డా. శిలాలోలిత
తెలంగాణా పుడమిని చీల్చుకుని వచ్చిన స్వచ్ఛమైన మొలక శోభారాణి.
గాఢత, ఆర్ద్రత, చలనశీలత, ఆమె కవిత్వపు లక్షణాలు.
ఒక మంచి కవిత్వాన్ని చదివిన అనుభూతిని, ఒక జీవన సారాన్ని, పరివేదనను అనుభవించిన స్థితిని ఏకకాలంలో కలిగించింది.
చాలాకాలంనుంచి ‘కొలిపాక శోభారాణి’ కవిత్వతీరం వెంట ప్రయణిస్తున్న బాటసారే. ఈ ‘చలనం’ అనే కవిత్వ సంపుటి కూడా 2004 లోనే వచ్చింది. మానేరు తీర ప్రభావం, సిరిసిల్లా రాజకీయనుభావం, కరీంనగర్ ప్రజల కడగండ్లు, వలసవాదం, పేదరికాల మధ్య బతుకులనీడుస్తున్న మట్టి బతుకుల చిత్రాలు, స్త్రీల జీవన సొరంగాల్ని తొలుచుకుంటూ పోతుంటే కురిసే వివక్షల నేపధ్యాలు ఆమె కవిత్వం నిండా ఉన్నాయి.
ఒక దు:ఖపు తేనె తుట్ట కదిలిస్తే జీవన వేదనను, రోదనను వినిపించినట్లు ఆమె కవిత్వపు కందిరీగలు మనను చుట్టు ముడతాయి. అయితే అవి చేసే గాయాలు మనని నిరంతరం సలుపుతనే వుంటాయి.
ఇక, శోభారాణి కవిత్వ గాయాలలోకి వెళితే ‘గాయమైన బాల్యం’లో పేదింటిపిల్ల చదువులకోసం చిన్న పెన్సిలు ముక్క కోసం పడే ఘర్షణ, కనీస జీవనావసరాలు తీరని ఆడపిల్లలు దైన్యం కన్పిస్తాయి. జూపాక సుభద్ర కూడా ఇలాంటిదే రాసి కన్నీళ్ళు తెప్పించింది. అమ్మ గురించి రాసిన అద్భుతమైన కవిత ‘గిజిగాని గూడు’.
‘తెలంగాణం’ కవితలో వివక్షకు, దోపిడీకి గురైన బ్రతుకుల నేపధ్యాన్ని వివరిస్తూ, ఆగ్రహంగా రాసిన కవిత. ‘తెలంగాణాభాష/ కల్లాకపటం లేకుంట/ ఏ ముసుగులు-నసుగులు లేకుంట/ధీటుగా సూటిగా/…ఇంక మాదేకాలం/ ఇంక మాదే ఈ గెడ్డ/ ఇంక మాదే ఈ గడ్డ అని స్పష్టీకరిస్తుంది. నిజానికి శోభారాణి భావించినట్లుగానే స్వచ్ఛమైన భాష, అచ్చ తెలుగు పదాలు తెలంగాణా ప్రాంతాల్లోనే నేటికీ నిలచి వున్నాయి. ‘ఇంగిలం’ (నిప్పు) అనే అచ్చ తెలుగు పదం ‘తిక్కన’ వాడింది. ఇప్పటికీ ఆ పదం, అలాంటి ఎన్నో పదాలు రూపాంతరం కూడా చెందకుండా నేటికీ నిలిచివున్నాయి. శోభారాణి కవిత్వంలో కూడా ఇలాంటి స్వచ్ఛమైన పదాల మల్లెలు పరిమళిస్తూనే వుంటాయి.
‘అణిచివేత’కవితలో – కంట్లో ఊట ఆగిపోనీయకుండా/ జీవనదిలా/కొనసాగించే వివక్ష/అన్నింటా పర్యాయపదం- ప్రతిరూపం/ స్త్రీ..స్త్రీ.. అంటుంది. సీత ‘ఆత్మఘోష’ను వ్యక్తీకరించిన కవితలో ‘భూమిల్నుంచి వచ్చిందానన్నని/ భూస్థాపితం చేస్తివా/ రామా!నువ్వు మగపురుగువే కదా’ అనేస్తుంది.
అలాగే ఒకసారి పసుపులేటి గీత ఒక కవితలో తండ్రే అత్యాచారం చేస్తే ఆ పాప మానసిక స్థితి గురించి రాసింది. చాలా రోజులు అది చదివి డిస్టర్బ్ అయ్యాను, అలాంటి కవితే ‘తెల్లనివన్నీ పాలు కావు! ‘కంటిపాపను కాచుకుంటుందనుకున్న రెప్ప / చూపును మింగేసింది/.. మగపులి మాత్రం ఎప్పట్లాగే / మేకతోలు కప్పుకు తిరుగుతుంది గొప్పగా అని నిజాల మూటను విప్పింది. ఒక గొప్ప వ్యంగ్యాస్త్రాన్ని విసిరిన కవిత ‘నో వెర్ టియర్స్’.
‘అన్నీ తానై’ ‘ఇనుపకచ్చడాలు’ విమర్శ, ద్వితీయ పౌరసత్వం, ఖాయిలా, చేతులు, ఒకానొక పురాతన ప్రక్రియ, అంచు, విరిగిన రెక్క కవితలు స్త్రీల సంఘర్షణల కెరటాల హోరుని వినిపిస్తాయి.
కొలిపాక శోభారాణి ‘మిగిలిన బతుకైనా తొలివాన ఉత్సవ సదృశమై, రవ్వంత సంబరం ఎరుకగా రూపుదిద్దుకోవాలని ఆశావహంగా.. లేచిగురు ఆకునై అల్లల్లాడుతూ నా ఈ ‘చలన’శీలత.. అని వ్యక్తీకరించుకున్నట్లుగానే, తెలంగాణా జీవన వైరుధ్యాలను చూసినట్లుగానే, మంచి కవిత్వాన్ని చదివామన్న తృప్తిని కలిగిస్తుంది. మరింత కవిత్వాన్ని రాయాలని, పోరాడడమే, జీవనసారాన్ని గ్రహించడమే బతుకు నేర్పిన పాఠాలన్న శోభారాణి భావాలతో ఏకీభవిస్తూ , ఆమె రాసే కొత్త కవిత్వం కోసం చూస్తుంటాను.
చలనం (కవిత్వం)- కొలిపాక శోభారాణి
వెల : రూ.50
ప్రతులకు : 3-3-132, పోస్ట్ ఆఫీస్ లేన్,
సిరిసిల్లా 505301, కరీంనగర్
ఫోన్. 08723 231618