క్షణికం
ఎన్.అరుణ
ప్రేమా! ప్రేమా!!
విఫలమైతే ఒకప్పుడు నువ్వు
జీవితమంతా బాధపడేదానివి
పెనంపై కాలిపోయి
అగ్ని గీతాలు పాడేదానివి.
ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి
చక్రవర్తులను సైతం ధిక్కరించేదానిని
ఎదుటి ప్రేమను త్యాగం చేసేదానివి
కాని ఇదేమిటి!
హింసావతారమెత్తావు
నిజంగా నువ్వు ప్రేమవేనా?
(9.4.08న ఉన్మాదంతో మీనా గొంతుకోసిన సందీప్ దుశ్చర్యను నిరసిస్తూ..)
నిర్వాసితులు
కొలిపాక శోభారాణి
అక్కడ… మౌనమే… మాట్లాడుతుంది
ఏమడిగినా… నిశ్శబ్దమే సమాధానమౌతుంది
తరచి అడిగితే గనక….మూగగా
వేన వేల భాష్యాలకు…నెలవైన కండ్లు
బెదిరి….చెదిరిన….చూపుల్లో
ఏరుకోవచ్చు….కొన్ని జవాబుల్ని
ఏం చెబితే ఏమౌతుందో నన్న బుగులు
కొత్తవారిని నమ్మొచ్చో లేదో నన్న సందిగ్ధం
వేటగాన్ని చూసి…. బీతిల్లుతున్న జింకలా భయం
ఎంతోసేపు…. బామాలి…. బుజ్జగించిన పిదప
ఒక్కొక్క అక్షరం కూడబలుక్కొన్న…
మాటలు-దుఃఖం జమిలిగా
మనస్సు కకావికలు….చేస్తుంది.
ఎంతెంతో శ్రమిస్తూ
ప్రేమించిన…చెట్టూ…పుట్టా..వాగూ…వంకా
పోలవరం…ప్రాజెక్టు…ముంపు ఊడ్చుకుపోతుందని
తెల్సి తల్లడిల్లుతున్న…మన్యం ప్రజలు.
ముంపు భూముల క్రింద నష్టపరిహారం
ఇస్తామంటున్న పాలకులకు
ఈ గిరిపుత్రుల కన్నీటి వెతలు
గుండెగూడు పట్లు…పెకలించుతున్న దుఃఖం
తండ్లాటను….వెలువరించటాన్కి
యాభైఆరు అక్షరాలు చాలవు.
వారు నిల్చున్న నేల…వాళ్ళు ఆడుకున్న
చెట్టుచేమా…వారికి గాకుండా పోతుందని
వారికి…తెలియదు…పోలవరం ముంపు అంతా ఊడ్చుకెళ్ళుతుందని
తెలియని…పసిపిల్లలు
సంబురంగా చేతులపుతున్నారు…
రాగద్వేషాలకతీతంగా వారి
చూపులు చేతలు కల్లాకపటం లేకుండా… స్వచ్చంగా
వారికి అతిథ్యిమివ్వటమే తెల్సు
వారు శబరి వారసులు…మరి….
పసిచేతుల…సాక్షిగా
చేతల్లో…మన వంతుగా ప్రయత్నిద్దాం
న్యాయం కొరకు…
మానవతతో… పునరాలోచించమని
గుర్తుచేద్దాం……పాలకులకు
మనతో…ఏమౌతుందని…చతిగిలపడకుండ
రామకార్యంలో…ఉడుతలా…మానవతకు
సేతువు కడదాం…
మానవాళి శ్రేయస్సును కోరుకుందాం….
బంగారు పంజరం
పృధ్వి
పుట్టి పెరిగింది
పంజరంలోనే!
ఇప్పుుడే తెలిసింది
ఇది పంజరమని!
నేను ప్రేమించే వాళ్ళంతా ఆకాశంలో…!
నేను మాత్రం ఈ పసిడి పంజరంలో…?
రెక్కలు రాలేదని
కట్టిపడేసారు?
మనసుకొచ్చిన రెక్కలు చాలవా?
కానపుట్టి రాచిలెకెగిరిందెట్టా?
రెక్కలొచ్చేదాకా ఆగేదెట్టా?
మనసు రెక్కలు కట్టేదెట్టా?
నమాస్కారము…….మీ కవితలు చాలా బాగున్నీ…..ఎల బ్లొగ్ చెయ్యలొ చెపుత
చెపుతారా……..దయచెసి నాకు ఉత్త్ర రము రాయగలరు…………..