6వ మహాసభకు ఆహ్వానం
మిత్రులారా,
కేంధ్రంలో ప్రభుత్వం మారింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. అన్ని చోట్లా పాలకుల అభివృద్ధి మంత్రం జపిస్తున్నారు. కేంద్రంలోని ప్రభుత్వాధినేత దేశాభివృద్ధి కోసం పెట్టుబడులను అహ్వానిస్తూ తీరిక లేకుండా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాడు. (హిందూత్వ వెలుగులో భారత దేశ ఆచార వ్యవహారాలను, హిందూ భావజాల పునరుద్ధరణ వైపు నిశ్శబ్ధంగా ప్రధానమంత్రి మోడీ దేశంలో పావులు కదుపుతున్నాడు.) ఆయన ఆప్యాయంగా కౌగిలించుకున్న విదేశీ పెట్టుబడిదారులు దేశంలో ఎటువంటి అభివృద్ధిని సాధిస్తారో, అందులో ప్రజలు, ప్రజల హక్కులు ఏమౌతాయో వేచి చూడాల్సిందే. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కట్టుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ నగరాలన్నీ పర్యటించి అపసోపాలు పడుతున్నాడు. మన దేశంలో నాణ్యమైన విద్యను అందించే ప్రతిష్టాకరమైన ఐఐటీలు, అన్ని రకాల పరిశోధనా సంస్థలు మేధావి వర్గాన్ని పక్కన పెట్టి, సింగపూర్ నుండి నిర్మాణ కంపెనీని ఆహ్వానించి దాని బాధ్యులను గోదావరిలో పుష్కర స్నానం చేయించి, వారినే ఒక బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం చేయమని, వేల ఎకరాల భూములను 99 సంవత్సరాలు లీజు కింద వాళ్ళ చేతుల్లో పెట్టాడు. నిర్మించే రాజధానిలో మామూలు ప్రజలు వుంటారా? భూమినే నమ్ముకుని గౌరవంగా జీవనం సాగిస్తున్న రైతులు, అందులో పనిచేసుకుంటున్న కూలీలు రేపు ఏమవుతారన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమౌతోంది. రాజధాని అంటే పరిపాలనా సౌలభ్యానికి కొన్ని భవంతులు, కార్యాలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, ప్రజలకు అవసరమైన ఇతర నిర్మాణాలు వుంటే సరిపోతుంది కదా! అలాకాకుండా అద్దాల మేడలు, హైటెక్ హంగులు, ఆకాశాన్నంటే భవనాలు, విమానాలు, హెలికాప్టర్లు, మెట్రో రైలు ఎందు కోసమోనని ప్రజల నోర్లు తెరుచుకుని పత్రికల్లో వచ్చే రంగు రంగుల బొమ్మలను చూసి మక్కుమీద వేలేసుకుంటున్నారు.
సుదీర్ఘ పోరాటం, ప్రజాస్వామిక ఆందోళన తర్వాత ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు, నిధులు,
ఉద్యోగాలు, వనరులు తెలంగాణ ప్రజలు మాత్రమే పొందే విధంగా పాలన వుంటుందని అధికారంలోకి వచ్చిన పార్టీ, నాయకులు ప్రతిజ్ఞలు చేశారు. కానీ వనరులు, నీళ్ళు తరలిపోతూనే వున్నాయి. వ్యవసాయ రంగంలో సంక్షోభం కొనసాగుతూనే వుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే వున్నారు.రాష్ట్రాభివృద్ధి కోసం విద్యుచ్ఛక్తి అవసరం కాబట్టి పెద్ద ఎత్తున బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకున్నది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ”యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు పేరుతో” 5 ప్లాంట్లు నిర్మించి 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సాధించాలని ప్రభుత్వం తలపెట్టింద. భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ నిర్భంధ పద్ధతుల ద్వారా చేస్తున్నారు. ప్రాజెక్టుల గురించి ప్రజాభిప్రాయం వ్యక్తపరచడానికి వచ్చే ప్రజలపై కేసులు పెట్టి వారిని రాకుండా నివారిస్తున్నారు. పర్యావరణ విధ్వంసం గురించిగానీ, బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి వల్ల వచ్చే కాలుష్య సమస్యల గురించి గానీ, నిర్వాసితులవుతున్న ప్రజలు వేసే ప్రశ్నల గురించిగానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం తాను ఎంచుకున్న అభివృద్ధి నమూనా వల్ల ప్రజల జీవించే హక్కులు నాశనమవుతున్నాయి. గతంలో రాష్ట్రంలో 6 దశాబ్దాలుగా కొనసాగిన నిర్భంధ పరిస్థితి మారి, స్వేచ్ఛగా భయం లేకుండా జీవించాలనే ఆకాంక్ష, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనోద్యమ సమయంలో బలంగా వ్యక్తమయింది. ఎన్‌కౌంటర్ హత్యలు, లాకప్ మరణాలు, చిత్రహింసలతో తెలంగాణ జిల్లాల్లోని పల్లెలు అతలాకుతలమయ్యాయి. దాదాపు 50 మంది వ్యక్తులు పోలీసులు అరెస్టు చేసిన తర్వాత అదృశ్యమయ్యారు. వీళ్ళంతా ఇళ్లలోనుండి, కళాశాలల నుండి, పని స్థలాల నుండి, జైళ్ల నుండి విడుదలైనప్పుడు పోలీసుల చేత తీసుకెళ్లబడ్డవాళ్లు. సుమారు 3 వేల మందిదాకా ఎన్‌కౌంటర్లలో హత్య గావించబడ్డారు. గ్రామాలలో కొన్ని వేల దళిత, బలహీన వర్గాల, చిన్నా చితక కుటుంబాల జీవితాలు ఛిద్రమైపోయాయి.
అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రభుత్వం పోలీసుల పనివిధానం మెరుగు పరుస్తామని, వాళ్ల సర్వీసు కండీషన్సును బాగు పరుస్తామని తలపెట్టింది. అందులో భాగంగా పోలీసు శాఖకు, జైళ్ల శాఖకు బడ్జెట్ పెంచింది. ఆధునిక వాహనాలు, స్మార్ట్ మొబైల్ ఫోన్లు, ఆధునిక కెమెరాలు, అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులకు అందుబాటులో వుంచుతుంది. దేశంలో ఎప్పుడూ లేని విధంగా క్రింది స్థాయిలో వున్న పోలీసు కానిస్టేబుల్‌కు ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలన్న నిర్ణయాన్ని తీసుకుంది. ఇవన్నీ తప్పకుండా ఆహ్వానించదగ్గ విషయాలే. అయితే ప్రజలతో పోలీసుల ప్రవర్తన ఎలా వుండాలనేది కూడా ముఖ్యమైన అంశం. ఈ విషయం గమనిస్తే పరిస్థితుల్లో మార్పు కనబడడం లేదు. నిర్భయంగా ప్రజలు, పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు నమోదు చేసుకునే పరిస్థితి లేదు. హైదరాబాద్ నగరంతో సహా పలు జిల్లాల్లో చాలా పోలీసు స్టేషన్లలో పరిస్థితి ఇలాగే వుంది. ఏ సమయంలో చూసినా ప్రజలు గుంపులు, గుంపులుగా పోలీసు స్టేషన్ ఆవరణలో చెట్ల కింద కూర్చుండి తమ బాధలు చెప్పుకోవడానికి అధికారుల కోసం వేచి వుండి కనబడుతున్నారు. ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు అయ్యాక డబ్బులు ముట్టచెబితేగాని పోలీసులు నేర విచారణ చేపట్టడం లేదని హక్కుల సంఘాలకు సమాచారం అందుతున్నది. చిత్రహింసలు, అక్రమ పద్ధతుల్లో అరెస్టులు కొనసాగుతూనే వున్నాయి. భయంకరమైన ”రోకలిబండ” చిత్రహింస ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే వుంది. ఎన్‌కౌంటర్లు, కస్టడీ మరణాలు ఆగిపోలేదు. జైళ్లలో ఖైదీల అనారోగ్య పరిస్థితి సరిగ్గా పట్టించుకోకపోవడంతో చాలా మంది ఖైదీలు మరణిస్తున్నారు. అందులో నేర విచారణలో వున్న ఖైదీలు కూడా వున్నారు. హైదరాబాద్ నగరంలో గత ఆరు నెలల్లో 60కి పైగా అక్రమ నిర్బంధం, చిత్ర హింసల ఫిర్యాదులు రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ ముందు నమోదయ్యాయి. ఇది గాకుండా ఇంకా చాలా వెలుగులోకి రాని ఉదంతాలెన్నో మానవ హక్కుల సంఘాల దృష్టికి వస్తున్నాయి.
మంత్రులు, ప్రజా ప్రతినిధులు రక్షణ కోసం గన్‌మెన్‌ల సంఖ్య ఇదివరకంటే ఎక్కువగా పెంచుకున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా ప్రజలను పోలీసులు భద్రతపేరుతో నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఆయన హెలికాప్టర్‌లో వెళ్ళుతుంటే రోడ్డు మీద ఎవరినీ నడవనీయం లేదు. గత సంవత్సరంగా నిరసన వ్యక్తపరచిన అన్ని ప్రజా సంఘాలు తీవ్రమైన నిర్బంధాలు ఎదుర్కొంటున్నాయి. రాజధానితో సహా అన్ని జిల్లాల్లో, మండల కేంద్రాలలో హాలు మీటింగుకు కూడా పర్మిషన్ తీసుకోవాలని పోలీసులు వత్తిడి చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసు ముందు ధర్మాలు, నిరసనలు నిషేధించారు. మున్సిపల్ ఉద్యోగుల నిరసన ఉద్యమం సందర్భంలో, విద్యుచ్ఛక్తి కాంట్రాక్టు కార్మికుల సమ్మె సందర్భంలో పోలీసులు ప్రవర్తించిన తీరు మనం చూశాం. కొన్ని కేసుల విషయలో పోలీసు స్టేషన్‌లో బెయిలు పొందవచ్చనే సవరణ వచ్చిన తరువాత బెయిలు పొందే విషయంలో పోలీసులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి కొత్తగా చలామణిలోకి వచ్చింది. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలలో అమాయకులైన ఆదివాసీలను నక్సలైట్లతో సంబంధాలు వున్నాయని వేధిస్తూనే వున్నారు. ఖమ్మం జిల్లా భద్రచలంలో వారానికి ఒక రోజు హాజరు ఇవ్వాలని బైండోవర్ కేసులు పెడుతున్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ విద్యార్థి వేదిక, బంధు మిత్రుల సంఘం, సంస్థలు, నిర్వహించే కార్యక్రమాలు ఏవీ జరగనివ్వడం లేదు. రాష్ట్ర చరిత్రలో కుట్ర కేసులు కోర్టుల్లో ఎప్పుడూ నిరూపించ బడకపోయినా కుట్రకేసులు పెడుతూనే వున్నారు. బీడీ కార్మికులపై, జనశక్తి పార్టీకి చెందిన కార్మిక నాయకులపై నిజామాబాద్‌లో ”మాచారం కుట్రకేసు” పేరుతో కేసు పెట్టారు. ఖమ్మం జిల్లాలో పోడు భూములు కొట్టి వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలపై, వారికి నాయకత్వం వహిస్తున్న ప్రజాపంథా నాయకులపై దేశద్రోహం కేసులు బనాయించారు. ఇంతకాలంలగా కొనసాగిన ”నేరం చేసినా శిక్ష వుండదనే హామీ సంస్క ృతి” (ూశీశ్రీఱషవ Iఎజూబఅఱ్‌వ)ని ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందని అనుకోవాల్సి వస్తుంది. గత ప్రభుత్వాలన్నీ నక్సలైటు ఉద్యమాలను అణచడానికి, ప్రజల ఆందోళనను అణచడానికి పోలీసులకు అన్ని రకాల రివార్డులు, అవార్డులు ఇచ్చి ఈ సంస్క ృతిని పోషించాయి. ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆందోళన చేస్తున్న ఉస్మానియా విద్యుర్థులపై, విత్తనాలు, ఎరువులు పురుగుల మందుల కోసం ఆందోళన చేస్తున్న రైతులపై, నిర్బంధం, అరెస్టులు, లాఠీచార్జీలు ఎప్పటి లాగానే కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నాయకులకు, శాసన సభ ప్రతినిధులకు కూడా ముఖ్యమంత్రిని కలవడానికి అనుమతి లభించడం లేదు.
ప్రజల ఆకాంక్షల మేరకు దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవిం చిన తెలంగాణ పరిపాలన పద్ధతుల్లో చాలా మార్పులు రావాల్సి వుంది. ప్రజాస్వామిక ప్రభుత్వంలో అభిప్రాయాల వ్యక్తీకరణ, నిరసనలు, ధర్మాలు, సమ్మెలు, మౌన ప్రదర్శనలు చాలా ముఖ్యమైన అంశాలు. ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాలు వినడం, అందుకు అనుగుణంగా పరిపా లనలో మార్పులు చేసుకోవడం ప్రభుత్వం బాధ్యత. అభిప్రాయాలను వ్యక్తపరచినా ప్రత్యామ్నాయ విధానాల గురించి మాట్లాడినా, పత్రికల్లో రాసినా ప్రభుత్వం తమ అధికారాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా, పాలించే పార్టీని వ్యతిరేకిస్తున్నట్లుగా భావిస్తోంది. ఈ పరిస్థితి మారాలి. పాలనా పరంగా సమూలంగా మార్పులు చేసే ప్రయత్నం ప్రభుత్వం నిజాయితీగా చేస్తే తప్ప ప్రజల మౌలిక హక్కులకు భరోసా వుండదు. ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడానికి ఆలోచనలు పంచుకోవడానికి మానవ హక్కుల వేదిక 6వ నగర కమిటీ మహాసభకు రావాల్సిందిగా మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నాం.