నిరంతరం ఉడుకుతున్న ఆమె దేహాత్మను
గొంతునొక్కి సజీవ మరణం అంటూ ఖననం
చేస్తున్న ఛాందస జ్వాలలు
సూదుల జల్లెడ శరీరాన్ని
మరో శిలీంధ్రానికి అప్పజెప్పి
వింత జబ్బుల తలంటుతో ఆమె
గూట్లో కన్నీటి పిట్టగా ముడుచుకుంది!
షరియతీ, ఫత్వాల కొరడాలతో
వివక్ష ఆంక్షల సంకెళ్ళలో
వేధింపు రావణాసురుల పడగనీడలో
ఎదగనీయని బోన్సాయ్‌లా ఆమె
చిగురు బతుకును చిదిమేశారు.
ఐనా ఆమె పుడుతూనే ఉంది!
అగ్ని కీలల్లో పైకెగిసే ఫీనిక్స్‌లా..
బూడిద కుప్పల నుండి ప్రాదుర్భవించే జీవపు మొలకల్లా
పురిటి కేకల అంత:స్వరాల్లో ఆమె
ప్రతిధ్వనిస్తూనే ఉంది!!