డా|| కత్తి పద్మారావు
ఇటీవల రాష్ట్రంలో స్త్రీలను అవమానించే సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.
రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించి వారిని కౌన్సిలర్లుగా, మేయర్లుగా, ఎమ్.ఎల్.ఏ లుగా, ఎంపీలుగా ఎన్నుకుంటున్నారు.
కొంతమంది గ్రూప్-1 ద్వారా కమీషనర్లుగా, ఆర్‌డిఓలుగా వస్తున్నారు. సివిల్స్ పాసయి ఐ.ఎ.యస్, ఐ.పి.యస్ అధికారులు అవుతున్నారు. అయితే వీరిని చూసి పురుషులు సహించలేక అవమానాలు చేస్తున్నారు. పురుషులలో సంస్కారం పెరగక పోవడంవల్ల ఈ అవమానాలు జరుగుతున్నాయి. స్త్రీలు మొదటినుండి పరిపాలనా సామర్థ్యం కలవారని సామాజిక చరిత్ర చెబుతుంది. ఈ పరిపాలనా సామర్థ్యం ఈనాటిది కాదు. ఆదిమ సమాజాన్ని రూపొందించింది స్త్రీలే. అయితే సమాజం పరిణామం చెందే క్రమంలో పురుషద్వేషం స్త్రీ పురుషుల మధ్య తేడాలను సృష్టించింది. శారీరక, మానసిక స్థితులలో వైరుధ్యాలను చూపించి, శ్రమ విభజనలో స్త్రీని న్యూనత పరచడానికి పురుష సమాజం ప్రయత్నించింది. అందువల్లనే స్త్రీల పనులను ప్రత్యేకంగా కేటాయించడానికి ప్రయత్నించడం జరిగింది.
స్త్రీలు అబలలు కాదు: శారీరక నిర్మాణ శాస్త్రంలో స్త్రీ అబలత్వమేమీ పేర్కొనబడలేదు. జంతు ప్రపంచంలో స్త్రీ జాతులకంటే పురుషజాతులే బలహీనమైనవి. వెన్నెముక లేని జంతువులలో కూడా స్త్రీ ఎక్కువ పరిమాణం కలిగివుంది. పురుషుడు ఆమె యొక్క సామర్థ్యానికి భయపడి ఆమెను లొంగదీసే ప్రయత్నం చేశాడు. డా|| బి.ఆర్. అంబేద్కర్ స్త్రీ స్వాతంత్య్రం కోసం పోరాడారు. భారత రాజ్యాంగంలో ఆమెకు సమస్థాయి కల్పించడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలను పురుషులతో సమానం చేసింది భారత రాజ్యాంగమే. స్త్రీలు ఇంతవరకూ ప్రవేశించని రంగాలకు ద్వారాలు తెరిచింది. స్త్రీలకు ధైర్యాన్ని కలిగించడానికి వివిధ ఉద్యమాలు నాటి నుండి నేటికి కృషి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు రాజకీయ అధికారంలోకి వస్తున్న స్త్రీలు ఈ చైతన్యాన్ని కలిగిలేరు. వాళ్ళు పురుషుల చాటు స్త్రీలగానే ఇప్పటికీ ఉన్నారు. స్త్రీల చైతన్యాన్ని రాజకీయ ఉద్యమాలకు అనేక సందర్భాలలో మగవాళ్ళు ఉపయుక్తం చేసుకొంటున్నారు. రాజకీయ ఫలితాలు స్త్రీలకు ఉపయెగపడింది తక్కువ. భారతదేశంలో జరిగిన తెలంగాణా సాయుధ పోరాటంలో కూడా స్త్రీలు మహత్తర త్యాగాలు చేశారు. ఆధిపత్యం మాత్రం పురుషులకు వచ్చింది. సోవియట్ కమ్యూనిస్టు పార్టీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో స్త్రీలను తొలిసారి కొత్తసిపాయిలుగా చేర్చుకున్నది. భారత సైన్యాలలో కూడా స్త్రీలు సహాయకులుగా, వైద్యులుగా, కొన్నిసార్లు యుద్ధవీరులుగా ఎంతో సామర్థ్యాన్ని చాటారు. వారికి దక్కిన ఫలితాలు నామమాత్రం.
వేదాలనుండి మనుస్మృతి వరకు : నిజానికి ఇప్పుడు రాజకీయాలలో ఉన్న స్త్రీలు హేతువాదభావాలతో విజ్ఞానవంతులుగా ఉన్నప్పుడు మాత్రమే పురుషాధిపత్యాన్ని ఎదుర్కోగల్గుతారు. తరతరాలుగా మన లిఖిత గ్రంథాలన్నీ స్త్రీలను అవమానిస్తూనే వస్తున్నాయి. వేదాలలోనే స్త్రీని అవమానపరిచే వాక్యాలు ఇలావున్నాయి. సాలవృకాణాం హృదయన్వేతా(ఋగ్వేద సంహిత-10-95-15), స్త్రీల హృదయములు తోడేళ్ళ హృదయములే. స్త్రీణాయశ్వాసం మనః (ఋగ్వేద సంహిత-4-3-33-1), స్త్రీల మనస్సు శాసించుటకు వీలు లేనిది. నవైస్త్రేణాని సఖ్యాని సన్తి (ఋగ్వేద సంహిత-10-95), స్త్రీలతో స్నేహమనునది ఉండకూడదు. యా మా యా సూం. గొడ్రాలిని యముని కొఱకు చంపవలెను. ఋగ్వేదంలో ఉన్న ఈ విషయాలు మనుస్మృతిలో విస్తృతం చేయబడ్డాయి. అయితే దస్య స్త్రీలు ఆర్యులను ఎదిరించి పోరాడినట్లు చెప్పబడింది. చమురి, ధుని, పిప్ర శంబర, శుష్ణ, పృషా శిప్రుడ, మేయవ, పృత్ర, అశుస, వ్యంశ, రుద్రిక బల్బూత, వశ, ఈశ్వపుత్ర వంటి అనార్య వీరులతో కలసి స్త్రీలు పోరాటాలు చేశారు. ప్రథానులు. వీరితో కలసి స్త్రీలు యుద్ధాల్లో సైన్యాధ్యక్షులుగా ఉన్నారు. అందుకే వారిని రాక్షస స్త్రీలు అన్నారు. ఆర్యులతో పోరాడిన దస్య స్త్రీలను వికృతంగా వర్ణించారు. శంబరాసురుడని, వృత్రాసురుడని ఆర్యులు పలుకుతూ వచ్చారు. శంబరుడు అతని జాతివారు ఆర్యులతో 40 సంవత్సరములు అవిశ్రాంతంగా పోరాడారు. ఆ యుద్ధంలో లక్షలాది సంఖ్యలో దస్యులు మరణించారు. వారిలో స్త్రీలు పెక్కు సంఖ్యలో వున్నారు. ఆర్య స్త్రీలు చాలా తక్కువ సమయాల్లో మాత్రమే ఆయుధాలు పట్టారు. ఆర్యులు స్త్రీల యుద్ధ కౌశలాన్ని నిరసించారు అని చరిత్ర చెప్తుంది. ఆర్య అనార్య గణాల్లో స్త్రీలు యుద్ధ కౌశలంతోనే వ్యవహరించారు. అయితే అనార్య స్త్రీలు మొదటి నుండి వతృస్వామ్య పునాదితో ఉన్నారు. ఆర్య రాజ్యాలు ఏర్పడిన తరువాత అవి హిందూ రాజ్యాలుగా మారిన తరువాత మనుస్మృతి పెత్తనం ప్రారంభమయ్యింది. మనుస్మృతి స్త్రీలను పురుషులకు అధీనం చేస్తూ ఇలా వ్యాఖ్యానం చేసింది. ”పితారక్షతి కౌవరే భర్తారక్షతి యౌవనే – రక్షంతి స్థావిరే పుత్రానస్త్రీ స్వాతంత్య్ర మర్హతి” (మనుస్మృతి-9-3) బాల్యంలో తండ్రి స్త్రీలను రక్షిస్తాడు. యౌవనంలో మగడు రక్షిస్తాడు. ముసలితనంలో పుత్రులు రక్షిస్తారు. కావున స్త్రీలు స్వతంత్రులు కారు అని ప్రకటించింది మనుస్మృతి. కావున స్త్రీ స్వతంత్రురాలిగా ఉండటానికి వీల్లేదు. భర్త, కుమారులు లేనప్పుడు బంధువులు రక్షిస్తారు. ”అస్వంత్రాః స్త్రీయః కార్యపురుషై స్స్వైర్దివానిశం – విషయేషుచ సజ్జంత్య స్సంస్థాప్యా ఆత్మనోవశే” (మను-9-2) భర్త మొదలయిన పురుషులు స్త్రీలను తమ అధీనతలో ఉంచుకోవాలి. తరచుగా వారిని, రూప రస గంధాది విషయములలో అనురక్తులుగాకుండా చూసుకోవాలి అని చెప్పబడింది. ఇవే భావాలు ఇప్పటికీ పురుషుల మనస్సులలో ఉన్నాయి. రాజ్యాంగ స్పూర్తి పురుషులకందనట్లే స్త్రీలకు అందలేదు. స్త్రీలు హిందూమత ఆచారాలలో ఉండటం వలన ఇంకా భయం నుంచి బయటపడలేదు. ప్రతిదానికీ కన్నీరు పెట్టుకోవడం, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం చేస్తున్నారు. అన్ని మతాలు స్త్రీలను అదుపులో ఉంచాలి అనుకున్నట్టే అన్ని రాజకీయ పార్టీలు స్త్రీలకు సముచిత స్థానం ఇవ్వటం లేదు. ఇచ్చినా గౌరవించటం లేదు. ఈ న్యూనతాభావం నుంచి బయటపడాలంటే స్త్రీలలో ఆత్మస్థైర్యం పెరగాల్సి ఉంది. దీనికి హైస్కూలు స్థాయి నుంచే కుంగుపూ, కరాటే వంటివి నేర్పి వీరిలో ధైర్యాన్ని పెంచాలి. మన రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఎటిక్స్ నుంచి వచ్చింది కాబట్టి ఆమె రిపబ్లిక్ పెరేడ్‌లో సైనిక వందనాన్ని స్వీకరించగలిగింది. స్త్రీలో సామర్థ్యం ఈనాటిది కాదు. మొదటివిల్లు తయారుచేసింది స్త్రీలే, వేటాడింది స్త్రీలే. మనుస్మృతి ఆచరణలోకి వచ్చాకే స్త్రీ అబలయ్యింది. రాజకీయరంగంలో వచ్చిన ఈనాటి అవకాశాల్ని స్త్రీలు సరియైన పద్దతిలో ఉపయోగించుకోవాలంటే స్త్రీకి అధ్యయనం కావాలి, కేవలం అక్షరజ్ఞానం కాదు. అవగాహనతో కూడిన చదువు కావాల్సివుంది. ముఖ్యంగా తత్వశాస్త్రం, రాజకీయం శాస్త్రం, సామాజిక శాస్త్రం, చరిత్రలను వీరు నేర్చుకోవాలి. ప్రపంచదేశాలలో ఈనాడు స్త్రీ పురుషుడు కంటే అన్ని రంగాలలోనూ తన శక్తి సామర్థ్యాలను ప్రకటిస్తుంది.
కాలేజీల్లో హింస : రాజకీయ రంగంలోకి వచ్చే స్త్రీలే గాక కాలేజీలలో కూడా విద్యార్థినులు హింసించబడుతున్నారు. తమను ప్రేమించకపోతే చంపేస్తామనే ఉన్మాదానికి కొందరు విద్యార్ధినులు గురవుతున్నారు. ఇంజనీరింగు, మెడిసిన్ చదివే విద్యార్థినులు లౌకిక జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దిన పత్రికలు కూడా చదవడం లేదు. తాము చదువుతున్న అంశాలపట్ల పూర్తి శ్రద్ధ లేదు. కాలక్షేపం కోసం అవుతున్న స్నేహాలు, బలితీసుకొనేదాకా పోతున్నాయి. విద్యార్థినుల జీవనశైలిలో స్పష్టమైన మార్పు రావాల్సిన అవసరం కనపడుతుంది. విద్యార్థులలోనూ, విద్యార్థినులలోనూ మోహపూరితాంశాల ప్రేరణ శక్తులు ఎక్కువ ఆవహిస్తున్నాయి. సినిమా, టి.విలో వచ్చే కల్పితాంశాలు నిజజీవితానికి అన్వయించుకుంటున్నారు. చదువుకునే కాలంలో పంచేంద్రియాలను అదుపులో పెట్టుకోవడం వల్లనే అత్యున్నత దశకు ఎదుగుతాము అనే దృక్పథం కొరవడింది. దీనికి విద్యార్థులది విద్యార్థినులది ఇద్దరిదీ తప్పుంది. ఇద్దరినీ ఒకరినొకరు ప్రేరేపించుకొనే అంశాలపట్ల తప్ప, ఒకరినొకరిని ఉత్తేజపరచుకొనే ఉపకరణాలు తక్కువ ఉన్నాయి. లైబ్రరీ చదువు బాగా తగ్గింది. విద్యార్థినీ విద్యార్థుల మధ్య ఉండవలసిన విషయచర్చ, జ్ఞాన జిజ్ఞాస, పోటీ దృక్పథం కొరవడింది. వీరు వినోదపూరితమైన అంశాలవైపు, గుంపుపార్టీలవైపు, విహారయత్రలవైపు, దుబారా ఖర్చులవైపు, అయచిత కానుకల సమర్పణల వైపు దృష్టి ఎక్కువపెట్టి విద్యార్జనా సమయాన్ని ఎక్కువమంది దుర్వ్యసనాలపాలు చేసుకుంటున్నారు. విద్య, సంస్కృతి, వ్యక్తిత్వ నిర్మాణం, సంభాషణా సామర్థ్యం, గ్రహణశక్తి, దినదినాభివృద్ధి చెందాల్సినది పోయి పొగత్రాగడం, తాగుడు, దృశ్యవీక్షణ, మత్తుమందుల స్వీకరణ వంటి అపమార్గాలు విద్యార్జనా సమయంలోనే కాక కార్పొరేట్ ఉద్యోగులలో కూడా పెరగడం వలన స్త్రీలకు విద్యా ఉద్యోగాలలో సమమైన అవకాశాలు వచ్చినా వారికి రక్షణ లేదు. ఇందుకు స్త్రీలు బాధ్యత వహించి ఆత్మస్థైర్యంతో కూడిన జీవన విధానాన్ని అలవరచుకోవాలి. స్త్రీలు ఒక సమాజం నుండి మరొక సమాజం వైపు ఎదుగుతున్న సందర్భంలో ప్రపంచదేశాలలో వస్తున్న మార్పులని గమనించాలి. ఎంత చదువుకున్నా ఎక్కువ మంది స్త్రీలలో మూఢాచారాలు బలంగా ఉన్నాయి. ఉంటే సున్నితంగా ఉండటం లేకపోతే కఠినంగా ఉండటం అనే రెండే పద్దతులలో స్త్రీలు తయారవుతున్నారు. ఇండ్లలో భయాన్ని నేర్పటం వలన బయటకు వచ్చినా ఆధారితులుగా జీవిస్తున్నారు. కొన్నిసార్లు పట్టణాలలో ఈ ఆధారితాంశమే సమస్య అవుతుంది. ఉమన్స్ సెంటర్స్‌లో ఉండే ఆడపిల్లలు వారికి కొద్దిగా అండగా ఉండటం కోసం కొందరి యువకులతో పరిచయాలు పెంచుకుంటే వాళ్ళకి పరిణితి లేక వాళ్ళు తొందరపాటు చర్యలకు చనువు తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ అవగాహనా రాహిత్యంతో జరుగుతున్న విషయాలే. వీటిని పరిష్కరించుకోవాలంటే ముందు మతభావాల నుంచి బయటపడాలి. స్త్రీలు పురుషుల కంటే తక్కువనే భావననుంచి బయటపడాలి. పోటీపడి చదవటమేకాదు తమనుతాము నిరూపించుకోవడం కోసం ఓ సుదీర్ఘమైన గమ్యాన్ని నిర్ధేశించుకోవాల్సివుంది.
దళిత మహిళలపై అత్యాచారాలు: ఇక రాష్ట్రంలో దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు 2007, 2008లో మరింతగా పెరుగుతున్నాయి. మానభంగాలు ఇప్పటికే 343 నమోదయ్యాయి, హత్యలు 98, దాడులు, 214 జైల్లో మరణాలు 19, అంటరాని స్త్రీలను నగ్నంగా ఊరేగించిన సంఘటనలు 8, ఆస్తుల జప్తు 8, అంటరానితనం వేధింపులు 121, ప్రభుత్వాఫీసుల్లో వివక్ష 46 ఇవీ ఈ సంవత్సరంలో ఇప్పటికి జరిగినవి. గతంలో 1977 సంవత్సరంలో 27,944 నుండి 2001లో 33,501కి పెరిగాయి. ఇవి కేవలం దళిత స్త్రీల మీదే అంటే వ్యవసాయకూలీలైన స్త్రీలమీద జరిగాయి. వీళ్ళ పిల్లల్నే ఇప్పుడు కష్టపడి హైస్కూలు చదువుల వరకు చదివిద్దామనే ప్రయత్నం చేస్తుండగా అక్కడ విద్యార్థినులమీద వివక్షతోపాటు వేధింపులు కూడా జరుగుతున్నాయి. అంటే స్త్రీ ఒక సామాజిక వ్యవస్థ నుండి మరొక సామాజిక వ్యవస్థకు మారాలన్నా, ఒక ఆర్థిక వ్యవస్థ నుండి మరొక ఆర్థిక వ్యవస్థకు మారాలన్నా ఎన్నో అణచివేతలు ఎదురవుతున్నాయి. అందులో పితృస్వామ్యం ఉంది. కులమూ ఉంది. కేవలం పురుషుని ఆధిపత్యం మీద జరుగుతున్న అంశాలకంటే కులవివక్ష తీవ్రమైంది. విద్యార్థినులను ఇంజనీరింగు కాలేజీల్లో వేరేకులం వాళ్ళతో మాట్లాడవద్దు అనే ఆంక్ష పెట్టడం ఆనవాయితీ అయ్యింది. ఇంజనీరింగు కాలేజీలు, మెడికల్ కాలేజీలు కులతత్వాన్ని స్థిరీకరిస్తున్నాయి. విద్యార్థుల్లో నిజానికి శారీరక నిర్మాణ శాస్త్రాన్ని చదివే విద్యార్థుల్లో కులతత్వం ఉండకూడదు. ఎందుకంటే అందరి శరీరాలు ఒక్కటే అని, మానవులు మానవులకే జన్మిస్తారని, కులం మనమీద రుద్దబడిందని వాళ్ళకు అర్థమవుతుంది. అందుకే వాళ్ళు అన్ని కులాల వారి గుండెలను, ఎముకలను, నరాలను ఒకే రకంగా పరిశీలించగలుగుతున్నారు. కానీ వారిలో కులతత్వం పోవడం లేదు.
రంగు భేదం: ఈ విద్యార్థినులను వేధించడంలో వీరు నల్లనివాళ్ళని, వీళ్ళు తెల్లనివాళ్ళని రంగుభేదాలు కూడా చూపిస్తున్నారు. స్నేహం చేసేటప్పుడు కులం లేదని చెప్పి పెళ్ళిళ్ళప్పుడు కులాన్ని అడ్డుపెడుతున్నారు. దీనికంతటికీ మతభావాలు, కులభావాలు కారణమవుతున్నాయి. కొన్ని ఇంజనీరింగు, మెడికల్ కాలేజీల్లో కులాలనుబట్టి విద్యార్థులు బెంచీలలో కూర్చుంటున్నారు. చాలా కాలేజీల్లో అధ్యాపక బృందంలో ఒకే కులం ఉపాధ్యాయులు 60 శాతం కంటే ఎక్కువ ఉన్నారు. కమ్మ, రెడ్లు కరస్పాండెంట్స్‌గా ఉన్న కాలేజీల్లో రాజ్యాంగం అమలులో లేదు. కులాధిపత్యం అమలు జరుగుతుంది. ఇక్కడ విద్యార్థినుల పరిస్థితి భయాందోళనలతో కూడి ఉంది. ఇటు రాజకీయాలలోనూ వేధిస్తున్నారు. అటు విద్యాలయాల్లోనూ వివక్ష చూపుతున్నారు, ఇటు గ్రామాలలోనూ హింసిస్తున్నారు. ఈ స్త్రీల పైన ఈ అమానుష హింస పోవాలంటే మత కుల ఆధిపత్యాలపైన పోరు జరగాలి.
ఈ పోరాటాలలో స్త్రీలు ప్రధాన పాత్ర వహించవలసి ఉంది. చాలా మంది దళిత విద్యార్థినులు టెన్త్ దాటి ఇంటర్‌మీడియట్ దాకా వెళ్ళలేక పోతున్నారు. గ్రామాల నుండి పట్టణాలలో నివాసం ఉండలేని వాళ్ళు, వాళ్ళ పిల్లల్ని పట్టణాలలో ఉండే విద్యాలయాల్లో చదివించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా డిగ్రీ కాలేజీ విద్యార్థినులకు హాస్టల్స్ లేవు. ఈ విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది. స్త్రీ అభివృద్ధికి సోపానం నిర్మించాలంటే స్త్రీల గురుకుల పాఠశాల సంఖ్య మండలానికి ఒకటి పెంచాలి. తమ గ్రామాలనుంచి విద్యార్థినులు స్కూళ్ళకు వెళ్ళడానికి ప్రత్యేక బస్సులు వారికి రక్షణ కల్పించాలి. స్త్రీ అభివృద్ధి చెందడం వలన దేశం అభివృద్ధి చెందుతుంది. ఎంబిఏ, ఎంసిఏ చదివి ఉద్యోగాలు చేస్తున్న యువతులు పురుషులకంటే కూడా తమ సామర్థ్యాన్ని చాటుతున్నారు.
వెనుకబడిన స్త్రీల సామర్ధ్యం: వ్యాపార రంగాల్లో మొదటినుంచి స్త్రీలే ముఖ్యంగా ఉన్నారు. బెస్త స్త్రీలు చేపలు అమ్మేవాళ్ళు, వేరుశనగకాయలు, గుగ్గిళ్ళు, తేగలు యాదవ స్త్రీలు అమ్మేవాళ్ళు, రవికగుడ్డలు పద్మశాలీలు, దేవాంగ స్త్రీలు – పాలు కాపు స్త్రీలు – తాటాకు, ముంజలు గౌడ స్త్రీలు – కట్టెలు దళిత స్త్రీలు – చింతపండు, కుంకుళ్ళు గిరిజన స్త్రీలు అమ్మేవాళ్ళు. కూరగాయలు, పండ్లు వంటివన్నీ వెనకబడిన కులాల స్త్రీలే అమ్మేవాళ్ళు. అయితే ఈ రిలయన్స్‌లు, హెరిటేజ్‌లు, ఫ్రష్‌లు, ఫుడ్‌వరల్డ్‌లు, మోర్‌లు వచ్చి కరివేపాకుతో కూడా అమ్ముతున్నాయి. ఒక్క రిలయన్స్ తప్ప మిగిలినవన్నీ కమ్మ, రెడ్డి పెట్టుబడిదారుల షాపులే. దీంతో కింద కులాల స్త్రీల ఉపాధి రంగమంతా కుంటుపడిపోయింది. ఇంకవారికి పావలా వడ్డీ ఇచ్చి లాభమేమివుంది. స్త్రీలపై అత్యాచారాలు జరగడానికి తాగుడు కూడా ఒక ప్రధాన కారణం. ఈ రుగ్మతలన్నింటినీ ఎదిరించాలంటే రాజకీయ అధికారాన్ని పొందిన స్త్రీలు తమ స్వావలంబనం కోసం అసెంబ్లీల్లో, పార్లమెంటులో, కార్పోరేషన్లలో, మున్సిపాలిటీలలో పోరాడాల్సి వుంది. అయితే వీళ్ళు తమ వ్యక్తిగత లాభాలకోసం మాత్రమే ఆరాటపడుతున్నారు. ఈ పరిస్థితులలో స్త్రీలు హేతువాద భావజాలంతో డా|| బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ స్పూర్తిని అందుకోవాలి. కులమత భేదాలు లేని పితృస్వామ్య కులాధిపత్యం లేని సమాజం కోసం విజ్ఞతతో, పరిణితితో ప్రపంచ దృక్పథంతో, ఆత్మగౌరవంతో ముందుకు వెళ్ళవలసిన చారిత్రక సందర్భం ఇది. లేకుంటే భౌతికంగా సంకెళ్ళు తెగినట్టు కనపడినా, అంతర్గతంగా ఆ సంకెళ్ళు మరింత బిగుసుకుంటాయి. సంకెళ్ళు తెంచుకోవాల్సింది స్త్రీలే ఎవరో కాదు. స్త్రీల ఆత్మగౌరవ పోరాట పతాకాన్ని ఎగురవేయాలి.
కథ