రైతు స్వరాజ్య వేదిక 2014 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో నూటికి 60 మందిగా వున్న రాష్ట్ర వ్యవసాయదారుల డిమాండ్లను ముందుకు తెచ్చింది. ఇది రైతులతోనూ, దళిత, బహుజనుల సంస్థలతోనూ, వ్యవసాయ కూలీలతోనూ, మహిళా రైతులతోనూ, కౌలు రైతులతోనూ, ఆదివాసీలతోనూ, విస్తృతంగా చర్చించి ఈ రైతుల మానిఫెస్టోను రూపొందించింది. గ్రామీణ సమాజంపట్ల బాధ్యతగా ఆలోచించే రైతు సంఘాలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ఆర్థికవేత్తలూ, వ్యవసాయ శాస్త్రవేత్తలూ, పాత్రికేయులూ ఈ మేనిఫెస్టోను సమగ్రంగా పరిశీలించి అవసరమైన సూచనలిచ్చారు. ఆ వివరాలు పాఠకుల అవగాహన కొరకు ప్రచురిస్తున్నాం.
వ్యవసాయదారుల ప్రధాన డిమాండ్లు :
వ్యవసాయానికి రాష్ట్ర బడ్జెట్‌లో 10 శాతం కేటాయించాలి. దానిని ప్రతి సంవత్సరం 25 శాతం పెంచుతూ పోవాలి.
1. రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు పరిధిలో…
్న రైతుల ఆదాయ కమీషన్ ఏర్పాటు చేయాలి.
్న రాష్ట్ర వ్యవసాయ ఖర్చుల, ధరల కమీషన్ ఏర్పాటు చేయాలి.
్న పత్తి, మిరప, పసుపు, ఉల్లి, వేరుశనగ, చెరకు, పామాయిల్ లాంటి వాణిజ్య పంటలకు కమోడిటీ బోర్డులు ఏర్పాటు చేయాలి.
2. రైతు సేవా కేంద్రాలు
్న విస్తరణ, ఉత్పాదకాలు, మార్కెట్, ఆర్థిక సేవలు అందించేందుకు క్లస్టర్ (5 గ్రామాలు లేదా 3,000 ఎకరాలు) స్థాయిలో రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
్న వాస్తవ సాగుదారులందరికీ 4 శాతం వడ్డీతో (చిన్న, సన్నకారు రైతులకు, కౌలు రైతులకు, మహిళా రైతులకు, ఆదివాసీ రైతులకు వడ్డీలేని రుణాలు) సంస్థాగత రుణాలను అందజేయాలి.
్న సమగ్రమైన పంటల భీమా సౌకర్యాన్ని రైతులందరికీ, అన్ని పంటలకూ కల్పించాలి.
్న చిన్న కమతాలకు ఉపయోగపడేలా వ్యవసాయ సబ్సిడీ విధానాలను రూపొందించాలి.
3. సమగ్రమైన విపత్తుల నిర్వహణ
్న పంటలకు, పశువులకు సమగ్రమైన బీమా వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
్న సమగ్రమైన విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. బాధితులకు హుడా కమిటీ సిఫారసులననుసరించి తగినంత నష్టపరిహారం చెల్లించాలి.
్న కరువును ప్రకృతి వైపరీత్యంగా గుర్తించాలి. అందుకనుగుణంగా కరువు మాన్యువల్‌లో మార్పులు చేయాలి.
4. రైతులకు ఆదాయ భద్రత
్న రైతులకు ఆదాయ భద్రతను చట్టబద్ధ హక్కుగా కల్పించాలి. వ్యవసాయ ఆధారిత జీవనోపాధులకు న్యాయమైన, గౌరవప్రదమైన ఆదాయాలు చెల్లించాలి.
్న ఆహార పంటలతో సహా అన్ని పంటలకు న్యాయమైన గిట్టుబాటు ధరలు రైతులకు అందించాలి. రైతులకు ఈ ధరలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి.
్న పంటల ధరల స్థిరీకరణకు 1000 కోట్ల నిధిని ఏర్పాటు చేయాలి.
5. భూమి సమస్యలను పరిష్కరించాలి
్న భూ గరిష్ట పరిమితి చట్టాలను సమగ్రంగా అమలుచేసి, భూమిలేని పేదలకు భూ పంపిణీ చేయాలి.
్న మారిన పరిస్థితులకనుగుణంగా కౌలుదారీ చట్టాలను సమీక్షించాలి. కౌలు రైతుల హక్కుల రక్షణ లక్ష్యంగా తగిన మార్పులు, చేర్పులు చేయాలి.
్న వ్యవసాయేతర ఆదాయం కలిగినవారు, వృత్తులలో వున్నవారు వ్యవసాయ భూములు కొనకుండా నిషేధిస్తూ చట్టం చేయాలి.
్న నిర్దిష్ట కాలపరిమితిలో భూములు సర్వే సెటిల్‌మెంట్ జరపాలి.
్న వేరే పనులకు వ్యవసాయ భూముల మళ్ళింపు జరగకుండా సమగ్రమైన భూవినియోగ విధానాన్ని రూపొందించాలి.
్న అసైన్డ్ భూములను సాగు యోగ్యంగా మార్చడానికి, కనీస సాగునీటి వసతి కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేయాలి. అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకుండా ఆపాలి. అసైన్డ్ భూములకు సంబంధించి వివిధ అంశాలతో సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలి.
6. సాగునీరు అందరికీ అందేలా న్యాయమైన పంపిణీ చేయాలి
్న చిన్న నీటిపారుదల వ్యవస్థ మీద దృష్టి పెట్టాలి. ప్రస్తుతం పెద్ద డ్యాములు, ఎత్తిపోతల పథకాల మీద పెడుతున్న దృష్టిని, చిన్న, మధ్య తరహా సాగునీటి వ్యవస్థలను బలోపేతం చేయడం మీదికి మళ్ళించాలి.
్న చెరువుల పునరుద్ధరణ, కాల్వల నిర్మాణంతో సహా సంపూర్ణంగా జరగాలి. కొత్త చెరువులు తవ్వాలి.
్న కనీసం ఒక పంటకు సాగునీటి హామి కల్పించాలి. తక్కువ నీటితో పండించే పంటలను, పద్ధతులను ప్రోత్సహించాలి.
్న వర్షపు నీటి సేకరణ, సంరక్షణను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి.
్న రైతులతో నీటి సహకార సంఘాలను ప్రోత్సహించడం ద్వారా నీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించాలి.
7. మహిళా రైతులకు మద్ధతు వ్యవస్థలు కల్పించాలి
్న మహిళలకు భూమి పట్టాలు ఇవ్వడంపై శ్రద్ధ పెట్టాలి. వారికి సాగు యోగ్యం కాని ప్రభుత్వ భూములు పంపిణీ చేయటం కాక సీలింగ్ అదనపు భూములను మహిళలకు పంచాలి.
్న వ్యవసాయంలో వున్న మహిళలను ప్రభుత్వం రైతులుగా గుర్తించి, వారికి వనరులపై హక్కులతో పాటు అవసరమైన అన్ని రకాల మద్ధతు వ్యవస్థలను కల్పించాలి.
8. జన్యుమార్పిడి పంటలపై నియంత్రణ
్న అనంతమైన జీవ, విత్తన వైవిధ్యం వున్న భారతదేశానికి జన్యుమార్పిడి పంటలు అవసరం లేదు. కానీ ఇప్పటికే బి.టీ. పత్తి భారత వ్యవసాయంలో ప్రవేశించి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. మరిన్ని పంటలను క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి.
్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ సూచనల మేరకు సమగ్రమైన జీవ భద్రత వ్యవస్థ కల్పించనంత వరకు రాష్ట్రంలో జన్యుమార్పిడి పంటల క్షేత్ర ప్రయోగాలను అనుమతించకూడదు.
9. రాష్ట్రస్థాయిలో విత్తన చట్టం తేవాలి
్న విత్తనరంగంపై కార్పొరేట్ కంపెనీల పెత్తనాన్ని నియంత్రించాలి.
్న విత్తనోత్పత్తి చేసే రైతులకు రక్షణ కల్పిస్తూ విత్తన నాణ్యత, ధరలు, నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం తదితర అంశాలకు హామీ ఇస్తూ రాష్ట్రస్థాయిలో విత్తనచట్టం తేవాలి.
10. ఆత్మహత్య బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
్న రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలన్నింటికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఆయా కుటుంబాల వ్యవసాయాన్ని, జీవనోపాధులను బలోపేతం చేయడానికి మద్ధతు ఇవ్వాలి.
్న ఈ కుటుంబాలకు అంత్యోదయ కార్డులు, ఉచితంగా ఇల్లు ఇవ్వాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఋణాలను మాఫీ చేయాలి.
11. ఆదివాసీ ప్రాంత వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి
్న ఆదివాసీయేతరులు షెడ్యూల్డు ఏరియాలో భూములు కొనకుండా, కౌలు చేయకుండా నిషేధిస్తూ 1/70 చట్టాన్ని సమగ్రంగా అమలు చేయాలి. ఆ ప్రాంతంలో రసాయన ఎరువులు, పురుగు విషాల అమ్మకం పైనా, పంటల, జీవ వైవిధ్యాన్ని హరించే జన్యుమార్పిడి పంటలపైనా నిషేధం విధించాలి.
్న ఆదివాసీ ప్రాంత సాంప్రదాయ ఆహార పంటల సాగుకు మద్ధతు కల్పించాలి. ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూములను అభివృద్ధి పథకాల కొరకు సేకరణ చేయకుండా నిషేధించాలి.
్న ఆదివాసీ రైతుల భూములను, జీవనోపాధులను కబళించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయాలి.
12. వర్షాధార ప్రాంత వ్యవసాయ పరిరక్షణకు ప్రత్యేక మద్ధతు అందించాలి
్న పంటను కాపాడే కనీస రక్షిత సాగునీటి వ్యవస్థతో సహా, వర్షాధార వ్యవసాయం కోసం ప్రత్యేక లక్ష్యంతో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి. వర్షాధార ప్రాంతాలలో బీటి పత్తిని నిరుత్సాహపరిచే విధంగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి మెట్ట పంటలకు మద్ధతు వ్యవస్థను నిర్మించాలి. పశు సంరక్షణకు అవసరమైన చర్యలను చేపట్టాలి.
్న వర్షాధార వ్యవసాయాన్ని పునరుజ్జీవింపచేసేందుకు ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి.
13. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగించాలి
్న 4 హెక్టార్ల వరకు వ్యవసాయదారులందరికీ పగటిపూట 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలి.
్న సోలార్ విద్యుత్తు ఉత్పత్తిపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టి, వ్యవసాయ విద్యుత్ అవసరాలకు దీనిని కేటాయించాలి.
్న ఎత్తిపోతల పథకాలకు, సామాజిక బావులకు ప్రభుత్వమే పూర్తిగా ఉచిత విద్యుత్ అందించాలి.
14. వ్యవసాయంలో సుస్థిరత మరియు ఉత్పాదకత పెంపు
్న భూసార క్షీణత, నీటి సంక్షోభం, మెట్ట ప్రాంత పంటల పట్ల నిర్లక్ష్యం, వాతావరణ మార్పులు, రసాయన ఎరువులు, పురుగు విషాల దుష్ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వం పర్యావరణపరంగా సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహించాలి.
15. సాగుదారుల గుర్తింపు కార్డులు
్న గత ప్రభుత్వం ప్రారంభించిన కౌలురైతులకు ఋణ అర్హతా గుర్తింపు కార్డుల వ్యవస్థను సంస్థాగత ప్రక్రియగా మార్చాలి. సాగుదారులు/కౌలు రైతులు పెట్టుకునే ఒక దరఖాస్తు ఆధారంగా స్థానిక అధికారులు గ్రామసభలలో విచారణ జరిపి గుర్తింపు కార్డులను ఇవ్వాలి.
్న కౌలు రైతులందరికీ ఋణాలు అందేవిధంగా, వారిని నిర్మాణయుతం చేయాలి. కౌలు రైతులకు బ్యాంకులు ఋణాలు ఇచ్చేందుకు గ్యారంటీగా ప్రభుత్వం ఒక నిధిని ఏర్పరచాలి.
16. రైతులకు సామాజిక భద్రత
్న వ్యవసాయ కుటుంబాలు విద్య, వైద్యంపై పెడుతున్న ఖర్చును తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ కుటుంబాల పిల్లలకు ఉచిత విద్య, గ్రామీణ ప్రజలందరికీ నగదు రహిత వైద్యం అందించాలి. గ్రామీణ ప్రాంతాలలో వృద్ధులందరికీ గౌరవప్రదమైన ఫించన్లను అందించాలి.
17. గ్రామీణ వాణిజ్యం మరియు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రోత్సాహం
్న గ్రామీణ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి, ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించాలి. రైతులతో
ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేయాలి. మౌలిక వసతులను అభివృద్ధి చేయాలి.
్న వ్యవసాయ/ఆహార ప్రక్రియ, విలువ జోడింపు, వ్యవసాయ ఉత్పాదకాల ఉత్పత్తి, రైతులకు అవసరమైన సేవలు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గ్రామీణ ప్రాంతాలలో చిన్న పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు రావడానికి ఇది ప్రాతిపదిక అవుతుంది. దీనికి ఉపాధి అవకాశాల పెంపు ఖచ్చితమైన లక్ష్యంగా వుండాలి.
్న వైవిధ్యభరితమైన జీవనోపాధులను గ్రామీణ యువత ఎంచుకోవడానికి, క్రమబద్ధమైన శిక్షణ, నిపుణత పెంపు లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి.
్న వ్యవసాయదారుల ఉపాధిని దెబ్బతీస్తూ, వారి భూములను గుంజుకుంటూ, కాలుష్యాన్ని విరజిమ్ముతూ అభివృద్ధి పేరున ముందుకు వస్తున్న సెజ్‌లను, పారిశ్రామిక కారిడార్లను రద్దు చేయాలి.
సుప్రీం కోర్టు తీర్పుకనుగుణంగా పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలకు సంబంధించి దేశస్థాయిలో ఎన్నికల కమీషన్ జారీచేసిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, సెక్షన్ 8 ప్రకారం – మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తమ పార్టీ మానిఫెస్టోలలో ఇచ్చిన హామీలకు సంబంధించి, బడ్జెట్ ఎంత అవసరమవుతుంది? హామీల అమలుకు అవసరమైన నిధులను ఎక్కడి నుండి సమీకరిస్తారు? ఈ హామీల వల్ల ప్రయోజనం పొందే లబ్ధిదారులు ఎవరు? హామీల అమలుకు అవసరమైన నిబంధనలు, షరతులు ఏమిటి? తదితర విషయాలపై ఆయా రాజకీయ పార్టీలు ముందుగానే ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి. ప్రభుత్వంలోకి వచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చని పార్టీలపై కోర్టుకెళ్ళే హక్కు ప్రజలకు కల్పించాలి. అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేయని పార్టీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలి. ఆయా పార్టీల నాయకులను తదుపరి ఎన్నికలలో నిలబడకుండా నిషేదించాలి. ఏ పార్టీ లేదా కూటమి అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు, ఇతర డిమాండ్ల సాధనకు ఉద్యమించేందుకు రాష్ట్ర రైతాంగం సిద్ధం కావాలి. ( రైతు స్వరాజ్య వేదిక)