మా యింటికి.. పెద్దమ్మొస్తుందంటే –
మేం చేసే కేరింతల స్పర్శకు ముడుచుకున్న అత్తిపత్తెలు.. విచ్చుకొనేవి!
మా ఆనందంతో.. దూదిపూలు తెల్లని సొగసుగా మారేవి!
కొత్త కబుర్లేవో తెచ్చినట్లు
కాకమ్మలు.. కావ్! కావ్! మనేవి
కోడిపిల్లలు.. అల్లరి చేస్తూ
తల్లికోడి రెక్కలపై ఊయల లూగేవి!
కోయిలమ్మలు .. ఈల పాటలు పాడేవి!
మా పెద్దమ్మ.. వచ్చినపుడల్లా –
తన చేతి సంచినిండా
మాకు నచ్చిన పిండి వంటల్ని తయారు చేసి తెచ్చేది
ఒకరికొకరం .. కాకెంగిలి చేసుకొని వాటిని తింటుంటే .. మురిపెంగా చూసేది!
కొంగున దాచిన కథల పుస్తకాలను
కొయ్య బొమ్మలను తీసిచ్చి .. మాతో కలిసి ఆడుకునేది –
మేం, నిండుగా నూరేళ్ళూ జీవించాలనీ
వేయ్యేళ్ళ ఆశీస్సుల తావీజులను మా మెడలో వేసేది!
పెద్దమ్మంటే .. పెద్దమ్మే..!
తనలో దాచుకున్న ప్రేమామృతాన్ని
అందరికీ సమానంగా పంచేది –
మొగ్గల మనసులు గాయపడకుండా
అక్షర సత్యాలను హరివిల్లుగా చూపి
ప్రకృతి పాఠాలను .. ఆటలుగా నేర్పేది –
దాచిన జ్ఞాపకాల మూటల్ని విప్పి
చిట్టిపొట్టి కథల పూలుగా చల్లేది!
మేం, పొట్లాడుకున్నపుడు
మా మధ్యకొచ్చీ .. మంచి మాటల గువ్వల్ని ఎగరేసేది –
యవ్వనాన్ని పొదువుకుంటున్న
మా అక్కచెల్లెల్ల మనస్సులతో మాట్లాడి
వారి అలజడులను దూరం చేసి.. రేపటి ఓదార్పునిచ్చేది
ఆశల కలలను మా కళ్ళనిండా నింపి
మాలోనున్న.. దిగులు, గుబుల్లను వెన్నంటి తరిమేది-
మా పెద్దమ్మ
కొండంత ఆత్మాభిమానంతో
తెలుగు కథల్లోని .. పేదరాశి పెద్దమ్మలా వుండేది-
ఇపుడు –
పెద్దమ్మ .. మా మధ్యలేదు.. తిరిగిరాదు!
అయినా .. ఇంకా
మేడిళ్ళల్లో .. మూల గదుల్లోనో
గుడిసెల్లో .. కుక్కి మంచాల మీదనో
ఏ గడప చాటునో – ఏ గోడవతల చింకి చాప మీదనో
కీళ్ళు వొదిలిన బొమ్మల్లా
పగిలిన మనసు
నిరాదరణ నీడలో
ఆరిపోయే దివ్వెలుగా!
మనకు మిగిలిన
పేదరాశి చిన్నమ్మలెందరో !!