ఎడిటర్ కి ఉత్తరాలు
భూమిక జూన్ 2008
జోలెపాలెం మంగమ్మ, మదనపల్లి
భూమిక మే సంచిక అందింది. ఎప్పటిలాగే ఎవరెవరు ఏమేమి రాశారని పత్రిక అందుకోగానే విహంగ వీక్షణం చేశాను.
కొమ్మూరి పద్మావతిగారి పేరు ఆకర్షించింది. ఎందుకంటే వారి అమ్మాయి ఉషారాణి భాటియా, మేమంతా ఢిల్లీలో చాలా సంవత్సరాలు ఒకే చోట నివశించాం. ‘పెద్దమ్మ’ కథను నాకు నేను అన్వయించుకున్నాను. పెద్దమ్మకు సాయాప్యం కనబడింది. మా చెల్లెలి పిల్లలు, తమ్ముని పిల్లలు వాళ్ళ అమ్మను ‘అమ్మ’ అని పిలుస్తారు. నన్ను అంటే పెద్దమ్మను ‘మమ్మీ’ అంటారు. ఇప్పుడు వారి పిల్లల పిల్లలు (మూడో తరం) కూడా మమ్మీ అనే పిలుస్తారు. ఆంగ్లం మీద వ్యామోహ౦ కాదు. అదే ఒక పేరు లాగ.. మా పిన్ని కూతురు ‘సుభద్ర’ (వారు తొమ్మండుగురు). వారింట్లో మూడు తరాల పిల్లలు ( అమెరికాలో ఉన్నా సరే) ఆమెను పెద్దమ్మ అనే పిలుస్తారు. కాబట్టి పెద్దమ్మ, మమ్మీ అనే పదాలు బంధుత్వాన్ని కాకుండా వ్యక్తిలోని ఆప్యాయతనే చూపుతున్నాయి.
ప్రతినెలా ముఖ్యమయిన ఒకటి, రెండు వ్యాసాలు, కథలో చదివేదానను. ఈ సారి భూమిక కొద్దిగా చిక్కిపోయినా అందులోని విషయాలు బలుపెక్కాయి. శ్రీ నుండి తధాస్తు వరకు ఏకబిగిన చదివించాయి అన్ని శీర్షికలూ. రచయితలసంఘం కార్యదర్శి అండమాన్ వెళ్ళి వచ్చానవాడు . నన్ను తప్పకుండా ఒకసారి వెళ్ళి రమ్మనేవాడు. నాకు అంత శ్రమ లేకుండా అక్కడ పొందవలసిన ఆనందాన్నంత మీ వ్యాసంలో అందించి నాకేమీ ఖర్చు లేకుండానే ఆ అనుభవాన్ని కలిగించి అండమాన్‌లో పర్యటించినంత ఆనందాన్ని కలిగించిన మిమ్ములను అభినందించకుండా ఉండలేను. ఇంతవరకు పేపర్లలో సెజ్‌వలన పేదలపాట్లు గురించి చదివినా ఈ సంచికలో సెజ్‌లోని సాధక బాధకాలను సమగ్రంగా గ్రహించాను. మహిళాభ్యుదయానికీ, మహిళల్లో జాగరూకత కల్పిస్తూ మీరు చేస్తున్న ఒంటరి పోరాటానికీ మరి మరీ ధన్యవాదాలర్పస్తూ
ముందుగా Heartiest Congrats. మే భూమికలో డా. జి. భారతి వ్యాసం నాకు నచ్చింది. హిందు (డైలీ)లో 2-3 వారాల క్రిందట వచ్చిన ఒక వ్యాసం చదివి దాచి ఉంచాను, 8-12 ఏళ్ల మధ్య వయస్సు ఆడపిల్లల్ని ఎలా తయారు చేస్తున్నారనే విషయం మీద. దాని ఆధారంగా భూమికకి ఒక చిన్న వ్యాసం రాయాలని అనిపించింది. వేరే పనులలో పడి అది వెనక్కి పోయింది. మీరు చదివారా? పనికొస్తుందంటే రాసి పంపుతాను. మా అమ్మకి ‘లంబాడీల వివాహ వ్యవస్థ’ వ్యాసం చాలా నచ్చిందట.
శాంతసుందరి, హైద్రాబాద్
డా. భారతిగారు చాలా బాగా రాశారండి. ఈ రోజుల్లో అమ్మాయిలు సన్నగా అవ్వడానికి ఎన్నెన్ని కష్టాలు పడుతున్నారో చక్కగా చెప్పారు.
విజయలక్ష్మి ,
డా. భారతిగారి ‘అందమంటే సన్నబడటమేనా’ అనే వ్యాసం చాలా బాగుంది.
రమాదేవి,
భారతి గారు రాసిన ఈ అద్భుత వ్యాసాన్ని ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేర్చేదారి కనిపెట్టండి
రాజేంద్ర, ఇమెయిల్
భూమిక ఏప్రిల్ సంచికలోని కథ ‘రూపాయిచొక్కా’చదివాను అమొఘ౦గా, అత్యద్భుతంగా, మనసుని, మెదడునీ కదిలించిన కథ. విదేశాల్లో ఉన్న, ఇక్కడ పెద్ద పెద్ద మెట్రోల్లో బ్రతుకుతున్న ప్రజలు తమ ఇళ్ళనీ, ఊళ్ళనీ వదిలి ఉండలేక పోవడం ‘’రూపాయిలు'’ ‘’డాలర్ల'’ కోసం వలసలు వెళ్లిపోవడం.. అవన్నింటికి ఒక రపాంతరం ఈ కథ. దీన్నే ఒక ‘’ఆర్ట్'’ సినిమాగా తీస్తే…అని ఒక భావన.
ఎంత అందమైన కథ రాశారు శ్రీదేవిగారు. ‘’అందం'’ అంటే ఆ అర్ధంలో లేదు. ఇది భరించలేని నిజాన్ని ఇంకో కోణంలో చూపించిన భయంకరమైన అందం. (బెంగాలీ వాళ్ళు ఎంతో బావుంటే ‘’దారుణ్ ఆచ్చే'’ అంటారు. మనకి ‘’దారుణం అనేది వేరే అర్ధం ఇస్తుంది.
కథ చివర ‘’అది రూపాయి అందులో నేను ఇరుక్కుపో్యాను దాన్ని ఇవ్వలేను. అందులో ఉండలేను'’ అన్న మాటలు ‘’ఓ హేన్రీ'’ కథల్లో ముగింపుని గుర్తుకు తెస్తున్నాయి. హాట్సాఫ్‌టూ ఎస్. శ్రీదేవి. భూమిక గురించి ఎంత రాయాలన్నా తనివి తీరదు. కవితలు, కథలు, వ్యాసాలు అన్నీ. ముఖ్యంగా అంతర్జాతీయ, అంతర్రాష్ట్రీయ వివరాలు మాదాకా తేవడానికి మీ ప్రయాస మెచ్చుకోదగినది.భూమిక ఎడిటర్‌గారికి. నేను భూమిక పాఠకురాలిని. భూమికలో వచ్చే అంశాలన్నీ చాలా బాగుంటున్నాయి. మా యింట్లో అందరం భూమిక చదువుతాం. గత కొంతకాల౦గాచందా కట్టలేదు. మీ బాధ చదివాక చాలా బాధ కలిగింది. జీవిత చందా పంపుతున్నాను.
బాలాదేవి, భువనేశ్వర్