ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగు సాహిత్యంలో ఈ శతాబ్దంలో ఆవిష్కరణ పొందిన నూతన ప్రక్రియ విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్యం. ఈ ప్రక్రియ మన సాహిత్యంలో కొన్ని దశాబ్దాల ముందే ఉదయించినా, తన పరిధిని విస్తృతం చేసుకోవడంలో సఫలీకృతం కాలేకపోయింది. విజ్ఞానరంగంలో వచ్చిన మార్పులు సాహిత్యం మీద చూపిన ప్రభావమే వైజ్ఞానిక కాల్పనిక సాహిత్య ఆవిర్భావానికి కారణం. విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్యాన్ని ఆంగ్లంలో ‘సైన్సు ఫిక్షన్’ అంటారు. రచనా కాలం వరకు వెలుగు చూసిన వైజ్ఞానిక అంశాలను దృష్టిలో ఉంచుకొని వాటి ప్రాతిపదికగా భవిష్యత్తులో ఆవిష్కృతం కావడానికి అవకాశం ఉన్న సైన్సు పరికరాలు, యంత్రాలు, పద్ధతులను మానవ సమాజంపై చూపే ప్రభావాన్ని ముందుగానే ఊహిస్తూ సృజించే సాహిత్యమే వైజ్ఞానికశాస్త్ర కాల్పనిక సాహిత్యం. ఈ సాహిత్యంలో రచయితలచే చేయబడిన ఊహలు భవిష్యత్తులో నిజరూపం దాల్చడానికి అవకాశం ఉందేమో అనే భావన పాఠకునికి కలిగిస్తుంది. భవిష్యత్తులో మారనున్న మానవ జీవితాన్ని గూర్చి పొంచివున్న ప్రమాదాలను గూర్చి ముందుగానే విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్యం ఊహిస్తుంది. ఈ లక్షణాలు కలిగియున్నది మాత్రమే విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్యం కాదు. దీని పరిధి విస్తరించే కొద్ది ఈ లక్షణాలు కూడా పెరిగే అవకాశం ఉంది.
19వ శతాబ్దంలో పాశ్చాత్య సాహిత్యంలో విజ్ఞాన కాల్పనిక రచనలు విరివిగా వెలువడ్డాయి. ఎడ్గర్ అలెన్ పో, జూల్స్ వెర్న్, హెచ్.జి. వెల్స్, మేరీ షెల్లీ, ఆసిమోవ్, సి.ఆర్. క్లార్క్, ఫిట్ జేమ్స్, ఒబ్రియన్, నాతనియెల్ హోతార్న్ మొదలగు రచయితల ఆంగ్లంలో కథలు, నవలలు వ్రాసిన వారిలో ప్రసిద్ధులు. రచయితల కల్పనలు, ఊహలు ఆ తరువాత కాలంలో వాస్తవరూపం దాల్చడంతో వీరి రచనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ఆంగ్ల రచయితల ప్రేరణతో తెలుగు రచయితలు కూడా విజ్ఞానశాస్త్ర రచనలపై కేవలం సైన్స్ పరిశోధనల ప్రభావం మాత్రమే గాక, సమాజంలో వస్తున్న సాంఘిక మార్పుల ప్రభావం కూడా వుంది. సమాజంలో వస్తున్న మార్పులను, విజ్ఞానశాస్త్ర రంగాలలో జరుగుతున్న పరిశోధన ఫలితాలను రచనలలో మిళితం చేసుకొని తెలుగులో విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్యం ముందుకు సాగుతోంది. సాహితీ సృజనలో ప్రాచీన సాహిత్యంలో రచయిత్రులు వెనుకంజ వేసినట్టుగా కన్పించినా, ఆధునిక సాహిత్యంలో రచయిత్రులు అన్ని సాహిత్య ప్రక్రియల్లో రచయితలతో పోటాపోటీగా రచనలు చేస్తూ తమ సత్తాను చాటుకుంటున్నారు. తెలుగులో విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్యం చాలా తక్కువగానే వెలువడినా అందులో రచయిత్రుల భాగస్వామ్యం అధికంగానే ఉందని చెప్పాలి. తెలుగు విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్య రచయిత్రులు చేసిన ఊహలు – కల్పనలు ఆ తరువాత కాలంలో వాస్తవాలై వారి రచనలకు సార్థకతను చేకూర్చాయి.
తెలుగులో తొలి వైజ్ఞానిక నవలా రచయిత్రిగా కంచి రమాదేవిని పేర్కొనవచ్చు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు బాలల సాహిత్యాన్ని ప్రోత్సహించాలనే దృక్పథంతో 1964 నుండి కవిత్వం, నవల, కథానిక, నాటక-నాటిక, సాహిత్య విమర్శ ప్రక్రియలకు బహుమతులు ప్రధానం చేస్తూ వుంది. ఈ క్రమంలో 1970-71 సంవత్సరానికి కంచి రమాదేవి రాసిన ‘అనంతంలో అంతం’ అనే వైజ్ఞానిక నవల బహుమతిని గెలుచుకుంది. సునంద గ్రహం నుండి వచ్చిన హరియన్ నల్లమల కొండలలో ఒక గుహలో సుదీర్ఘంగా నిద్రపోవడం, అక్కడి ప్రాజెక్టు పనులలో కాలువల నిమిత్తం కొండలను పేల్చగా వెలుగులోకి వచ్చిన అతని గాథను రచయిత్రి నవలగా రూపొందించారు. మానవ కల్యాణానికి దోహదకారి కాదగిన మహత్తర విజ్ఞానాన్ని, అసూయ ద్వేషాలతో స్వార్థంతో ఉపయోగిం చుకున్న ఎడల అది సర్వనాశనానికి ఏవిధంగా దారితీస్తుందో సునంద లోకవాసియైన హరియన్ అనే శాస్త్రవేత్త తన స్వానుభవాల ద్వారా తెలియజేస్తాడు. మారణాస్త్రాల తయారీలో ఇరుగు పొరుగు దేశాలు పోటీపడితే, ఆ తరువాత జరిగే పరిణామాలను గూర్చి ఈ నవలలో హరియన్ తెలియజేస్తూ, అందుకు తమ గ్రహాన్ని ఉదాహరణగా తెలుపుతాడు. విజ్ఞానం పదునైన కత్తిలాంటిది. సర్వసౌభాగ్యాలు విజ్ఞానంతో సాధించి సర్వమానవ కల్యాణం సాధించవచ్చునని అట్లే సర్వ మానవ వినాశనానికి కూడా కారణభూతం కాగలదనే సత్యాన్ని రచయిత్రి నవలలో తెల్పారు. ఈ నవల బాలల వైజ్ఞానిక నవల అయినప్పటికీ, పిల్లలను – పెద్దలను విశేషంగా చదివిస్తుంది. వైజ్ఞానిక అంశాల ఆధారంగా నవల రాయడం అనే ప్రక్రియకు తొలి ప్రయత్నంగా ఈ నవలను పేర్కొనవచ్చు.
తెలుగు పాఠకుల హృదయాలను దోచుకున్న తెన్నేటి హేమలతాదేవి ‘మహాయాత్ర’ పేరుతో సోషియో ఫాంటసీ ఫిక్షన్ నవల రాశారు. ఈ నవలలో ఆశాదేవి అనే యువతి విదేశాలలో చదువుకొని సంపాదించిన డిగ్రీలు, ప్రాచీన మహర్షుల రచనల ఆధారంగా ఒక అంతరిక్షనౌకను నిర్మిస్తుంది. ఈ నౌకలో ఆశాదేవి తనతోపాటు ఆనంద్ అనే నిరుద్యోగ యువకుణ్ని, ఉడత అనే అనాథ బాలుడిని ధ్రువ నక్షత్రానికి తాను రూపొందించిన వ్యోమనౌక ద్వారా వెళ్ళిరావడం ఇందులో కథా వస్తువు. ఈ నవలలో వైజ్ఞానిక అంశాల కన్నా దైవ సంబంధ విషయాలకు శ్లోకాలకు, శృంగారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కన్పిస్తుంది. ధ్రువ నక్షత్రం నుండి వచ్చే రేడియో తరంగాలను విజయవాడ స్టేషన్ నుండి ఆశాదేవి రిసీవ్ చేసుకోవడం, అంతరిక్ష ప్రయాణం చేసి భూగ్రహానికి తిరిగి రావడం…. నవలలో ప్రతిపాదించిన తదితర అంశాలు సైన్స్ ఫిక్షన్ క్రింద పరిగణించడానికి అవకాశం ఉన్నప్పటికీ దైవత్వం లాంటి అంశాలను నవలలో అధికపాధాన్యత ఇవ్వడం చేత ఈ నవలను సోషియో ఫాంటసీ ఫిక్షన్ నవలగానే పరిగణించాలి. సైన్స్ ఫిక్షన్ సాహిత్యం వెలువడుతున్న తొలినాళ్ళలో వెలువడిన కథ యిది.
చంద్రుని ఆధారంగా వైజ్ఞానిక నేపథ్యంలో రాయబడిన నవల జొన్నలగడ్డ రమాదేవి రాసిన ‘చంద్ర మండలంలో శశిరేఖా పరిణయం’. శశిరేఖ అనే యువతి తన బావయైన అభిమన్యురావును చంద్ర మండలం మీద వివాహం చేసుకోవడం ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం. ఈ నవలలో వైజ్ఞానికాంశాలు కోకొల్లలుగా ఉన్నాయి. కథ కన్నా వైజ్ఞానికాంశాలను పాఠకులకు అందించాలనే తపనతోనే రచయిత్రి ఈ నవల వ్రాశారని చెప్పవచ్చు. నవలలో కథ చిన్నదే అయినా రచయిత్రి కథను వైజ్ఞానిక దృష్టితో రాసి, రచనకు ప్రామాణికతను చేకూర్చారు. స్త్రీలు ప్రేమ కథలు, కన్నీటి గాథలే గాక చక్కని వైజ్ఞానిక కథలను కూడా రాయగలరని ఈ నవల స్పష్టం చేస్తుంది.
సముద్ర గర్భంలోని జీవరాశి నేపథ్యంలో వెలువడిన నవల డాక్టర్ సి. ఆనందరామం రాసిన ‘నీటి సెగలు’ అనే నవల. కడలి గర్భంలో వింతలోకాలు, వింత జీవులు ఉన్నాయని ఆ నవల తెలియజేస్తుంది. సముద్ర గర్భం పరిశోధన నేపథ్యంలో వెలుగు చూసిన విశేషాలు, మరెన్ని విషయాలు వెలుగుచూడటానికి జరుగుతున్న పరిశోధనలు, వివిధ రకాల చేపలు, వాటి జీవన విధానం ఈ నవలలో ప్రస్తావించడం జరిగింది. రసాయనిక ఆయుధాల ప్రయోగం వల్ల ఎటువంటి జననష్టం, ఆస్తి నష్టం, వాతావరణ కాలుష్యం జరుగుతుందో తెలియజెప్పి, ఇందుకు దేశ విదేశ శక్తులు ఏవిధంగా పన్నాగం పన్నుతున్నాయో, ఈ ప్రయత్నాలను భారత ప్రభుత్వం ఏవిధంగా ఎదుర్కొంటుందో అడవి సూర్యకుమారి ‘టాప్ సీక్రెట్’ నవల తెలియజేస్తుంది. ఈ నవలలో ఆది నుండి అంతం వరకు అనేక వైజ్ఞానిక విషయాలను ప్రస్తావించడం జరిగింది. రసాయనిక ఆయుధాలు, కృత్రిమ వర్షాలు, శాస్త్రవేత్తలను చంపడానికి శత్రు దేశాలు వేసే ఎత్తులు, స్వదేశీ రక్షణ సమాచారాన్ని విదేశీయులు దొంగిలించడం… ఇలాంటి సంఘటనల నేపథ్యంలో రాహుల్ అనే వ్యక్తి ఏవిధంగా దేశాన్ని రక్షించాడనేది ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం.
ఇతర గలాక్సీలలో విజయం సాధించిన మానవులు తమ స్వంత భూగ్రహంలో ఎలాంటి ఇబ్బందులకు గురి అయ్యారో డాక్టర్ మొరంపల్లి అన్నపూర్ణారెడ్డి రాసిన ‘జులియస్’ నవల తెలియజేస్తుంది. కాలం మారినా, నాగరికత అభివృద్ధి చెందినా భూమి మీద మనుష్యులలో మానవత్వం ఎదగడంలేదని. స్వార్థం – దోపిడీ వ్యవస్థ – మూఢ నమ్మకాల హద్దులను ఛేదించలేకపోతున్నాడనే వాస్తవాన్ని వెల్లడిస్తుంది ఈ నవల. గ్రహాల ప్రభావం మనుష్యులపై ఉంటుందని, వాటిని తప్పించుకోవడంలో కావాల్సిన మెళుకువలను గూర్చి కె. పద్మావతి రాసిన ‘ది ప్లానెట్ ఎంపోరియం’ అనే నవల తెలియజేస్తుంది. కృషి పట్టుదల ఉంటే మనిషి ఎలాంటి అసాధ్యాన్నైయినా సుసాధ్యం చేయగలడని, తన భవిష్యత్తును తానే తీర్చిదిద్దుకోగలగే శక్తి అతనికి మాత్రమే ఉందని మనిషి మహనీయతను చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈ నవల.
కథల విషయానికొస్తే – టెస్ట్ ట్యూబ్ బేబీస్ కథా నేపథ్యంతో వెలువడింది ఎమ్. హేమలత రాసిన ‘కన్నతల్లి’ అనే కథ. సంపన్నులైన ఆనందరావు, సునీత దంపతులకు వివాహమై చాలాకాలం అయినా పిల్లలు కలుగరు. డాక్టర్ సంజయ్ చోప్రా ఆ దంపతులను పరీక్షించి, సునీత గర్భం నుండి అండాన్ని వేరుచేసి, ఆమె భర్త వీర్యంలోని పురుష కణాలతో కలిపి సైంటిఫిక్ గా ఒక టెస్ట్ ట్యూబ్‌లో శిశువు ప్రాణం పోసుకున్న తరువాత తమ పనిమనిషి గర్భాశయంలోకి చేర్చి శిశువును జన్మింపజేస్తాడు. నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన ఆ పనిమనిషి ఆ బిడ్డను ఆనందరావు దంపతులకు ఇవ్వలేక ఆక్రోశించడం ఈ కథలోని ప్రధాన ఇతివృత్తం. 20 సంవత్సరాలకు పూర్వమే రచయిత్రి టెస్ట్ ట్యూబ్ బేబీ గురించిన ఆలోచనను కథా నేపథ్యంలోకి తీసుకురావడం ఆశ్చర్యం.
ప్రకృతి జీవపరిణామాన్ని స్తంభింపజేసి రోబోట్స్ ద్వారా పనులు చేయించడం, క్లోనింగ్ ద్వారా మనుష్యులను సృష్టించడం పిల్లలమర్రి రామలక్ష్మి రాసిన ‘జెనెసిస్’ కథా వస్తువు. 40వ శతాబ్దంలో వెలుగు చూడటానికి అవకాశం ఉన్న శాస్త్ర సాంకేతికరంగాల అభివృద్ధికి సంబంధించిన ఊహలను ఈ కథలో రచయిత్రి చేశారు. క్లోనింగ్‌ను గూర్చి ఈ కథలో రచయిత్రి చేసిన ఊహలు 20వ శతాబ్దంలోనే వాస్తవ రూపం దాల్చడం విశేషం. మానవ శరీరం, మనస్సు పై సప్త వర్ణాలు ప్రభావాన్ని చూపుతాయని, కలర్ హీలింగ్ పద్ధతి ద్వారా జబ్బులను నయం చేయవచ్చునని శంఖవరపు సరోజా సింధూరి రాసిన ‘వరద గుడి’ కథ తెలుపుతుంది. కలర్ సోలారైజ్డ్ ప్రొగ్రెన్స్ ఫ్యాన్, కలర్ బ్రీతింగ్, కలర్ వాటర్, కలర్ హీలింగ్ లాంటి ప్రక్రియలు చేయడంవల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు, వీటిపై విదేశాలలో జరుగుతున్న పరిశోధనలు తదితర విషయాలు కథలో ప్రస్తావించబడ్డాయి. సృష్టిలోని వివిధ రంగుల వలన శరీరానికి ఒనగూరే ప్రయోజనాలు అనంతమని ఆధునిక వైద్య విజ్ఞానంలో వీటిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని, పరిశోధన ఫలితాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఈ కథ తెలియజేస్తుంది.
మెదడు మార్పు వల్ల మెదడులో ఆ వ్యక్తి ఆలోచనలు గాక మెదడు తీసుకోబడిన వ్యక్తి ఆలోచనలు కూడా ఉంటాయని బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ ఊహిస్తూ రాయబడింది అన్నపూర్ణారెడ్డి మొరవపల్లి ‘సోలాండ్ మై ఫ్రెండ్’ అనే కథ. ఈ కథలో మురహరి అనే ధనవంతునికి మెదడుకు సంబంధించిన వ్యాధి రావడం చేత అతనికి చనిపోయిన మరో వ్యక్తి మెదడును అమర్చుతారు. ఆపరేషన్ అనంతరం కోలుకున్న మురహరికి పాత స్మృతులు గుర్తుకు రావు. ఈ క్రమంలో ప్రేయసి ప్రదీప్తిని కూడా దూరంగా ఉంచుతుంటాడు. కాలక్రమంలో జీవనగమనానికి అలవాటుపడిన మురహరి ఉన్నత చదువు నిమిత్తం విదేశాలకు వెళ్తూ అన్ని విషయాలు ఒక లెటర్‌లో రాసి ప్రదీప్తికి ఇచ్చి వెళ్తాడు. అందులో రాబర్ట్ విలియంగా చనిపోయిన తాను మురహరిగా బ్రతికానని, శరీరం ఒకరిది – మనసు మరొకరిదని తెలియజేస్తాడు. ప్రదీప్తిని భార్యగా స్వీకరించలేనని మరొకరిని వివాహమాడమని సూచిస్తాడు. అవయవాలను స్పేర్ పార్ట్స్ లాగా అమర్చడం వైద్యరంగానికి సవాలుగా భావిస్తున్న తరుణంలో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్స్ జరిగితే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఊహిస్తూ రాయబడిన కథ యిది.
అన్నపూర్ణారెడ్డి రానిన మరో వైజ్ఞానికశా కాల్పనిక కథ ‘నూట పధ్నాలుగు’. గ్రహాంతరవాసులు నేపథ్యంతో రాయబడిన కథ యిది. భారతీయులు సాధించిన వైజ్ఞానిక ప్రగతి తమ గ్రహంలో ూడా సాధించదలచామనీ, ఆ పరిజ్ఞానాన్ని తమకు అందించేందుకు ఏజెంటుగా సహకరించాలని మార్చే గ్రహవాసులు ఆనంద్ అనే శాస్త్రవేత్తను కోరతారు. అందుకు నిరాకరించిన ఆనంద్‌ను బంధిస్తారు. ఆ గ్రహంలోని నూటపద్నాలుగు అనే అమ్మాయి సహకారంతో భూగ్రహానికి చేరుకుంటాడు. చివరకు తనకు సహాయం చేనిన ఆ అమ్మాయి రోబో అని తెలిసి ఆశ్చర్యపోతాడు. అంగారక గ్రహంలో యాంత్రిక జీవనం, అన్ని పనులు రోబోలే చేస్తుండటం, ఆ రోబోలు మానవత్వం కలిగి ఉండటం, 2050 సంవత్సరంలో భూమి మీద అణ్వ యుద్ధం జరిగి జీవకోటి నశిస్తుందని… తదితర అంశాలను ఊహిస్తూ ఈ కథ రాయబడింది.
తెలుగు విజ్ఞానశాస్త్ర కాల్పనిక రచయిత్రులు తమ రచనలలో ఒకవైపు ెనౖన్సు సంబంధించిన అంశాలను చెబుతూనే మరోవైపు సమాజంలోని అసమానతలను గూర్చి, స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను గూర్చి, స్త్రీ వివక్షతను గూర్చి సందర్భోచితంగా వివరిస్తూ సమాజాన్ని చైతన్యపర్చే ప్రయత్నం చేస్తున్నారు. వైజ్ఞానిక సాంతిేకాభివృద్ధి ఎంత జరిగినా భారతీయ స్త్రీ స్థితిగతుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదనే ఆవేదన వీరి రచనల్లో కన్పిస్తుంది. సైన్సును, సామాజిక స్థితిగతులను మిళితం చేని రచనలు చేనిన, చేస్తున్న తెలుగు విజ్ఞానశాస్త్ర కాల్పనిక రచయిత్రులు అభినందనీయులు.
సాహిత్యం యొక్క ముఖ్య లక్ష్యం సామాజిక ప్రయోజనం. తెలుగు సాహిత్యంలోని ఒక కోవకు చెందిన విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్యం యొక్క ఆవశ్యకత సమాజానికి ఉంది. విజ్ఞానశాస్త్ర అభివృద్ధితో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో విజ్ఞానశాస్త్ర మూలాలను సామాన్య ప్రజలకు, ముఖ్యంగా బాలబాలికలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ అవసరాన్ని విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్యం తీరుస్తుంది. ఈ సాహిత్యం ప్రస్తుతం మానవజాతి ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, ఈ సమస్యలు భవిష్యత్తులో ఏవిధంగా తీవ్రతరమవడానికి అవకాశం
ఉందో విశదీకరిస్తూ, ఆ సమస్యల పట్ల ప్రజలకు అవగాహన కలిగేటట్లు చేస్తుంది. ఐతే ఇంతటి ప్రాధాన్యత గల ఈ సాహిత్యాన్ని తెలుగు పత్రికలు పట్టించుకోక పోవడం, విజ్ఞానశాస్త్ర రచయితలకు సైన్సు పైన- సాహిత్యంపైన సమపాళ్ళలో పట్టులేకపోవడం, పాఠకులతో అత్యధికమందికి ప్రాథమిక స్థాయిలో ూడా సైన్సు పట్ల అవగాహన లేకపోవడం తదితర కారణాల వల్ల తెలుగులో విఫలమైంది. ఇంతటి ఆవశ్యకత కలిగిన విజ్ఞానశాస్త్ర కాల్పనిక సాహిత్యం నూతన శతాబ్దిలో మరెన్నో నవీన కల్పనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తుం దని, మరెంతో మంది రచయిత్రులను ఉత్సాహపర్చగలదని ఆశిద్దాం.