరంగ దూరంగ శోకం బెడ్తున్న బూదక్క గొంతు ఇన్పించి నాలగడుగులు వాకిలి దాటి బాటెక్కిన. నిక్కచ్చిగ అది బూదక్క గొంతే పోయిన పెనిమిట్ని తల్సుకొని శోకం బెడ్తుంది. బూదక్క తోట దిక్కు అడుగేసిన. బూదక్క పెనిమిటి సమాది దిక్కు నించి బూదక్క గొంతు జీరగా సమాది వైపు అడులేసిన కుసింత దూరంగుండంగనే సమాది ముందు బూదక్క. అయితే బూదక్కను రేగడి మట్టిలో బొమ్మ చేసి పెట్టినట్టు సమాది ముందట నిలబడి ఉంది. రెగడి మట్టి బొమ్మ పచ్చిగ నేల మీద రెగడి బురద కారుతుంది. ఎందిది ఎంటనె సమజుకాలె గని తేరుకుని గబుక్కున ఉరికి పట్టుకున్న బూదక్కె గాని, రెగడి బురదల ముంచి తీసినట్టుంది. సమజయింది నాగండ్ల కడ్డంబడి మర్ల వడ్దందుకు రెగడి బురద పొలంల పడేసి కొట్టిండ్రని. పెద్దబావ పీనిగెళ్ళ పెనిమిటి పోయిన దు:ఖంలున్నది సొయంగ తమ్ముడి బార్య అన్న ఇంగితం గూడ లేకుండ జీతగాండ్ల తోని ఇంతపని జేయిస్తడా పొలంలేసి తొక్కిస్తడా ఆని తలపండు బగుల అనుకుంట బూదక్కను పట్టుకు మా ఇంటికి తీస్కపోయ్యి ఉడుకు కుడుకు నీళ్లు బోసిన ఇంతట్లకి ఊళ్ళె జనానికి తెల్సి అందరొచ్చి మా పెద్దబావ ఇంటిమీద పడి తలో మాటని బుద్ది జెప్పి వచ్చిండ్రు. నేను ఇంతట్ల బలవంతం జేసి బూదక్క తొని నాలుగు ముద్దలు తినిపిచ్చి యింటి ముంగట ఆడుకుంటున్న పిల్లలిద్దరిని తొలుకొచ్చి వాళ్ళకింత బెట్టి అందరం కల్సి బూదక్కను ఆళ్లింటికి తోల్కపోయి సానా రాత్రి దాక తోడుండి వచ్చినం. పెనిమిటున్నంత కాలం ఆయన సాట్న బతికిన బూదక్క పట్నంల కోర్టు మెట్టెక్కింది. పెనిమిటిని సంపినోళ్ళకి శిక్షపడేదాక కోర్టులల్ల కొట్లాడింది. జాయిదాదు చారెడు పోకుండ కాపాడ్డానికి పెద్దబావ నెదిరించి కొట్లాడింది. గెలిచిన బూదక్క నా ఒక్కదానికి కాదు ఊళ్లో సిన్నాపెద్దా అందరికి బూదక్కె – పెద్దలయితే బూదక్క – చిన్నలయితే బూదమ్మమ్మ అని ఆదరంగా ఆప్యాయంగా పిలుచుకునే వాళ్ళు. పాడి, పంట పిల్లలకి పెద్దలకి కాదనకుండా, లేదనకుండా పెట్టె బూదక్క అంటె అందరికి అక్క, అమ్మే, అమ్మమ్మే మరి కుండెడు పెరుగు, సల్లజేసి ఎన్న తీసి, ఊళ్లో అడిగిన వాళ్లందరికి పోసేసి తోటల రెగపండ్లు జామ కాయలు అడిగి నోళ్ళందరికి అడగనోళ్లకి అందరికి ఇచ్చేది. అందుకే అందరికి బూదక్కంటే అంత ఇష్టం అభిమానం.

కొడుకు పట్నం బొయినంక ఎటా ఎకరం రెండెకరాలు కడకు అంత అమ్ముకున్నా తోట మాత్రం అమ్మనీయకుండ అడ్డం తిరిగింది. తోట నాదే నాకే ఉండాలి అంది. ఊళ్లో పెద్దలు ఒక్కగానొక్క కొడుకు నీకెందుమ్మా అంటున్నా ఇనకుంట పట్టు బట్టి చివరికి పంచాయితి పెట్టి మరి నిలుపుకుంది. ఈ తోటల మా అత్త మామ సమాదులు కట్టిచ్చిన, పెనిమిటి సమాది పక్కనే నా సమాది కట్టాలే నాకొడుకు కట్టక పోయినా ఊళ్లోళ్ల యినా నిలబడి నేను పోయినంక నా పెనిమిటి సమాది పక్కనే నా సమాది కట్టించాలి అనేది. రోజు రాత్రి సమాదుల ముందు నూనెతో దీపం ఎలిగించి పెట్టేది. చివరి చివరి రోజుల్లో కూడా చేతికట్టె ఊతంతో కుంటుకుంట కూడా సందేల సమాదుల ముందు దీపం ఎలిగించి వచ్చేది. తల్లి కష్టం ఇని వచ్చిండో ముసల్ది ఇక్కడున్నంత కాలం తోట అమ్ముకోనియ్యదనుకొని వచ్చిండో గాని ఒక్కదానివి పెద్దదానివి ఇక్కడేం ఉంటవు రమ్మని తల్లిని తనతో పాటు పట్నం తొల్కపోయిండు. ఆ రోజు బూమక్క ఆనందమే ఆనందం. అది కొడుక్కు తన మీద ప్రేమనుకునో ఒక్కతి ఊళ్ళో తన్లాడుకుం టున్నదని కొడుకును అందరు ఆడి పోసుకుం టున్నరనో గాని బూదక్క కొడుకుతో సంతోషంగనే పోయింది గాని మూన్నెళ్ళు తిరక్కుండ కాళ్ళు చేతులు ఆడుతున్న మనిషి వారం రోజుల్నించి మంచంల పండి లేవట్లేదని బూదక్క కొడుకు ఇంటి ఎదురుగ్గున్న సైదులు ఈడకొచ్చినప్పుడు జెప్పినప్పుడు ఓ పాలి పోయ్యి బూదక్కను చూసి రావలనుకున్న కాని, ఈ లోపల కొడుకొచ్చి మిగిలి ఉన్న సమాదులతో సహ తోట అమ్ముకుని పోయిండు. తల్లిని తనతో తీసుకపోయింది ఇందుకన్నమాట. తోట కొన్నోళ్ళు సమాదులు పడగొట్టి ఆ జాగాల మరో నాలుగు మామిడి చెట్లెసుకున్నరు. సమాదులు పడగొట్టిన్రని తెల్సిన మర్నాడే బూదక్క ప్రాణం పోయిందని సైదులు మా ఊరికి ఫొను కొట్టిండు ఈరోజే ఈడ్నే తగిలేస్తరట అని కూడా చెప్పంగానే నువ్వెట్లన్న జేసి ఆపని జెయ్యకుంట ఆన్నాపరా సైదులు మేం ఊరోళ్లం ఒస్తున్నం అని జెప్పి మద్యాహ్నం సర్వీసు బస్సుకు పట్నం పోయినం. తలో మాట తగులుకున్నంక ఒప్పించి తల్లి శవంతో పాటూ కొడుకుని ఆని బార్య పిల్లల్ని తీసుకుని ఊళ్ళెకొచ్చెటాల్లకు రాత్రయింది. ఇంతట్ల బూదక్క బిడ్డ భర్త పిల్లలు వచ్చిండ్రు. బూదక్కను తెల్లారిందాక ఎక్కడ బెట్టాలె. 44ఎకరాల జాయిదాదును చారెడు చెక్క అమ్ముకోకుండా నిలబెట్టిన బూదక్కను, బూమిని కాపాడుకునేందుకు పాలోళ్ళ కెదురొడ్డి కనా కష్టం నానాయాతన పడ్డ బూదక్కకు మన్నల మన్నయి, సెల్కలలో చెట్టయి కాపాడిన బూదక్కను పెట్టడానికి ఆరడుగులు కాదు గదా ఆమె పొడుగు సరిపడే అయిదడుగుల జాగ కూడ మిగల్లేదు. తలకొరివి బెట్టడాని కొచ్చిన కొడుకు తల్లి శవాన్ని కాలేయడానికైన జాగలేకుంట తల్లిని ఎంటబెట్టుకుని పోయిన వారానికే వచ్చి సమాదులతో సహా తోటంత అమ్ముకుని పోయిండని. అప్పుడర్దమయింది వారం కిందట వచ్చి ప్రేమ ఒలక బొసి తీసుకుపోయింది తోట అమ్ముకుని పోవడంకోసమని. ఏదో అయిందయి పోయింది. ఇప్పుడు బూదక్క ప్రాణం లేదు ఆకరికి జేసే తంతు జేయాలి. ఇప్పుడు బూదక్కను పెట్టడానికి జాగలేదు. తలో మాట ఎవరికి తోచింది వాళ్ళని చివరికి తెల్లారేదాక ఊళ్ళ బొడ్రాయి దగ్గరుంచి తెల్లారినంక ఊరి బయట ఉమ్మడి కాట్లె తగలేయాలని ఒక్కమాట మీద కొచ్చిండ్రు. తెల్లారి ఇంటికో కట్టి తెచ్చి కాట్లె కాల బెట్టినంక తొమ్మిదొద్దుల్నాడు బూడిదను చెర్ల కలిపిపోయిన కొడుకు ఊరి మొఖం మళ్ళి తిరిగి చూడ్లే. నెల మాసికం కాదు కదా కడకు యడాది మాస్కిమైనా జేయలే. తలకొరివి బెట్టి బూడిద సెర్ల కలిపిందాకున్న తొమ్మిదోద్దులు ఊళ్లొల్లె కొడుక్కి పెడ్లాం పిల్లలకి ముద్ద బెట్టిండ్రు చావు ఖర్చు, చావు బంతి ఖర్చు బిడ్డ, బిడ్డ పిల్లలు పెట్టుకున్నరు. అంతే బస్‌ 44ఎకరాల జాయిదాదు నాలుగెకురాల పండ్లతోట అరెకురం ఇల్లు అమ్ముకుని పట్నంల కాలుమీద కాలేసుకుని బతుకుతున్న కొడుకు తల్లిని తలుసు కోక పోయినా తోట ముందు నుంచి పోతున్నప్పుడు జనం మాత్రం వాళ్ళకు బూదక్క చేత్తొ ఇచ్చిన జాంపల్లు, రేగుపండ్ల రుచిని యాదికి తెచ్చుకుంటరు.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో