కె. వరలక్ష్మి
అందరూ రావాలి పెళ్లికి
అమ్మాయి అమ్మానాన్నల కళ్ళల్లో
ఆరిపోబోతున్న దివ్వెల్ని చూడాలి….
అంతా అద్భుతంగానే ఉంది
ఖరీదైన కళ్యాణమండపం
లక్షల విలువైన
పచ్చిపూల తోరణాలు
నాలుగు వీధుల అంచులమేరకు
నగిషీ బల్బుల అలంకరణలు
అప్పటికప్పుడు మొలిపించిన
కృత్రిమవనాల సోయగాలు
పరిమళద్రవ్యాల ఫౌంటెన్లు
అంతా అద్భుతంగానే ఉంది
సన్నాయి వాద్యాల సవ్వడులు
బేండుమేళాల బృహద్వాయింపులు
అంతంత మాత్రంగా
తిని వదిలేసే ఆకుల్లో
షడ్రసోపేత విందులు
నవదంపతుల ముఖాల్లో
చిరునవ్వుల చిందులు
అంతా అద్భుతంగానే ఉంది
ఇరవైలక్షల కేష్
ఇన్నాళ్లూ కుటుంబానికి చేదోడై నిలిచిన
అరణంభూమి ఆరెకరాలు
ప్లాట్లు ఫ్లాట్లు
వాటిని సంపాదించడానికి పడిన పాట్లు
అమ్మాయి ఒంటిన అరవైతులాల బంగారం
ఆరుకేజీల వెండి అంతకు రెట్టింపు ఇత్తడి
బియ్యం బస్తాలు పప్పులు ఉప్పులు
పెళ్లయ్యాక చూసుకుంటే
ఊరంతా అప్పులు
అబ్బాయి రాజధానిలో
సాఫ్ట్ వేర్ ఇంజనీరు
అతడి గుండె మాత్రం హార్డువేరు
దారిఖర్చులు కూడా
ఆడపిల్లవాళ్లని అడుక్కునే
అష్టదరిద్రపు మొహాలు
అంతా గమనిస్తూ
అమాయకపు ఫేసులు పెట్టే
ఆ ఇంటి మగవాళ్ల అపూర్వ నటనలు
అంతా అద్భుతంగానే ఉంది
‘ఆడపిల్లని కన్నందుకు’ అంటూ
ఏడ్వలేక నవ్వులు
పులిని చూసి నక్కపెట్టుకున్న వాతలు
మోయగలిగినవాళ్లకి
మోయలేనంత బరువులు
సారెలు చీరెలు స్వీట్లు పళ్లు
దుప్పట్లు తువాళ్లు దిండుగలీబులు
అన్నిట్నీ మోసుకుని
అమ్మయ్యా!
అమ్మాయి అత్తింటికెళ్లింది
ఆరని గాయాలకి గుర్తుగా
అయిదుకేజీల ఆల్బమ్ మిగిలింది