జ్వలిత
గ్రామాలే భారతదేశానికి పట్టు గొమ్మలు. గ్రామాలధికంగా ఉన్న గ్రామీణదేశం మనది.
అందుకే నిజమైన భారతదేశం, భారతీయత గ్రామాల్లోనే జీవిస్తుందని అన్నారు గాంధీగారు.. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా వరింది.
గ్రామాలతో సహా నగరాలు, పట్టణాలు గ్లోబలైజేషన్ ప్రభావంలో కొట్టుమిట్టాడుతున్నాయి. భారతదేశానికి వారసత్వంగా వచ్చిన సాహిత్య, సాంస్కృతిక సంపదను మరిచి పాశ్చాత్యదేశాల ఎండమావులవంటి సంస్కృతిపట్ల ఆకర్షితులయి డబ్బువేటలో పరుగెడు తున్నారు.
గ్రామీణులు ప్రాకృతిక సహజ సౌందర్యాన్ని విడనాడి, అమాయకత్వంతో కూడిన, నిజాయితీ నిండిన జీవన సౌందర్యాన్ని విడనాడి, కృత్రిమ నాగరికత వెంట పరుగులు పెడుతున్నారు.
ఏ సమాజంలోనైనా, ఏ యుగంలోనైనా సమాచారలోపం వల్ల ఒక వర్గం వెనుకబడి వుంటుంది. ప్రాచీనకాలంలో రాజరికపు వ్యవస్థ, బ్రిటిష్ మహ్మదీయుల కాలం ఏదైనా పాలకుల భాష పాలితులకు అర్థంకాక ఒక వర్గం అంటే గ్రామీణులు వెనుకబడివున్నారు. సంస్కృతి, సంప్రదాయలకు ఉనికిపట్టువంటివి గ్రామాలు. గ్రామాలు కలుషితం కాకుండా కాపాడుతూ వచ్చినవి పండుగలు, సజీవ స్రవంతిగా ప్రవహించే సంస్కృతీ, సంప్రదాయలను కాపాడి భద్రపరచిన ”గోల్డెన్ త్రెషోల్డ్స్” (ఖజానాలు) వంటివి గ్రామాలు. కాని ఈ మధ్య పద్ధతి మారింది. గ్రామాలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదాలు వచ్చిపడినాయి. పారిశ్రామికాభివృద్ధి కారణంగా చేతిపనులవాళ్ళు భృతిని కోల్పోయి, పట్టణీకరణ ప్రభావంతో పంటపొలాలు ”రియల్ ఎస్టేట్లుగా” మారి, ప్రపంచీకరణ మాయలో పడి ఐ.ఐ.టి చదువులు, డాలర్ల వేటలో గ్రామాలకు గ్రామాలే వలసపోవడం జరుగుతున్నది. దీనితో కళకళలాడుతూ, పచ్చపచ్చగా సజీవంగా వుండవలసిన పల్లెలు, కనిపించని భయంతో, కానరాని దుఃఖంతో, గాజుకళ్ళతో, ఎండి బీటలు వారిన పొలాలవంటి గుండెలతో రంగులు వెలసి, దారాలు తెగిన జీవితాలతో సజీవ శవాలుగా మిగిలిపోతున్నాయి.
నాగరికత పెరిగి, కులమతాల అడ్డుతొలిగి, జాతీయసమైక్యత వెల్లివిరిసి, అన్ని పండుగలు అందరం కలిసి చేసుకుంటున్నాము. అందరినీ అందరం విమర్శించుకుంటున్నాము. కులాలు, మతాలు తొలగిపోయి ఉన్నవారు ఎక్కువ డబ్బున్నవారిగా ఎదుగుతుంటే లేనివారు ఏమీ లేనివారిగా మారిపోతున్నారు. హృదయవిశాలత పెరిగిపోయి, కులాంతర, మతాంతర వివాహాలు ప్రోత్సహిస్తున్నాము. పేరు ప్రక్కన కులం పేరును కిరీటంలా తగిలించుకుంటూ నరసింగమాదిగ, జంగయ్యమాల, రాజన్నగౌడ, మల్లన్నయదవ్ అంటూ వ్యక్తులుగా ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నాము. సమైక్యత కొన్ని అవసరాల కోసమే అనే విషయం మనం అర్థం కానంత అయెమయానికి గురికాబడుతున్నాము.
ఈ రకంగా పట్టణ, గ్రామీణ జీవితాలలో అంతరాలు పెరిగి పెరిగి పెను ఎడారిలా మారిపోయాయి. దీనికంతటికి ప్రత్యేకమైన కారణాలతో కొన్ని ఎత్తుగడలు, కుట్రలు కూడా అనవచ్చునేమో. అవి మూడు – 1) ప్రపంచీకరణ, 2) బహుళజాతి సంస్థలకు లొంగిపోయిన రాజకీయం, 3) ప్రపంచీకరణచే ప్రభావితమైన రాజకీయ స్వార్థం.
ఇక్కడ వింత ఏమిటంటే మనకే తెలియకుండా మనలో మనమే మోసం చేసుకుంటూ పై మూడింటిలో ఏదో ఒక దానికి ఏజెంటుగానో, బ్రోకర్‌గానో, కార్యకర్తగానో సహకరిస్తూ మన చుట్ట వున్న మనవారిని మనమే మోసం చేస్తూ, మనని మనం పోగొట్టుకొని, ఎవరికివారే ఒంటరి పక్షులమై మిగిలిపోతున్నాము.
ఇంతకుముందు మా వూర్లో పండుగ బాగా జరుపుకుంటాము అని గర్వంగా చెప్పుకునేవాళ్ళం. కాని ఇప్పుడు మా పట్నంలో పండుగ బాగా జరిపించారు అని ఆడంబరంగా చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఈ మధ్యకాలంలో ముఖ్యంగా బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్, క్రిష్టమస్ పండుగలను టి.వి. ఛానళ్ళు, వివిధ సంస్థల వాళ్ళు నిర్వహించిన తీరు మనం చూశాం. ముగ్గుల పోటీలు, బతుకమ్మ పండుగల ప్రత్యక్ష ప్రసారాలు, పండుగ బోనస్‌లు, వస్త్రమేళాలు, పండుగ డిస్కౌంట్‌లు వీటిలో జనం మునిగిపోయారు. ఎవరు ఎవరితో మాట్లాడే తీరిక లేదు. డబ్బు సంపాదించేవారు సంపాదనలో, లేనివారు ఖర్చుపెట్టడంలో అందరూ కలవకుండా ఎవరి వ్యామోహాల్లో వారు పబ్బుల్లో, క్లబ్బుల్లో, ఇంటర్‌నెట్‌లలో, సినిమాహాళ్ళలో, షాపింగుమాల్‌లలో మిగిలినవారు టి.విలముందు – ఇదీ నవ భారతం.
ఇంతకుముందు నల్లవాడో, తెల్లవాడో, డబ్బు, ధనం, ఇలా ఫలానావాడు, ఫలానాది దోచుకోవడం మనకు తెలిసేది. ఇప్పుడు ఎవడేది దోచుకుంటాడో తెలియదు. బుద్ధిని, తెలివిని, అందాన్ని, ఆశను మనకు తెలియకుండా మనం దోచుకోబడుతూ, చదువుకున్నవారు, చదువుకొన్నవారు, చదువులేనివారు అందరూ అందరి చేతిలో మోసపోతున్నారు, మోసపుచ్చుతున్నారు.
విదేశీయులు మన సంస్కృతి, సాహిత్య, సంప్రదాయములను గౌరవించి వాటిపై పరిశోధనలు చేస్తుంటే మనం మాత్రం విదేశాల ఆడంబరాల పట్ల గుడ్డిగా ఆకర్షింపబడుతున్నాం. బడి అంటే ఇంగ్లీషు మీడియం కాన్వెంట్ బడే. చదువంటే ఐ.టి. చదువే, డబ్బంటే డాలరే, దేశమంటే అమెరికాయే అనే ధోరణిలో వున్నాయి మన ఆలోచనలు.
ఇంతకుముందు యాచకుడు అమ్మా! దానం చెయ్యమ్మా! అనేవాడు, ఇప్పుడు ఆంటీ! అన్నంపెట్టమ్మా అంటున్నాడు. మమ్మీ-డాడీల సంస్కృతి పల్లెలపై ప్రభావం చూపుతుంది. అమ్మా అని పిలిచినందుకు చెంప చెళ్ళుమనిపించే తల్లులు, ఇంజనీరింగే జీవితలక్ష్యం అనే తండ్రులే మనకు కనిపిస్తారు ఈ రోజుల్లో. కాస్త చదువుకున్న ఇల్లాలు తన భర్తతో అవసరార్థం పల్లెనుండి పట్టణానికి వస్తే, పనులు చూసుకుని, ఒక సినిమా చూసి, బ్యూటీపార్లర్‌కు పోయి తిరిగి ఇంటికి వెళ్తుంది. ఈ విధంగా సినిమా కథ కొంత, కృత్రిమ అందం కొంత పట్నం నుండి పల్లెకు తీసుకుపోతుంది. సౌందర్య స్పృహ అవసరం లేదు అనను కాని విపరీత ధోరణులపట్ల ఆకర్షణ వద్దు అని చెప్పగలను.
ప్రతి ఊరికి కరెంటు, రోడ్డు సౌకర్యం ఉన్నా లేకపోయినా, టూత్‌పేస్ట్, ఫెయిర్ & లవ్‌లీ అమ్మే దుకాణం వుంటుంది. సొంతగూడు వున్నా, లేకున్నా సెల్‌ఫోన్ వుంటుంది. రిలయన్స్ నెట్‌వర్క్ ప్రకటన టి.విలో చూపుతారు. భూమి లేకున్నా ఫోన్ నెట్‌వర్క్ వుంటుందని సముద్రంలో పడవను, నీరు లేకున్నా నెట్‌వర్క్ వుంటుందని ఎడారిలో ఒక పురుగును, లైట్ లేకున్నా నెట్‌వర్క్ వుంటుందని ఒక చీకటి ప్రదేశాన్ని చూపుతారు. మనిషికి అవసరమయిన భూమి, నీరు, కరెంట్ ఇవేవి లేకపోయినా జేబులో సెల్‌ఫోన్‌తో మనిషిననే విషయం కూడా మరిచిపోవచ్చన్నమాట.
మన పండుగల పేరుతో మీడియా చేసే హడావిడి అంతాయింతా కాదు. కాగితపుపూలకు సెంటువాసనలద్ది సీతాకోకచిలుకలను ఆకర్షించే సంస్కృతిని బలవంతంగా చూపిస్తుంది.
దసరా సెలవులకు హైదరాబాదు వెళ్ళినపుడు మా అమ్మతో కలిసి ‘శిల్పారామం’ వెళితే అక్కడ బతకమ్మ పండుగ సీను వీడియో తీస్తున్నారు. నిజానికి అక్కడ ఒక టి.వి. ఛానల్ యాంకర్ బలవంతంగా ఓ నలుగురు ఆడపిల్లలని, ఓ ఇద్దరి ఆంటీలని చప్పట్లు కొడుతూ చుట్టూ తిరగమని, ఏదో ఒక పాటపాడమని బలవంతపెడ్తున్నది. వాళ్ళు తిరగలేక, పాడలేక అవస్థపడడం చూశాను. చుట్టూ చూస్తే బతకమ్మ పాటపాడగల పెద్దవయస్సు ఆడవాళ్ళు చాలామందే వున్నారు. నాకు తెలిసిన వాళ్ళే వున్నారు చుట్టూ. కాని ఆ యాంకర్ వీళ్ళలో ఏ ఒక్కరిని అడిగినా బతకమ్మ పండగ గురించి చాలా బాగా చెప్పేవారు కాని ఆ అమ్మాయి కాలేజీ పిల్లలను, ఆఫీసులకు వెళ్ళే ఆంటీలను ఎన్నుకుంది. మరి అందంగా వుండాలి కదా ప్రోగ్రాం. మా అమ్మకు అవకాశమిస్తే గంటకు తగ్గకుండా కార్యక్రమం నిర్వహించేది. కాని అలా జరగదు కదా!
బతకమ్మ పండుగను కూడా రాజకీయ రంగులమయం చేసే ప్రయత్నంలో రచయితలు, సాహితీప్రకాశకులు కూడా కొంత జాగ్రత్తవహించవలసిన అవసరం వుంది. ప్రకృతిని అద్దాల్లో చూడవలసిన అవసరం ఏంటి? సహజ సుందరంగా ఆకులో ఆకునై, పూవులో పూవునై అంటూ మమేకమైపోవాలి కదా!
గ్రామాల్లో, గల్లీల్లో కూడా బుల్లిబుల్లి క్రికెట్ ఆటగాళ్ళే కనిపిస్తున్నారు. కోతికొమ్మచ్చిఆట, జిల్లగోనె, గోలీలాట, దాగుడుమూతదండాకోర్ ఇవన్నీ ఏవి? చల్లని వెన్నెలలో ఊరి పొలిమేరల్లో, దుబ్బదొడ్లకాడనో ఆడపిల్లలు కూడా భయంలేక ఆడే బలిగూడు ఆటలేవి? అన్నీ మాయమై ‘మరు భూమికిపోయిన మహిళపై అత్యాచారం’, ‘చేతబడి అనుమానంతో వృద్ధుని సజీవదహనం’ ఇవి కనిపిస్తున్నాయి. దీనికి కారణం చైతన్యపరచవలసినదానిని, అవగాహన పెంచాల్సినవాటిని మరిచి అవసరంలేని ఆడంబరాలను మాత్రమే పెంచుతున్న నవనాగరికత.
ఇంతకుముందు ఇంటికి ఎవరైనా వస్తే మా అమ్మ, నాన్న, అత్త, మామ, చిన్నాన్న, పెద్దమ్మ, అన్నయ్య, వదిన, ఇలా వ్యక్తులను పరిచయం చేసేవాళ్ళు. కాని ఇప్పుడు జపాన్ టి.వి, అమెరికా వాషింగు మిషన్, జర్మనీ వాక్యూమ్ క్లీనర్ – ఇలా ఇంట్లో వస్తువులను పరిచయం చేసే వస్తువ్యామోహం స్థితి ఏర్పడింది.
మనిషిని మనిషి ప్రేమించే తీరు మారి వస్తువులను ప్రేమించడం మొదలుపెట్టి, డబ్బు యావలో పడి సాలెగూటిలోచిక్కిన ఈగలా మారిపోయాడు. అమ్మమ్మలు, నానమ్మలు కాస్త విస్తృతంగా ఒకింత బాధ్యతగా వ్యవహరించాలి. పల్లెకథలను, తమ బాల్యస్మృతులను, ఊరించి, ఊరించి, జుంటితేనెల, జున్నుపాల మాధుర్యాన్ని రుచి చూపించాలి. మన పండుగల ఔచిత్యాన్ని పట్టణమాయలో పడ్డ మన మనవళ్ళకు, మనవాళ్ళకు తెలియజేయాలి. ముసలివాళ్ళ మాట ఎవరు వింటారు అనుకోకుండా, కొంచెం చొరవ, కొంచెం ఆలోచన చేర్చితే తప్పకుండా అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు చాలా చేయగలరు.
స్వగృహ ఫుడ్స్ వచ్చిన తరువాత అమ్మ, నానమ్మల చేతివంటల కోసం పండగ సెలవులకు వచ్చే ప్రవాస గ్రామీణ మనవళ్ళ బృందం రాకపోకలు తగ్గాయి. పల్లెమరదళ్ళు, పట్నంబావల సరదాలు పోయి ”హింసాత్మక ప్రేమోన్మాదాలు” తలలెగరేస్తున్నాయి.
కవులు, ప్రకాశకులు కూడా తమ కలాలను, గళాలను కదిలించి మన ఊపిరైన గ్రామీణ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి.
‘పత్రికొక్కటి పదివేలసైన్యంబు’ అన్నట్టు కవులు, రచయితలు కొంత ‘ఫ్యూచర్‌విజన్’ మరికొంత ‘సూపర్‌విజన్’ కలిగివుంటారు కనుక సామాన్యుడికంటే భిన్నంగా, భవిష్యత్తును మనోఫలకం మీద చిత్రీకరించుకుని తాను స్వయంగా దర్శించి, ప్రపంచానికి చూపించే గురుతర బాధ్యత మనపైన ఉన్నది.
అలా సందర్శించి, స్పందించి ప్రజలను సమీకరించిన వారే కదా శ్రీశ్రీ, జాషువా, గురజాడ మొదలైనవారు. అటవీశాఖ 100 సం||లలో చేసే పనిని 10 సం||లలో చేయగలిగిన చిప్కో ఉద్యమనేత బహుగుణ వంటి వారిని స్పూర్తిగా, ఉద్యమరూపంలో స్పందించవలసిన అవసరం ఇప్పుడున్నది.
ఏ యుగమయినా, ఏ సమాజమయినా సమాచార లోపం ఏర్పడినప్పుడు ఒక వర్గం వెనుకబడివుండటం మనం గమనిస్తాం. అటువంటి సమాచారం, ప్రచారం పల్లెలకు, పట్టణాలకు సమానంగా జరగకపోవడం కారణంగా పల్లెలు వెనుకబడి వున్నాయి. ఇంటింటికి టి.వి.లు, స్టార్ కేబుల్ కనెక్షన్ వచ్చిన తరువాత ఇంకా సమాచార పంపిణీ లోపం ఏమిటని ప్రశ్న తలెత్తొచ్చుకాని.
చైతన్యాన్ని కలిగించాల్సిన నిప్పు దగ్గరే చలికాచుకుంటూ కూర్చుని వళ్ళు కాల్చుకుంటున్నది కొందరు (యువత). చుట్టలు కాల్చుకుంటూ బాధ్యత మర్చిపోతున్నది మరికొందరు (పలాయన వాదులు). ఇక్కడ భాగవతం ఎలా వుంది అంటే టన్ను బరువుందనో, గుడ్డివాళ్ళు ఏనుగును వర్ణిస్తూ లావుగా, అరిటిబోదెలాగుందనో, చేటలా వెడల్పుగా వుందనో చెప్పినట్టు వుంటుంది. సమగ్ర అవగాహనా లోపమే దీనికి కారణం. (చెవిని తడిమిన గుడ్డివాడు చేటతో, కాలును తడిమిన గుడ్డివాడు అరటిబోదెలా ఉంటుందని చెప్పాడు. పూర్తిగా ఏనుగును చూడలేని అవిటితనం, అజ్ఞానం. తనకు తెలిసినదే జ్ఞానం అనుకుంటాడు కదా) మీడియా చేస్తున్నది అదే. ప్రణాళికాబద్ధంగా తమకు కావలసిన విధంగా బహుళజాతి సంస్థలు సామాన్య ప్రజానీకాన్ని మాయజాలంతో ఒక రకమైన ట్రాన్సుకు గురిచేసి తమ ఉత్పత్తులను మనపై రుద్ది, అవి లేకపోతే మనం బ్రతకలేమని మన చేతే చెప్పించగలుగుతున్నారు.
రకరకాల ఛానల్స్ వచ్చి మనుషుల్ని గుంపులు గుంపులుగా టి.వి. ముందే కట్టిపడేసి, కదలనీయడం లేదు. క్రికెట్ మ్యాచ్ ప్రభావం ఆఫీసులకు, కాలేజీలకు వెళ్ళనీయకుండా టి.విల ముందే కూర్చోబెడ్తుంది.
జీడిపాకం లాంటి టి.వి. సీరియళ్ళు మనుషుల మధ్య ద్వేషాన్ని, ప్రతికూల ధోరణులను మాత్రమే చూపించి కుటుంబ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. కవులు, ప్రచురణకర్తల పాత్ర అంటే సీరియళ్ళ గురించేంటి అనే సందేహం మీ చూపుల్లో నాకు కనిపిస్తుంది. ఈ సీరియల్స్ సృష్టి ఒక రచయితే కదా. ఒక వ్యాపార ప్రకటన వెనుక వుండేది ఒక రచయితే కదా. 10 కోట్లు పెట్టి ఉత్పత్తి చేసే వస్తువునయినా, 30 సెకన్లలో ప్రసారమయ్యే ప్రకటన మాత్రమే ప్రభావితం చేస్తుందంటే దాని వెనుక ఒక సృజనకారుడు లేకుండా సాధ్యమవుతుందా?
ఉదా: వాన చినుకు శబ్దాన్ని తండ్రికి సెల్‌ఫోన్‌లో వినిపించే చిన్నారి, ఫోన్లో చదరంగమాడే తాత-మనవళ్ళు, కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధాన్ని ఎంత సున్నితంగా, సంక్షిప్తంగా హృదయానికి హత్తుకునేలాగా చెప్పగలుగుతున్నారంటే, వీరి ముందు రాజకీయ నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలు ఏ మాత్రం పనిచేస్తాయో మనకు తెలుసు. కనుక కవులు/కళాకారులు/ప్రకాశకులు ఎవరైనా గ్లోబలైజేషన్ ప్రభావం మనకు తెలియకుండా మనను మోసం చేస్తున్న సమయంలో మనను కాపాడుకొని, మన బాధ్యత నిర్వహించవలసివుందని నా అభిప్రాయం.
ఇది నిజంగ చాలా మంచి ప్రయత్నము, చాలా మంచి మంచి రచనలు మీరు అందిస్తున్నరు, నాకు భుమికలొ రచన్లు చుసుకొవలని అనిపించింది, పమ్పించాలని వుంది.