-సైలేష్
నిజం చెప్పాలంటే నేను ఇదివరకు ఇలా లేను. ఒకవేళ మీరు నా గతంలోకి చూడగలిగితే, ఆరు సంవత్సరాల క్రితం మీరు సైలేష్ అనే ఒక ఆత్మవిశ్వాసం వున్న, చలాకీతనం వుట్టిపడుతున్న ఒక ప్రభుత్వ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న యువకుణ్ణి చూసివుండేవారు. నేను తిరగడానికి చాలా ఇష్టపడేవాడిని, అదీగాక జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకుల్ని తట్టుకోవడాన్కి సిద్ధంగా వుండేవాణ్ణి. నేను రేఖని తొలిసారి కలిసినప్పుడు ఆమె చాలా అందంగా, ఫ్రెష్‌గా కనబడింది. మాకు వివాహం అయిన వెంటనే అభినవ్ పుట్టడంతో మా ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. జీవితం చాలా అందమైనది. నేననుకోవడం మరీ ఎక్కువకాలం వుండలేనంత అందమైనదేమో.
అభినవ్‌కి ఆరు సంవత్సరాల వయసులో, నాకు జ్వరం, పొడిదగ్గు వచ్చాయి. దానిని అంత పెద్దగా పట్టించుకోలేదు ఎందుచేతనంటే జీవితంలో అంతకు ముందెన్నడూ ఒక్కరోజు కూడా జబ్బుపడి ఎరుగను. ఈ లక్షణాలు ముదురుతూ వుంటే వెళ్ళి పరీక్షలు చేయించుకున్నాను. డాక్టర్లు నాకు నా జబ్బు టి.బి. అని తేల్చారు. నేను మరీ ఎక్కువ కంగారు పడకుండా వైద్యం చేయించుకోవడానికి వెళ్ళాను. కాని భవిష్యత్తులో నాకు ఏం ఎదురవ్వబోతోందోనని ఊహించలేకపోయాను.
ఎనిమిది నెలల తరువాత, నేను క్రమంగా బరువు తగ్గుతూ అతిసారంతో బాధపడ్డం మొదలైంది. ఈసారి విషయం ప్రమాదకరంగా అన్పించింది. రహస్యంగా నా గురించి కలవరపడుతూ వున్న రేఖ బలవంతంమీద నేను ఒక కార్పొరేటు ఆస్పత్రిలో చేరి రకరకాల పరీక్షలు చేయించు కున్నాను. హెచ్ఐవి పరీక్ష పాజిటివ్ అని తెలిసి నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను వైద్యం పొందుతున్న ఆస్పత్రి నన్ను ఎక్కడలేని తొందరగా బయటకు పంపించేసింది.
త్వరలోనే నేను జబ్బుతో నీరసపడి పోయాను. నేను ఉద్యోగం చెయ్యడం మానెయ్యడంతో, పెరుగుతున్న మందుల ఖర్చులకోసం, నా భార్య ఒక స్కూల్‌లో టీచరుగా చేరక తప్పలేదు. కాని జబ్బుపడ్డ భర్తకు సేవ చేయడం, ఇంటిపని, మళ్ళీ స్కూలుకు పరిగెత్తడం అన్నీ ఆమె మీద చాలా ప్రభావం చూపించాయి. ఆమె స్కూలుకి సరిగ్గా వెళ్ళలేకపోవడంతో, అధికారులు ఆమెను పనిలోంచి తొలగించారు. పరిస్థితులు చెడునుంచి హీనస్థితికి వచ్చాయి. అర్ధరాత్రి మేముంటున్న ఇంటినుంచి మమ్మల్ని వెళ్ళగొట్టడం జరిగింది. మా ఇంటి యజమాని మా మీద ఉపయోగించిన ఈ ఆఖరి అస్త్రం మమ్మల్ని వీధుల్లో పడేసింది. నేను ఇప్పుడు ఒక ఎయిడ్స్ రిహబిలిటేషన్ సెంటర్‌లో వుంటున్నాను. రేఖ, అభినవ్ ఒక స్నేహితురాలి దగ్గర వుంటున్నారు. మా స్నేహితులకి కాని, మా బంధువులకి కాని మా గురించి ఏమీ పట్టకుండా పోయింది. బహుశా నేను చేసిన దానికి ఫలితం అనుభవిస్తున్నాను. మరి రేఖ, అభినవ్ మాటేమిటి?వాళ్ళెందుకు బాధపడాలి. ఎందుచేత హెచ్ఐవి వాతబడ్డ వారిని, వారి కుటుంబాల్ని వెలివేసి, వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు? ఎందుచేత మాఇంటి యజమాని అంత కఠినంగా, డొంక తిరుగుడుగా ఈపని చేశాడు? ఆయనేం చేశాడో మీకు తెలుసా, ఎయిడ్స్ తో బాధపడుతున్నవారికి సహాయం చేసే స్వచ్ఛంద సంస్థ దగ్గరకు రేఖ నాకోసం వెళుతూ వుంటే రహస్యంగా ఆమెను వెంబడించి నాకు ఎయిడ్స్ వుందన్న విషయం కనుక్కున్నాడు. ఎందుకని ప్రజలు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్ని అంటరానివారిలాగా చూస్తూ అసహ్యించు కుంటున్నారు?
రేఖకి, అభినవ్‌కి జీవితం ఒక పెద్ద సంఘర్షణ అయిపోయింది. ఈ పరిస్థితికి నేను బాధ్యుడినని గుర్తొచ్చినప్పుడు ఆ చేదునిజం నా గొంతును నులిమేస్తోంది. రేఖ మొహంలో అలసట, నిరాశ చూసినప్పుడల్లా నాకు చచ్చిపోవాలని అన్పిస్తోంది.
హెచ్ఐవి వైరస్ కేవలం శరీరద్రవాలైన రక్తం, వీర్యం, యోని ద్రవం లాంటివి ఒకరి శరీరంలోంచి ఇంకొకరి శరీరంలోకి మారినప్పుడే సంక్రమిస్తుంది. ముట్టుకున్నా, చేతులు కలిపినా, తినుబండారాలు పంచు కున్నా, ఒకరు ఉపయోగించిన మరుగుదొడ్లు ఉపయోగించినా సంక్రమించదు. ఒకసారి ఈ వైరస్ శరీరం బయటకు వస్తే, కొద్ది నిమిషాలకన్న ఎక్కువ జీవించి వుండలేదు. అదీకాకుండా హెచ్ఐవి వైరస్ కణాలు క్లోస్ట్రీడియమ్ లాంటి బ్యాక్టీరియా కణాల్లాగా, గోడలమీద కాని, నేలమీదగాని అంటి పెట్టుకుని ఎక్కువసేపు వుండలేవు. అందు వలన హెచ్ఐవి బాధితులకి ఇల్లు అద్దెకివ్వ కూడదనే భయం అర్థం లేనిది. ప్రజలు హెచ్ఐవి బాధితుల పట్ల తమ అభిప్రాయాలు మార్చుకుని వారిని కూడా సాటి మనుషులుగా చూడాలి.
(Whispers from within- unheard voices of HIV/AIDS- సౌజన్యంతో) అనువాదం- కె.మాధురి