నేను నడుస్తుంటె
నన్ననుసరిస్తూ వీళ్ళు
నేను పరుగెడుతుంటె
నా వెనకాల ఉరుకుతూ వీళ్ళు
నేను నిలబడితే
అడుగులు ముందుకు పడక
స్ధబ్తుగా వీళ్ళు
నేను ఎగురుతుంటె
నన్నందుకోవాలని వీళ్ళు
రాజకీయ చదరంగంలో
నిర్దాక్షిణ్యంగ నన్ను తొక్కివేస్తే
పరిహసిస్తు, గేలిచేస్తు
నా చుట్టూరా వీళ్ళు
ఓరా! మానవ ప్రవృత్తి ఎంత విచిత్రం
ఇది తరతరాల చరిత్రే
కొత్తేముంది వింతేముంది
మరుగున దాగిన నైజం
వికృత రూపం దాల్చి ఎదుట నిలిస్తే
భయం వేయటం లేదు
కోపం రావటం లేదు
జాలి వేస్తున్నది
చిన్న కయ్య నుండి
బయటకు విసరి వేయబడిన చేపలా
విలవిల లాడుతానని ఆనందిస్తున్న
వీళ్ళ ఆశలను వమ్ము చేస్తు
సామాజిక సేవా నదంలో పడి
రోజురోజుకి
విస్త్రృతమవుతూ
వ్యాపిస్తున్న నన్ను చూసి
ఆశ్యర్యంతో వీళ్ళు
ఔను మరి
ప్రజ్ఞ ఆటబల్ల
ఒక ప్రక్క తొక్కితే
మరో ప్రక్క పైకి లేస్తుంది
తొక్కి వేయబడితే
నేలకు అంటుకు పోయే మట్టిముద్దను కాను.