యం.రత్నమాల
(నిర్వాసితత్వం – స్త్రీలపై రాజ్యహింస గురించి ఫిబవ్రరి 22-24, 2008 తేదీలలో అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్, మరియు కలకత్తా రిసెర్చ్ గ్రూప్ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో చేసిన ప్రసంగ పాఠం.)
నిర్వాసితులు అవుతున్న ప్రజల గురించి అయినా, నిర్వాసిత ప్రాంతాల గురించి అయినా మాట్లాడాలి అంటే – ముందు వలసల గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే వలసలకు, నిర్వాసితత్వంకు చాలా సంబంధం వుంది. ప్రజలు ఒకచోట నిర్వాసితులు అయినపుడు మరోచోటుకు వలస వెళ్తుంటారు. ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటేనే నిర్బంధంగానో, మాయచేసో ప్రజలను ఆ ప్రాంతం నుంచి నిర్వాసితులను చేయగలిగేది. నిర్వాసితులైన ప్రజలకు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు చూపనప్పుడు ప్రజలు జీవనాధారం వెతుక్కుంటూ వలస పోకతప్పదు కదా! అయితే ఇక్కడ మనకు రెండు అనుభవాలు వున్నాయి. అవి : (1) గతంలో నిర్వాసితమైన ప్రాంతాలు – ప్రజల ప్రస్తుత పరిస్థితి. (2) ప్రస్తుతం నిర్వాసితం కాబోతున్న ప్రాంతాలు – నిర్వాసితులు కాబోతున్న ప్రజలకు ఎదురయ్యే కష్టనష్టాలు. గతంలో ప్రజలకు నిర్వాసితం వల్ల ఎదురయ్యే సమస్యల అనుభవాలు లేవు. గతంలో ప్రజలు నిర్వాసితులు అవ్వడం వలన ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేది వారికి ముందే తెలియదు. ఇప్పుడు కళ్ళముందు ఎన్నో అనుభవాలు వున్నాయి. ఆ అనుభవాలతో ప్రజలు నిర్వాసితులు కావడానికి సిద్దంగా లేరు. ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడానికి గాని, లేక ‘మీరు ఇంతకంటే అద్భుతమైన స్వర్గంలోకి వెళ్తారు’ అని చెప్పినా కూడా ఆ ప్రజలు ఏ మాత్రం నమ్మటానికి సిద్దంగాలేరు. ఆ సిద్ధంగాలేని ప్రజలను నిర్వాసితులను చేయడానికి ప్రభుత్వం బలప్రయెగం చేస్తుంది. చాలా ప్రాంతాలలో బలప్రయెగమే జరుగుతున్నది.
ఒకప్పుడు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు – ప్రజలు వ్యతిరేకించలేదు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయటానికి సిద్ధపడ్డారు. నష్టపరిహారం తీసుకున్నారు. కాని వ్యతిరేకించలేదు. ఇప్పుడు ప్రజలు మేము వెళ్ళం అంటున్నారు. ఆ ప్రజలను ప్రభుత్వం చాలా నిర్బంధ పద్ధతులలో నిర్వాసితులను చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఆ పద్ధతి సామ, దాన, భేద దండోపాయలు అంటారు కదా! అది. అంటే ఆశలు చూపటం, నచ్చ చెప్పటం. నిజానికి ఆశలు చూపటం, నచ్చచెప్పటం అనే కంటే కుట్రలు చేయటం ఎక్కువ చేస్తున్నది. రకరకాలైన కుట్ర పద్ధతులు ప్రయెగిస్తున్నది. ఉదాహరణకు తను ఏ ప్రాంతంలో భూమిని తీసుకోవాలనుకుంటుందో – ఆ ప్రాంతంలో మొట్టమొదట, ముందే కొంతమంది చేత మామూలు కొనుగోలు చేయిస్తుంది. వైయుక్తిక కొనుగోలు అంటే – సామూహికంగా మొత్తం భూమిని కొనకుండా, వ్యక్తిగత స్థాయిలో కొంతమందితోని కొంతమంది ప్రజలకు అవసరం వచ్చినపుడు, కొంత కొంత భూమిని కొనిపించటం. వాళ్ళు తర్వాత ఆ భూములు ఇచ్చేస్తారు. మిగతావాళ్లు తీసుకుంటారు. ప్రభుత్వాల దగ్గర ఈ పద్ధతులు అన్నీ అయిపోయాయి. ఈ పద్ధతులన్నీ అయిపోయాకా, చట్టాలను మార్చే స్థితికి వచ్చాయి. అంటే ప్రభుత్వం, తను ఇచ్చిన అసైన్డ్ భూములను తిరిగి తీసుకుంటాను అంటున్నది కానీ, ఇచ్చినపుడు ఏ స్థితిలో వుంది? ప్రస్తుతం ప్రజలు దాన్ని ఏ స్థాయికి తెచ్చారు? ఆవాసయెగ్యం కానీ, సాగుకు లాయకీ కానీ భూమిని సారవంతంచేసి సాగు చేశారు. ఇవన్నీ చూడకుండా నేను ఇచ్చాను! మళ్ళీ తీసుకుంటాను అంటుంది. అలాగే ప్రభుత్వం స్వంత భూములను, బీడు భూములను అమ్ము కుంటుంది. అది ఒక అంశం అయితే, ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రజలకు గత నిర్వాసిత అనుభవాలున్నాయి.
ఆ అనుభవాల నుంచి చూస్తే, ఆ ప్రజల జీవితాలు, ఆ గ్రామాలు మొత్తం నిర్వాసితం కావడం, నిర్వాసితం అవడం వలన పెద్దఎత్తున నష్టపోయేది స్త్రీలు. చాలామంది మామూలుగా – మీరు హక్కుల సంఘాల వాళ్లు కాబట్టి, పోరాడుతున్న ప్రజల పక్షాన మీరు వున్నారు కాబట్టి, మీరు ప్రతీది రాజ్యహింస అంటారు! ప్రతీది ప్రభుత్వ హింస అంటారు! ప్రతీదాన్ని పోలీసు హింస అంటారు. అసలు నిర్వాసితులు అయిన చోట స్త్రీలకు ఎలాంటి సమస్యలు వున్నాయి? స్త్రీలకు పైనుంచి ఎక్కువ సమస్యలు ఎందుకు ఉన్నాయి? అసలు మీరంటున్న స్త్రీల సమస్యలకు కారణం రాజ్యహింస ఎట్లయితది? అది కుటుంబ హింస అయితది. కుటుంబ హింసను రాజ్యహింస అంటున్నారు అని మనల్ని ప్రశ్నిస్తారు. కాని ఇక్కడ మనం స్పష్టంగా చూడాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే – వ్యక్తీకరణ కుటుంబ హింసలాగే కనపడుతుంది. అంటే ఆ హింస వ్యక్తీకరణ నిర్వాసితులైనాక కుటుంబ హింస రూపంలోనే కనపడుతుంది. కాని అలా జరగటానికి, లేక ఆ పరిస్థితులకు దోహదం చేసింది మాత్రం రాజ్యం, ప్రభుత్వం. బలవంతంగా లేక పయత్న పూర్వకంగా ప్రజలను – అంటే వారికి నచ్చి అయినా, నచ్చచెప్పి అయినా, నమ్మించి అయినా, మోసం చేసి అయినా, ఏ హింసలేకుండా, హింస ప్రయెగించి అక్కడి నుంచి తరలిస్తుంది. కానీ తరలించిన తర్వాత వాళ్ళ జీవితాలు దుర్భరమైన పరిస్థితులలోకి నెట్టబడ్తున్నాయి. ఎందుకంటే ఉదాహరణకు – ప్రజలను నిర్వాసితులను చేసినపుడు వారికి కొంత నష్టపరిహారం రూపంలో ఇస్తారు. అయితే ఇప్పుడు నష్టపరిహారం కాదు, ఒక జీవనాధారం కోల్పోతున్నప్పుడు ఇంకో జీవనాధారం వుండాలి అని అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల సత్రాలు చెప్తున్నాయి. నష్ట పరిహారానికి, జీవనాధారానికి, అర్థం – ఆచరణ – నిర్వచనంలో చాలా తేడా వుంది. ప్రజలను నిర్వాసితులను చేసిన ప్రతిచోటా ఇప్పటివరకూ నష్ట పరిహారమే చెల్లిస్తున్నారు. అయితే ఒక ఐదు, పది సం||రాల నుంచి అంతర్జాతీయంగా గాని, మన దగ్గర గాని, ఈ నష్టపరిహారం అనే పదాన్ని వ్యతిరేకిస్తున్నారు. నష్టపరిహారం కాకుండా జీవనాధారం కల్పించాలి అని అడుగుతున్నారు. కాని ఎక్కడా అలా జరగటం లేదు. నిజానికి స్త్రీ జీవితాన్ని ఎదిగిన చెట్టుతో పోల్చవచ్చు. దాని వ్రేళ్ళు భూమిలో వుంటాయి. నిజానికి మనిషి జీవితం సజీవమైంది. అది ఒక బండరాయి కాదు. అక్కడ నుంచి తీసి ఇంకో చోట పెట్టడానికి. నిజానికి బండరాళ్ళు కూడా ఒక వాతావరణంలో కనపడే రాళ్లు ఇంకో చోట కనపడవు. అలాగే మనుషులు, ముఖ్యంగా స్త్రీలు-వాళ్ళున్న వాతావరణం, ఏళ్ళతరబడి, సంవత్సరాల తరబడి వాళ్ళు నిర్మించుకున్న జీవన పరిస్థితులు అనేవి ఇంకోచోటకు పోవటం వలన మారి అందరి కంటే ముఖ్యంగా స్త్రీలు దెబ్బతింటున్నారు. ఎలాగంటే వారు ఆ గ్రామంలో నుంచి విసిరి వేయబడ్తున్నారు.
నిర్వాసితులైన తర్వాత గ్రామం అంతా గ్రామంలా వుండదు. వేరువేరు ప్రాంతాలకు విసిరివేయబడ్తారు. అలా విసిరివేయబడటం వలన స్త్రీలు తమ సంబంధ బాంధవ్యాలను కోల్పోతారు. అంటే వారికి బాగలేనప్పుడైనా, కష్టం వచ్చినప్పుడైనా, సంతోషం వచ్చినప్పుడైనా, భౌతిక అవసరాలు ఏర్పడినప్పుడైనా ఈ సమిష్టి బలం స్త్రీలకు ఎక్కువగా అవసరం, వాటిని కోల్పోతారు.
తర్వాత కుటుంబ పెద్ద అయిన పురుషుడి చేతికి డబ్బు రావడం వలన ఆర్థిక అరాచకత్వాలకు అలవాటు పడ్తాడు. ఎందుకంటే ఆ డబ్బు పెట్టి తనకు అలవాటైన పని తప్ప ఇంకోపని చేయలేడు. డబ్బు వుంది కాబట్టి రకరకాల విలాసాలకు లేదా ఆర్థిక అరాచకత్వాలకు అలవాటు పడటం ద్వారా సామాజిక అరాచకత్వాలకు, వాటి ద్వారా కుటుంబ అరాచకత్వానికి పాల్పడతాడు. ఎందుకంటే, డబ్బు రకరకాల అరాచకత్వాలను అలవాటు చేస్తుంది. అది ప్రోద్భలం అవుతుంది. దాని వలన కూడా స్త్రీలు నష్టపోతున్నారు. చాలా ప్రాంతాలలో – ఇక పోలవరంలోగాని, సెజ్‌ల ప్రాంతంలో గాని, గ్రామాలకు వెళ్ళినపుడు చూస్తే – నష్టపరిహారం అందుకున్న వారు డబ్బుతో ఉడాయిస్తున్నారు. అప్పటిదాకా అతనికి భూమి వుంటుంది. ఆ భూమి మీద పనిచేస్తాడు. భూమి మీద ఆధారపడే వ్యవసాయ కూలీలకు గాని, చేతివృత్తుల వారికి గాని – ఒక స్థిరమైన జీవితం వుంటుంది. కాని డబ్బుకు అస్థిరత్వం వుంటుంది. స్థిరాస్తులకు అస్థిరత్వంలేదు. చరాస్థి అనే ఆస్తి రాగానే వీరి మనసుకూడా అస్థిరమై పోతుంది. వాళ్లు డబ్బు తీసుకొని కుటుంబం నుంచి ఉడాయించనన్నా ఉడాయిస్తారు. లేకపోతే భూమి పోయి, డబ్బులు చేతికి రాగానే విచ్చలవిడి ఆరాచక జీవితానికి అలవాటు పడ్తారు. ఈ అలవాటు పడటం వలన కలిగే హింస మొదట స్త్రీ జీవితం మీద పడ్తుంది. తర్వాత పిల్లల మీద పడ్తుంది. ఆ తర్వాత వృద్దులమీద పడ్తుంది. ఈ రకంగా నిర్వాసితత్వం వలన స్త్రీల మీద జరిగే హింసను కుటుంబ హింస రూపంలో వ్యక్తీకరించినప్పటికీ దానికి కారణం రాజ్యహింస. రాజ్యం ప్రజల పట్ల బాధ్యతగా వుండాలి. అయితే ప్రజలు తమని ఎన్నుకొని పరిపాలనా బాధ్యత అప్పగించారు, కనుక ప్రజల నిర్ణయాధికారాన్ని వారి నుంచి తాను లాక్కోకూడదు. వారికి బాధ్యతగా వుంటూ, జవాబు దారితనం వహించాలి. కానీ ప్రభుత్వం ప్రజల బాగోగుల ఆలోచన లేకుండా తమ ఇతరేతర ప్రయెజనాలు చూసుకుంటున్నది. ఉదాహరణకు మన దగ్గర తీసుకున్నట్లయితే ప్రభుత్వం బోల్డన్ని అప్పులు చేసి సామ్రాజ్యవాదుల గుప్పిట్లో చిక్కింది. అసలు ఒక
భూమి మీద ఆధారపడే వ్యవసాయ కూలీలకు గాని, చేతివృత్తుల వారికి గాని – ఒక స్థిరమైన జీవితం వుంటుంది. కాని డబ్బుకు అస్థిరత్వం వుంటుంది. స్థిరాస్తులకు అస్థిరత్వంలేదు. చరాస్థి అనే ఆస్తి రాగానే వీరి మనసుకూడా అస్థిరమై పోతుంది. వాళ్లు డబ్బు తీసుకొని కుటుంబం నుంచి ఉడాయించనన్నా ఉడాయిస్తారు. లేకపోతే భూమి పోయి, డబ్బులు చేతికి రాగానే విచ్చలవిడి ఆరాచక జీవితానికి అలవాటు పడ్తారు. ఈ అలవాటు పడటం వలన కలిగే హింస మొదట స్త్రీ జీవితం మీద పడ్తుంది. తర్వాత పిల్లల మీద పడ్తుంది. ఆ తర్వాత వృద్దులమీద పడ్తుంది. ఈ రకంగా నిర్వాసితత్వం వలన స్త్రీల మీద జరిగే హింసను కుటుంబ హింస రూపంలో వ్యక్తీకరించినప్పటికీ దానికి కారణం రాజ్యహింస..
రకమైన నయభస్వామ్యం రాష్ట్రంలో వచ్చింది. ఒకప్పుడు భారీ ప్రాజెక్టుల కోసం – అప్పట్లో భారీ ప్రాజెక్టులకు సంబంధించిన ‘పర్యావరణ స్పృహ’ మన దేశానికే కాదు, ప్రపంచ దేశాలకు కూడా లేదు. లేనప్పుడు ప్రజలు దాన్ని వ్యతిరేకించలేదు. అటు శాస్త్రవేత్తలు గానీ, మేధావులు గానీ, లేక ప్రజల తరపున సామాజిక కార్యాచరణ రంగంలో వున్న కార్యకర్తలు గాని, ప్రజా రాజకీయాలతో సంబంధం వున్న వాళ్ళుగానీ వ్యతిరేకించలేదు. అప్పుడు నిర్వాసితత్వం బలవంతం కాకపోయి వుండొచ్చుగానీ, ఉదాహరణకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వలన నిర్వాసితం అయిన గ్రామాల నుంచే – ఇప్పుడు ఆడపిల్లల అమ్మకం అనేది విపరీతంగా జరుగు తున్నది. అక్కడ దేవరకొండ ప్రాంతం తీసుకుంటే – ఆ గ్రామాలన్నీ కూడా ఒకప్పుడు ప్రజలు సుసంపన్నంగా బ్రతికినవాళ్ళు. నిజమే అప్పుడు కూడా ఆడవాళ్లు చాలామంది పిల్లలను కన్నారు కానీ కష్టాలు లేకుండా హాయిగా బ్రతికారు. అంటే ఎదుగుదల లేకపోయి ఉండొచ్చు కానీ జీవితంలో ఒక సంతృప్తి, కడుపునిండా తిండి, ఒంటినిండా గుడ్డా ఇవన్నీ వుండేవి. అక్కడ ఎక్కువగా లంబాడీలు, ఇతర ప్రజలు వుండేవారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రింద నిర్వాసితులకు ఎంతోకొంత డబ్బు ఇచ్చారు. వారికి వేరే గ్రామాలలో పునరావాసం కల్పించారు. కాని అప్పటి నుంచి ఇప్పటికి కూడా వారి జీవితాలు ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. ఎవరి మీద, ఆధార పడకుండా, ఏ ఒత్తిడి లేకుండా, ఏ కష్టనష్టాలు లేకుండా సాఫీగా గడిపే జీవితం వాళ్ళకు లేకుండా పోయింది. దానివలన కుటుంబాలలోని ఆడవాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి పెరిగింది. నాగలి దున్నడంతో సహా అన్ని పనులు ఆడవాళ్ళు చేస్తారు కాని ఏ రకంగా కూడా ఆడవాళ్ళు హింసలేని జీవితం గడపటం లేదు. ఆఖరికి వారి గర్భసంచులు కూడా కర్మాగారాలు అయిపోయాయి. కర్మాగారాలలో వస్తువులను ఉత్పత్తి చేస్తారు. అట్లాగే గర్భసంచులలో పిల్లలను ఉత్పత్తి చేసి అమ్ముకోవడం అనే దౌర్బాగ్యస్థితికి స్త్రీలు నెట్టబడ్డారు. ‘ఈజీమని’ మొత్తం కుటుంబాన్ని రోడ్డున పడేసింది.
అలాగే ఇంకొక నిర్వాసితత్వం – ఇది బలవంతంగా భూములు ఆక్రమించడం ద్వారా కాకపోవచ్చు ఉదాహరణకు మన కళ్ళ ముందే హైదరాబాద్‌లో డి.బి.ఆర్. మిల్సు తీసుకుందాం. డి.బి.ఆర్. మిల్సులో ఉద్యోగాలు తీసి వేస్తున్నప్పుడు మగవాళ్ళకు ఎంతో కొంత డబ్బు ఇచ్చారు. వారు ఆ పని – అంటే మగ్గంపని, నేత పని తప్ప మరో పని చేయలేరు. ఇతర పనులు చేసే నైపుణ్యంలేదు. ఆ డబ్బులు చేతిలో వున్నాయి. ఆ డబ్బులు అలా కరిగిపోతూ, కరిగిపో్తూనే వున్నాయి. మొత్తం కుటుంబ భారం స్త్రీ మీద పడింది. వాళ్ళు బీడీలు చుట్టీ, ఉప్పరపని, ఆ పని, ఈ పని చేస్తూ కుటుంబాన్ని నడుపుతుంటే ఈ లోపల మగవాళ్ళు పనిచేయకుండ తయారయ్యరు. పని చేయకుండా – ఆర్థిక ఆరాచకత్వానికి, భౌతిక అరాచకత్వానికి ఇట్లా అన్ని రకాల అరాచకత్వాలకు తయారయ్యి మానసికంగా, శారీరకంగా ఏ పని చేయలేని స్థితిలో పడ్డారు. ఇట్లా చాలా నిర్వాసిత ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ఆ తరలించిన కుటుంబా లలో మనకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఆడవాళ్ళ మీద కుటుంబ భారంపడటం. ఎన్నో లెక్కలు చెప్పాయి, మన దేశంలో లేదా రాష్ట్రంలో ఈ పది సంవత్సరాలలో స్త్రీల ఆధారిత కుటుంబాల సంఖ్య 36 శాతం పెరిగింది. ఎందుకు పెరిగిందీ? ఇలాంటి వాటి అన్నింటి వల్ల పెరిగింది. ఇదంతా చూస్తుంటే – మగవాళ్ళు కుటుంబంలో పనిచేయరు, సోంబేరిగా తిని తిరుగుతారు. పైకి ఇది స్త్రీ పురుష వైరుధ్యంగానే కన్పడుతుంది. కాని ఈ వైరుధ్యం తలెత్తటానికి, కరుడుగట్టిన రూపం తీసుకోవడానికి కారణమైనది రాజ్యం, రాజ్యహింస.
ఇదంతా ఒకపక్కన జరుగుతుంటే, ఇప్పుడు మన దగ్గర పెద్దఎత్తున జరుగుతున్న నిర్వాసితత్వం సమస్యలు (1) పోలవరం (2) సెజ్‌లకు సంబంధించినవి. ఇది ఒక్కచోట కాదు. రాష్ట్రం అంతా అన్ని జిల్లాలలో వుంది. చిత్తరు, రాజమండ్రి, విశాఖపట్నం, అనంతపురం, మెదక్ జిల్లాలలో వుంది. ఎక్కడలేదు? దాదాపు నాకు తెలిసి నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో తప్ప అన్ని జిల్లాలలో వుంది. ఎందుకంటే ఈ సెజ్‌ల వారికి చాలా సారవంతమైన, సంపన్నమైన అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో వున్న ప్రాంతాలు మాత్రమే కావాలి. పనికిరాని భూములు ఉన్న జిల్లాలో లేకపోతే ప్రభుత్వంచేత చాలా రోజులుగా రకరకాల కారణాల వలన నిర్లక్ష్యం చేయబడి, అభివృద్ధి చెందని ప్రాంతాలు, వాళ్ళకు అంతపెద్దగా అవసరం లేదు. ఈ రెండు ప్రాంతాలలో (పోలవరం, సెజ్‌లలో) ప్రభుత్వం పెద్దఎత్తున ప్రజలను నిర్వాసితులను చేయడానికి పూనుకుంది. అయితే దీనికి ప్రభుత్వాలు వేస్తున్నముసుగు ఏంటంటే ‘అభివృద్ధి’! పారిశ్రామికాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అంటారు. ఈ అభివృద్ధి ముసుగులో ప్రజలను ఎంతో నమ్మించడానికి చూస్తున్నారు, ఎంత నమ్మించటానికి చూసినా గత అనుభవాల దృష్ట్యా – శ్రీశైల నిర్వాసితులకు ఇంకా నష్టపరిహారం అందలేదన్న విషయం లేదా వాళ్ళకు పునరావాసం సరిగ్గా జరగలేదన్న విషయం ఇలాంటి అనుభవాల వల్ల స్త్రీలకు మిగతా అందరికంటే ఎక్కువగా నష్టపోతున్నారని గ్రహించటం వల్ల ఈ సెజ్‌లకు వ్యతిరేకంగా గాని, పోలవరంకు వ్యతిరేకంగా గాని, యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా గాని జరుగుతున్న ఉద్యమాల్లో, ప్రతిఘటనా పోరాటాల్లో స్త్రీలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. అక్కడ వేసిన పుస్తకాలు గాని, ఆ ప్రాంతంలో చేసిన అధ్యయనాలు చదవటం, చూడడం ద్వారా కానీ, వారి బంధువులు, కుటుంబాల ద్వారా విషయాలు తెలుసు కోవటం ద్వారా సమాచారం తెలుసు కుంటున్నారు. అంటే ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధి పెరుగుతున్న క్రమంలో – సమాచార పరిజ్ఞానం అనేది ఒకచోట నుంచి మరొక చోటుకు సులువుగా చేరుతుంది. సమాచారం ద్వారా అనుభవాలు పెరిగాయి. ఉదాహరణకు అనంతపురం వద్ద కొన్ని జిల్లాలలో అక్కడ కూడా గతంలో రకరకాల కారణాల వల్ల నిర్వాసితులైన కొన్ని గ్రామాలున్నాయి. అక్కడ ఎంత ట్రాఫికింగు (వ్యభిచార వృత్తికి తరలించడం) ఉందంటే – ఒక గ్రామంలో 36 తండాలు వుంటే 30 ఇళ్ళ నుంచి దాదాపు 2సంవత్సరాల లోపు మొత్తం 46 మంది అమ్మాయిలను ఢిల్లీకి, బాంబేకి వ్యభిచార వృత్తికి తరలించారు.
ఈ నిర్వాసిత సమస్య వల్ల కుటుంబంలో అందరికంటే – 16 నుంచి 25, 30 సం||రాల లోపు యువతులు మొత్తం కుటుంబ ఆర్థిక భారాన్ని వెయవల్సిన స్థితికి నెట్టబడ్తున్నారు. వారికి ఒక హామీ వుండే ఉపాధి లేకపోవటంతో దైనందిన జీవితంలో రోజు వారీ ఉపాధి వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకచోట ఉద్యోగం ఉంటే అందులో స్థిరమైన హామీ వుంటుంది. అట్లాకాక నిర్వాసితులు హైదరాబాద్ మొదలైన పట్టణాలకు వస్తారు. అడ్డా కూలీలుగా అక్కడ కూర్చుంటారు. వాళ్ళు రకరకాలుగా దోపిడీకి గురవుతుంటారు. అట్లాగే – చిన్నవయస్సు యువతుల మీద కుటుంబ ఆర్థిక భారాన్ని మోపటం – ఇంతకు ముందు పెళ్ళికాని ఆడపిల్లల్ని, బాలికలను పనులకు పంపించడానికి, అది భూస్వామ్య భావజాలం అయినా ఆడపిల్లల్ని పనికి పంపుతామా? అని ఆలోచించేవారు. అట్లా కాకుండా – ఇప్పుడు ఈ పరిస్థితులలో వీరికి పని దొరకదు, ఇంట్లో డబ్బు ఖర్చు పెట్టడానికి ఆర్థిక అరాచకత్వానికి అలవాటుపడ్డ మగవాళ్లు పని చేయలేరు. కుటుంబాన్ని పోషించరు. పెద్దామె తెచ్చింది సరిపోదు. దాంతో మొత్తం పని భారం ఈ యువతుల మీద పడటం వలన వీరు బయటికి వెళ్ళి పనులను వెతుక్కునే క్రమంలో – వారి మీద రకరకాల దోపిడీ జరుగుతుంది. అందులో ఆర్థిక దోపిడీ ఒకటి. అంటే తక్కువ కూలీకి పనిచేయటం అనేది ఆడపిల్లలకు, అలాగే మగవాళ్ళకు, ఏ రోజుకారోజు పని వెతుక్కునే వారికి ఎప్పుడూ ఒక అనిశ్చిత పరిస్థితి వుంటుంది. ఆర్థికంగా వీరికి న్యాయమైన కూలీగాని, వేతనంగాని లభించదు. దాంతోపాటు ఆడపిల్లలు అవటం వలన వారు లైంగికమైన దోపిడీలకు గురి అవుతున్నారు. అనివార్యంగా వాళ్ళు కుటుంబాలను గడపటానికి ఏ రోజుకారోజు డబ్బులు తీసుకు రావాల్సిన పరిస్థితిలో ఉండడం వలన ఆ పరిస్థితిని ఆధారం చేసుకొని ఎక్కువ మందిని ట్రాఫికింగులోకి లాగటం లేదా అక్కడున్న పెద్ద కంపెనీల్లో, చిన్న చిన్న కంపెనీల్లో యజమానులు వాళ్ళని ఉపయెగించుకోవటం అనేది జరుగుతుంది. ఇదంతా హింసకు పరాకాష్ట. దీని వెనకాల మనకు ప్రత్యక్షంగా రాజ్యం కనపడటంలేదు. కాని తప్పకుండా రాజ్యం వుంది. వారిని నిర్వాసితులను చేసింది రాజ్యమే. ఇంతవరకూ నిర్వాసితత్వం అనేది స్త్రీలపై హింసకు ఏ విధంగా కారణం అవుతుందో చూశాము.
ఇప్పుడు ప్రజలను నిర్వాసితులను చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఈ రెండు విషయలు చాలా తీవ్రమైనవి. ఎంత తీవ్రమైనవి అంటే మహిళా ఉద్యమాలు కాని, పౌరహక్కుల ఉద్యమాలు కాని, అన్ని రకాల సామాజిక ఉద్యమ కార్యకర్తలు కాని దృష్టిని కేంద్రీకరించవల్సినంత తీవ్రమైన సమస్యలు. ఎందుకంటే ఈ సెజ్‌లు ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అనేవి – వాటి కోసం చేసిన చట్టం చూస్తే – ఏ ఒక్క దేశీయ చట్టం అక్కడ అమలుకాదు. ఉదాహరణకు – సామూహిక లైంగిక బలత్కారానికి గురియైన స్త్రీకాని, యువతి కాని, బాలిక కాని వుంటే – మనం వెంటనే పోలీసుల దగ్గరకు వెళ్ళి కేసువేస్తాం, డిమాండ్ చేస్తాం. కాని ఈ సెజ్‌లలో ఏదైనా జరిగితే – పోలీసువాళ్ళు కూడా పోయి – అయ్య మేము మీ ప్రాంతంలోకి రావచ్చా? ఫలానా సంఘటన జరిగిందంట? విచారించవచ్చా? అని అనుమతి తీసుకోవాలి. అంటే అవి పాత అగ్రహారాల్లాగా – ఒకప్పటి రాచరిక వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ ఈ దేశంలో కొందరికి అగ్రహారాలు ఇచ్చింది. ఆ తర్వాత కొందరు రాజులు బ్రిటీష్ వారి ఈస్ట్‌ఇండియ కంపెనీకి కొన్ని ప్రాంతాలు ఇచ్చి ఇవి మీరు ఏలుకోండి అన్నారు. కాని ఇప్పుడు ఈ ఆధునిక సామ్రాజ్యవాదం పట్టు పెరిగిన దశలో, సామ్రాజ్యవాదులకు లేక వారితో మిలాఖత్ అయిన దళారీలకు, ఒక ప్రాంతాన్ని, అగ్రహారాల్లాగా, జమీందారీల్లాగా కట్టబెడ్తుంది. ఆ జమిందారీల్లో ఏమి జరిగినా ఏమీ చేయటానికి లేదు. మిగతా అన్ని విషయాలకంటే కూడా ఇలాంటి పరిస్థితుల్లో – బయట ప్రపంచం ప్రవేశించటానికి అనుమతి లేని వాతావరణంలో ఎప్పుడూ అందరికంటే పెద్దఎత్తున నష్టపోయేది స్త్రీలు – ఆ పరిస్థితి వాటిల్లో కలుగబోతుంది.
ఇక పోలవరం విషయం తీసుకుంటే స్త్రీలు ఎందుకు ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు అంటే – నేను పోలవరం ప్రాజెక్టు మొదలు గ్రామాలు నుంచి చివరి గ్రామాలు వరకు చూశాను. చివరి గ్రామాలు తీసుకుంటే – 13 సంఘటిత గ్రామాలు (క్లస్టర్ ఆఫ్ విలేజస్), ఒకప్పుడు కొండ మొదలు 13 గ్రామాలు వుండేవి. ఇప్పుడు 35 గ్రామాల దాకా పెరిగాయి. ఈ గిరిజనుల గురించి ప్రభుత్వం ఏమంటుంది? ఈ గిరిజనులు అభివృద్ధి చెందవద్దా? వాళ్ళు అడవులలోనే వుండాలా? వాళ్ళు బయటికి రావద్దా? వాళ్లు నాగరికులు కావొద్దా! అంటారు. ఇక్కడ పంజాగుట్టలో బిల్డింగులు, ఆస్తులు ఇచ్చిన తల్లిదండ్రులను రోడ్డుమీద పడేస్తే – చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అన్నం పెట్టారు. అలాంటి సంస్కృతి కావాలా? సమిష్టి సంస్కృతి కావాలా? నిజానికి ఆ గ్రామాలలో వ్యక్తిగత పట్టాకానీ, వ్యక్తిగత భూములు కాని ఉండవు. మొత్తం గ్రామానికి కలిపి పంచాయితీ పట్టా వుంటుంది. అందరూ సమిష్టిగా వ్యవసాయం చేసుకుంటారు.
అయితే ఎవరికివారికి పొలాలకు గట్లు వుంటాయి. సమిష్టిగా పనులు చేసుకుంటారు. అట్లాగే ఆ గ్రామంలో ఏ స్త్రీకి అయినా పురుడు వస్తే, ఇంట్లో పెద్దవాళ్ళు లేనట్లయితే గ్రామంలోని ఇతర స్త్రీలు వచ్చి ఆమెను హాస్పిటల్‌కు తీసుకువెళ్ళడమో, మంత్రసానితనం చేసి పురుడుపోయడమో చేస్తారు. ఇలాంటి సమిష్టిసంస్కృతి పోతుంది కాబట్టి స్త్రీలు వ్యతిరేకిస్తున్నారు.
ప్రభుత్వాలకు ప్రేమ వుండి, ఆ గిరిజనులను అభివృద్ధి చేయదల్చుకుంటే, మొదట వాళ్ళు వున్న ప్రాంతాలను అభివృద్ధి చేయలి. మహిళా ఉద్యమాలు, హక్కుల ఉద్యమాలు ఏమి అడుగుతున్నాయంటే – ఎవరినైనా అభివృద్ధి చేయాలి అంటే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలి. ఆ తరువాత అక్కడే పాఠశాలలు పెట్టవచ్చు, చిన్న పరిశ్రమలు పెట్టవచ్చు, ఏమైనా అభివృద్ధి చేయవచ్చు అని చెప్తున్నారు.
నిజానికి ఇప్పుడు నందీగ్రామ్ విషయం తీసుకుందాం. ఏ ప్రభుత్వం అయినా సరే అది కాంగ్రెస్ కావొచ్చు, కమ్యూనిస్ట్ కావొచ్చు, ఎవరైనా కావొచ్చు, సామ్రాజ్యవాదులకు అనుకూలంగా వున్న ప్రభుత్వాలు ఏవైనా సరే ప్రజలకు న్యాయం చేయవు అన్న సంగతి ఈనాడు ప్రజలు అర్థం చేసుకున్నారు. నందీగ్రామ్ ఎంత మంచి ప్రాంతం అంటే, అక్కడి ఇళ్ళ చుట్ట పొలం వుంటుంది, చేను వుంటుంది. తమలపాకు తోటలు వుంటాయి. అక్కడ నాలుగు పంటలు పండుతాయి. అందులో రెండు శాశ్వత పంటలు. గట్లమీద పెరిగే పోక చెట్లు లాంటివి రెండు దిగుబళ్ళు ఇస్తాయి. వ్యవసాయపంటలు, కూరగాయలు మూడు నాలుగు దిగుబళ్ళు ఇస్తాయి. ఇన్ని పంటల మీద ఎవరికీ ఎకరం ఎకరంన్నర మించి పొలంలేదు. కానీ అవన్నీ ఉమ్మడి కుటుంబాలు. ఎవరో ఒకరు ఉద్యోగం చేస్తే చేస్తారు, చేయని కుటుంబాలు కూడా వున్నాయి. ప్రతి ఇంటికి ఆ పొలం దగ్గర ఒక నీటి అఘాతం (నీటి గుంట) వుంటుంది. వాళ్లు రోడ్డుమీదకి వెళ్ళటానికి వాళ్లే సొంతంగా వేసుకున్న బ్రిడ్జి వుంటుంది. చిన్న పిల్లలు కూడా – పెద్దవాళ్ళు పనులకు వెళ్ళినపుడు, ఆ నీళ్ళల్లోకి దూకి ఒక చేపను తెచ్చుకొని కాల్చుకొని తింటుంటారు. ఇంత సుసంపన్నమైన స్వయం సమృద్ధి గ్రామాలను మొత్తంగా తీసివేయలని చూస్తున్నారు. నిజానికి పారిశ్రామికాభివృద్ధి చేయదల్చుకుంటే, అక్కడ 5,234 మూతబడిన పరిశ్రమలు వున్నాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు మూతపడిన చిన్న తరహా కుటీర పరిశ్రమలు. వీటిని పునర్ నిర్మించవచ్చు కాని చేయరు. ఇదంతా ప్రజల కోసం, అభివృద్ధి కోసం అంటే నమ్మటానికి ప్రజలు ఎంత వత్రం సిద్ధంగా లేరు. మన దగ్గర కూడా ప్రజలు సిద్ధంగా లేరు. మన దగ్గర పోలవరం ప్రాజెక్టు క్రింద మొత్తం 276 ముంపు గ్రామాలున్నాయి. ఇంకా ఎక్కువే అనుకుంటున్నారు. అంటే ఇవి మొత్తం మునిగిపోయే గ్రామాలు. ఇదికాక కొంత అడవి వుంది. దీని క్రింద 3లక్షల మంది ఆదివాసీ ప్రజలు నిర్వాసితులు అవుతారు. దాదాపు 2లక్షలపైన కుటుంబాలు నిర్వాసితం అవుతాయి. ఇట్లాగే ఈ సెజ్‌ల క్రింద తీసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ కూడా 3.5 లక్షల మంది దాదాపు 2.5 లక్షలపైన కుటుంబాలు, మొత్తంగా గ్రామాల లెక్కన తీసుకొన్నా కొన్ని వేల గ్రామాలు లేచిపోతాయి.
ప్రజలను మొత్తంగా రోడ్డుమీద పడేసి వాళ్ళను రోజువారీ అడ్డాకూలీలుగా ఏ దినం కూలీ ఆ దినం, ఏ దినం భత్యం ఆ దినం వెతుక్కునే స్థితికి నెట్టబడ్తున్నారు. ఈ అనిశ్చిత ప్రభావం అనేది అందరికంటే ఎక్కువగా స్త్రీల మీద వుంటుంది. ఎందుకంటే మనం ముందునుంచీ చూస్తే కూడా, ఆదిమ సమాజంలో పురుషుడి కంటే స్థిర జీవితాన్ని వెతుకున్నది స్త్రీ. ఎందుకంటే స్థిర జీవితం అనేది స్త్రీకి అనివార్యమైన భౌతిక అవసరం. అది మొత్తం మానవజాతిని అభివృద్ది చేస్తుంది, కాబట్టి మానవుడికి అది అవసరం. కాని అది స్త్రీకి తప్పనిసరి అయిన పకృతిపరమైన అన్ని అవసరాల నుంచి, ఒక భౌతిక పరిస్థితిలోనుంచి వచ్చింది. దాన్ని వెతుక్కున్నది స్త్రీ. కాబట్టి అనిశ్చితత అనేది పురుషుడి కంటే స్త్రీకి చాలా కష్టదాయకమైనది, నష్టదాయకమైనది. ఇది స్త్రీ జీవితాన్ని మొత్తంగా విధ్వంసం చేస్తుంది. అందులో ఈ పితృస్వామ్య విలువలు వున్న సమాజంలో – ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా వాటి ప్రభావం మొదట స్త్రీ మీద పడ్తుంది. అయితే ఇన్ని రకాల కారణాలు, ఇంత స్పష్టమైన అవగాహన రీత్యా కాకపోయినా నిర్వాసిత ప్రాంతాల్లో అనుభవాల రీత్యానే అక్కడ వున్న స్త్రీలు, పురుషులు ముఖ్యంగా స్త్రీలు వీటిని వ్యతిరేకిస్తున్నారు.
ఇకపోతే విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు జరుగుతున్న గంగవరం పోరాటంలో నిజానికి ఎక్కువ అరెస్ట్ అయింది స్త్రీలు, దెబ్బలుతిన్నవాళ్ళు స్త్రీలు. ఎవరో చెప్పారు ! వాళ్ళు అంటున్నారంట! భూమి పోవట్లేదు కదా! మీ వృత్తిపోతుంది అంటున్నారు. వృత్తిపోతుందీ అంటే ఏమిటి? ప్రధానంగా కుటుంబ వృత్తులు-నేతపని, చేపలు పట్టటం ఇలాంటివి అన్ని కూడా మొత్తం కుటుంబానికి ఉపాధి ఇచ్చేవి. ఈ పనులు ఇంకా మిగిలివున్నాయి. అట్లాంటి వృత్తి మత్స్యకారులు చేసేది అందులో ఆడవాళ్ళకు చాలా పని వుంటుంది. వాళ్ళు చేసే మార్కెటింగు చాలా ప్రధానమైనది. అందుకని – ప్రధానమైన పని చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక సాధిక్యత వుంటుంది. వ్యవసాయరంగంలో కూడా మిగతా పారిశ్రామికీకరణ చెందిన ప్రాంతాల కంటే, స్త్రీకి ఒక రకమైన సాపేక్ష సాధికారత వుంటుంది. ఇందుకు కారణం ఏంటంటే – వాళ్ళకున్న పని ప్రాధాన్యత. ఇప్పుడైతే అందరూ విత్తనాలు కొనుక్కుంటున్నారు. అవి పని చేయటంలేదు లేకపోతే పుచ్చు విత్తనాలు అవుతున్నాయి లేకపోతే విషవిత్తనాలు అవుతున్నాయి లేకపోతే పంటను పెంచేది కాక పురుగులను పెంచే విత్తనాలై ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాని ఒకప్పుడు విత్తనం మొలకెత్తించటం అనేపని స్త్రీలు చేసేవారు, వాళ్ళు వూర్లల్లో ఇట్లా మొలక కట్టేవారు. నేను నా చిన్నతనంలో కూడా చూశాను ఇండ్లల్లో చేసేవారు. వాటిని భద్రంగా చూసి ఏ సమయనికి వాడాలి అనేది చూడటం ఆడవాళ్ళ పని. కుటుంబంలో, సొమాజంలో ఆడవాళ్ళు చేసే పనిని చాలా ప్రధానమైనదిగా చేసే సాధిక్యత క్రమేణా పోతుంది. అలాగే చేపలు పట్టే పనిలో స్త్రీలు చేసే పనికి భద్రతలేకుండా పోతుంది. ఒకప్పుడు గతంలో నిర్వాసితత్వం అనేది ఎక్కువగా మైదాన ప్రాంతాలలో వుండేది, ఆదివాసీ ప్రాంతాలలో ఉండేది. ఇప్పుడు ప్రధానంగా ఈ నిర్వాసితత్వం, ప్రభుత్వం ఏ భూములను అయితే ఆక్రమించుకొని ఎవరికి కట్టబెట్టాలి అనుకుంటుందో ఆ సెజ్‌ల ప్రాంతాలలో వుంది. ఇప్పుడు ఈ చిత్తూరు జిల్లాలో తీసుకుంటే ఇప్పటికే అందరూ భూములు అమ్ముకున్నారు. ఎందుకంటే అక్కడ బ్రతకటం కష్టం. ఆ భూమి సాగుకురాదు, దానికి డబ్బురాదు. ముందు భూములు అమ్మడానికి అక్కడ స్త్రీలు కూడా వ్యతిరేకించటంలేదు. అమ్ముకున్న తర్వాత అసలు పరిస్థితి వాళ్ళకు ఇప్పుడు అర్థమవుతున్నది.
అసలు ఈ పోలవరం ప్రాజెక్టు కాని, సెజ్‌లు కాని గిరిజన, ఆదివాసీ ప్రాంతాలలోనే ఎందుకు కేంద్రీకరించబడినాయి? ఎందుకంటే ఈ ప్రాంతాలలో అపారమైన ఖనిజ సంపద వుంది. అలాగే 1800వ సం|| నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ విధానాలపై గిరిజనులు నిరంతరం పోరాడుతూనే వున్నారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని గానీ, వ్యక్తిత్వాన్ని గానీ, వాళ్ల జీవిత విధానాన్ని గాని దెబ్బతీసే ప్రతి ప్రయత్నాన్నీ వాళ్ళు ప్రాణాలను ఒడ్డి ప్రతిసారీ ఎదుర్కొన్నారు. ఈ ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు కూడా. అడ్డుకుంటు న్నప్పుడు ప్రభుత్వం కొంత వెనక్కు తగ్గినట్లు సంస్కరణలు చేసినట్లు, కొత్త చట్టాలు చేసినట్లు కన్పిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం 1/70 చట్టం చేసింది. రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యల్స్ గిరిజనుల షెడ్యల్ ప్రాంతాలకు సంబంధించినవి. 6వ షెడ్యల్ క్రింద ఈశాన్య రాష్ట్రాలు, 5వ షెడ్యల్ క్రింద మిగతా రాష్ట్రాలు వస్తాయి. 1/70 చట్టం ప్రకారం – గిరిజన ప్రాంతాలలో భూములు కొనాలన్నా – అమ్మాలన్నా గ్రామ సభల అనుమతి తీసుకోవాలి ప్రభుత్వమైనా సరే.
నిజానికి నేను పోలవరం వెళ్ళినపుడు అక్కడ ఒక రాతిపై – ఈ ప్రాంతాలలో భూములు కొనాలన్నా, అమ్మాలన్నా గ్రామసభల అనుమతి తీసుకోవాలి అని 5వ షెడ్యల్‌లోని రూల్స్ & రెగ్యులేషన్స్ రాసి వున్నాయి. అయితే ప్రభుత్వం ఈ నిబంధనలు పట్టించుకోలేదు. ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించినందుకు ప్రజలను అరెస్టు చేశారు. ఇక్కడ పబ్లిక్ హియరింగు వద్దకు ఊరేగింపుగా వచ్చిన ఆడవాళ్ళను, మగవాళ్ళను పశువులను బందెల దొడ్డెలో తోలినట్లు తోలారు. వారిమీద అంత నిర్భంధం ప్రయెగించారు. ప్రభుత్వం చట్టాలను పాటించకుండా ఆదివాసీ ప్రాంతాల మీదే ఇంత హింస ఎందుకు ప్రయెగిస్తుందంటే – అక్కడ అపారమైన ఖనిజ సంపద వుంది. దానిని ఆ సెజ్‌ల వారికి ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ సంపదను తరలించుకు పోయే అవకాశాన్ని వారికి ఇస్తుంది. ఈ చర్యల వలన – రాజ్యాంగం ఇచ్చిన సౌర్వభౌమత్వాన్ని రాజ్యం కోల్పోతుంది. ఇది కనిపించని ఒక వలసవాదం. ఒకప్పుడు బ్రిటీష్ పాలనలో ఈ వలసవాదం ప్రత్యక్షంగా కనిపించింది. ఇప్పుడు ఈ సామ్రాజ్యవాదం అనేది కనపడకుండానే మొత్తం మన దేశాన్ని పారిశ్రామికవాడలుగా తయారు చేయదల్చుకుంది. ఈ పారిశ్రామికవాడలలో వారికి అవసరమైన ఉత్పత్తులను, ఖనిజ సంపదలను, ముడిపదార్ధాలను దోచుకొని పోవడానికి అవకాశం ఇస్తుంది. అయితే ఇక్కడికంటే కూడా ప్రతిసారీ గిరిజనులు వాళ్ళకున్న శక్తులు, డబ్బు, పలుకుబడి అన్నీ తక్కువైనప్పటికీ కూడా, అన్నిటికంటే మానవశక్తి గొప్పది అని నిరూపించారు.
ఆయుధశక్తికన్నా కూడా మానవ శక్తి గొప్పది అని నిరూపించారు. ప్రతీదాన్ని తిప్పికొట్టగల్గారు. ఉదాహరణకు శ్రీకాకుళ ఉద్యమం తీసుకోవచ్చు, లేకపోతే అల్లూరి సీతారామరాజు ఉద్యమాన్ని తీసుకోవచ్చు లేకపోతే కొమరం భీము పోరాటాలను ఏ పోరాటాలను తీసుకున్నా, ప్రతిచోటా గిరిజన ప్రాంతాలలో చొచ్చుకుపోయి వారి జీవితాన్ని కల్లోలపరిచే ఏ ప్రయత్నాన్నైనా వారు తీవ్రంగా అడ్డుకున్నారు. అందుకని ఇప్పుడు కూడా ఆ ప్రాంతాలలో అంతే స్థాయిలలో ఉద్యమాలు మొదలవుతున్నాయి. మిగతా ప్రాంతాలలో ప్రభుత్వం నిర్బంధంతో ఎంతోకొంత భూములను సేకరించ గల్గింది. నిర్బంధంగా అక్వైజిషన్ నోటీసులను ఇచ్చింది. నిజానికి ఈ నోటీసులు ఎంత భయంకరం అంటే ఒక పక్క నుంచి – ఫ్రెంచి రెవల్యూషన్ తర్వాత స్వేచ్ఛా, సౌభ్రాతృత్వాలు, పారిశ్రామికీకరణ తరువాత కార్మిక చట్టాలు వచ్చాయి. ఎనిమిది గంటల పని అని చాలా అనుకుంటున్నాం. ఎనిమిది గంటల పని విధానం అనేది కాల్‌సెంటర్స్ వచ్చాక పోయింది. అదేదీ లేదు. కార్మిక చట్టాలు అయితే ఉన్నాయి కాని అవి అమలు జరిగే పరిస్థితి లేదు.
సెజ్‌లలో తీసుకుంటే ఏ కార్మిక చట్టాలు, ఇండస్త్రీయల్ డిస్‌ప్యూట్ యాక్ట్ (పారిశ్రామిక వివాదాల చట్టం), అలాగే ఆడవాళ్ళకు మెటర్నిటీ బెన్‌ఫిట్ యక్ట్ (ప్రసూతి సెలవు)తో సహా ఏదీ వర్తించదు. ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ వుండదు. అక్కడ కార్మిక చట్టం ఒక్కటి కూడా వర్తించదు. ఇంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలో, మూడవ ప్రపంచ దేశాలలో, వలసవాద దేశాలలో వలసవాదుల పాలన ఉన్నప్పుడు పోరాడి తెచ్చుకున్న చట్టాలు – వేటికి అవకాశం లేకుండా పోతుంది. ఒకరకంగా సమాజాన్ని మళ్ళీ బానిస వ్యవస్థలోకి నెట్టే పరిస్థితులను, సమాజాన్ని రాచరిక వ్యవస్థలోకి నెట్టే పరిస్థితులను పునరుద్ధరించే ప్రయత్నం జరుగుతుంది. అది కూడా కన్పించకుండా జరుగుతుంది.
ఇక పోలవరం సంగతి తీసుకుంటే. పోలవరంలో మొట్టమొదటి గ్రామాలలో కూడా – అవన్నీ పోడు వ్యవసాయం ద్వారా గిరిజనులు నిర్మించుకున్న గ్రామాలు. కృష్ణానది పరీవాహక ప్రాంతం, గోదావరి నది పరీవాహక ప్రాంతం రెండూ సారవంతమైనవి. మన దగ్గర చిన్న చిన్న మొక్కలుగా కనపడేవి. అక్కడ పెద్దపెద్ద వృక్షాలుగా కనపడతాయి. వూరికే వేస్తేనే చాలు మొలకెత్తుతాయి. అక్కడ అడవిలో మొలిసినా, ప్రక్కన మొలిసినా గాని – పెద్దగా పెరుగుతాయి. అక్కడ చేపలు కూడా చాలా రుచికరంగా వుంటాయి. అలాంటివి ఇంకో ప్రాంతంలో దొరకవు. అక్కడ ఒక సీజన్‌లో మొత్తం వరదలు వస్తాయి. వాళ్ళు అక్కడ గృహాలు కూడా ఎట్లా నిర్మించుకుంటారంటే – మొదట స్తంభాలు కడతారు, స్తంభాలు ఎత్తుగా కట్టి క్రింద అంతా స్థలం వదిలి పెడ్తారు, మనకు సెల్లార్ వదిలిపెట్టినట్లు. పైన ఇల్లు నిర్మించుకుంటారు. అంటే వరదలు వస్తే మునిగిపోకుండా వుండటానికి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. వరదలు వస్తే నీటిసారం అంతా పొలాల్లోకి చేరుతుంది. ఆ సీజన్‌లో పంట వేయకుండా వరదలు వచ్చిపోయినాక వేస్తారు. అంటే అక్కడ పకృతి శాస్త్రాన్ని ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎంతగా అధ్యయనం చేశారో అర్ధం చేసుకోవచ్చు. ఎప్పుడు పంటలు వేయలి? ఎప్పుడు పంటలు వేయకూడదు? ఏవిధంగా ఇళ్ళు నిర్మించుకోవాలో వారికి తెలుసు. వాళ్ళు ఇంకో ప్రాంతానికి వెళ్తే ఈ జ్ఞానం అంతా దేనికి ఉపయెగపడ్తుంది? అంటే సమాజ జ్ఞానాన్ని కూడా నిరుపయెగం అయ్యేట్లు చేస్తున్నారు? అలాగే వాళ్ళు పాఠశాలలు కూడా ఎంతో పోరాడి సాధించుకున్నారు.
ఇప్పుడు ప్రభుత్వం – గిరిజనుల జీవితాలను అభివృద్ది చేస్తాం అంటుంది కదా? పోలవరం మొదలు గ్రామాల వాళ్ళు, చివరి గ్రామాల వాళ్ళు పోలవరం ప్రాజెక్టు పొడుగతా ఉన్న గ్రామాల గిరిజనులు కూడా తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్నవాళ్ళే. ఖమ్మం జిల్లా మొత్తం ఆ సాయుధ పోరాటానికి దన్నుగా నిలబడింది. పోరాటం సాగిన గ్రామాలు కాబట్టి ఆ గ్రామాల ప్రజలు అభివృద్ధి చెందారు. మొత్తం మైదాన ప్రాంతాలు, ఇతర విషయాలు కూడా అంటే బయట ప్రపంచ జ్ఞానాన్ని అందుకుని – వాళ్ళ సంస్కృతిని వదులుకోకుండా, ఆ బయట జ్ఞానాన్ని తిరస్కరించకుండా రెండింటిని సమ్మేళించి అభివృద్ధి చెందిన గ్రామాలు ఆ మొత్తం కూడా. మొత్తం 25 లక్షల పైగా కుటుంబాలను కలిగి దాదాపు రెండువేలపైన గ్రామాలుంటాయి. ఇవన్నీ ఆ రకంగా అభివృద్ధి చెందిన గ్రామాలు. అంటే ఆదివాసీ సమాజం – బయట సంస్కృతిని తిరస్కరిస్తుందని ప్రభుత్వాలు ఏ ఆరోపణ చేస్తున్నాయో, ఆ ఆరోపణ అక్కడ నిరాధారం అయింది. ”వాళ్ళు తిరస్కరిస్తున్నారు. మేము వాళ్ళని బయటికి తెచ్చి అభివృద్ధి చేస్తాం” అంటున్నారు. కానీ ఆ వాదన ఎంత శుద్ధ అబద్ధమో ఆ గ్రమాలను చూస్తే అర్థమౌతుంది. వాళ్ళు రెండింటిని మేళవించి అభివృద్ధి చెందుతున్నారు. ఇక్కడిలాగా కుటుంబాలను లేదా వృద్ధులను అందరినీ తిరస్కరించరు లేదా నిరాదరణ చూపరు. అంటే అక్కడ ఉమ్మడి కుటుంబాలు వుంటాయి. పూర్తిగా అన్నిచోట్ల సమిష్టి వ్యవసాయం లేకపోయినా కొండమొదలు ప్రాంతంలో గ్రామాలకు మొత్తంగా పంచాయితీ పట్టాలుంటాయి. అటుచివర శ్రీకాకుళ ఉద్యమం కొనసాగిన గ్రామాలకు, ఇటు ఖమ్మంలో సాయుధ పోరాటం సాగిన గ్రామాలు వున్నాయి. ఈ రెండు ప్రాంతాలకు కొంతతేడా వున్నప్పటికి అవి ఈ రకంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు.
అయితే ఇప్పుడు విశాఖ ఏజెన్సీలో వున్న సెజ్‌లను తీసుకుంటే – అక్కడి అరుకులోయ ఎంత టూరిజం సెంటర్. అది ఎంత మంచి ప్రాంతం, ఎంత సారవంతమైన ప్రాంతం, అలాంటి ప్రాంతంలో పాడేరు ఏజెన్సీ మొత్తం – తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని మండలాలు, విశాఖ జిల్లా ఏజెన్సీలో కొన్ని మండలాలు కలిపి 14 మండలాల్లో జిందాల్‌కు అక్కడ బాక్సైట్ గనులను త్రవ్వడానికి, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి 2005లో ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ అనుమతి ఇచ్చిన క్రమంలో అక్కడ ప్రజలు తిరగబడ్డారు. సెజ్‌లను రానివ్వమని ఎంతో తీవ్రమైన ఉద్యమం చేశారు. దాంతో పోలీసులు అక్కడ కూంబింగులు నిర్వహించారు. ఏమన్నా అంటే ప్రభుత్వాలకు ప్రతీదానికి నక్సలైట్లు, మావోయిస్టులను కారణంగా చూపుతాయి. నక్సలైట్లు కూడా కాదు – నక్సలైట్లు అని ఒకప్పుడు అనేవారు ఇప్పుడు మావోయిస్టులంటారు. చంపదల్చుకుంటే మావోయిస్టులంటారు. నిర్బంధం పెట్టదల్చుకుంటే నక్సలైటు అంటారు. రెండింటికి కొంచెం తేడా వుంది. అంటే నక్సలైట్లల్లో చాలా గ్రూపులున్నాయి. కొన్నిగ్రూపుల పట్ల అంతగా కార్నర్ చేయలేదు. వారిని చంపదల్చుకుంటే మావోయిస్టులంటాఏజెన్సీ ప్రాంతాలపై 2005 నుంచి ఇప్పటిదాకా చెప్పనలవి కాని నిర్బంధం ప్రయెగిస్తున్నారు. ఆ చేసే క్రమం ఎంతదూరం పోయిందంటే – ఆ పాడేరు ఏజెన్సీలో జి.మాడుగుల మండలం వుంది. నిజానికి ఈ జి.మాడుగుల ఇప్పటికి అప్పజెప్పిన ప్రాంతం క్రిందికి రాదుగాని, విస్తరణ ప్రాంతం క్రిందకు వస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు రెండుసార్లు పబ్లిక్ హియరింగును తిరుగగొట్టారు. కాబట్టి ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఈ అప్పజెప్పిన ప్రాంతం చుట్టూతా వున్న గ్రమాల మీద ఇంకా తీవ్రమైన నిర్భంధం విధిస్తున్నది. పబ్లిక్ హియరింగులో నూటికి 90శాతం అంటే దాదాపు ఒక పదిమందో ఇరవై మందో వారి తొత్తులు, ఏజెంటులు ఎవరైనా వుంటే తప్ప – మిగతా అందరూ పబ్లిక్ హియరింగును జరగనివ్వ లేదు. జరిగిన తరువాత కూడా పబ్లిక్ హియరింగులో ఓపెన్‌గా వారి అభిప్రాయలను రికార్డు చేయించారు.
నిజానికి నల్గొండలో యురేనియం త్రవ్వకాలకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ఉద్యమం జరిగినా పబ్లిక్ హియరింగును అందరూ వద్దన్నారు. కాని రికార్డు చేయటం జరగలేదు. కాని జి.మాడుగుల మండలంలో ఒత్తిడి పెట్టి రికార్డులు చేయించారు. ఎందుకంటే గిరిజనులు అందరిలాగా వచ్చి వెనకాముందు చూడరు. పోతే పోవుడే! నువ్వు అన్నా బో! నేనన్నా బోతా! అనేది వాళ్ళ స్వభావంలో వుంటది. అయితే ప్రభుత్వము మొత్తం జిందాల్‌కు అప్పజెప్పిన ప్రాంతం చుట్టూ దిగ్భంధనం విధించింది. ఆ సర్కిల్ ప్రాంతంలో జి.మాడుగుల కూడా ఒకటి. జి.మాడుగులలో వాకపల్లి అని ఒక 59 కుటుంబాలు మాత్రమే వుండే ప్రాంతంలో – ఆగస్టు 20వ తేదీన కూంబింగు పేరుతో 21 మంది పోలీసులు 11 మంది స్త్రీల మీద లైంగిక బలాత్కారం చేశారు. మనకు ఇన్ని చట్టాలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలుగా మహిళా ఉద్యమం ఎంతో పోరాటం జరిపింది. రమీజాబీ లైంగిక బలత్కార సంఘటన తర్వాత చేసిన పోరాటానికి ఎవిడెన్స్ యాక్ట్ (భారత సాక్ష్యాధారాలచట్టం)ను కూడా సవరించారు. బ్రిటీష్ కాలం నాటి చట్టం అది. నిజానికి అందరూ దాన్ని గురించి అడగాలి. మహిళా ఉద్యమం చేసిన పోరాటం ఫలితంగా ఎవిడెన్స్ యాక్ట్‌లో సవరణలు చేయటంతో పాటు రేప్ లా ను (లైంగిక బలాత్కార చట్టం) సవరించడం జరిగింది. ఇన్ని చట్టాలు వున్నప్పటికీ – రేప్ లా లో సవరణలు జరిగినప్పటికి వాకపల్లిలో జరిగిన లైంగిక బలాత్కారం కేసు విషయంలో న్యాయవ్యవస్థ పట్టించుకోలేదు. మానవ హక్కుల కమీషనులు అంతే. ఇక్కడ ఈ చట్టాల విషయాలకి వచ్చే సరికి. ఒకటి : చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. కొత్త చట్టాల ద్వారా కొట్టిపడేస్తున్నారు. రెండు : ఉన్న చట్టాలు కూడా అమలు కాకుండా వుండటానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి. అంటే న్యాయవ్యవస్థ వుంటుంది, కానీ దీనికి ఒక్కోసారి చట్టాల అవగాహన వుండదు, వున్నాగాని అది రాజ్యానికి అనుకూలంగా వుంటుంది. చాలాసార్లు మనకి కొన్ని మంచితీర్పుల్లానే కనపడతాయి. కాని ఇవి ‘దింపుడు గండం ఆశలు’ లాంటివి. అంటే చచ్చిపోయిన తర్వాత స్మశానంలో కాలబెట్టే ముందు శవాన్ని క్రింద దింపుతారు. వాడు బ్రతుకుతాడో ఏమో, లేస్తాడో ఏమో అని. లేవడు అది వేరే విషయం. అది ఒక ఆనవాయితీ అయిపోయింది.
అట్లాగే ప్రజలను పోరాటాల నుంచి కొంచెం పక్కకు తప్పించటానికి, కొంచెం ఉద్రిక్తతలు తగ్గించటానికి, వారిని పక్కదారి పట్టించడానికి ఇలా రకరకాలుగా భ్రమలు పెడ్తారు. ఉదాహరణకు గిరిజన స్త్రీలకు హైదరాబాద్ వచ్చి ఇక్కడ హ్యూమన్‌రైట్స్‌లు కోర్టు ముందు – ”మమ్మల్ని మావాళ్ళు ఇళ్ళల్లోకి రానీయటం లేదయ్య, మామీద అత్యాచారం జరిగింది శుద్ధి చేసుకోమంటున్నారు” మాకు న్యాయం జరపమని అడిగితే అందుకు ఆయన – అట్లెట్ల చేస్తారు మీ మొగోళ్ళు! మీ తప్పేంలేదు కదా! మీ వాళ్ళమీద నేను ఆర్డర్ ఇష్యూ చేస్తాను అన్నాడు. వాళ్ళు కనీసం శుద్ధి చేసుకొని అయినా రానిస్తారు! వాళ్ళ దగ్గర ఒక వెసులుబాటు వుంది. అదే మనదగ్గరయితే బలాత్కారానికి గురైన స్త్రీని కుటుంబము, సమాజము తిరస్కరిస్తుంది. ఈ మేధావులు, న్యాయవాదులు, జడ్జీలు అట్లా వాళ్ళ కుటుంబంలో జరిగితే – ఇంట్లోకి కూడా రానివ్వరు. వారు కనీసం మంచోచెడో! శుద్ధి చేసి స్వీకరిస్తున్నారు. స్వీకరించడం అనే వెసులుబాటు అయినా అక్కడ ఉంది. ఇక్కడ అదికూడా లేదు. వాళ్ళు ”అట్టెట్ట చేస్తారు” నేను ఆర్డర్ ఇష్యూ చేస్తాను అంటాడు. అసలు ఆ సంస్కృతి ఏంటో తెలియదు? శుద్ధి చేసుకోవటమంటే ఏమిటే తెలియదు? ఇలా వ్యవహరిస్తారు అన్నమాట.
అయితే భూముల విషయంలో ప్రజలను భ్రమపెట్టడానికి అవకాశం లేదు. ప్రభుత్వాలు తాత్కాలికంగా కొంచం వెనక్కితగ్గినట్లే కనిపించినప్పటికీ నిజానికి చాలా తెలివిగా వున్నాయి. ఒక్క అడుగు వెనక్కి, రెండు అడుగులు ముందుకు అన్నట్లు చేస్తున్నాయి. ఇలాంటి చాలా తెలివైన సృజనాత్మక పద్ధతులలో చేస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కొనడం అంటే ఇలాంటి పద్ధతే కదా. ప్రభుత్వం తన ఏజెంట్లతో పేద ప్రజల వద్ద నుంచి ముందే కొంత కొంత భూమిని కొనుగోలు చేయిస్తుంది. మొదట డబ్బు అవసరం ఉన్న వ్యక్తినుంచి ఎకరం లేదా అరెకరం కొంటారు. ఆ తర్వాత పక్కన మిగతా భూములను బలవంతంగా రాబట్టుకుంటారు. ఈ పరిస్థితులు ఎంత తీవ్రస్థాయికి వచ్చాయంటే, అంతిమంగా ఈ నిర్వాసితత్వం అనేది – గ్రేహౌండ్స్ గుండాలు స్త్రీల మీద లైంగిక బలాత్కారం చేయటానికి దారితీసింది. తర్వాత ఇక్కడ వచ్చినా కూడా వారికి న్యాయం దక్కిందా అంటే దక్కలేదు. సామాజిక న్యాయం దక్కిందేమోకాని, ప్రభుత్వం నుంచి కానీ న్యాయవ్యవస్థ నుంచి కానీ న్యాయం దక్కలేదు. సామాజిక న్యాయం దొరికింది అంటే – ”వాళ్ళు తప్పు చేసినట్లుకాదు, వాళ్ళు తలెత్తి సెజ్‌లకు వ్యతిరేకంగా పోరాడారు. వాళ్ళ శరీరం మీద దాడి జరిగినా, ఆ దాడిలో కూడా వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు నిలబడ్డారు” అని సమాజం గౌరవించే ఒక సామాజిక న్యాయం దొరికింది. ప్రభుత్వ న్యాయం కాని చట్టపరమైన న్యాయంకాని దొరకలేదు. కాబట్టి ఇదిహింసకు పరాకాష్ట. అంతిమంగా వాకపల్లి సంఘటన నిర్వాసితత్వంలో భాగంగా జరిగిందే తప్ప, కూంబింగు ఆపరేషన్‌లో భాగంగా జరిగింది కాదు అంటే అక్కడ డిఎస్‌పి రియాక్షన్ ఏమిటంటే – జరగలేదు! అసలు మా వాళ్ళు పోనేపోలేదు అన్నాడు. పోనీ లోకల్‌గా వున్న సి.ఐ. సబర్వాల్ – మావోయిస్టులు వాళ్ళతో అలా చెప్పించారు అన్నాడు. అంటే ప్రజల మీద వాళ్ళకున్న గౌరవం అది. ఎవరు ఏం చెప్పమంటే అట్లా చెప్తారా? ప్రజలు, ఎవరెట్లా చేప్తే అట్లా వినేట్లయితే నువ్వు భూమి తీసుకుంటానంటే నిన్నేందుకు వద్దంటున్నారు? చివరికి తేలిందేమిటంటే దీనిమీద నాగిరెడ్డి కమీషన్ వేశారు. ఈ నివేదికలో ఇద్దరిమీద అత్యాచారం జరిగింది, వేరేవాళ్ళ మీద జరగలేదని రిపోర్ట్ వచ్చింది. అసలు రేప్ అంటే ఏమిటి? ఇన్ని సంవత్సరాలుగా మహిళా ఉద్యమం ఏదైతే డిమాండ్ చేస్తున్నాయో దాన్ని తుంగలో తొక్కారు. లైంగిక బలాత్కారం అంటే – ఈనాటి సెక్స్‌వల్ హేరాస్‌మెంట్ – లైంగిక వేధింపులు, అసభ్యమైన సంజ్ఞలు, సెక్స్‌ను సూచిస్తూ చేసే ప్రతిచర్య, శిక్షార్హమైన నేరంగా గుర్తింప చేసుకున్నాం.
మహిళా ఉద్యొమాల ద్వారా పోరాటాలు చేసి ఇవి సాధించుకున్నాం. దానికి ఇక్కడ విలువ లేకుండాపోయింది. 21 మంది గ్రేహౌండ్ పోలీసులు అసలు అక్కడికి ఎందుకు పోయారు? ఏం చేశారు? అనేదే శిక్షార్హమైంది కావాలి. నిజానికి సుభాషణ్‌రెడ్డి గారి కమీషన్ వేసింది కూడా – పోలీసులు రికార్డు చేసి పోయారా? ఎందుకు పోయారు? ఎప్పుడు పోయారు? అవన్నీ నోట్ చేసి వుండాలి. ఆయన పై విషయాలు విచారించాలి గాని ఇప్పుడు సంబంధంలేని మాటలు అడిగితే మనకు ఏమనిపిస్తుంది? సుభాషణ్ రెడ్డి అందరికంటే బాగా పనిచేస్తున్నట్లు కనపడుతుంది కానీ జడ్జీగా ఆయనకు తెలియాలికదా. ఆయన పరిధిలో ఈ చట్టాలన్నీ ఉన్నాయి. జడ్జిగా ఈ సంఘటన లైంగిక వేధింపుల చట్టం క్రిందకు వస్తుందని, ఎందుకు దాని క్రింద విచారించలేదు? హైకోర్టు కూడా – ఇది రేప్ కాదు! అని కొట్టిపడేయ్యటం కాకుండా – ఇది లైంగిక వేధింపుల చట్టం క్రిందకు వస్తుంది. ఎస్.సి., ఎస్.టి. అట్రాసిటీ యాక్ట్ క్రిందకు వస్తుంది అని తీర్పు చెప్పాలి. అది న్యాయవ్యవస్థకి సంబంధించిన విషయం. న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లోనే – న్యాయ వ్యవస్థ ప్రజలకు న్యాయం చేయలేనపుడు ప్రజల వైపు నుంచి ఆలోచిస్తే న్యాయవ్యవస్థ లేనట్లే. ఇది అంతిమంగా స్త్రీల పట్ల నిర్వాసితత్వంలో భాగంగా జరుగుతున్నది. ఇక్కడ చట్టం, న్యాయం ప్రజలదికాదు. ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదు. కేవలం ప్రజల సంఘటిత శక్తి మాత్రమే ప్రజలది.
ప్రజల సంఘటిత శక్తి వల్ల మాత్రమే – నిర్వాసితత్వం వల్ల స్త్రీలుగాని, పురుషులుగాని హింసలు పడకుండా ఉండగల్గుతారు. స్త్రీల ఆత్మగౌరవాన్ని అయినా, దళితుల ఆత్మగౌరవాన్ని అయినా ఆదివాసీల ఆత్మగౌరవాన్ని అయినా – ఆ సంఘటిత పోరాటశక్తి మాత్రమే నిలబెట్టగల్గుతుంది.
(ఈ వ్యాసాన్ని భూమికలో పున: ప్రచురించడానికి అనుమతి ఇచ్చిన అస్మితకు ధన్యవాదాలు)
(ప్రధమ ముద్రణ:అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్,
ఏప్రిల్, 2008)
ప్రతులకు
ఎం.రత్నవల
మేఘా అపార్ట్‌మెంట్స్, ప్లాట్ నెం : 302
నల్లకుంట, హైదరాబాద్ – 44
ఫోన్ : 27662957
రు. ఇక్కడ మావోయిస్టుల కోసం కూంబింగు జరుపుతున్నాం అనే పేరుతో, విశాఖ – పాడేరు ఏజెన్సీ, తూర్పు గోదావరి
Pingback: నిర్వాసితత్వం -స్త్రీలపై రాజ్యహింస « Fighting Injustice in Polepally (Jadcherla) SEZ