నిర్భయ సంఘటనపై బి.బి.సి. తీసిన ”ఇండియన్ డాటర్స్” డాక్యుమెంటరీ ఒక్క స్త్రీలనే కాదు ప్రజాస్వామిక వాదులను, ప్రగతిశీల వ్యక్తులను కలవర పరిచింది. మధ్యయుగంనాటి భావజాలం నేడూ సమాజాన్ని స్త్రీ జీవితాన్ని వెంటాడుతుందనే సత్యాన్ని మరొక్కసారి రుజువు చేసింది. వీటి వెనుక ఉన్న సామాజిక రాజకీయ, ఆర్ధిక కోణాల్ని అర్థం చేసుకునే ఆవశ్యకతను ఎత్తి చూపింది. ఈ భావాజాలానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ సంస్కృతికి అంతిమంగా మానవ సంబంధాలలోని మార్పుకు కావల్సిన తాత్వికత, ప్రాపంచిక దృక్పధం పట్ల మనకు సరైన అవగాహన ఎంతో అవసరం. అందుకు మన చైతన్యానికి పదును పెట్టే పుస్తకాలు నేటి చారిత్రక అవసరం. గతాన్ని పరిచయం చేస్తూ వర్తమానంతో ముడి వేస్తూ మనల్ని ఆలోచింపచేసే పుస్తకాలు అరుదు అని చెప్పాలి. స్త్రీల సమస్యలను కేవలం స్త్రీల సమస్యలుగానే కాకుండా వాటి మూలాలను వెతికిపట్టుకొని అందించే పుస్తకం మనల్ని దిశానిర్దేశం చేయగలదు. అలాంటి కోవలోకి చెందిన పుస్తకాన్ని చదవడం చదివించడం మన కర్తవ్యం కూడా.
అందుకే ఈ నాటి పుస్తక పరిచయంలో మన బాధలకు, బంధాలకు తాత్విక భూమిక నిచ్చే యం. రత్నమాల పుస్తకం ”పాఠకులతో నూతన సంభాషణ”ను పరిచయం చేస్తున్నాను. రత్నమాల రాసిన యితర పుస్తకాలు 1. గమనం – ఘర్షణ – గమ్యం, 2. ఇమ్మర్ష 3. నిర్వాసిత్వం – స్త్రీలపై రాజ్యహింస, 4. తెలంగాణ రాష్ట్రం (ఆదివాసి, దళిత, బహుజన మైనార్టీ అస్థిత్వాలు) 5. తెలంగాణ రాష్ట్రం (ప్రజలు-ప్రజాసంఘాలు, పార్టీలు, ఐక్య సంఘటనలు), 6. పాఠకులతో నూతన సంభాషణ, 7. దాక్షిణ్యవాదం నుండి దండకారణ్యం దాకా, 8. జర్నలిజం ప్రొఫెషన్ ట్రేడ్ యూనియన్లు మరియు వైయలెన్స్ ఎగనెస్ట్ ఉమెన్ దాకా ఎన్నో పుస్తకాలు ఒక సిరీస్‌గా అనేక అంశాల మీద ఆమె వెలువరిస్తున్నారు. ఇందులో నన్ను మరింతగా ఆలోచింప చేసిన పుస్తకం ‘పాఠకులతో నూతన సంభాషణ’ ఈ పుస్తకం 3 దశాబ్దాలపైగా నా గమనాన్కి ముడిపడిందన్న వాస్తవం నన్ను మరింత హత్తుకునేలా చేసింది. అప్పుడప్పుడే వామపక్ష భావజాలన్ని దగ్గరవుతున్న నాకు కుటుంబం నిషేధించిన పుస్తకాలలో ‘నూతన’ ఒకటి. గాంధీని తిట్టే మొగాడే (ఆయన భావన, భాష నాదికాదు) లేడనుకున్న మా నాన్నకు ఒక స్త్రీ (యం. రత్నమాల సంపాదకురాలు) గాంధీని ఆ భావజాలాన్ని చెండాడుతుంటే పితృస్వామ్య అహంకారంతో ఒకటి రెండు నూతనలను నా కళ్ళముందే కాల్చేసాడు. జూపాక సుభద్ర అన్నట్టు ‘నూతన’ నెలనెలా నెగడులా అప్పటి యువతను మండేలాచేసింది. ప్రేరణగా నిలిచింది యువత మెదళ్ళను పదునెక్కించింది. అప్పుడప్పుడే సమాజాన్ని చూసేందుకు కళ్ళు పుటమరించే మాకు ‘నూతన’ పత్రిక విప్లవ సాహిత్యోద్యమానికి ప్రాథమిక పాఠకులగా కొత్త చూపు నందించింది. యిప్పుడు నూతన సంపాదకీయాల పరిచయంకై తిరగేసినప్పుడు ఆనాటి సంఘటనలు వ్యక్తులు, ఉద్యమాలు మళ్ళీ అక్షరాలుగా ఊపిరి పోసుకొని ఊసులు చెబుతున్నట్టనిపించాయి. నేను పెరిగిన సింగరేణి మట్టి (బొగ్గు) వాసనలను, కణకణలాడే సింగరేణి అరుణ కాంతిని విరజిమ్మింది. మళ్ళీ నన్ను నేను విశ్లేషించుకునే అవకాశాన్ని యిచ్చింది. నాకే కాదు నిరంతరం తపనతో సమాజంలోని సంఘర్షణలకు స్పందించే మనందరికి ఈ పుస్తక ఆవశ్యకత ఎంతో వుంది.
96 పేజీలతో వున్న ఈ పుస్తకం ఆనాడు నూతన పత్రికలో యం. రత్నమాల రాసిన (ఒకటి రెండు తప్ప) సంపాదకీయాలతో కూర్చింది. జూన్ 1978 నుండి డిసెంబర్ 1982 వరకు 24 సంచికలలోని సంపాదకీయాలు మనల్ని పలకరిస్తాయి. ఆనాటి వామపక్ష ఉద్యమాలకు ప్రభావితులైన వారు వాటి అనుబంధ సంఘాలతో కలిసి నడిచిన కామ్రేడ్స్ ‘నూతన’తో తమ అనుబంధాన్ని ఉద్యమాల్ని తలపోస్తు ముందు మాటగా మన ముందుకు వచ్చి మనతో ముచ్చటిస్తారు.
తెలంగాణ సాయుధ పోరాట నాయకత్వంలో చాలామంది ‘కామ్రేడ్ దొరలను’ పుట్టళ్ళయిన అమ్మమ్మగారి వూరు (కరివిరాల, కొత్తగూడెం), తెలంగాణ పోరాటంలో పాల్గొన్న చిన్న సన్న కారు, మధ్య తరగతి రైతాంగం, వ్యవసాయ కూలీలు, చేతివృత్తు వారుండే బాపువూరు (కుక్కడం) గ్రామాల మానవ సంబంధాలలో ఉండే వైవిధ్యం, వైరుధ్యం పితృసామ్యం వర్గాధిపత్యం కలగలసే వుంటుందన్న విషయాన్ని రచయిత్రికి సుభోదకం చేసింది. ఇదే నేను చిన్నప్పటి స్త్రీవాద చైతన్యంతోనే ఆగి పోకుండా గతితార్కిక భౌతికవాద నిబద్దతకు ఆస్కారమిచ్చింది. స్త్రీ వాదం నా చిన్నప్పటి వ్యక్తి చైతన్యమైతే మార్క్సిజం (గతి తార్కిక చారిత్రక భౌతిక వాద దృక్పధం) నా ప్రాపంచిక ధృక్పధం. నేను విప్లవ రచయితల సంఘంలో వున్నాను. కనుక విప్లవ రచయితల సంఘం ప్రణాళిక మార్క్సిజం-లెనినిజం- మావోయిజం నా నిబద్ధత. ఈ నిబద్ధతే నా కార్యాచరణ, నా కార్యచరణే నా కవిత్వం, ఇతర సాహిత్య ప్రక్రియలు, వ్యక్తీకరణలు (పేజి నెం. 91 & 92 సాహితీగమనం శీర్షికలో) అని నిక్కచ్చిగా చెప్పే రత్నమాల రచనలో ఆ నిబద్దత ప్రస్పుటిస్తుంది. ”నేను నాలుగు సంవత్సరాల పాటు ‘నూతన’ పత్రిక నడిపిన క్రమంలో సి.వి. సుబ్బారావు చేసిన వ్యాఖ్యానాలు, సలహాలు, సూచనల ప్రభావం సాహిత్య వ్యక్తీకరణ ప్రతి అక్షరంలో ఉందని” ఓపెన్‌గా చెప్పే రత్నమాలలో చాలా సీదాసాదాతనం చూడవచ్చు.
ఈ పుస్తకం చదువుతున్నంత సేపు ఓ చరిత్రను తిరిగి చదువుతున్నట్టు వాటి వెంబడీ మనం అనుకోకుండా ఏదో మెస్మరిజంలో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఉలిక్కి పడి మళ్ళీ మనం మన వర్తమానంలోకి వస్తే ఆమె వేసిన ప్రశ్నలు మన సమాజ నడకను మన గమనాన్ని ప్రశ్నిస్తాయి. మరీ ముఖ్యంగా ప్రజా ఉద్యమాలలో పాల్గొనే కార్యకర్తలకు ప్రతి అంశం మీద ఒక క్లారిటీ వస్తుంది. ప్రపంచీకరణ వేయి తలలుగా విస్తరిస్తున్న పరిణామాలను ముందే అంచనాకట్టి అందించిన సంపాదకీయాలు మనల్ని అబ్బురపరుస్తాయి. అరే! ఈ సంపాదకీయంలోని అంశం అక్షరాల మా సైద్దాంతిక దృక్పధాన్కి, మా పోరాటాన్కి సరిపోతుందే అన్న భావన మనల్ని చుట్టుముట్టేస్తది. నిన్నగాక మొన్న భూమికలో రాసిన ఒక కాలమ్‌కు తొలిపలుకులు (మరో జలియన్‌వాల్ బాగ్) సంపాదకీయాల నుండి తీసుకోవడం జరిగింది. అంటే 35 ఏళ్ళ తర్వాత కూడా ఈ సంపాదకీయాలు ఎంత రిలవెంటుగా వున్నామో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే సంపాదకీయాలలోని తాత్వికత మనందరికి దోహపడుతుందని బలంగా నమ్ముతున్నాను. వీటిలో కొన్నింటిని తడిమి పుస్తకం ‘పాఠకులతో నూతన సంభాషణ – యం. రత్నమాల’ను పరిచయం చేస్తున్నాను. ముందుమాట రాసిన వారి అనుభవాల్ని అనుబంధాన్ని అక్కడక్కడా జోడించడం జరిగింది.
1970వ దశాబ్దం అనేక పరిణామాలను మన ముందుకు తెచ్చింది. 1975-1977 కొనసాగిన ఎమర్జన్సీ ఆ తర్వాత ఎత్తివేసినా అప్రకటితంగా కొనసాగింది. చైతన్య వంతులైన యువత గ్రామాలకు తరలివెళ్ళారు. గ్రామాలు, వర్సిటీలు పోరాట క్షేత్రాలకు నాంది పలికాయి. సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటాలు నక్సల్బరి వారసత్వ ప్రత్యామ్నాల రాజకీయంగా సంచలనం సృష్టించాయి. అదిగో ఆ సమయంలోనే దేశం పెట్టుబడిదారుల, భూస్వాముల కొమ్ము కాసే దళారీ ప్రభుత్వాల గుప్పిట్లో బందీ అయినప్పుడు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ‘నూతన’ ముందుకు వచ్చి యువతను చైతన్య పరిచింది. అలనాటి ఆ నాలుగు సంవత్సరాలు వివిధ సమస్యలు, ఉద్యమాలు, పత్రికలు, స్వేచ్ఛ, పరిమితులు, చట్టాలు, చట్ట సభలు నడిచిన తీరు ఆయా ప్రభుత్వ ధోరణులు దృక్పధాలుతో సహా ప్రేమచంద్ లూసన్‌లకు నివాళి దాకా ఈ సంపాదకీయాలు రికార్డు చేసాయి. సరిగ్గా అప్పుడే ప్రపంచ పెట్టుబడి దారి దన్నుతో స్త్రీ విముక్తి పేరిట యు.ఎన్. డిక్లరేషన్ మహిళా దశాబ్దాన్ని ప్రకటించింది. స్త్రీలను ఉద్దరిస్తామని కుట్టు, అల్లికలు, కుటుంబ నిర్వహణ శీర్షికలతో పితృస్వామ్య భావజాలాన్ని మరింత బలపరిచే ‘వనితా’ లాంటి పత్రికలు పుట్టుకొచ్చాయి. ఈ దశలోనే సాంఘిక వ్యవస్థకు దర్పణం పడుతూ సామాజిక స్పృహతో గతి తార్కిక చారిత్రక భౌతికవాద దృక్పధంతో స్త్రీల స్థానం గురించి సమాజంపై సవాలు విసరటమే కాదు విప్లవపార్టీలపై సైతం ప్రశ్నలను నూతనలో రత్నమాల సంధించారు. మొదటి సంచికలోనే పేర్కొన్నట్టు గుర్తింపు లభింపక నివ్వురుగప్పిన నిప్పులా వున్న యువ రచయితలకు ప్రాధాన్యత ప్రోత్సాహతనిచ్చింది. ఈ విషయం రాస్తుంటే ప్రజాస్వామిక రచయిత్రుల పుట్టుక జ్ఞాపకం వస్తుంది. ఆనాటి రత్నమాల ఆకాంక్ష, నిబద్దత, కృషి సంఘ ఆవిర్భావంలో ప్రధాన పాత్ర వహించింది.
ఆమె ఎంతగా క్రొత్త తరాన్ని ప్రోత్సహించిందో అంతగాను పాత వర్తమాన తరాల రచయితల దిగజారుడుతనాన్ని ఎండగడుతుంది. ‘స్వాతంత్య్రానంతర సాహిత్యం’ సంపాదకీయంలో ”తెలంగాణ పోరాట కాలంలో రుద్రవీణల్ని పలికించి అగ్నిధారల్ని కురిపించిన వారు ఆ తర్వాత కాలంలో అధికార కుర్చీ కాళ్ళు పట్టుకొని ఏలిక కళ్ళ మీద, కళ్ళజోడు మీద కవిత్వం రాసి పదవుల్ని సంపాదించుకున్నారు. ఉద్యమాలకు ప్రజలకు దూరమైన కవులు ఎంతగా దిగజారుతారో తెలుసు కోవడానికి ఇలాంటివి ప్రబల తార్కాణం అంటారు. (పేజీ 47-48) ప్రజా రచయిత ప్రేమ్‌చంద్‌కు నివాళిలో (పేజీ నెం. 68-70)లో ”ఈనాడు ప్రేమ్‌చంద్ తెలుగు నేలలో వుంటే సిరిసిల్ల, జగిత్యాల రైతాంగంతో గొంతు కలపకుండా వుండేవాడా! ఆదిలాబాదులో, ఖమ్మంలో, పండితాపురంలో, నల్లగొండలో పేద రైతాంగం గుండె దండోరాలను ప్రతిధ్వనించక పోయేవాడా? తప్పకుండా ఆయన ప్రజలతోనే ఉండేవాడు అంటారు. ఈనాడు తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా గొంతెత్తిన కళాకారుల, రచయితల గొంతు మూగపోవటాన్కి సమాధానం పై వాక్యాల్లో దొరకుతాయి. తెలుగు సాహిత్యక్షేత్రం ప్రధానంగా కథాసాహిత్యక్షేత్రం బీడువారి పోయిందని చెప్పొచ్చు అంటారు. ఈనాటికి కొంత పురోగతి వున్న కొరత అలాగే వుంది, యిప్పటి యింటర్నెట్ యుగంలో యువత పుస్తకాలకు దూరంగా వుంటుంది. సాహిత్య ఎంపికలో స్నేహాన్ని ముడివేసుకున్న తరం నుండి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లతో వ్యక్తిగత విషయాలకు పరిమితమవుతున్న స్నేహాలు నేడు కన్పిస్తాయి. ఈ స్థితిలో సామాజిక అవగాహన ఉన్న రచయితలు ఉత్తమ సమకాలిక సాహిత్యాన్ని సృష్టించాలన్న ఆమె ఆకాంక్ష యిప్పటికి వర్తిస్తుంది. పత్రికా స్వాతంత్య్రం ఎవరి నుంచి ఎవరికి (పేజి 86-89) సంపాదకీయంలో పత్రికా స్వేచ్ఛను అణచివేయడానికి తీసుకొచ్చిన ‘నల్లబిల్లు’ను నిరసిస్తూ మీడియా స్వభావం గురించి రాశారు. కార్పోరేటు శక్తులు ఇప్పటి మీడియాను ఆక్రమించుకున్న ఈ సందర్భంలో, ఎడిటోరియల్ బోర్డు రూముల్లో కార్పోరేటు డైరెక్టర్లు తిష్టవేసి నడిపిస్తున్న సందర్భాల్లో రత్నమాల ఈ సంపాదకీయంలో అలనాడు చేసిన వాఖ్యాలు ఇప్పటికి అంతే సత్యంగా వుండటం ఆశ్చర్యమే కాదు ఆమె (యం. రత్నమాల) మేధస్సుకు ప్రతీక. పత్రికా స్వాతంత్య్రానికి దున్నే వానికి భూమి లేకపోవడాన్ని శ్రమించే వానిదే పనిముట్టు కాకపోవడానికి ఉన్న సంబంధాన్ని గుర్తిస్తేనే పత్రికా స్వాతంత్య్రాన్ని రక్షించుకోవడం కోసం ఏం చేయాలో? ఎలా నడవాలో తెలుస్తుంది అని విశదీకరిస్తారు.
నిర్భంధాన్ని గురించి మాట్లాడుతూ ప్రజలగోరు చుట్టు ప్రభుత్వ రోకలి పోటు (ఆగష్టు 1981) (తుఫాన్) సంపాదకీయంలో ఇంకెన్నాళ్ళో ప్రజాస్వామ్యమా? నియంతృత్వమా? అన్న నినాదంతో జనం నోరు మూయించలేరు అందుకే పి.డి. గురించిన పునరాలోచన, ఫాసిజం మళ్ళీ పంజా విప్పబోతుంది. ప్రజాస్వామ్యమా జాగ్రత్త – జాగ్రత్త – జాగ్రత్త అంటూ హెచ్చరిస్తారు. నిర్బంధ ఆర్డినెన్స్‌లను వ్యతిరేకించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం కాదు కాని అనుకున్నదే అయినా నక్సలైటు ఏజెండా మా ఎజెండా అని బీరాలు పలికి గద్దెనెక్కిన కె.సి.ఆర్. అదే నిర్భందాన్ని ప్రజా సంఘాలపై కొనసాగించే పంధాని చూస్తున్నాం. కాషాయ రంగు అవతారం ఎత్తి మోడి రూపంలో ఫాసిజం అమలు చేస్తున్న తీరును ప్రజాస్వామ్య దేశంలో పౌరులుగా గమనిస్తూనే ఉన్నాం. యిప్పటికీ వాటిపై పోరాటం చేయవలసిన బాధ్యతకై నూతన మనల్ని నిలదీస్తుంది. అలాగే విద్యా, రవాణా, వైద్యరంగాల ప్రైవేటీకరణ డా|| మర్రి చెన్నారెడ్డి, ముఖ్యమంత్రిగా వున్న కాలంలోనే ప్రారంభ మైనదని జనవరి-ఫిబ్రవరి సంపాదకీయంలో ప్రస్తావనతో 1980 నుండి ప్రైవేటీకరణ వేగం పెరిగిన క్రమం తెలుస్తుంది. అవగాహనతో కూడిన ఆమె ముందు చూపు మనల్ని ఉత్తేజితులను చేస్తుంది.
అవసరమైతే, అదీ తప్పయితే జాతి పిత (ఆ బిరుదు ప్రజలు యిచ్చినది కాదు) గాంధీని సైతం విమర్శించడానికి ఆనాటి నూతన సంపాదకురాలిగా రత్నమాల వెనుకడుగు వేయలేదు. ‘సర్కారు బాబాలు’ (అక్టోబరు – 1978) సంపాదకీయంలో జె.పి., గాంధీ కలల ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడుతూ భగత్‌సింగ్ ఉరితీయడానికి గాంధీ యిచ్చిన సిగ్నల్‌ను, అల్లూరి సీతారామరాజుని దొంగ అన్ని విషయాన్ని జ్ఞప్తికి తెస్తూ ఈ సర్కారు బాబాల పట్ల భ్రమలు వదిలేదాకా ఈ దేశాన్కి విముక్తి లేదంటారు. కాని యిప్పుడు గవర్నర్లు, ముఖ్యమంత్రులు గుడులు చుట్టూ యజ్ఞయాగాదులతో, వాస్తు పిచ్చితోటి పాలన సాగిస్తుంటే నిజంగా ఈ దేశానికి విముక్తి లేదనిపిస్తుంది.
1979 మార్చి సామాన్యుడిపై చావు బరువు (పేజీ 58-60) సంపాదకీయం చదువుతుంటే 36 ఏళ్ళ తరువాత అభివృద్ధి పేరుతో చేస్తున్న నరమేధం, వనరుల దోపిడి తీరు, కేంద్ర రాష్ట్ర పాలకవర్గాల యొక్క చర్యలు నోటితో పిలుస్తూ నొసటితో వెక్కిరిస్తున్న క్రమం అర్థమవుతుంది. ఓ ప్రక్క ప్రజలపై కాల్పులు జరిపి వాళ్ళ ప్రాణాలు తీస్తూ ప్రజా సంక్షేమం గురించి మాట్లాడటం నీ కోసమే నీ కొంపకు నిప్పుపెట్టానని చెప్పడమే అన్న అప్పటి మాటలు సోంపేట, కాకినాడ, కాకరపల్లి, పోలెపల్లెలకు ఇప్పుడు వర్తిస్తాయి. మన ఆలోచనలను పోరాటాలను సామ్రాజ్యవాద పెట్టుబడిదారి విధానాన్కి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలపై మళ్ళిస్తాయి. కళ్ళు తెరిచిన వారిపై కాల్పులు జరుపుతూ, అంధకారంగా హత్య చేస్తూ ఎంతో కాలము ఏలుబడి సాగించలేవు. అణచివేసే కొద్ది ప్రతిఘటన పెరుగుతుంది అంటారు. దీని ఫలితాన్ని మనం చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఒరిస్సా, నార్త్ ఈస్ట్‌లలో ప్రత్యక్షంగా సాగుతున్న ప్రత్యామ్నాయ రాజకీయాలలో చూడగలం.
గత 30 సంవత్సరాలుగా ఆర్ధిక పోరాటాలకు (ఒకటి, ఆరా సందర్భాలల్లో తప్ప, యిప్పుడు అవి కూడా లేవు) పరిమిత చేస్తున్నవే తప్ప తమ శ్రమదోపిడికి మూలమైన సామ్రాజ్యవాద, పెట్టుబడిదారి, భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల్లో చైతన్యం పెంచలేక పోయాయి అని కార్మిక సంఘాల గురించి ఎత్తిచూపుతారు. (చికాగో కార్మికుల నెత్తుటి జండా నీడలో ఐక్య ఉద్యమానికై కదలండి పేజి నెం. 63-65) కాని పాలక వర్గాలు దయతలచి మేడే కానుకలు యిచ్చేదాకా కార్మికులు ఆగరు. సంఘటిత శక్తిగా, నిర్మాణయుతంగా నిరంతర దీక్షతో విజృంభించి గాలి, నేలా, నీరూ అందరి సొత్తని మా చెమటతో తడిసిన పనిముట్లు పరిశ్రమలు ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు అని అధికారం హస్తగతం చేసుకునేందుకు ఉద్యమిస్తారు అని ప్రకటించిన రత్నమాల ఆశయం సాకారం కావలసిఉంది. ఆ లక్ష్య సిద్ధికి ఐక్య ఉద్యమానికి కదిలిరండి అన్న పిలుపు ఈనాటి ప్రజాస్వామిక, వామపక్ష వాద కార్మిక సంఘాలకు వర్తిస్తుంది. ఇదే క్రమంలో నేటి సి.పి.ఐ., సి.పి.యం. లాంటి కమ్యూనిస్టు పార్టీల కార్మీక వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తాయి.
మహిళా ఉద్యమంలో నిమ్నోన్నతలులో స్త్రీలు (పేజి 74-75, మార్చి -ఏప్రిల్ 1980) అనివార్యంగా పోరాట వీరంగంలో అడుగు పెడుతున్న గ్రామాల దాకా మహిళా సంఘాలు ఎదగడం లేదే అన్న నిరాశ మధ్య అసలంటూ తలెత్తుతాయి కదా అన్న ఆమె (రత్నమాల) ఆశ ఆశయం ఈనాటికి అనుకున్నంతగా ఆవిష్కరించబడలేదు. కుప్పలుగా వచ్చిన ప్రభుత్వ మహిళా సంఘాలు కొన్ని స్వచ్చంధ సంస్థల మహిళా మండలులు నేడు మహిళా ఉద్యమాల్ని పెడద్రోవ పట్టించి చీప్ లేబర్‌గా పెట్టుబడిదార్లకు ఉపయోగపడేలా స్త్రీ విముక్తిగీతాలు పాడుతున్నాయి. ఒక విధంగా స్త్రీలను సంఘటిత పరచడానికి అవరోధాలుగా మారాయి. ఫెమినిజం ఫిలాసిఫితో ముందునిల్చిన వారు స్త్రీలపై జరిగే రాజ్యహింసకు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడరు. వీరు పితృస్వామ్య భావజాలంతో తమతోటి స్త్రీలపై జరుపుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తాత్వికతను అందించడంలోను విఫలమవుతారు. మహిళా ఉద్యమం సరైన మార్గంలో సాగడానికి కమ్యూనిస్టు పార్టీలు యిప్పటికైనా శ్రద్దవహిస్తాయని ఆశిద్దాం అన్న రత్నమాల ఆశ నిజమవ్వాలని ప్రగతిశీల కాముకులుగా ఆశిద్దాం!
కారంచేడు సంఘటన తర్వాత రాష్ట్రంలో విస్తృతంగా కులం వర్సెస్ వర్గం పట్ల చర్చ విపరీతంగా వచ్చింది. అస్థిత్వ ఉద్యమాలకు తెలుగునాట ప్రాణం పోసింది. అయితే ప్రపంచీకరణలో అవి కుల నిర్మూలన నుంచి కులం స్థిరపరిచే దిశగా లాబీయింగ్ సెక్షన్‌గా ప్రజాస్వామ్యంలో వర్ధిల్లుతున్న సందర్భం యిది. ప్రజాస్వామ్య ముసుగులో కులం పేరుతో పాలకులు ఆడుతున్న చదరంగం మనం చూస్తూనే వున్నాం. అందుకే రత్నమాల అప్పుడే అంటే 1981 సంచికలో (కారంచేడు సంఘటనకు ముందే) మరో జలియన్‌వాలా బాగ్ సంపాదకీయంలో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య వెనుకబడిన కులం అని గుర్తిస్తూనే ఆయన పాలకవర్గం కనుక భద్రంగా వుంటాడు. స్త్రీ అయినందుకు రమీజాబీకు భయం ఇందిరమ్మకు కాదు. ఏజాతికాదు ఏ వర్గం అన్నది ప్రశ్న (పేజి-79) అని కుండబద్దలు కొట్టి చెబుతారు.
ఒక కొత్త వ్యవస్థను ప్రతిపాదించడానికి, సామాజిక సాంస్కృతిక స్పృహని పెంపొందించే సాహిత్యాన్ని ప్రచారం చేయడానికి నడుము కట్టిన ‘నూతన’ ఆనాటి సమాజానికి అందించిన ప్రేరణలు, చైతన్యాలు, అవగాహనా దృక్పథం ఇప్పటివారికి స్పూర్తిదాయకమే. అప్పటి యువతను విప్లవకారులుగా రచయితలుగా కవులుగా మలచిన చరిత్ర ‘నూతన’కు ఉంది. నాలుగేళ్ళపాటు రత్నమాల తన ప్రత్యామ్నాయ విలువలతో, సాహిత్య నిబద్దతగల ఆలోచనా ధోరణులతో, కొత్త తరాన్ని రెండు చేతులా ఆహ్వానించే దృక్పధంతో పత్రికను నడిపారు. ప్రజాఉద్యమాలలో తాము గమనించిన పెడ ధోరణులను ఎత్తి చూపడం అది చేతులు కాలాక కాకుండా, సకాలంలో స్పందించడం ఈ నాటికి అరుదైన విషయం ‘నూతన’ చేయగల్గింది. సంపాదకీయాల్లో స్థానిక, సమకాలీక స్పందనే కీలకమైనప్పటికి ఈ సంపాదకీయాలు అంతకే పరిమితం కావు. వీటిల్లో విశ్వజనీనత, సార్వకాలికత గోచరిస్తాయి. ఆరోజు వర్తమాన విషయాల మీద కామెంట్ లాగా చదివించిన విషయాలు ఈ రోజు డాక్యుమెంట్ చేయబడ్డ చరిత్రగా చదివిస్తాయి.
అల్లం నారాయణ అన్నట్టు సంక్షుభిత తెలంగాణ జీవితంలో వికసించిన అగ్గిపువ్వు రత్నమాల ఆమె కలిసి నడిచిన ఉద్యమాలకు ఈ వ్యాసాలు లక్ష్య ప్రకటనలు. అప్పటికి, ఇప్పటికి సంస్థలు, వ్యక్తులు కాక ప్రజల పట్ల నమ్మకంతోనే పని చేస్తుంది. అన్ని సంపాదకీయాల లోనూ ప్రస్పుటంగానో అంతర్లీనంగానో మార్పుని ప్రజలే సాధించగలరనే నమ్మకం వ్యక్తమవుతుంది. తన వ్యక్తీకరణలో తప్పులు ఉన్నప్పుడు ఆత్మవిమర్శకు తావిచ్చి తన అవగాహన పరిమితిని అపరిపక్వతని ఒప్పుకోవడానికి ఆమె ఎప్పుడు సిద్ధమే. విద్యాలయాల్లో అవినీతి (డిసెంబర్ 1978) సంపాదకీయంలో ‘మొగుణ్ణి కొట్టి మొత్తుకున్నట్టు” వంటి భావజాలాన్ని ఎన్. వేణుగోపాల్ (ఇప్పటి వీక్షణం ఎడిటర్) ఎత్తి చూపించారంటూ ఆనాటి నా అవగాహన పరిమితిని అపర్వికతను వ్యక్తీకరిస్తుందని బాహటంగానే ఒప్పుకుంటారు. జీవితాంతం ఉద్యమంగా బతికిన చరిత్ర రత్నమాలది. పీడితుల పక్షాన నిలబడిన చరిత్ర రత్నమాలది. అందుకే ఆమె కలం నుంచి వెలువడిన ప్రతి అక్షరం సమాజంలో జరిగే దోపిడిని అణచివేతను చీల్చి చెండాడే కత్తులే. ఈనాడు ప్రజలు గొంతులో గొంతు కలిపి నినదించని వారిని రేపు క్షమించరు. ఈనాడు అక్రమాలను నిరసించని మేధావులను చరిత్ర అసహ్యించుకుంటుంది అనే రత్నమాల స్పూర్తి అందరికి ఆదర్శప్రాయం. అలాంటి పత్రికలను గొంతుల్ని, కలాల్ని మనం రక్షించుకోవడం ప్రగతిశీల వ్యక్తుల సంఘాల కర్తవ్యం. సామాజిక వ్యవస్థలోకి ప్రతి కదలికకు చలించి, ప్రతిచలనాన్కి ప్రకంపించి ప్రతి ధ్వనించే రచయితల రచనలు సజీవంగా వుంటాయనే తాత్వికత నిత్య సత్యం.
మనం గుర్తించాల్సిన విషయం పత్రికా స్వాతంత్య్రాన్ని కాపాడు కోవల్సింది ప్రభుత్వం నుంచి మాత్రమే కాదు పారిశ్రామికాధిపతులు నడిపే గొలుసు పత్రికల గుత్తాధిపత్యం నుంచి ”ఈసారి మేం వెనక్కి తగ్గుతాం. కాని ఎప్పటికి కాదు. మేం చాలా నేర్చుకున్నాం. ఇనుమడించిన పోరాట చతురతతో, రెట్టింపు క్రమశిక్షణతో మరింత బలవంతులమై ఉద్యమ లక్ష్యం వైపు నిరాఘాటంగా సాగుతాం” (జాక్‌లండన్) అని అనేక యువకవులకు బాసటగా వుండి ఆనాటి సామాజిక విప్లవ శక్తులకు కాగడాగా పనిచేసిన ‘నూతన’ లాంటి పత్రికల ఆవశ్యకత నేడు మరింత పెరిగింది. తాను నమ్మిన విలువల కోసం నిజాయితిగా నిరంతం శ్రమిస్తున్న రత్నమాల స్పూర్తి ప్రజాస్వామిక రచయిత్రులకే కాదు ప్రతి ప్రజా రచయితకు ఆదర్శం కావాలి.
నోట్ : ఈ పుస్తకం ధర కేవలం 80/- రూపాయలే. ఈ పుస్తకం చదివి చదివించడం అంటే వ్యవస్థ మార్పుకు కావలసిన తాత్వికతను చదువరులకు సమాజానికి అందించడమే. ప్రతులకు రత్నమాల మేఘా అపార్ట్‌మెంట్స్ ప్లాట్ నెం. 302, నల్లకుంట, హైదరాబాద్ – 44. ఫోన్ : 040-27662957, సెల్ : 9440329445
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags