పి. సత్యవతి
పదేళ్ళకిందట అనుకోకుండా మా వూరి మైత్రీ బుక్‌హవుజ్‌లో నాకు ‘బిలవ్డ్’ అనే పుస్తకం దొరికింది.
టోని మారిసన్ అనే రచయిత్రి గురించి వినడమే కానీ అప్పటిదాకా నేను ఆవిడని చదవలేదు.
ఏదైన ఒక పుస్తకం కొనగానే చదివెయ్యడం అలవాటు చొప్పున ఆ పుస్తకాన్ని ఆత్రంగా చదవబోయాను కానీ అది అట్లా ఆషామాషీగా చదివి పడేసే పుస్తకం కాదు కదా! ఒకసారి చదివేసి మళ్ళీ ఇంకోసారి చదివాక ఆ పుస్తకానికి పులిట్జర్ ప్రైజు రావడం ఎంత సహజమో, ఆ రచయిత్రికి నోబెల్ సాహితీ పురస్కారం ఇచ్చి ఆ కమిటీ తమని తాము ఎలా గౌరవించుకుందో అర్ధమైంది. నోబెల్ సాహితీ పురస్కారం పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ రచయిత్రికూడా ఈమే.. అంతేకాదు ఒక ఐవీలీగు యూనివర్సిటీ లో ప్రముఖమైన ఒక సాహితీ పీఠానికి అధ్యక్షురాలిగా వున్న తొలి ఆఫ్రికన్ అమెరికన్ రచయిత్రికూడా తనే. అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ కౌన్సిల్ ఆఫ్ హ్యుమాని టీస్‌లో రాబర్ట్ ఎఫ్ గోహీన్ ప్రొఫెసరుగా ఆమెను గౌరవించారు. ఆమె సాధించిన గౌరవ పురస్కారాలు చూసినప్పుడు, ఎంత ప్రతికూలమైన వాతావరణంలోనైనా ప్రతిభను గుర్తించడం వుంటుదనే విశ్వాసం కలుగుతుంది. బానిసలుగా ఆఫ్రికన్ అమెరికన్ స్త్రీల పరాభవాలు, చదివినప్పుడు జుగుప్స కలుగుతుంది. అతి నాగరిక ప్రజాస్వామ్య దేశంగా ఈనాడు గర్వంగా చెప్పుకునే మనుషులేనా ఇన్ని దారుణాలకి పాల్పడింది అని ఒక రోత కలుగుతుంది. అయితే అంత నికృష్ట జీవన స్థితి నించి టోని మారిసన్ స్థాయికి ఎదగటానికి ఎన్ని తరాల పోరాటం వుందో!
అమెరికా దక్షిణాది రాష్ట్రాలనించీ జాతి వివక్ష భరించలేక 1900లలో ఉత్తరానికి వలస వచ్చిన కుటుంబాలలో జార్జ్‌వొఫోర్డ్ ది కూడా ఒకటి. ఆయన ఒహాయొ రాష్ట్రంలోని లోరైన్ లో షిప్ వెల్డర్‌గా పనిచేసేవాడు. ఆయన ఎంత కష్ట జీవి అంటే పిల్లల చదువుల కోసం పది హేడేళ్ళపాటు ఒకేసారి మూడు ఉద్యోగాలు చేసేవాడు. లోరైన్ ఒక చిన్న పట్నం. అక్కడ, వలస వచ్చిన యూరోపియన్లూ, మెక్సికన్లూ, ఆఫ్రికన్ అమెరికన్లూ పక్క పక్కనే ఉండేవాళ్లు. 1931లో జన్మంచిన టోనీ అసలు పేరు క్లో ఆన్టోని వోఫోర్ట్. తన పేరు లోని ఆన్టోని లోనించీ టోనిగా తరువాత పేరు మార్చుకుంది.
నలుగురు సంతానంలో ఆమె రెండవది. టోని కుటుంబానికి వాళ్ళ సంస్కృతి అంటే చాలి ఇష్టం. నల్లజాతి వారి జానపద కధలు, పాటు వింటూ పెరిగింది. వాళ్ళ ఇంట్లో మొదటినించీ కధలు చెప్పుకోడం వినడం అలవాటు. పెద్దవాళ్ళతో పాటు పిల్లల కూడా వాళ్ళకి నచ్చిన కధలు చెప్పేవాళ్ళు.
అట్లా చిన్నప్పటినించీ సాహిత్యాభిలాష ఏర్పడిన టోనికి టాల్‌స్టాయ్ అన్నా, దోస్తోవొయస్కి అన్నా, జేన్ అస్టెన్ అన్నా చాలా ఇష్టం కలిగింది. 1953లో హెవర్డ్ యూనివర్సిటీనించీ పట్టా పుచ్చుకుని, 1955 మాస్టర్స్ డిగ్రీ తీసుకుని, మవర్డ్‌లోనే ఇంగ్లీషు ఇన్‌స్ట్రక్టర్‌గా చేరింది. అప్పుడే పరిచయమైన హెరాల్డ్ మారిసన్‌ని పెళ్ళి చేసుకుంది. వాళ్ళకిద్దరు పిల్లలు. హెర్డాల్డ్ ఫోర్డ్, స్లేడ్ మారిసన్. ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు. తన వైవాహిక సమస్యల్ని మర్చిపోవడానికి ఒక రచయితల బృందంలో చేరి వాళ్ళకోసం హడావుడిగా ఒక కధ రాసింది. దానిపేరు, బ్లూయెస్ట్ ఐస్ (నీలం కళ్ళు) 1964లో మారిసన్ నించీ విడాకులు తీసుకోవడంతో పాటు హెవర్డ్ల్‌లో ఉద్యోగం మానేసింది. తరువాత రాన్డమ్‌హౌస్‌లో చేరింది.
అక్కడనించీ రచనని సీరియస్‌గా తీసుకుంది. పిల్లల్ని పెంచడం, రచనలు చెయ్యడం ఈ రెండు పనులు తప్ప మిగతా పనులన్నీ నిరాసక్తమైనవని ఆమె నమ్మకం. అప్పుడు రాసిన నీలం కళ్ళు కథ ఆమె మొదటి నవలగా మారింది. దాని తరువాత ‘శూలా’ అనే నవల, బిలవ్డ్, టార్ బేబి, సాంగాఫ్ సాల్మన్ రాసింది. తరువాత పారడైజ్, జాజ్ అనే నవలలు రాసింది. వీటన్నిటిలోకి ప్రసిద్ధమైనది ‘బిలవ్డ్’ నవల. ఇటీవల న్యూయర్క్ టైమ్స్ పత్రిక దీనిని గత పాతిక సంవతర్సాలమధ్య వచ్చిన ఉత్తమ నవలగా ప్రకటించింది. ఈ నవల ముందు ”అరవై మిలియన్లకి పైగా” అని ఉంటుంది. అంటే బానిస హింసలో ఛిద్రమైన వాళ్ళన్నమాట. ఈ నవలకి మూలం 1851లో జరిగిన ఒక సంఘటన. మార్గరెట్ గార్నర్ అనే బానిస కెంటకీలోని తన యజమాని ఇంటినించీ ఒహాయొకి పిల్లలతో సహా పారిపోయింది. అప్పటి బానిసలు, వాళ్ళ పిల్లలతో సహా బానిసలే.
యజమాని ఆమెని వెతికి పట్టుకున్నప్పుడు, ఆమె తన పిల్లల్ని చంపడానికి ప్రయత్నించింది. ఎందుకంటే వాళ్ళు పెరిగి మళ్ళీ తనలా బానిసలయేకంటే చనిపోవడం ఉత్తమమని అనుకుంది. అందులో ఒక పిల్ల చనిపోయింది. మార్గరెట్ జైలుకెళ్ళింది. ఆమె తన చర్యకి ఏ మాత్రం పశ్చాత్తాపపడలేదు. తనలా తన పిల్లలు బాధపడకూడదని చెప్పింది. బిలవ్డ్ నవలలో సెతా కూడా ఒక బానిస. ఆమె తన యజమాని ఇంట్లో ఘోరమైన అవమానాన్ని పొందింది. ఏ తల్లీ, ఏ స్త్రీ కూడా ఊహించలేనటువంటీ అమానుషమైన అత్యాచారానికి గురైంది. అక్కడనించీ పారిపోయింది. నిండు నెలల గర్భిణి. వీపుమీద యజమానులు కొట్టిన దెబ్బలు. అవి ఒక చెట్టు ఆకారంలో వున్నాయి. అట్లా పారిపోయి పిల్లలూ ఆమె అత్తగారూ అంతా కలిసి ఉంటూండగా యజమాని ఆమెని వెతుక్కుంటూ వచ్చాడు. మార్గరెట్ లాగే సెతా కూడా తన పిల్లల్ని చంపాలనుకుంది. అప్పటికింకా నడకకూడా రాని ఒక ఆడపిల్లని చంపింది. జైలుకెళ్ళింది, తనతోపాటే పసిపిల్లని తీసుకుని. ఆ పిల్లని చంపినందుకు ఆమె పడిన వేదన, తరువాతి జీవితం ఇదంతా చదవవలసిందేకాని క్లుప్తంగా చెప్పడానికి కాదు. సెతా అత్తగారి పేరు బేబిసగ్సు. యజమానులకి డబ్బుకట్టి ఈమెకు విముక్తి కొన్నాడు కొడుకు.సెతా పారిపోయొచ్చాక, ఆమె భర్త తప్ప అంతా కలవగలిగారు. బ్రతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. బేబి సగ్సు అక్కడ కొంత మందిని పోగేసి ప్రార్ధనలు నడిపేది. ఆమె గురించి ”బానిస బ్రతుకు ‘ కాళ్ళనీ, వీపుని, తలని, చేతుల్ని, కళ్ళని, మూత్రపిండాలని గర్భసంచిని, ఆఖరికి నాలుకని కూడా చిధ్రం చేసింది. మిగిలింది హృదయం ఒక్కటే..దానితోనే ఆమె పనికి బయల్దేరింది” అంటుంది రచయిత్రి.
ఆల్బనీలోని న్యూయర్క్ స్టేట్ యూనివర్సిటీలో పని చేసేటప్పుడు ఆమె తన మొదటి నాటకం ”డ్రీమింగు ఎమ్మెట్” రాసింది. ఎమ్మెట్‌టిల్ అనే నల్లపిల్లవాడు ఒక తెల్లమ్మాయిని చూసి ఈల వేశాడనే నెపంతో తెల్లవాళ్ళు అతన్ని చంపేసారు. 1955 లో జరిగిన ఈ సంఘటన ఈ నాటకానికి మూలం. బిలవ్డ్‌కి పులిట్జర్ వస్తే ఆమె రాసిన సాన్గ్ ఆఫ్ సాల్మన్‌కి నేషనల్ బుక్ క్రిటిక్స్ అవార్డు, అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ అవార్డు వచ్చాయి. తన జాతిని తన సంస్కృతిని తన కళల్ని, పాటల్ని ప్రేమించడం, తన సమూహంలోనే సాంత్వన వెతుక్కోవడం ఆమె రచనల్లో చూస్తాం. తనని ఎక్కువ ప్రభావితం చేసింది తన తల్లీ, తన అమ్మమ్మా అంటారు టోని. అమ్మమ్మ ముఫ్ఫె సంవత్సరాల వయసులో ఏడుగురు పిల్లల్తో సహా దక్షిణాదినించీ ఉత్తరానికి వలస వచ్చింది, ఈడొస్తున్న తన కూతుళ్లపైన లైంగిక హింస జరగరాదనే కారణంగా. అట్లాగే టోని తల్లి రమా కూతురి చదువుకోసం ఎన్నో విసుగొచ్చే ఉద్యోగాలు చేసింది. ఏడు పదుల వయసులో ఇప్పుడామె తన కొడుకు స్లేడ్ మారిసన్ తో కలిసి పిల్లల సాహిత్యం సృష్టిస్తున్నారు. పుస్తకాల గురించి, గొప్ప రచయితల గురించి మాట్లాడేటప్పుడు కొన్ని పేర్లు మాత్రమే మనికి వినపడుతుంటాయి. అట్లా ఆ కాసిని పేర్లు మాత్రమే పదే పదే ఉటంకించే సాహితీ పిపాసులు దృష్టి ఇంకాస్త సారిస్తే వారికి పెరల్ బుక్‌లు, నదీన్ గోర్డిమర్లు, పాట్ బార్కర్లు, టోని మారిసన్‌లు, ఆలీస్ వాకర్‌లు కనిపిస్తారు.
నేను తన పుస్తకాలు కొన్ని చదివాననండి. చాలా గొప్ప రచయిత, మనిషీ. ఇక్కడ(యు.ఎస్)లో నాకు CSPAN TV వారి ద్వారా నాకు లభించిన మంచి రచయిత ఈవిడ.
చాలా మంచి వాళ్ళని పరిచయము చేస్తున్నారు… నా మటుకు మీ కాలమ గొప్ప ఎడ్యుకేషను. ధన్యవాదాలు.
హిమబిందు