మsheన్

టి. సంపత్‌కువర

”అమ్మా… అమ్మా… లెవ్వవే! స్కూలుకి టైమవుతుంది.  ఈ రోజు యూనిట్‌ టెస్టుంది…”
సరోజనుండి ఎలాంటి స్పందనా లేదు.  గాఢనిద్రలో ఉన్నట్టుంది.


  ఐదు నిమిషాలయ్యాక పదేళ్ళ కూతురు అనన్య తండ్రి దగ్గరికెళ్ళి ఆయన్ని లేపే ప్రయత్నం చేసింది.
కృష్ణారెడ్డి బద్దకంగా, నిద్రలోనే ”అమ్మని లేపమ్మా…” విసుగ్గా అన్నాడు.
అనన్యకి గాబరాగా ఉంది.  తనతో అయ్యే పనుల్ని తాను చేసుకొంది.  డ్రెస్సు వేసుకొంది.  నీళ్ళబాటిల్‌ నింపుకొంది.  స్కూలుబ్యాగు సర్దుకొంది.  తల దువ్వుకొంది.  షూస్‌ వేసుకొంది… లంచ్‌బాక్స్‌ ఒకటే మిగిలింది.  దానికి అమ్మే కావాలి.  అనన్య తన డాడీని కిచెన్‌లో ఎప్పుడూ చూడలేదు.
గడియారానికి ఇవన్నీ పట్టవు. ముల్లులు గుచ్చకుండానే మన జీవితాల్ని ముందుకు నడుపుతుంటాయి.  అనన్య పదేపదే పెద్దముల్లువైపు చూస్తుంది.
అనన్య సరోజ దగ్గరికెళ్ళి శరీరాన్ని గట్టిగా ఊపింది.  ”అమ్మా… అమ్మా… టైమవుతుందే… ఈ రోజు టెస్టుందే…”
నిద్రలో ఉన్న సరోజ భయంతో, తప్పుచేసిన భావనతో ఒక్కసారే లేచింది.  నిద్రమత్తు ఇంకా ఉంది.  అనన్య టెస్టు గురించి చెబుతున్న మాటల్ని విని బెడ్డుపైనుండి వెంటనే లేచింది.  ఎంత చురుగ్గా ఉందామనుకున్నా ఉండలేకపోతుంది.  శరీరం సహకరించడం లేదు.  ఉత్సాహం ఉష్‌కాకిలా ఎగిరిపోయింది…..
కృష్ణారెడ్డి హాయిగా నిద్రపోతున్నాడు.  అనన్యని స్కూలు బస్సులో ఎక్కించి సరోజ ఇంటికి వచ్చేవరకు హాయిగా నిద్రపోతాడు.  ఆ టైములోనే తియ్యని కలలు వస్తుంటాయంటాడు.
సరోజకి కొన్నినెల్లనుండి నిద్ర ముంచుకొస్తుంది.  పగటిపూట పడుకోనిది ఈ మధ్య నిద్రపోతుంది.  తన స్నేహితులు తనకి ఒళ్ళువచ్చినట్టు చెబుతున్నారు.  రెండువారాలక్రితం సరోజ వదిన తన కూతురు కాలేజి అడ్మిషన్‌ గురించి హైద్రాబాద్‌ వచ్చినపుడు గమనించి ”పీరియడ్స్‌ రెగ్యులర్‌గా వస్తున్నాయా?” అని సరోజకి సూటిగా ప్రశ్నవేసింది.
”లేదు…” సరోజ ముక్తసరి జవాబు.
”ఎందుకయినా మంచిది, ఓసారి మీ ఆయన్ని డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్ళమను… నీవు చెప్పిన లక్షణాలను వింటే థైరాయిడ్‌ సమస్యేమోనని నాకనిపిస్తుంది.”
సరోజకి థైరాయిడ్‌ గురించి నామమాత్రమే తెలుసు.  ఎందుకో వదినని వివరాలు అడగదలుచుకోలేదు.  అర్థాలు మార్చుకొని ఈ విషయం బంధువర్గంలో ఎలా పాకిపోతుందోనన్న బాధ సరోజకి.  అందుకే ఈ విషయాన్ని మరీ ముందుకు కదిలించలేదు.
మూడురోజుల్లో ఎడ్మిషన్‌ పనులు పూర్తిచేసుకొని సరోజ వదిన వెళ్ళిపోయింది.
పనులయ్యాక తీరిగ్గా ఉన్నపుడు సరోజ తనదగ్గరి స్నేహితులతో ఫోన్లో మాట్లాడింది.  కొందరు తమకు తెలిసింది చెప్పారు.  మరికొందరు తమకు పరిచయమున్నవారితో మాట్లాడి చెబుతామన్నారు.  మెడిసిన్‌ చేస్తున్న ఓ అమ్మాయితో మాట్లాడి చెబుతానని మరో స్నేహితురాలు భరోసా ఇచ్చింది.
వారంరోజుల్లో సరోజకి థైరాయిడ్‌ గురించి చాలానే విషయాలు తెలిసాయి.  థైరాయిడ్‌ లక్షణాల్ని తనలో జరుగుతున్న జీవప్రక్రియలతో పోల్చి తనకు తోచిన పరిధిలో తాను ఆలోచించుకుంది.
కృష్ణారెడ్డికి కారు కొనుక్కోవాలని ఏళ్ళనుండి కోరిక.  టూవీలర్‌పై పోవడం ఇపుడు నావెషీగా అనిపిస్తుంది.  రోజురోజుకి కారు కావాలన్న కోరిక ముదిరిపోయింది.  ఎరియర్స్‌ లెక్కలు, వచ్చే ప్రమోషన్‌ తెచ్చే అమౌంటు, ఆ లెక్కలు – ఈ లెక్కలు, చివరికి సరోజ తన కిట్టీపార్టీవారు వేసుకునే చిట్టీ మొత్తం… అన్నీ కలిపి ఎంతో సంతోషించాడు.  బ్యాంకువారికి లోనుకోసం ఫోను చేసాడు.  నాలుగురోజుల్లో ఇంటిముందు ‘మారుతీ’ నిలిచింది.
ఆరునెల్లయింది కృష్ణారెడ్డి జీవితంలోకి కారొచ్చి… రోజూ బుల్లిబక్కెట్టులో నీళ్ళు తీసుకెళ్లి చక్కగా తుడుస్తాడు.  టైర్లతో సహా నిగనిగ మెరిపిస్తాడు.  అవసరం లేకున్నా బోనెట్‌తీసి ఇంజన్నీ ఇతరవాటినీ అలా-ఇలా చూస్తాడు.  భాగాల్ని పరిశీలిస్తాడు.  ఆన్‌చేసి ఇంజన్‌ చేసే చప్పుడిని జాగ్రత్తగా వింటాడు.  అదిచేసే శబ్దంలో ఏమైనా మార్పుందేమోనని గమనించే ప్రయత్నం చేస్తాడు.  ఆదివారమైతె కాస్త ఎక్కువసేపు కారుని చూసుకొంటాడు.  ఈ బుల్లికారు ఉబ్బి పెద్దకారైతే ఎంత బాగుండు అని నిల్చొనే కలలు కంటాడు.
కారు వచ్చాక కృష్ణారెడ్డి తన ఫ్రెండ్స్‌ సర్కిల్లో కొంచెం మార్పుతెచ్చాడు.  ఆఫీసులో కారున్న కొలీగ్సుతో కూచొని లంచ్‌ తీసుకోవడం మొదలుపెట్టాడు.  పదేళ్ళనుండి కారు నడుపుతున్నవాడిలా చర్చిస్తాడు.  పెట్రోల్‌ ఏ బంకులో కల్తీలేకుండా దొరుకుతుంది, ఏ రకం పెట్రోల్‌ వాడాలి, సిటీలో మైలేజ్‌ ఎంత, సిటీ బయట ఎంత, హైవేపై మరెంత… ఈ సవచారమంతా కృష్ణారెడ్డి మునివేళ్ళపై ఉంటుంది.  ఎవరైనా సంభాషణల మధ్య కార్ల సమస్యల్ని చెబితే ”చూద్దాం పదండి…” అంటూ పార్కింగు ఏరియాకి వెళ్ళి, వారితో ఇంజన్‌ ఆన్‌ చేయించి, బోనెట్‌ తెరిచి అటు-ఇట చూసి, కళ్ళు మూసుకొని ఇంజన్‌ శబ్దం విని ఉచిత సలహాలిచ్చి, ఫలానా మెకానిక్‌ వద్దకో, వర్క్‌షాప్‌కో తీసుకెళ్ళమని చెబుతాడు.
 ”ఏమండి… రెండు లక్షలకు పైగా ఖర్చుపెట్టి మీరు కారు కొనుక్కున్నారు.  కాని రెండేళ్ళనుండి మీరు నాకోసం వాషింగుమెషీన్‌ కొనడంలేదు.  కొనరా… ప్లీజ్‌… నా కిట్టీడబ్బుతో కొందామనుకొంటే కారుకి డౌన్‌పేమెంట్‌ అని కలిపేసుకున్నారు…” ప్రాధేయపూర్వకంగా సరోజ.
సరోజ కిట్టీడబ్బుల విషయం ఎత్తగానే కృష్ణారెడ్డి ఆమెవైపు కోపంగా చూసాడు.  ఎందుకు తీసుకున్నానన్న ఈగో……
”అందరిల్లలో వాషింగుమెషీన్లున్నాయా?  వాళ్ళంతా ఉతుక్కోవడం లేదా?  దినమంతా ఏం చేస్తావింట్లో…” ఇంకా సాగించాడు.
”కారులోన్‌ ఇన్‌స్టాల్‌మెంట్లు, అనన్య చదువుఖర్చు చూస్తున్నావుగా… వచ్చే ఏడాది కొందాంలే…” అని సమయస్పూర్తితో జవాబిచ్చి సంభాషణని కట్టేసే ప్రయత్నం.
కిచన్‌లో ఉన్న సరోజకి చర్రున కోపమొచ్చింది.  పొంగే పాలని చూసి గ్యాస్‌ని తగ్గించింది.  పైకి దూసుకొచ్చే పాలు కిందకి జారి నిలకడగా మరుగుతున్నాయి.
”వాళ్ళందరికి పనిమనిషి ఉతుకుతుందండి.  మీకు పనిమనిషి ఉతికితే నచ్చవు.  సబ్బు ఎక్కువ రుద్దుతుంది, షైనింగు ఉండదు అంటూ నానా వంకలు పెట్టి మాన్పించారు…”
”చాలు…చాలు…కొంచెం అవకాశమిస్తే రామాయణం మొదలెడుతావు… ఎదురుమాటలు చెబుతావు…” కారు సర్వీసింగు బుక్కుని తిరగేస్తూ సరోజవైపు చూడకుండా అన్నాడు.
తనని డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్ళమని అడుగుదామనుకున్న సరోజ వాతావరణం అనుకూలంగా లేదని రాత్రికి వాయిదా వేసుకొంది.
అనన్య బస్సుదిగి తనకోసం ఎదురుచూస్తున్న సరోజ దగ్గరికి నడిచింది.  పాపనుండి ఐదుకిలోల బ్యాగుని, వాటర్‌బాటిల్‌ని, లంచ్‌బాక్స్‌ని తీసుకొని కూతురు స్కూలుకబుర్లు చెబుతుంటె వింటూ, నవ్వుకుంటూ ఇంటికి చేరారు.
అనన్య యూనిఫార్మ్‌, షూస్‌ తీసి మామూలు దుస్తుల్లోకి మారింది.  మరింత స్వేచ్ఛ! ఆరోజటి హోంవర్క్‌ పూర్తిచేయడంతో సంపూర్ణస్వేచ్ఛ దొరుకుతుంది.
సరోజకి తన కూతురిని రంగుల దుస్తుల్లో చూస్తేనే ఎంతో సంతోషం.  రంగుల గురించి ఎంతో చక్కగా స్కూలుగదుల్లో బోధించే స్కూలువారికి ఒకటి లేక రెండు రంగుల్లోనే పిల్లల్ని స్కూలుకు రప్పించడం విచిత్రంగా తోస్తుంది.
”అమ్మా… ఎందుకమ్మా రోజూ పొద్దున టైంకి లేవడంలేదు.  రాత్రి ఆలస్యంగా నిద్రపోతున్నావా?” అన్నం తింటూ ప్రేమగా అడిగింది అనన్య.
కూతురి ప్రశ్నతో సరోజ కళ్ళల్లో నీళ్ళు…..
”లేదమ్మా… ఎప్పటిమాదిరిగానే నిద్రపోతున్నాను.  రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టడం లేదమ్మా.  ఉదయంపూట మాత్రం గాఢనిద్ర వస్తుంది.  నీవు లేపేంతవరకు మెలకువ రావడంలేదు.  సారీ తల్లీ… రేపటినుండి నువ్వు లేపకముందే లేస్తాను… ప్రామిస్‌…” అంట అనన్య తలని నిమిరి ముద్దు తీసుకొంది.
”ఎప్పుడు నాకంటే ముందే లేచేదానివి కదా అమ్మా… నీ ఆరోగ్యం బాగానే ఉందికదమ్మా?… మునుపటి మాదిరిగా హుషారుగా ఉండటం లేదమ్మా, నువ్వు…”
చేతులు కడుక్కొని తల్లిదగ్గరికొచ్చి వాటేసుకుంది.  సరోజ కళ్ళలో నీరు… ఈసారి మెల్లగా జారాయి…
”ఏమండీ… ఓసారి నన్ను డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్ళండి.  ఈ మధ్య నా ఆరోగ్యం బాగుండటం లేదు” ప్రాధేయపూర్వకంగా అడిగింది.
”ఏమయింది?” కారు స్టీరియోల గురించి తెచ్చిన కాగితాల్ని తిరగేస్తూ తల తిప్పకుండానే అడిగాడు.
”మీకేమీ కనబడడంలేదా?  మీరు నాతో సంసారం చేస్తున్నారు కదా!… పదేళ్ళ మనపాప, చుట్టుప్రక్కలవారు గమనించారు…”
”ఈ స్టీరియో చూడు… దీన్ని కార్లో పెట్టిద్దాం… హాయిగా పాటలినొచ్చు…” అని చేతిలోని పేపర్‌ని సరోజవైపు పట్టాడు.
ఫోన్‌ మ్రోగింది… కృష్ణారెడ్డి ఎత్తాడు… నాలుగిళ్ళవతల ఉంటున్న మిత్రునినుండి…
”కారు కొందామనుకుంటున్నాం మీ సలహా కావాలి…” ఆ వైపునుండి మిత్రుడి కోరిక.
ఇరవై నిమిషాల వరకు సంభాషణ జరిగింది.
”………..గో ఫర్‌ దట్‌ మోడల్‌….. చాలా బాగుంటుంది” నిపుణుడిలా కృష్ణారెడ్డి సలహా ఇచ్చాడు.
”కారు డెలివరీ రోజు మీరు ఫ్రీగా ఉంటే వస్తారా?…” మిత్రుడి కోరిక…
”ఓయస్‌… తప్పకుండా… మీరు ముందుగా తెలిపితే నేను రడీ” కృష్ణారెడ్డి ఉత్సాహంతో మాటిచ్చి ఫోను పెట్టేసాడు.
”ఏమండి?… ఎపుడెళదాం… డాక్టర్‌ దగ్గరికి…” రెండోసారి ప్రాధేయపూర్వకంగా సరోజ.
 ”నీకేమయిందే ఇపుడు.  బాగానే ఉన్నావుగా… అనారోగ్యంగా ఉన్నట్టుగా కనిపించడంలేదే… నిన్ను అనారోగ్యంగా ఉన్నావన్నవాళ్ళు క్వాలిఫైడ్‌ డాక్టర్సా?…” విసుగ్గా, యాంత్రికంగా కృష్ణారెడ్డి.  ఆయన మనస్సులో ఎపుడెపుడు స్టీరియో కొని కార్లో పెట్టించి ఇష్టమైన పాటల్ని వింటూ స్టీరింగు తిప్పుతూ పోతే ఎంతో హాయి అన్న ఆలోచనలే కమ్ముకుంటున్నాయి.
సరోజ భర్తవైపు నిరసనగా చూసి బెడ్‌రమువైపు అడుగులేసింది.
”ఏంటి? ఉప్మానా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు… నాకు ఉప్మా నచ్చదని… దోసెలెందుకు చెయ్యలేదు…” ప్లేట్లో ఉన్న వేడి వేడి ఉప్మా చూసి తినగూడని పదార్థాన్ని చూసినట్టుగా గరంగరంగా అరిచాడు కృష్ణారెడ్డి.
”మిక్సీ పాడయ్యిందండీ… తిరుగుతూ తిరుగుతూ ఒక్కసారే ఆగిపోయింది.  నిన్న పొద్దున మీకు చెప్పడం మరిచాను…” అపరాధభావనతో సరోజ.
ఉప్మా తినకుండానే లేచి డ్రెస్సేసుకొని మిక్సీ తీసుకొని కార్లో వెళ్ళిపోయాడు.
సరోజ మిక్సీ గురించే ఆలోచిస్తుంది……
అనన్యని పిలిచింది.  ఇద్దరూ బ్రేక్‌ఫాస్ట్‌ ముగించారు.
”డాడీ ఎక్కడికెళ్ళాడమ్మా? ఈరోజు ఆదివారం కదా!” చేతులు తుడుచుకుంటూ అనన్య.
సరోజ చెప్పింది…
”అంత తొందరేమొచ్చిందమ్మా… నాన్న బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండానే వెళ్ళాడు…” వివరించి చెప్పింది సరోజ.
”డాక్టర్‌ దగ్గరికెపుడెలుతున్నారమ్మా?”
”తెలియదు…”
”డాడీని అడగలేదా?”
”అడిగాను…”
”ఏమన్నాడు డాడీ”
”నాకేం కాలేదట. బాగానే ఉన్నావన్నారు…” కళ్ళలో నీళ్ళు నిండాయి సరోజకి.  అనన్య గమనించి దగ్గరికొచ్చి సరోజ భుజంపై తలఆన్చింది.  అనన్యని దగ్గరికి తీసుకొని హత్తుకొంది.  దుఃఖం ఉబికివచ్చింది.
”మనిద్దరం వెళదామమ్మా డాక్టర్‌ దగ్గరికి.  నేనొస్తానమ్మా నీకు తోడుగా…” అనన్య.
”వద్దమ్మా… మీ డాడీ తీసుకెళ్తారు… మళ్ళీ అడుగుతాను నీవెళ్ళి ఆడుకోపో…” కూతుర్ని పంపింది.
రెండుగంటల తరువాత కృష్ణారెడ్డి రిపేర్‌ చేయించుకొని మిక్సీతో తిరిగొచ్చాడు.
”హు…” అని దాన్ని డైనింగుటేబుల్‌పై పెట్టాడు.
సరోజ మిక్సీవైపు తదేకంగా చూసింది.  భర్తకి తెలిసిన క్షణంలోనే జీవం లేనిదాన్ని తీసుకెళ్ళి రిపేర్‌ చేయించి తీసుకొచ్చాడు.  జీవమున్న మనిషిపట్ల ఎందుకంత ఆతురత లేదో సరోజకి అస్సలు అర్థంకాలేదు.  విచిత్రమైన మనిషనుకొంది.
ఆలోచించింది… మరింత ఆలోచించింది… ఎంతో ఆలోచించింది… ముఖంపై ఆత్మవిశ్వాసం ఛాయలు… ఏదో గట్టినిర్ణయం తీసుకున్న ప్రకాశం…
మరునాడు సోమవారం కృష్ణారెడ్డి ఆఫీసుకెళ్ళాడు.  అనన్య స్కూలునుండి వచ్చింది.  అంతవరకు రోజటి దినచర్యలే ఆ ఇంట్లో… ఏమాత్రం మార్పులేదు.
సరోజ విషయంలో కొంతమార్పు… తాను తయారైంది.  ఎవరికో ఫోనుచేసి ఇంకో ఐదునిమిషాల్లో ఇంటినుండి బయలుదేరుతున్నట్టుగా చెప్పింది.
”అనన్యా… నేను బయటకెలుతున్నానమ్మా.  బోల్టుపెట్టుకొని జాగ్రత్తగా ఉండు.  డాడీ వచ్చాక ఈ స్లిప్‌ ఇవ్వమ్మా…” అనన్యకి అందించింది.
సరోజ బయటకి వచ్చింది.  హాయిగా, స్వేచ్ఛగా ఊపిరిపీల్చింది.  ఆటోలో కూర్చొని ఎక్కడికెళ్ళాలో చెప్పింది.
అమ్మ ఎక్కడికెళ్ళిందో చెప్పలేదు.  కాగితం తనకి ఇచ్చింది.  అనన్యకి ఏమీ అర్థంకాలేదు.  ఆలోచించుకుంటూ కాగితం మడతలు విప్పింది.
”సాయంత్రం నేను వచ్చేసరికి ఆలస్యం కావచ్చు.  నేను డాక్టర్‌ దగ్గరికెళుతున్నాను.  మీరు మషీన్లు-ఇంజన్ల గురించి ఇష్టంతో, ఎంతో ఉత్సాహంతో పట్టించుకొంటారు.  కాని ఇంట్లో జీవమున్న ‘మsheన్‌’ గురించి ఎపుడైనా పట్టించుకొన్నారా????????”
అమ్మ అన్ని క్వశ్చన్‌మార్కుల్ని ఎందుకు పెట్టిందో అర్థం కాలేదు.
ఆలోచిస్తూ కూర్చుంది అనన్య.
మషీన్‌ పదంలో తెలుగులో ‘షీ’ రాయకుండా ఇంగ్లీషులో ‘she’ ఎందుకు రాసిందో కూడ అనన్యకి అర్థం కాలేదు.
మరింత ఆలోచిస్తూ అలానే కూర్చుంది అనన్య.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.