భూమిక చేపట్టబోతున్న ఒక ప్రాజెక్టు నిమిత్తం తెలంగాణ గ్రామాల్లో విస్తృతంగా తిరిగే అవకాశం దొరికింది. మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు, దామరగిద్ద మండలాల్లోని 102 గ్రామాల్లో ”బాల్య వివాహాల” మీద భూమిక కార్యకలాపాలు జూలై 2015 నుండి మొదలయ్యాయి. ఈ సందర్భంగా గ్రామాలకు వెళ్ళడం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో వున్న గ్రామాలను, ముఖ్యంగా అన్ని విధాలుగాను వెనుకబడిన జిల్లాగా చెప్పుకునే మహబూబ్‌నగర్ లోని గ్రామాలను చూడడం, అక్కడి మహిళలతో మాట్లాడటం ఒక కొత్త అనుభవాన్నిచ్చింది. గ్రామస్థాయిలో వున్న ఎన్నో సమస్యలను ప్రత్యక్షంగా చూడగలిగే అవకాశం దొరికింది. మద్దూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న బాల్య వివాహలు, వాటికి గ్రామస్తులు చెబుతున్న కారణాలు విన్నాము. అలాగే చెన్నారెడ్డిపల్లి గ్రామంలో 1 నుండి 8 తరగతులకు ఒకే టీచర్ వున్న వైనాన్ని నొరేళ్ళ బెట్టుకుని విన్నాము. గ్రామ కార్యాలయంలో మేము మహిళలతో మాట్లాడుతున్నప్పుడు ఎనిమిది తరగతులకు కలిపి చదువు చెబుతున్న
ఉపాధ్యాయుడొచ్చి ఎలా మొరపెట్టుకున్నదీ విన్నాము. ఆ గ్రామం విద్యార్థినీ, విద్యార్థులు జిల్లా కలక్టర్‌ని కలిసి ”టీచర్ లేకుండా మేము ఎలా చదువుకోవాలి?” అని నిలదీయడం, పిల్లలంతా కూడబలుక్కుని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉత్తరం రాసి ”మాకు చదువు చెప్పే టీచర్లు లేరు. మేము ఎలా చదువుకోవాలి” అని విన్నవించుకొన్న విషయం చెన్నారెడ్డిపల్లిలో సర్పంచ్ చెప్పగా విన్నాం.
దామరగిద్ద మండలంలోని ‘బాపనపల్లి’ గ్రామానికి వెళ్ళినపుడు ఎదురైన అనుభవం, ఇంతకు ముందెప్పుడూ నాకు ఎదురవ్వలేదు. బాపనపల్లి, చిన్న గ్రామం. ”బాల్య వివాహాల నిరోధం’ గురించి మాట్లాడటానికి నేను, ప్రశాంతి ఆ గ్రామానికి వెళ్ళాం. మేము ఒక బాదం చెట్టు కింద కొంత మంది మహిళలతో కూర్చుని చర్చిస్తున్నాం. హఠాత్తుగా ఊరి మధ్యలో వున్న వేపచెట్టు కింద కూర్చున్న వారి మీద మా దృష్టి పడింది. ఆ చెట్టు కింద కూర్చుని పట్టపగలు ఆడా, మగ కలిసి కల్లు తాగుతున్నారు. వొక్కక్కరి ముందు తాగేసిన బీర్ బాటిళ్ళతో నింపిన ”మందుకల్లు” అది కల్లో, సారానో వాళ్ళకే తెలవదు… ‘మందుకల్లు’ అంటున్నారు. ఆ దృశ్యం నన్ను చాలా కలవరపరిచింది. ఆ చుట్టు పక్కల వొక్క తాటిచెట్టు లేదు. కల్లు దొరికే అవకాశమే లేదు. కల్లు పేరుతో అమ్ముతున్న సారా అది. రోజుకి 70 క్రేట్లు అమ్మడవుతాయి. ఒక్క క్రేట్‌లో 24 సీసాలుంటాయి. మూడు పూటలా తాగడమే పని.
పాఠశాలల నుంచి వచ్చిన పిల్లలు రెండేసి బాటిళ్ళు అమ్మకోసమో, నాన్నకోసమో, మరెవరి కోసమో కొనుక్కెళుతూ కనబడ్డారు. పోతూ పోతూ కొంత మంది పిల్లలు ఇదే అదనుగా కొంచం తాగుతూ కనిపించారు. ‘అయ్యో! పిల్లలు కూడానా’ గుండె చెరువైంది. ఒకామె సీసా ముందు పెట్టుకుని బాధపడుతూ కనబడింది. నేను ఆమె దగ్గరకెళ్లి మాటల్లో పెట్టాను. ”ఇయ్యాల తాగాల, సావాల.. ఛీ నా బతుకు చెడ” అంటూ తిట్టుకుంటోంది. కళ్ళల్లో నీళ్ళు. ఎందుకు తాగుతున్నావంటే ”సావనీకీ” అంది. కొడుకు తిట్టాడట… అందుకే ”తాగాల.. సావాల” అంతే. అక్కడ మీటింగ్‌లో కూర్చున్న స్త్రీలల్లో చాలా మంది తాగుతారట. సారా అమ్మే ఆమె మాత్రం తాగదట. ”ఎందుకంతలా తాగుతారు” అని అడిగితే ”మా సమస్యలు మర్చిపోనీకి, వానల్లేవ్… పనుల్లేవ్… ఏంచేయాల.. ఉపాధి పనులకు పోతాం. సగం డబ్బులు తాగుతాం…. మేం సస్తే ఏం నష్టం? ఎవలికి నష్టం?” ఈ మాటల్లో ఎంతో నిస్తేజం… నిరాశ… ”కొత్త ప్రభుత్వం వచ్చింది కదా! మీ సమస్యలు తీరటం లేదా” అంటే ఏ గవర్నమెంటైనా వొకటే? మా గురించి ఎవరూ పట్టించుకోరు” కొత్త ప్రభుత్వం వచ్చిందన్న ఉత్సాహం, ఉద్వేగం ఏమీ లేవు. వారి ముఖాల్లో కళాకాంతులు లేవు. తైల సంస్కారం లేని అట్టలు కట్టిన జుట్లు, గాజు కళ్ళు… చాలా మంది స్త్రీలు ఇలాగే దర్శనమిచ్చారు.
తెలంగాణలో చాలా గ్రామాల్లో ఇప్పటికే సారాకి, గుడుంబాకి, ‘మందు కల్లుకు’ చాలా మంది బానిసలైపోయారు. వర్షాలు కురవని, సరైన నీటితీరువా లేని గ్రామాల్లో ప్రజలకు చేతినిండా పనుల్లేవు. ఆదాయాల్లేవు. సరైన సౌకర్యాలు లేవు. పాఠశాలల్లేవు. స్కూళ్ళల్లో పంతుళ్ళు లేరు. మంచి నీళ్ళు లేవు. మురికాలువలు లేవు. మరుగుదొడ్లు లేవు. ఉన్నా వాడుక లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లేవు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థితి దయనీయం. డాక్టర్లుండరు. మందులుండవు. వసతులుండవు. వెరశి ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ తెలంగాణ, అభివృద్ధికి నోచుకోని తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తమ కలల తెలంగాణ వస్తుందని ఆశపడ్డ ప్రజలకి తొట్ట తొలుత స్వాగతం చెప్పినవి కల్లు కాంపౌండులు. కల్లు, గుడుంబా, ఆల్కహాల్ తాగిన వాళ్ళు మహిళల మీద ప్రయోగిస్తున్న హింసకి అంతం అనేదే లేదు. కుటుంబాల్లో మద్యమనే మహమ్మారి సృష్టిస్తున్న హింసకి అడ్డూ, అదుపూ లేదు. 2014 జాతీయ నేర గణాంకాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోను మహిళల మీద హింస ప్రమాదకరంగా పెరిగింది. పెళ్ళి పేరుమీద, ప్రేమ పేరుతోను, గృహహింస, మోసాలు, వంచనలు విపరీతంగా పెరిగిపోయాయి. దానికి తాగుడు తోడై మహిళల జీవితాలను ఇప్పటికీ అతలాకుతలం చేస్తోంది. దీనికి కొత్త మద్యం విధానం జోడైతే…
ఇప్పటికే తెలంగాణలో 2216 మద్యం షాపులు, ప్రతి గ్రామంలోను లెక్కకు మించి బెల్టుషాపులు వున్నాయి. వీటి ద్వారా గరవ్నమెంటుకి 13000 కోట్లు ఆదాయం వచ్చింది. పదమూడు వేల కోట్ల మద్యాన్ని తెలంగాణ పురుషులు తాగేసారు. ఈ తాగుబోతుల ద్వారా మహిళల మీద ఎంత హింస జరిగివుంటుందో లెక్కకి అందదు. దీని మీద ఏ అధ్యయనమూ జరగదు. ఇన్ని వేల కోట్ల రూపాయల మందు తాగేసిన ఈ మగవాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటో, కుటుంబ స్థితి గతులేంటో ఎవరికీ పట్టదు. వీళ్ల ఆరోగ్యాలు బాగుచేయడానికి ప్రభుత్వం ”తాగుబోతుల సంక్షేమ పథకం” పెట్టి దానికో పది కోట్లు ఇవ్వాల్సి వుంటుంది. మద్యంలో మునిగి తేలుతూ ఎన్ని లక్షల పనిగంటల్ని వీళ్ళు నష్టపోతున్నారో ఎవరికీ పట్టదు. ఇప్పటికే పరిస్థితి ఎంతో భయంకరంగా వుంది.
పులి మీద పుట్రాలాగా వచ్చే ఆక్టోబరు 1 తేదీ నుండి అమలుచేయబోయే నూతన మద్యం పాలసీ మహిళల్ని పెనం మీంచి పొయ్యిలోకి తోసేంత భీభత్సంగా వుంది. ఈ కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం జనాభా ప్రాతిపదిక అంటే ప్రతి 10000 మందికి (స్త్రీలు, పురుషులు కలిపో, లేక పురుషులు మాత్రమేనో ) ఒక మధ్యం షాపట. ఇది చాలా విప్లవాత్మకమైన విధానమని, ప్రజల్ని గుడుంబా నించి రక్షించడానికే ‘చీప్ లిక్కర్’ అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆహా!! ఏమి అభివృద్ధి? ఎంత విప్లవం? జనాభా ప్రాతిపదికన ఏ కనీసావసరమూ తీర్చని ప్రభుత్వం అవసరం లేని మద్యం అవసరాన్ని ఎంత విప్లవాత్మకంగా తీరుస్తోంది? జనాభా ప్రాతిపదికన పాఠశాలలుండవు, టీచర్లుండరు. బాత్‌రూమ్‌లుండవు – ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ముండదు… డాక్టర్లుండరు… పోలీసులుండరు. గ్రామాల్లో రోడ్లు సరిగా ఉండవు. రవాణా సదుపాయాలుండవు. ఇవన్నీ లేకపోయినా, ఏర్పాటు చేయకపోయినా సరే మద్యం షాపులు మాత్రం చాలా సౌకర్యవంతంగా ఏర్పాటుచేసి ‘రండి బాబులూ రండి… మందుబాబులూ రండి’ అని పిలిచి మరీ తాగబోయిస్తుంది. 18,000 కోట్ల టార్గెట్… బలవంతంగా గరాటులు నోట్లో పెట్టి మరీ తాగించే విప్లవం. తాగితాగి ఊగే జనాలకి ఇల్లు, వాకిలీ, భార్య, పిల్లలూ, సమాజం ఏమీ పట్టవు. ముఖ్యంగా సామాజిక సమస్యలు, తమ ఊరి సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు ఏమీ పట్టవు గాక పట్టవు.
తెలంగాణా ప్రజలు పోరాటాల్లో ఆరితేరిన వారు. కొన్ని దశాబ్దాలుగా ఉద్యమ నేపద్యంతో బతుకుతున్నవారు. ఎన్నో కొత్త పోరాట రూపాలను అభివృద్ధి చేసుకున్న వారు. ఇక్కడి ఆట, పాట, నాట్యం, నటన, రచన అన్నీ ఉద్యమాల్లోంచి పుట్టి, ఉద్యమాన్ని శ్వాశిస్తాయి. ఈ ఉద్యమ నేపధ్యం ఉసురు తియ్యడమే ఇప్పటి నూతన మద్యం పాలసీ ముఖ్య ఉద్దేశ్యం. తమ ఆశల, ఆకాంక్షల, కలల ప్రభుత్వం ఏర్పడినా… తమ జీవితాల్లో వీసమెత్తు మార్పు కూడా కనబడకపోతే… తిరిగి ఉద్యమంలోకి దూకడం తెలంగాణ గడ్డకి వెన్నతో అబ్బిన విద్య. అలా కాకూడదని, ప్రజల్ని నిత్యం మత్తులో ముంచి, నిస్తేజులుగా చెయ్యాలన్నదే ప్రభుత్వ పన్నాగం. దీనిని ప్రజలు గుర్తిస్తున్నారు. పెద్ద ఎత్తున నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఉద్యమం మొదలు పెట్టారు. ఇది మంచి పరిణామం.
గుడుంబా తాగి జనాలు ఆనారోగ్యాల పాలవుతున్నారని గుర్తించారు సరే… మరి దానిని అరికట్టే చర్యలు తీసుకోండి. గుడుంబాకి పరిష్కారం, చీప్ లిక్కర్ పారించడం కాదు. గుడుంబా లేకుండా చేయడం ప్రభుత్వ బాధ్యత. ఆర్భాటంగా (తీవ్ర వ్యతిరేకత వున్నాసరే) మొదలుపెట్టిన కల్లు కాంపౌండులు (కల్లు గీత పని వారికి ఉపాధులు పేరుతో మొదలు పెట్టారు కదా) ఏమౌతాయి. ముపై రూపాయలకి మూడు పెగ్గులు పోస్తే… కల్లెవరు తాగుతారు? దాని మీద బతుకుతున్న వారేమౌతారు? ‘పిచ్చి కుదురిపోయింది నా తలకు రోకలి చుట్టు’ అన్నట్లుంది. ఈ వ్యవహారమంతా… నూతన మద్యం పాలసీని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలి… లేదంటే నిర్ణయం ప్రజలే తీసుకుంటారు.