స్నేహశీలి సత్యవతి గార్కి,
ఎలా ఉన్నారు? మీ ఫోన్‌కున్న రింగ్‌టోన్ నాకు చాలా ఇష్టం. మీతో మాట్లాడాలనుకున్న మరునిముషమే ‘వీణ’ తానే ముందు పలకరిస్తూ వాతావరణాన్ని సంగీతమయం చేస్తుంది. దానికి శృతి కలుపుతూ మీ నవ్వుల హోరు విన్పిస్తుంది. ఆ క్షణమే చాలు, మనసు నిండడానికి అనిపిస్తుంది.
మీకూ, శాంతసుందరి గార్కి, కొండవీటిి దగ్గర పోలికలున్నాయి. ఒకసారి మీతో స్నేహం మొదలుపెట్టాక, ఎవ్వరూ మిమ్మల్ని ఒదిలి పోలేరు. అంత స్నేహాన్నీ, ప్రేమనీ, నమ్మకాన్ని కల్గిస్తారు. అందుకే నాకు ఒకోసారి చాలా గర్వంగా, తృప్తిగా అన్పిస్తుంది. ఇంతమంది స్నేహాన్ని నేను పొందాను కదా! అని.
మీకంటే ముందు ఫాస్ట్‌గా నడిచొ చ్చిన అక్షరాలే పరిచయంనాకు. మీ కథల్ని చదివి మనుషులు ఇంత గొప్పగా రాయగలరా అని బోల్డంత ఆశ్చర్యపడేదాన్ని ఎప్పటికైనా మిమ్మల్ని కలుసుకోగలనా అనే అనుమానం కలిగేది. మీ కథల్లోని జీవితం, జీవనస్పర్శ, లోతైన మీ అవగాహన, స్త్రీ వాదధోరణి, పరిష్కారదిశగా ధైర్యంగా అడుగువేసే మీ పాత్రలు, ఇవన్నీ నాకు చాలా అపురూపమైన విషయాలు. అపురూపం అంటే గుర్తొచ్చింది. మీకు ఈ సంవత్సరం ఉత్తమ కథారచయిత్రి అవార్డ్‌ను ‘అపురూప అవార్డ్ ”వాళ్ళు ప్రకటించారు కదా! చాలా సంతోషంగా అన్పించింది. శాంతసుందరి గార్కి కూడా అనువాద రచనలో అవార్డ్‌ను ప్రకటించారు. ‘కేంద్ర సాహిత్య అకాడమీ’ అవార్డును ‘ఇంట్లో ప్రేమ్‌చంద్’కి ఇచ్చారని వినగానే రెట్టింపయింది. ఈ మధ్యఅన్నీ మంచి మంచి వార్తలే వింటున్నాను.
మీరు అనువాదం చేసిన ‘ఒక హిజ్రా ఆత్మకథ’ను నిన్ననే పూర్తి చేశాను. రేవతి నన్ను ఒదిలి వెళ్ళనంటోంది. నిజంగా ఇప్పటి వరకూ హిజ్రాల పట్ల చాలా అపోహలు, భయం ఉండేవి. స్పష్టంగా తెలియదు. కానీ మీ రచన చదివాక నా అజ్ఞానానికి, అవివేకానికి నిజంగా సిగ్గుపడ్డాను. రేవతి తన స్వంత జీవితాన్ని మలిచిన, చూపించిన తీరు అనితరసాధ్యం. ఒక పిల్లవాడైన దొరైస్వామి తాను స్త్రీగా మారడానికి చేసిన జీవన ప్రయాణంలో అతగాడి అవమానాలు, ఆవేదనలు, ఆర్తులు చాలా సహజంగా మీ అనువాదంలో ఒదిగిపోయాయి. రేవతిగా మారిన తర్వాత సమాజంలో ఎదుర్కొన్న స్థితుల్ని సామాజిక భాగస్వామి, ‘సంగం’ లాంటి సంస్థలో పనిచేసిన తర్వాతకూడా ఆమె ప్రేమ వైఫల్యం, జీవితమంతా ప్రేమ కోసం ఆమె పడిన తపన, దొరకని చేదునిజాలు, ప్రతి సందర్భంలోనూ గాయపడ్డ ఆమె శరీరం ఇవన్నీ నన్ను ఒకచోట నిలవనీయలేదు. ఒక గొప్ప పుస్తకాన్ని, కాదుకాదు ఒక గొప్ప అనువాదాన్ని, అదీ కాదు ఒక గొప్ప జీవితాన్ని చూసిన క్షణాలివి. ధాంక్యూ వెరీ మచ్! చాలా మంది తప్పక చదవాల్సింది. సానుభూతి, అసహ్యప్రకటనలు కావు. సహానుభూతి, ఆత్మగౌరవాలను మాత్రమే మేం కోరుకుంటున్నవి అని రేవతి అన్నట్లుగా లక్షల సంఖ్యలో వున్న వారందరినీ సరైన రీతిలోఅర్థం చేసుకోవడానికిది బాగా పనికొస్తుంది. చూశారా మనిద్దరం మాట్లాడు కుందామని ఉత్తరం మొదలు పెడితే, మీరు రాసినరేవతి తన మాట్లాడడం మొదలెట్టే సింది. తెలుగువారికి పరిచయం చేసినందు కుగాను మీకూ, హెచ్‌బిటి గీతా రామస్వామి గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాల్సిందే!
మీరీ మధ్య చాలా తక్కువగా రాస్తు న్నారు. రచయితలు శ్వాసిస్తున్నారనడానికి నిదర్శనం వారి రచనల పుట్టుకే. మీ నుంచి ఇంకెన్నో రావాల్సిన కథల గురించి ఎదురుచూస్తున్నాను. సత్యవతిగారనగానే ‘ఇల్లలకగానే’ అనేది ఎంత ప్రాచుర్యాన్ని పొందిందో గుర్తొస్తే భలేగా అన్పిస్తుంది. ఏ అక్షరాలైతే మన మధ్య స్నేహాన్ని, అభిమాన్ని ప్రొదిచేసామో, అవే అక్షరాలు అక్షరాలా మనతో కడదాకా పయనిస్తాయి కదూ! ప్రతిమ ఎలావుంది? ఆరోగ్యం బాగుంటోందా? చాలా రోజులైంది తనతో మాట్లాడి, మొన్నీ మధ్య ‘విమెన్స్‌డే’ సందర్భాంగా ఇన్‌కమ్‌టాక్స్‌డిపార్ట్‌మెంట్ వాళ్ళు మాట్లాడమని పిల్చారు. ఆఫీసర్ల స్థాయి నుంచి అన్ని రకాల
ఉద్యోగినులు. ఆరోజు మన సమస్యల గురించి మాట్లాడుతూ, వాళ్ళు కూడా వాళ్ళ సమస్యల్ని వివరిస్తూ ంటే, ఆరోజు చాలా బాగా గడిచింది. ఒబిఆర్ స్త్రీలపై హింసకు నిరసనగా పెద్ద సభ భూమిక నిర్వహించింది. 22, 23 ఆర్గనైజే షన్ల నుంచి పిల్లలు వచ్చారంటే, ఇన్ని సంస్థల్ని ఏకం చేయడం కూడా సాధ్యమయ్యేపనికాదు. సత్యవల్లనే సాధ్యమైందది. ఎంతమంది అనాధపిల్లలో, వాళ్ళని చూసి కడుపులోని దుఃఖం కళ్ళల్లోకి వచ్చి చేరింది. కానీ ఎంత ఆత్మ విశ్వాసంతో ఉన్నారో వాళ్ళు. వాళ్ళు ప్రదర్శించినఅనేక కళా రూపాలు, ఆటలు, పాటలు చాలా బాగా గడిచింది. కాలేజీక్కూడా ‘డుమ్మా’ కొట్టానారోజు. కవయిత్రుల సమ్మేళనమూ జరిగింది. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ – అని సినిమా వచ్చింది. ‘క్రాంతి మాధవ్’ అని ‘ఓనమాలు’ సినిమా తీశాడు గతంలో. మంచి సినిమా అది. వీలైతే చూడండి. మా ఫ్రెండ్ సుధక్క కొడుకు. మంచి విలువలున్న వాడు. సినిమా యువతరానికి విలువల్ని నేర్పేదిలా ఉందంటున్నారు. చూస్తే, వీలైతే మీ అభిప్రాయాల్ని చెప్పండి. వచ్చే నెలలో గుంటూరు మీటింగ్‌కి వచ్చేదుంది. మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. చూడాలని ఉంది. ఉండనామరి
– మీ శిలాలోలిత.