పూజ్యులు, పెద్దలు, గౌరవనీయ శ్రీ కొండవీటి సత్యవతి గారికి నమస్కారములతో. భూమిక పత్రిక గత మూడు నెలల నుండి చదువుతున్నాను. బాగుంది. కానీ నేను ఏ ఉద్ద్యేశంతో అయితే భూమిక చదువుతున్నానో ఆ సమాచారం నాకు భూమికలో లభ్యం కావడంలేదు. మా అమ్మ, తరువాత మా అక్క, చెల్లెలు, మా ఇంటి చుట్టు ప్రక్కల ఉండే మహిళలు నాతోపాటు చదువుకున్న నా స్నేహితులు అక్కలు, చెల్లెళ్ళు వీళ్ళ బాధలు, సమస్యలు వాటికి పరిష్కారాలు అన్నీ చూసిన తరువాత అలాంటి వాళ్ళకు అవసరం అయిన చైతన్యం భూమికలో దొరుకుతుంది అనుకున్నాను.
ఉదయం నుండి రాత్రి పడుకోబోయే వరకు అంటే పుట్టుక నుండి చావు వరకు విశ్రాంతి, గుర్తింపు అనేవి లేనిది ఒక్క మహిళలకే! వారి శ్రమకు విలువ, మాటకు గుర్తింపు ఉండదు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ”మనువు” అనే ఒక వెధవ రాసిన పిచ్చిరాతలు ఆడవాళ్ళ బతుకులను హీనంగా తయారు చేశాయి. అలాంటి పరిస్థితులలో వారికి సమాన అవకాశాలు కల్పించింది గౌతమ బుద్ధుడు, తరువాత బి.ఆర్. అంబేద్కర్. ఈ విషయం ఎంతమంది మహిళలకు తెలుసు. ఎంత మంది చైతన్యమూర్తులైన మహిళలు వారి కార్యాలయాల్లో కానీ ఇంట్లో కానీ వారి ఫోటోలు పెట్టుకుంటున్నారు. వారికి మానసిక, శారీర సమస్యలతో పాటు అవగాహనా లోపం, మూఢ నమ్మకాల్లో చట్టపరంగా ఉండే అవకాశాలు మహిళల కోసం ఉన్నటువంటి చట్టాలు వారికి తెలిసేలా చేయటం మన కర్తవ్యం. భూమికలోని అనువాద కథలు నేను అర్థం చేసుకోవడానికే కొంత సమయం పడుతుంది. పాపం అరకొర చదువులు చదివిన సామాన్య గృహిణులు, ఉద్యోగులు, విద్యార్థుల విషయం ఏమిటి?
దూబగుంట రోశమ్మ గారి గురించి విచారించాను. ఆమె బాగానే ఉన్నారు. పత్రికల జోక్యంతో ఆమెకు కావలసిన అవసరాలు అధికారులు ఏర్పాటు చేశారని తెలుసుకున్నాను. మీరు నాకు ఫోను చెయ్యడం చాలా సంతోషం అనిపించింది. ఒక రకంగా అదృష్టంగా కూడా అని పించింది. ఉత్తరంలో పొరపాట్లు ఉంటే మనస్ఫూర్తిగా క్షమించండి. మీ ప్రయత్నాలలో మరో అడుగు విజయం వైపు ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను.
– మీ గౌస్‌బాషా, జర్నలిస్టు, గూడూరు.