ఆహా ఓల్గా! మీ మనసు బంగారం! – మానవత్వం పరిమిళించే కథ ‘ముదిమిసిమి’!
సాహితీ లోకంలో ఓల్గా పేరు వినని వారుండరు. ఆమె అలవోకగా ఎడంచేత్తో కథలు పుంఖానుపుంఖాలుగా రాసిపారేసే రచయిత్రి కాదు. అలా అప్పుడప్పుడు ఒక కథలోనో, కవితలోనో, నవలలోనో కనిపించి, ఆ కధా వస్తువు గురించి అందరూ కొంతకాలం వరకూ వారి మనస్సుల్లోనే పదిలంగా దాచుకుని ఆలోచించేలాంటి రచనలు చేయడం, ఆమెకే తగును. నిన్న భూమిక మార్చినెల పత్రిక పోస్టులో రాగానే, లేచి చూశాను. ముందుగా కనిపించింది ఓల్గా కథ ‘ముది మిసిమి’ ‘పేరెంత గొప్పగా వుంది’. వెంటనే చదివాను. అంతే మనసు నిండిపోయింది. ఆలోచనలు మనసు చుట్టూ ముట్టేశాయి. ఎంత గొప్ప కథ! రావలసిన సమయంలో వచ్చింది. ఈనాటి పరిస్థితులకి అద్దం పట్టినట్టుగా వుంది. ముదిమిలో వారి కోర్కెలు ఎలా వుంటాయో, వయస్సులో వున్నప్పుడు వారూ ఎంతో హాయిగా ఆనందంగా పిల్లల్ని పెంచి పెద్ద చేశాక, వృద్ధాప్యంలో, వయస్సు చేత వచ్చే జబ్బులు, నిస్సహాయత, వాళ్ళని ఎలా కృంగదీస్తుందో, ఓల్గా సరళంగా చక్కగా వివరించారు. రంగమ్మ తల్లి, కూతురు సుజాతల సంభాషణల్లో.
డబ్బులేని వారు, వసతులులేనివారూ తల్లిదండ్రులని చూసుకోలేక వృద్ధాశ్రమాలకు పంపించేవారు కొందరయితే, రూపాయిలో, లేదా డాలర్లు దిమ్మరించి, నెలకీ రెణ్ణెల్లకీ వారిని చేర్పించిన ఆధునాతనమైన వృద్ధాశ్రమాలకు వెళ్లి, మిఠాయిలో, పళ్లూ, పట్టుకెళ్లి పలకరించే వారు మరికొందరు. వాళ్లకి ఆ వయసులో కావలసిని అవి కాదు కదా అని ఆలోచించరు. మరికొందరు ఇంట్లో పెట్టుకున్నా, ఒక స్థలంలో వుండాలంటే ఎవరైనా, అక్కడ కావలసింది కేవలం సౌకర్యాలు కాదు, అక్కడి పరిసరాలు ప్రేమమయంగా వుండాలి. అక్కడి మనసుల వాకిళ్ళు తెరుచుకుని ఉండాలి. అది లేనప్పడు, విసుగు, చిరాకు, కోపం ప్రదర్శిస్దూ కంచంలో పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా రుచించవు. నోటికి పోవు. అది గ్రహించే వారు ఎంతమంది? డబ్బు ఉన్నవాళ్లూ లేనివాళ్లూ కూడా, పూర్తిగా మునిగిపోయేది, సంపాదనా పర్వంలోనే.
ఓల్గా గారి కథలో సుజాత నెలకి యాభైవేల పైచిలుకు సంపాదన గల స్త్రీ! పని ఒత్తిడిలో ఆమె, తను తల్లికి అన్నీ అమర్చి, ఆఫీసు కెళ్లినాగానీ, ఆమె నీళ్లు తాగుతూన్న గ్లాసుని వొణికే చేతులతో పట్టుకోలేక పారబోసుకున్నా, అన్నం మెతుకులు వంటినిండా పోసుకున్నా, చీర నలిపేసుకున్నా, విసుక్కున్న కూతురు సుజాత మాటలకి తల్లిరంగమ్మ, ఎంత చక్కగా నిదానంగా, శాంతంగా సమాధానం చెప్తుందంటే ”నువ్వు చిన్నప్పుడు ఇలాంటి పన్లు ఎన్నిసార్లు చేశావో… నేను ఎన్నిసార్లు అవన్నీ తుడిచి శుభ్రం చేసి, నీకు మూతికడిగి, ఎలా తయారు చేశానో గుర్తుందా? ఇప్పుడు చిన్నప్పుడు నీలాగా, నేను ఆ పరిస్థితిలోనే వున్నాను. నన్ను అలా చూడు”. అని సున్నితంగా చెప్పడం ఈనాటి పిల్లలకి కనువిప్పు.
సుజాత ఆలోచిస్తుంది. తన పిల్లల బాధ్యతలు తీరిపోయాయి. వాళ్లు ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికాలో వున్నారు. తన భర్త బాగానే సంపాదిస్తున్నాడు. తనూ ఇన్నేళ్లు సంపాదించింది. మరో పదేళ్ల సర్వీసూ, ఆ సంపాదనా పోతేనేం? ఆర్ధికంగా ఏ ఇబ్బందీ లేదు.
ఇస్త్రీ చీర మడత నలగకుండా, రోజులో ఎంతో కులాసాగా, చలాకీగా వుండే పండుటాకులాంటి ‘అమ్మ’ రాలిపోతే, మరి కనిపించదు. ఇప్పుడామెకు కావలసింది, ప్రేమగా చూసుకోవడం, మాట్లాడడం, చెయ్యిపట్టి నడిపించడం. అందుకే కొందరు రాలిపోయే తల్లికోసం నిక్షేపంలాంటి ఉద్యోగం మానేస్తున్నావేమిటి అని హేళన చేసినా, సుజాత పట్టించుకోలేదు. భర్త కూడా ఆమెకి సహకరించాడు. అర్ధం చేసుకున్న సంస్కారవంతుడైన వ్యక్తిగా. ఇప్పుడు రంగమ్మకి, సుజాత తల్లి. కథలు చెప్పినా, కవ్వించినా, పాటలు పాడినా, పలకరించినా, ఒక పసిపాపను లాలించినట్టే. రంగమ్మ మనసు ఆనందంతో నిండిపోయి, ఆరోగ్యం కూడా మెరుగుపడింది.
చివరి క్లైమాక్స్! రంగమ్మ పుట్టినరోజు ఎనభై ఎనిమిదేళ్లకి, ఆమె స్నేహితులందరూ ఎక్కడెక్కడున్నారో వెతికి పట్టుకుని, ఆమె బంధువులందరినీ కలిపి, పుట్టిన రోజుని పండగలాగా జరిపించడం. వారితో తల్లి, సంతోషంగా నవ్వుల పువ్వులు వెదజల్లుతూ గడిపిన తీరుని చూసి సుజాత ఆనందించడం. అందరూ గిప్ట్‌గా ఇచ్చిన చీరలని రంగమ్మ, ఒకరిచ్చి వేరొకరికి ఇచ్చీనవి నాకెందుకిన్ని అని పంచేయడం, కళ్ళనీళ్ళు పెట్టిస్తుంది సంతోషంతో.
అసలైన మానవ సంబంధం ఇదే…! ఈనాడు సమాజంలో మాయమైపోతున్నది ఇదే! యువతకి అందించవలసిన విషయం ఇదే! యువత ఆలోచించవలసిన విషయమూ ఇదే! ఇదే వుంటే సమాజంలో సగం రుగ్మతలు అంతరించిపోతాయి కదూ! ఇంత మంచి కథ రాసిన ఓల్గా గారికి, ‘హాట్స్ ఆఫ్…! ప్రతి ఒక్కరూ చదివి తీరాలి. ఆలోచించాలి. అదే నా కోరిక.
ఇక భూమిక, స్త్రీల పాలిటి చక్కటి వేదిక. దాన్ని నడిపించే శక్తిమంతురాలు సత్యవతిగారు. ఆమెకి భగవంతుడు ఇంకా ఎంతో శక్తినివ్వాలని తద్వారా, బాధిత, పీడిత వర్గాలకి, ఎంతో మేలు జరగాలని ఆశిస్తున్నాను.
– శారదా అశోకవర్ధన్, హైదరాబాదు.