డా. శిలాలోలిత
కవిత్వమంటే ఉన్న ప్రేమతో, చాలాకాలంపాటు రచనావ్యాసంగానికి అడ్డుకట్ట పడినా, రెట్టించిన ఉత్సాహంతో కవిత్వాన్ని మళ్ళీ ప్రారంభించిన కవయిత్రి కె. రాజకుమారి.
‘భావాల మేఘాలతో
అక్షరాల చినుకులతో
పదాల స్వాతివాన
నా కవిత
నా వనసాక్షర సరోవరంలో
వికసించిన పదాల ‘భావరాజీవం’
నా కవిత అంటూ తన కవిత్వ నేపథ్యాన్ని వినిపించింది.
రాజమండ్రిలో వున్న ఈ కవయిత్రి ‘వీరేశలింగం’ సాహిత్య సామాజిక కృషి గురించి రెండు కవితలు రాసింది. లాయర్‌గా, సామాజిక కార్యకర్తగా ఆమెకున్న రాజకీయనుభవాలన్నీ కవితలైనాయి.
భార్యాభర్తలు ‘సమాంతరరేఖలు’గా వుండే తీరును
‘దగ్గరగానే ఉన్నా ఒకదాని
నొకటి చూచుకోలేని రెండు కళ్ళల్లా
మనసు కలవని భార్యాభర్తలు
కలిసివుండే సమాంతరరేఖలు
జీవించే జీవచ్ఛవాలు.
స్త్రీపురుషులు కలిసి జీవించాల్సింది స్నేహంతోనని, ఆధిక్యతాభావజాలం వుండకూడదని చాలాచోట్ల కవిత్వీకరించింది. ‘భావరాజీవం’ (2008) అనే కవిత్వసంపుటిలో 77 కవితలున్నాయి.
ఒంటరితనాన్ని పారద్రోలి
ఆత్మస్థైర్యమిచ్చిన ఆత్మీయహస్తాలు
పుస్తకాలు – అంటూ తన జీవితంలో విజ్ఞానవీచికలంటుంది. కానీ, ఇంకా ఎక్కువగా విస్తృతమైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఈ కవయిత్రికుంది. ప్రస్తుత సాహిత్యం పట్ల ఎక్కువ పరిచయం లేదని ఒకచోట చెప్పుకుంది. కవిత్వంలో ఒకనాటి రూపశైలులకు ఇప్పటి కవిత్వానికి ఎన్నో వైరుధ్యాలున్నాయి. ఈ రంగాన్ని ఎన్నుకుని రచిస్తున్న ఈమె కవిత్వాన్ని ఈ దృష్టితో అధ్యయనం చేస్తే ఉత్తమ కవిత్వం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ కవయిత్రికున్న కమిట్‌మెంట్, నిజాయితీ, సాహితీతృష్ణ స్పష్టంగా తెలుస్తున్నాయి కాబట్టి. ‘మనసొక సెల్ అయితే…’ మంచి కవిత. కవిత్వంలో సుభాషితాలు ఎక్కువగా కన్పిస్తాయి. ‘స్నేహాన్వేషణ’ చేస్తూ ఉత్తమ స్నేహం కోసం 2, 3 కవితలు రాసింది. ‘మీడియా’ స్త్రీలపట్ల చూపిస్తున్న వివక్ష, దోపిడీల గురించి ‘రంగులవల’ రాసింది. మనస్సులోని సంఘర్షణల చిత్రపటాన్ని ‘కలవరం’ కవితలో
‘నాచుట్టూ నేనే
మౌనపంజరాలు బిగించుకొని
బందీని కావాలని వుంది’ అశాంతి కెరటరూపాన్ని చెప్పింది.
ఆడపిల్లల గురించి – ‘ఆణిముత్యా’లంటూ ‘అమ్మ-భయం’ ఎలా ఏర్పడిందో రాసింది. స్త్రీలపట్ల నానాటికీ పెరిగిపోతున్న లైంగిక దోపిడీలను, ర్యాగింగు పేరిట జరుగుతున్న నిత్య దౌర్జన్యాలను కవిత్వీకరించింది.
‘ఇసుక మీద రాతను చెరిపేసే
నీటి కెరటాల్లా
రెక్కలొచ్చిన పక్షుల్లా
నన్ను విడిచి ఎగిరిపోతున్నాయి’ అంటూ బాల్యస్మృతులు చెదిరిపోతున్న దృశ్యాల్ని చూపించింది. స్త్రీలకు ఆత్మగౌరవం వుండాలని, వాళ్ళకున్న ఆత్మవిశ్వాసమే పోరాటబలాన్నిస్తుందనే వాస్తవాల్ని తెలిపింది. సినారె, బేతవోలు రామబ్రహ్మం, అద్దేపల్లి, ఎండ్లరి సుధాకర్, సన్నిధానం, ప్రభాకరరావుగార్ల ముందుమాటల్లో ఈ కవయిత్రి వ్యక్తిత్వం, కవిత్వరూపం స్పష్టంగా కనిపిస్తాయి.
కవిత్వాన్ని జీవితాన్ని ప్రేమించినంతగా ప్రేమించే సున్నిత హృదయిని కలం నుంచి ఉత్తమ కవిత్వం రావాలని ఆకాంక్షిస్తున్నాను.