”మా దేశంలో స్త్రీలు సురక్షితం” -సిరియా ప్రథమ మహిళ శ్రీమతి అస్మా

ఇంటర్వ్య సేకరణ: డాక్టర్‌ జె. భాగ్యలక్ష్మి

”సిరియాలో స్త్రీలకు ఎంత భద్రత ఉంది?” అని అడిగిన ప్రశ్నకు సిరియా ప్రథమ మహిళ శ్రీమతి అస్మా అల్‌-అస్సాద్‌ చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో ఇచ్చిన సమాధానం, ”చాలా భద్రత ఉంది.

 
 స్త్రీలు సురక్షితం” అని.  అయితే ప్రైవేటుగా, ఇండ్లలో, కుటుంబాలలో అక్కడ హింస లేదని కాదు.  అది మరో విషయం.  కాని బయట స్త్రీలు సురక్షితంగా ఉన్నారనేది కూడా గొప్ప వరమే.  చాలా తక్కువ దేశాలు తమ దేశాలలో స్త్రీలు సురక్షితమని చెప్పగలుగుతాయి.  దీనికి అభివృద్ధితో సంబంధం లేదు.  స్త్రీలపట్ల అపరాధాల గ్రాఫు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది.

 సిరియా ప్రెసిడెంటు డాక్టర్‌ బాషర్‌ అల్‌-అస్సాద్‌, ఆయన భార్య శ్రీమతి అస్మా అస్సాద్‌ జూన్‌ 17 నుండి 21 వరకు భారతదేశ యత్రకు వచ్చారు.  ప్రెసిడెంట్‌ ఇరుదేశాలకు సంబంధించిన ఉన్నతస్థాయి చర్చలలో పాల్గొనగా శ్రీమతి అస్మా భారతదేశంలోని ప్రముఖులను కలవటమేగాక, యన్‌.జి.ఓ.ల విషయంలో కూడా ఆసక్తి కనపరచారు.  సిరియా ప్రథమ మహిళగా, ప్రెసిడెంటు భార్యగా శ్రీమతి అస్మా కేవలం లాంఛనంగా తన కర్తవ్యం నిర్వహించటం లేదు.  ఆమె స్వయంగా యన్‌.జి.ఓ.లను స్థాపించి సిరియా ప్రగతికి ఎంతో కృషి చేస్తున్నారు.

 ”ఫిర్‌దోస్‌” అనే యన్‌.జి.ఓ.ను జూలై 2001లో సమగ్ర గ్రామీణాభివృద్ధి కోసం ప్రారంభించారు.  సిరియన్‌ ప్రజలు కార్యక్రమాలలో నేరుగా పాల్గొనటం ద్వారా నిలకడైన సమగ్రాభివృద్ధిని, మానవాభివృద్ధిని సాధించటమే ఈ సంస్థ ముఖ్యోద్దేశము.  గ్రామాలకు తరచుగా వెళ్ళి ప్రజలతో శ్రీమతి అస్మా ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకొంటారు.

 అభివృద్ధి ప్రక్రియలో స్త్రీలకు ప్రముఖపాత్ర ఉందని శ్రీమతి అస్మా నమ్ముతారు.  స్త్రీలు చురుకుగా అభివృద్ధి ప్రక్రియలో, కార్యక్రమాలలో పాల్గొనటానికి అనుకూల పరిస్థితులు కల్పించటానికి ప్రయత్నిస్తున్నారు.  ”స్త్రీలు, విద్య” అని ఒక సమావేశాన్ని ఏర్పరచి ఆరు అరబ్‌ దేశాల ప్రథమ మహిళలు దానిలో పాల్గొనేటట్లు చూశారు.  ఇరవై రెండు దేశాల ప్రతినిధులకు అవకాశం కల్పించారు.  విద్యారంగంలోని కొత్త ధోరణుల గురించి, పద్ధతుల గురించి అవగాహన కలగటానికి ఈ సమావేశం వేదికలా పనిచేసింది.  సిరియన్‌ స్త్రీలు బిజినెస్‌ వ్యవహారాలలో పాల్గొనాలని అస్మా వాంఛిస్తారు.
 మధ్యప్రాచ్యంలో ఉన్న బిజినెస్‌ ఉమెన్‌కు సంబంధించి ఒక సమావేశం సిరియాలో ఏర్పాటుచేశారు.
 ఆధునిక కాలానికి అనుకూలంగా ఇన్‌ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ దేశ భవిష్యత్తుకు ఎంత ఉపయెగకరమో ఈమెకు బాగా తెలుసు.  స్కూలు రోజుల నుండి ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీతో పెరిగి పెద్దదయిన అస్మా లండన్‌ యూనివర్సిటీలోని కింగ్సు కాలేజిలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఆనర్స్‌ డిగ్రీ పొందారు.  ఫ్రెంచి సాహిత్యంలో డిప్లొమా పొందారు.  యూనివర్సిటీ చదువు ముగిశాక ఆరునెలలు దూరప్రాచ్యదేశాలు, ఐరోపా పర్యటించారు.  లండన్‌లో డ్యూష్‌ బ్యాంకులో పనిచేశారు.  జె.పి. మోర్గన్‌ వారి ఇన్‌వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగు డివిజన్‌లో పనిచేశారు.  కంపెనీల విలీనాలు, కొనుగోళ్ళలో ప్రత్యేక పరిజ్ఞానంతో ఎన్నో విదేశాలలోని క్లయింట్స్‌కు సలహాలనిచ్చి వారి వ్యవహారాలలో సాయపడ్డారు.
 జె.పి. మోర్గన్‌ కంపెనీలో ఉద్యోగం వదిలి నవంబరు 2000లో సిరియాకు వచ్చారు.  డిసెంబరు 2000లో డాక్టర్‌ బాషర్‌ అల్‌-అస్సాద్‌తో వివాహం జరిగింది.  డిసెంబరు 2001లో వాళ్ళకు కొడుకు పుట్టాడు.  ఆ అబ్బాయికి తాత పేరు, సిరియాకు ఇదివరకటి ప్రెసిడెంటు అయిన ”హఫేజ్‌” పేరు పెట్టారు.
 భారతదేశానికి వచ్చిన సందర్భంగా శ్రీమతి అస్మా ఢిల్లీలో ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌కోర్‌లో మహిళా జర్నలిస్టులతో స్వేచ్ఛగా ఒకగంటసేపు ఎన్నో విషయాలు చర్చించారు.
 నిరాడంబరంగా, సున్నితంగా, చిరునవ్వుతో ఎంతో ఆత్మీయంగా కన్పించే సిరియా ప్రథమ మహిళ అస్మా 33 ఏండ్ల వయస్సుకే ఎన్నో సాధించారు.  మరెన్నో సాధించటానికి, ముఖ్యంగా సిరియా అభివృద్ధికి, గ్రామ ప్రజల సాధికారతకు, మహిళల సాధికారతకు నిరంతరం కృషి చేస్తున్నారు.  యువతలో ఉండే ఆశాభావం, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఈమెలో ప్రతిఫలిస్తాయి.
 సిరియాలో అన్ని మతాలవారు సామరస్యంగా జీవించటం తమకు సహజంగా అబ్బుతుందని, పుట్టుకతోనే వస్తుందని అన్నారు.  సిరియాలో పార్లమెంటులో స్త్రీలు 13 శాతం ఉన్నారని, దేశంలో జరిగే అన్ని చర్చలలో పాల్గొంటున్నారని అన్నారు.  ”నేను ముస్లిమ్‌నయినందుకు గర్విస్తున్నాను” అని అన్నారు.  ఇప్పుడు సిరియాలో చాలామంది ముస్లిం స్త్రీలు ”హిజాబ్‌” (ముసుగు) ధరిస్తున్నారని వస్తున్న వార్తల గురించి అడిగితే ”తలకు స్కార్ఫ్‌ చుట్టుకోవటమన్నది అన్నిమతాలవాళ్ళూ పాటిస్తారు.  అది వాళ్ళ ఇష్టం.  ఇది మతానికి సంబంధించినట్లు కాకుండా మర్యాదసూచకంగా భావిస్తారు” అని అన్నారు.
 సిరియాలో స్త్రీల గురించి మాట్లాడుతూ ”ఎవరెటువంటి దుస్తులు వేసుకొన్నారన్నది అంత ముఖ్యం కాదు.  అందరూ అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.  అన్ని విషయాలలో అవగాహన ఉంది.  అన్ని రంగాలలో స్త్రీలున్నారు” అని శ్రీమతి అస్మా చెప్పారు.
 స్త్రీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఉండటమన్నది శ్రీమతి అస్మాకు ప్రోత్సాహకరంగా కనిపించదు.  గ్రామస్థాయిలో పనిచేస్తుందేమోగాని, దేశస్థాయిలో ఇది జరిగితే స్త్రీలు నిశ్చింతగా, ఏమీ పట్టనట్టు కూర్చునే ప్రమాదముంది అని అన్నారు.  భారతదేశంలో ఒక మహిళ ప్రెసిడెంటు కావటమన్నది చాలా హర్షించదగిన, మెచ్చుకోదగిన విషయమన్నారు.
 తండ్రి కార్డియలజిస్టు.  తల్లి లండన్‌లోని సిరియన్‌ ఎంబసీలో ఫస్ట్‌ సెక్రటరీగా పనిచేశారు.  శ్రీమతి అస్మా స్వేచ్ఛగా లండన్‌లో ఉన్నత విద్యలభ్యసించి ప్రపంచదేశాలెన్నో చూసి ఎంతో అవగాహనను, అనుభవాన్ని గడించారు.  మరి సిరియాకు రాగానే గ్రామప్రజలపట్ల శ్రద్ధ ఎందుకు చూపించినట్లు?  ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు చాలావరకు పట్టణాలకు పరిమితమై పల్లెల దాకా చేరవనేది ఆమె అభిప్రాయం.  వాళ్ళకు విద్య, సమాచారము, ఆదాయం వచ్చే పనులు కల్పిస్తే ఎంతో సాధికారత చేకూరుతుంది.  గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక మహిళ తనను కౌగిలించుకొని ”నాకూ మీకున్న ధైర్యం, సామర్థ్యం ఉన్నాయి.  మీ చేయూత చాలు నిలదొక్కుకోటానికి” అని చెప్పిన విషయం శ్రీమతి అస్మా గుర్తుకు తెచ్చుకున్నారు.  ”గ్రామప్రజలు ఎవరికేమాత్రం తీసిపోరు.  వాళ్ళకు అనుకూల వాతావరణం కల్పించాలి అంతే” అని శ్రీమతి అస్మా అన్నారు.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.