మనం స్త్రీలుగా ఒక్కటిగా లేము. మతాన్ని బట్టి విడగొట్టబడ్డాం! హిందువులుగా, ముస్లింలుగా, క్రైస్తవులుగా సమాజం మనల్ని విడదీసింది. వీరి కుటుంబాలకు త్యాగాలు చేసే కేంద్ర బిందువులం అయ్యాము. మతాలకు అతీతంగా వారి ఆస్థులను కాపాడడం కోసం పిల్లల్ని కనిచ్చే యంత్రాలుగాను, చివరికి వారి ఆస్థి గాను మిగిలిపోయాం. ఎవరిమీద ఎవరికి కోపం వచ్చినా అవతలి వారి వైపునున్న స్త్రీలపైనే ముందుగా ప్రభావం వుంటుంది. మన దేశ సామాజిక, రాజకీయ, ఆర్ధిక సంబంధాలకు పునాది వేసింది హిందూమతం. మన చుట్టూ పరుచుకున్న భావజాలం అంతా పితృస్వామిక భూస్వామ్య హిందూ భావజాలమే!
మైనార్టీ స్త్రీలపై జరుగుతున్న సంఘటనలనే తీసు కుందాం….., 71 సం|| నన్ పై అత్యాచారం, ధన లూటీ, కాందమాల్ 2008 మత విద్వేషపు దాడులలో నన్‌పై సామూహిక అత్యాచారం, ఆదివాసి మైనార్టీ స్త్రీల పై హింస, అర్థ నగ్నంగా రోడ్డు వెంబడి పెరేడ్ చేయించడం, అంతకు ముందు మంగళూరులో భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా పబ్బులకు వెళుతున్నారని మైనార్టీ క్రైస్తవ స్త్రీలను తరిమి తరిమి కొట్టిన వైనం… మరింత ముందుకు వెళితే గుజరాత్‌లో (2002) ముస్లిం స్త్రీలపై భౌతిక హింస, మారణ హోమం మనల్ని కలిచి వేస్తాయి. ఈ దేశం సెక్యులర్ స్టేటా కాదా అన్న సంధిగ్ధంలో మనల్ని పడివేస్తాయి.
ఈ క్రమంలో మనం గమనించవలసిన రెండు అంశాలు వున్నాయి. ఒకటి గుజరాత్ ప్రయోగంతో మైనార్టీలపై దాడులు, అత్యాచారాలతో భయభ్రాంతులను చేసి వీరిని భారతదేశంలో రెండవ తరగతి పౌరులుగా మిగల్చడం లేదా హిందూత్వ నినాదం ప్రకారం మైనార్టీలను ”హేరామ్” అన్పించి ‘ఘర్‌వాపసి’ ద్వారా హిందూజాతిలో కలిపేసుకోవడం. తద్వారా విశాలమైన హిందూ మార్కెట్టును సామ్రాజ్యవాద దేశాలకు అప్పగించే దిశగా దేశాన్ని తయారు చేయడం. రెండవ అంశం ఏమిటంటే శతాబ్దాలకు పైగా ప్రజలతో పని చేస్తూ జీవితాల్ని త్యాగం చేస్తున్న మైనార్టీ సంస్థల నుండి వారిని వెళ్ళిగొట్టి అక్రమంగా వారి ఆస్థులను ఆక్రమించుకోవడం. ఆ ఆస్థులను హిందూ ఆధిపత్య కులవర్గాలకు అప్పగించడం ప్రధానమైనవి.
అందుకే ‘హిందూత్వ’ పాలకులకు ఒక ఆయుధంగా మారింది. ‘నస్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అన్న మనువు మతాన్ని రాజకీయాలలోకి జొప్పించిన గాంధీ, వల్లభబాయి పటేల్‌లు పార్టీలకు అతీతంగా ఆదర్శ మూర్తులయ్యారు. అందుకు ఆర్య యుద్ధనీతి ప్రకారం శత్రు వర్గంలోని స్త్రీలను అపహరించడం, అత్యాచారాలు చేయడం, కొల్లగొట్టడం ఒక మత విధానంగా మారింది. శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ఆర్య నీతికి (జాతికి) యింత కంటే ఏమి చేతనవుతుంది. ఘర్‌వాపసి, దళితగోవిందం లాంటి కార్యక్రమాల్తో రాజ్యాంగం యిచ్చిన మత స్వేచ్ఛను (ఆర్టికల్ 25(1)) బుట్టదాఖలు చేస్తున్నారు. జీవించే హక్కును, ఆస్థులను కలిగి ఉండే హక్కులను మైనార్టీల పట్ల కాలరాస్తున్నారు. ఏ మతం అయినా నిలదొక్కు కోవటాన్కి, వ్యాప్తి చేయటాన్కి ప్రథమంగా స్త్రీ యే మూలం అవుతుంది. ఈ హిందూత్వ పైశాచిక చర్యల వలన ముందుగా నష్ట పోయేది స్త్రీయే. యిప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఊచకోతలన్నీ మైనార్టీల పైనే. అది కాశ్మీర్, నాగాలాండ్, పంజాబ్ ఏదైనా కావచ్చు. హిందూత్వ రాజకీయాలకు అడ్డు వేస్తే మానవ హననమే జరుగుతుంది. (ఢిల్లీలో ఇందిరాగాంధీ హత్య తరువాత సిక్కులపై జరిగిన ఊచకోత దేశ విభజన సమయంలో జరిగిన ఊచకోత కంటె ఎక్కువే). వీటికి సరైన రిపోర్టింగ్ ప్రభుత్వం వైపు నుండి ఉండదు. మైనార్టీ స్త్రీలు పిల్లల జీవితాలు చిధ్రమవుతుంటే ప్రభుత్వం ప్రకటించిన మావోయిస్టు ప్రభావ మరియు ఇతర కల్లోలిత ప్రాంతాలలో ప్రజల్ని హడలెత్తించే సైనిక శక్తులు, పోలీసులు మైనార్టీలకు అండగా నిలబడరు. ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు ఎవరైనా కూడా అదృష్టం బావుంటే మన మోడీ లాగా ప్రధానమంత్రి అవ్వచ్చు.
ఒరిస్సా, కర్ణాటకలో జరిగిన విధ్వంసం, హింసలకు సూత్రధారి విశ్వహిందూ పరిషత్, దాని రాజకీయ అనుబంధ సంస్థ బి.జె.పి. అయితే అయోధ్యలో రామమందిరం కూలగొడుతున్నప్పుడు మిన్నకుండిన ప్రభుత్వమూ, పంజాబ్‌లో గోల్డెన్ టెంపుల్ మీద సైనిక చర్యా కాంగ్రెస్‌దేనని మర్చిపోకూడదు. మతం తమ ఓట్లకు ఆలంబనగా పనిచేస్తుందనుకుంటే కాంగ్రెసే కాదు ఏ బూర్జువా పార్టీ అయినా ఏవో కొన్ని స్వల్ప తేడాలు తప్పితే ఒకే విధంగా ప్రవరిస్తాయి. యిప్పుడు హిందూత్వ మరింతగా దేశాన్ని హిందూ సమాజంగా మార్చాలని ఊవిళ్ళూరుతొంది. మన సమాజంలో గృహ, రాజ్య హింసకు గురైన సీతను, సతీ అనసూయను రోల్ మోడల్స్‌గా నిలబెట్టదల్చుకుంది. ఈ పరిణామం వలన కేవలం మైనార్టీ స్త్రీలకే కాదు మెజార్టీ హిందూ స్త్రీలు కూడా ప్రమాదంలో పడనున్నారు. అంబేద్కర్ తయారు చేసిన హిందూ కోడ్ బిల్లు పార్లమెంట్‌లో వీగిపోయిన స్థితిగతులు, సందర్భం నేడు ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్రం (అధికార మార్పిడి) తర్వాత కూడా సజీవంగానే
ఉంది. ఈ హిందూత్వ పాలన దేశంలో స్థిరపడితే జాతి మత రహితంగా మన స్త్రీలందరూ వివక్ష, దోపిడి, దౌర్జన్యాలకు మరింతగా గురవడం తధ్యం.
కాని మనం కూడా స్త్రీలుగా ఒక్కసారి ఆలోచిద్దాం!! నిర్భయ కేసుపై బి.బి.సి. తయారు చేసిన ‘యిండియాస్ డాటర్’ నిషేధం పై వచ్చిన స్పందన వ్యతిరేకత మైనార్టీ స్త్రీలపై జరిగిన దాడులపై వచ్చిందా? లేదు. హిందూత్వ రాజకీయాల కోసం పాలకులు మైనార్టీ స్త్రీలపై జరిపే రాజ్య హింసకు వ్యతిరేకంగా ఎంతమంది స్త్రీలు, మహిళా సంఘాలు ముందుకొస్తున్నాయి….?? మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన సమయం ఆసన్నమైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నన్‌పై జరిగిన అత్యాచారం, ధనలూటీ తర్వాత మైనార్టీ సంఘాలు క్రొవ్వొత్తుల ప్రదర్శన సికింద్రాబాద్‌లో మదర్‌మేరీ విగ్రహం వద్ద చేసారు. ఒక చిన్న ర్యాలీ నిర్వహించారు. అది ఒక ప్రార్థనా పూరిత చర్యగానే ముగిసింది తప్పితే పోరాట రూపంగా లేదు.
కాథలిక్ చర్చి 2010లో ఒక జండర్ డాక్యుమెంటును విడుదల చేసింది. అందులో మైనార్టీ స్త్రీలకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు, అత్యాచారాల పట్ల తీసుకోవలసిన చర్యలు, ప్రతిఘటనా రూపాల గూర్చి ప్రస్తావనే లేదు. ఏ మైనార్టీ స్త్రీని కదల్చినా తమకు న్యాయం జరగదనే అపనమ్మకమే ఎక్కువగా
ఉంది. ఇది విస్మయ పరిచే విషయం కంటే దిగజారుతున్న దేశ రాజకీయ పరిస్థితికి అద్దం పడుతుంది. అందుకే చర్చి కూడా స్త్రీలను తగు జాగ్రత్తలు తీసుకోమని మాత్రమే చెబుతుంది. పశ్చిమ బెంగాల్‌లో నన్‌పై జరిగిన అత్యాచారాన్కి పాల్పడిన దోషులను మన్నిస్తున్నట్టు నన్ మరియు పశ్చిమబెంగాల్ ఆర్చి బిషప్ (మతాధికారి) ప్రకటిం చారు. గత అనుభవాల దృష్ట్యా తమకు న్యాయం జరగని చోట తమ క్షమించే క్రైస్తవ ఫిలాసఫితో నిరసనగా హిందూ సమాజ పోకడల్ని ప్రపంచాన్కి తెలియచెబుతున్నారు.
మనం ముఖ్యంగా ఈ సంక్లిష్ట సమయంలో మైనార్టీ స్త్రీలకు, వారి పోరాటాలకు అండగా నిలువ వలసిన సమయమిది. సమాజానికి విద్యను అందించే మైనార్టీ సంస్థలు తమ విముక్తికోసం సైద్దాంతిక ప్రాపంచిక దృక్పధాన్ని ఏర్పరుచుకో గలగాలి. కేవలం క్షమ, దయే కాకుండా క్రీస్తు మరో కోణమైన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఘటనా పంథాతో ముందకు సాగాలి… విశాల ప్రజా ఉద్యమాల్లో మైనార్టీ స్త్రీలు నడిచినప్పుడే ఈ హిందూత్వాన్ని, దాని రాజకాయాల్ని ధీటుగా ఎదుర్కోగలం…..
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags