ఆధునిక మనువాదుల కుట్రలు- తోకల రాజేశం

స్వార్థపూరితమైన తర్కం కంటే భయంకరమైన దేదీ లేదని అంటాడొక సందర్భంలో కారల్‌ మార్క్స్‌. ఇటీవల వరుసగా భాష గురించీ మతం గురించీ కొందరు రాస్తున్న వ్యాసాల్లో ఇట్లాంటి భయంకరమైన తర్కాలే చోటు చేసుకుంటున్నాయి. నందిని పందిగా నిరూపించటానికి ఇలాంటి రకరకాల తర్కాలు చేసే వాళ్లను సర్కస్‌లో బిత్తిరి వేషాలు వేస్తూ ప్రేక్షకుల్ని నవ్వించే హస్యగాళ్లతో పోల్చవచ్చు. కాకపోతే తేడా ఏమిటంటే సర్కస్‌లోని హాస్యగానికి మనల్ని నవ్వించటమే లక్ష్యం – దాని కోసం మనల్ని మభ్యపెడుతుంటాడు – ఈ కుతర్కవాదులు మాత్రం మనల్ని మభ్యపెట్టటమే లక్ష్యంగా రకరకాల కూటవాదాలను లేవనెత్తుతూ వుంటారు. హాస్యగాని వల్ల మనకు కలిగే ఇబ్బందేమి లేదు కానీ ఈ కుతర్క వాదులను

ఉపేక్షిస్తూ పోతే వ్యవస్థకు ఒరిగే నష్టం అంతా ఇంత కాదు. ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థకు పట్టిన అనేక రకాలైన చీడపీడల్లో ఈ జాతి ఒకటి.

ఇటీవల ఆంధ్రభూమి దినపత్రికలో వరుసగా అచ్చవుతున్న వ్యాసాలు – ఎంత అశాస్త్రీయంగా వుంటున్నాయంటే – వేదాల్లో లేనివి ప్రపంచంలో మరెక్కడా లేనట్లు ప్రపంచంలోని భాషలన్నింటికి సంస్కృతమే మూలమట. కొందరైతే పైత్యం మరీ  ఎక్కువైపోయి – మతోన్మాదులైన కేంద్ర ప్రభుత్వంలోని నాయకులు మాట్లాడుతున్న తలాతోక లేని మాటలను సమర్థిస్తూ – యధేచ్ఛగా చరిత్రను వక్రీకరిస్తున్నారు. వీళ్ళందరికి ఉమ్మడి లక్ష్యం ఏమిటంటే ఈ దేశాన్ని – ఈ దేశ చరిత్రనూ కాషాయీకరించటం.

ఇప్పటికీ తెలుగు సంస్కృతం నుంచి పుట్టలేదని, అది ద్రావిడ భాషా కుటుంబానికి చెందినదని మనదేశంలోని భాషా శాస్త్రవేత్తలతో బాటు విదేశీ భాషా శాస్త్రవేత్తలు కూడా నిరూపించిన చారిత్రక సత్యం. దీని గురించి తెలియదంటే పోనీ అమాయకత్వమని వదిలిపెట్టవచ్చు కానీ ద్రావిడ భాషా సిద్ధాంతాన్నే ఆమోదించమనే మూర్ఖులను – కేవలం మూర్ఖులుగానే కొట్టిపారెయ్యలేం. చరిత్రను పకడ్బందీగా వక్రీకరించే కార్యక్రమంలో భాగంగానే దీన్ని చూడవలసి వుంటుంది. ఈ క్రమంలో వీళ్ళు ఎంత దూరం పోతారో చూడండి: భారతీయ భాషలే కాదు, విదేశీ భాషయైన ఆంగ్ల భాష కూడా సంస్కృత భాష మూలాలతోనే ఆవిర్భవించిందన్న విషయాన్ని గమనించాలని దబాయిస్తున్నారు. బలుసా జగతయ్య (అన్ని భాషలకు మూలం సంస్కృతమే అన్న వ్యాసంలో – తేది : 23-01-15) అనే మహా పండితుడు. దీన్ని అజ్ఞానమని కొట్టి పారేయాలో చరిత్రకు మసిపూయటమని నెత్తి కొట్టుకోవాలో అర్థం కాక మనలాంటి వాళ్లం చచ్చిపోతాం కాని – ఇలాంటి వాళ్ళు, నోటినిండా – పత్రికల నిండా అబద్ధాలు దట్టిస్తూనే ముందుకెళ్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ పోతే తప్ప చరిత్ర చరిత్రగా నిలబడదు. నిజమన్న దానికి నిలవనీడ దొరకదు. వాస్తవిక వాదులు ఏ మాత్రం ఏమరుపాటుగా వున్నా కాళ్లకింది మన్ను తన్నుకుపోయే భూబకాసురుల్లా మన చరిత్రనంతా కబ్జా చేసి పారేస్తారు వీళ్లు.

ఈ మధ్య క్యాన్సర్‌లా, స్వైన్‌ఫ్లూలా చాలా మందిలో విజృంభిస్తున్న జబ్బు మరొకటి వుంది. ఈ భూమ్మిద జరిగిన, జరుగుతున్న ప్రతి దృగ్విషయానికీ – శాస్త్ర సాంకేతికాభివృద్ధి వేస్తున్న ప్రతీ బంగారు అడుగుకీ – అనవసరంగా వేదాలతో ముడి పెట్టడం. అయితే – వేదాల్లో ఏమున్నది అన్న విషయం గురించి మనకు తెలియజెప్పినవాళ్లు చాలా వరకు పాశ్చాత్యులు. వాళ్లు సంస్కృతం చదువుకుని వేదాలు పఠించి అందులో ఏమున్నదీ మనకు తెలియపరచవలసిన దుస్థితి కలిగింది అని కొడవటి గంటి కుటుంబరావు (చరిత్రవ్యాసాలు : పుట : 87) అంటున్నాడంటే – కావాలనే ఒక వర్గం అధిక సంఖ్యాకులైన కింది కులాల వారికి చదువునూ విజ్ఞానాన్ని (అది ఎలాంటి విజ్ఞానమన్నది తరువాత ప్రశ్న) దూరం చేసిందని కూడా చెప్పినట్టే. అయితే పరాయి దేశాల వాళ్లు కష్టపడి వేదాలు చదువుకున్న విషయాన్ని ఆసరా చేసుకున్న మన మహామేధావి అయిన బలుసా జగతయ్య గారు – సంస్కృత భాషలో ఉన్న వేదాలలోని విజ్ఞానం ద్వారానే రష్యా, చైనా, అమెరికా, జర్మనీ, జపాన్‌ దేశాలు సాంకేతిక పరంగా అభివృద్ధి చెందినవన్న విషయాన్ని గుర్తించలేకపోవటం విదేశీ భావజాలం మత్తును వీడకపోవడం – అని తీర్పును ప్రకటిస్తున్నారు. వేదాల కోర్టుకు తానే ప్రధాన న్యాయమూర్తినన్నంత గర్వంతో. వేదాల్లో ఉన్నదంతా ఆర్యుల చరిత్ర – ఇక్కడి మూలవాసులైన తెగనాయకులను, గణనాయకులను అసురులుగా (రాక్షసులుగా) చిత్రీకరిస్తూ – తమ వారిని (ఆర్యులను) దేవతలుగా చిత్రికరించటం, వీళ్ల మధ్య జరిగిన యుద్ధాలను దేవాసుర యుద్ధాలుగా వర్ణించటం – ఒక వర్గం మరొక వర్గాన్ని ఇష్టం వచ్చినట్లు దోచుకోవటానికి గతి మార్గాలను చూపించటం – పైగా జరగటానికి వీలులేని – జరగని సంఘటనలను అభూత కల్పనలను, భ్రమలను చదివే వాళ్లకు కలిగించటం – వీటికి మించిన పనులను వేదాలేం చేశాయో అర్థం కాదు. ఇట్లాంటి వేదాల నుంచి – విదేశాలు అభివృద్ధి చెందాయని చెప్పుకోవటానికి కొంచెమెనా సిగ్గుండాలి. అంతటి విజ్ఞాన శాస్త్రానికి నిలయాలే అయితే – కొన్ని వేల ఏళ్ళుగా వేదాలు మనదేశంలోనే ఉన్నాయి కదా! తరతరాలుగా వాటిమీద గుత్తాధిపత్యం చెలాయిస్తున్న బ్రాహ్మణ వర్గం మనదేశాన్ని అందులోని విజ్ఞానశాస్త్ర ఆధారంగా ముందుకెందుకు తీసుకెళ్ళలేదో సెలవిస్తారా జగతయ్యగారూ? విదేశాలు స్వంత శక్తితో ఎదిగితే దాన్ని ఓర్వలేక – ఇలాంటి అజీర్తిమాటలు మాట్లాడటం వల్ల విదేశాలకు వచ్చే నష్టమేం లేదు – మన అజ్ఞానం బయటపడటం తప్ప. ఇల్లాంటి వాళ్లు – ఇలాంటి మాటలు మాట్లాడే ముందు కొంచెం చరిత్ర చదువుకుంటే మంచిది. లేకపోతే ఏమిటి? మన గొప్పదనాన్ని నేడు అభివృద్ధి చెందిన శాస్త్ర విజ్ఞానంలో చూపించుకోవచ్చు, అందులో మనకు విదేశాలతో దీటైన పరిజ్ఞానం నేడు అందుబాటులో వుంది. అంతేకానీ ఈనాటి ప్రపంచానికి ఏ విధంగానూ సహాయం చేయలేని(చారిత్రకంగా అవసరమేనని నేనూ ఒప్పుకుంటాను) వట్టి వేదాలను ఉదాహరించటం వల్ల మనకు కలిగే అదనపు లాభాలేమీ వుండవు. గతాన్ని ఆరాధించటం, ఆదర్మాల కోసం గతం మీద ఆధారపడటం మానుకోవలసిన అవసరం హిందువులకు లేదా? అని ప్రశ్నించాడు కులనిర్మాలనలో డా|| బి.ఆర్‌. అంబేద్కర్‌. ఈ అవసరాన్ని గుర్తించిన వాళ్లెవరూ గతాన్ని గబ్బిలంలాగా పట్టుకొని వేలాడరు.

”సంస్కృత భాషా మాధ్యమంగా విద్యాబోధనం జరిగినట్లైతే చదువుకోని వారు కూడా సంస్కృత భాషలో మాట్లాడే అవకాశమే ఎక్కువ”. అని అంటున్నారు బలుసా జగతయ్య. సంస్కృత భాషా మాధ్యమంలో విద్యా బోధన జరగటానికి – చదువుకోనివారు సంస్కృతాన్ని మాట్లాడటానికి మధ్యగల సంబంధమేమిటో బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాని విషయం. అర్థం కాకుండా, అర్థమే లేకుండా మాట్లాడటం ఈ జాతి మేధావుల గొప్పదనంగా మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. అసలు వీళ్లను సంస్కృత భాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెట్టి దేశాన్ని ఉద్ధరించమని ప్రాధేయపడే వాళ్ళెవ్వరూ? చదువురాని వాళ్ళు కూడా – సోమరిపోతుల గుత్తాధిపత్యం కింద వున్న సంస్కృత భాషను మాట్లాడటం వల్ల పాపం వాళ్లకు వచ్చిపడే లాభాలేమిటో? ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పటం చేతకాక – సంస్కృతాన్ని ప్రజలనెత్తిమీద బలవంతంగా రుద్దాలను కోవటం ఆధునిక మనువాదుల కుట్ర. కొండనాలుకకు మందు రాస్తే ఉన్న నాలుక పోయిందన్నది తెలంగాణ సామెత. సంస్కృతం ఈనాటి జనాలకెలాంటి లాభం కలిగించకపోగా ఊహించని నష్టాన్నే కలుగజేస్తుంది. సామాన్య జనానికి ముఖ్యంగా కింది కులాల వాళ్లకి చదువును దూరం చేసే కుట్రలో భాగంగానే ఈ ఆధునిక మనువులు సంస్కృతం గొప్పదంటూ – దాన్ని బోధనామాధ్యమంగా చేయాలని గొంతుచించుకొని అరుస్తున్నారు. ఎందుకంటే అదివాళ్ల సొంత భాష ఆధిపత్య భాష. వాళ్ల తప్పుడు చరిత్రలను పదిలంగా భద్రపరచిన భాష. సంస్కృతానికి ప్రాచీనమైన చరిత్ర వున్నది మాత్రం నిజం. ఆ చరిత్రకు ప్రజలతో ఎలాంటి సంబంధం లేదన్నదీ అంతే నిజం. ”బండెడు అబద్ధం కంటే చిటికెడు సత్యం కలిసిన అబద్ధం ఎక్కువ ప్రమాదకరమైనది” అంటాడు డాస్టోవస్కీ. ప్రాచీన గ్రంధాలైన వేదాల విషయంలోనూ – సంస్కృత భాష విషయంలోనూ ఈ ఆధునిక మనువాదులు చెప్తున్న మాటలు అట్లాంటి ప్రమాదకరమైనవే.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో