భూమిక ఉమెన్స్ కలెక్టివ్ హెల్ప్‌లైన్ ద్వారా, పత్రిక ద్వారా అందరికీ సుపరిచితమే. మొట్టమొదటిసారి క్షేత్ర స్థాయిలో పనిచేయడానికి గాను మహబూబ్‌నగర్ జిల్లా మద్దూరు, దామరగిద్ద మండలాలను ఎంపిక చేసుకుని ”బాల్య వివాహాల నివారణ”పై కార్యక్రమాలను చేపట్టడం ప్రారంభóమైంది. రెండు మండలాల్లోని 102 గ్రామాల్లో (తండాలతో సహా) అంగన్‌వాడి కార్యకర్తలు, పాఠశాలల ఉపాధ్యాయులు, మహిళా సంఘాలు, గ్రామ పంచాయితి సభ్యులు, మరీ ముఖ్యంగా యుక్త వయసు బాలబాలికలు మా ఈ ప్రయత్నంలో మాతో భాగస్వాములవుతారు.
బాల్య వివాహాల నిరోధానికై ఇప్పటికే చట్టాలున్నా వాటి అమలు తీరు అన్ని చట్టాల్లాగే లోపాలమయంగా ఉంది. బాల్య వివాహాల నిరోధక అధికారులైన (జవీూూర)వారికి కూడా వారే ఆ అధికారులన్న అవగాహన లోపించింది. ఇక తల్లిదండ్రులు, సమాజం బాలికల రక్షణ, ఆర్ధిక స్థితిగతులు లాంటి కారణాలను చూపిస్తూ అమ్మాయిలకు పట్టుమని 15 ఏళ్ళు వచ్చీ రాకముందే పెళ్లి చేసేసి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి. వీరికి చట్ట ప్రకారం అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 ఏళ్ళు నిండాకే పెళ్ళి చేయాలని చెప్పగానే ఎదురయ్యే ప్రశ్నలకు ఎవ్వరైనా సమాధానాలు వెతుక్కోవలసిందే.
ఈ నేపథ్యంలో బాల్య వివాహాలను నిరోధించడం కాకుండా నివారణే జవాబుగా భూమిక ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. పీటల మీద పెళ్ళి ఆపే వరకు రాకుండా అమ్మాయికైనా అబ్బాయికైనా వివాహ వయసు వచ్చాకే పెళ్ళి మాటలు జరపాలన్న ఆలోచనాత్మక మార్పు దిశగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. ఈ క్రమంలో ముందుగా అధికార యంత్రాంగాన్ని సమాచార పరంగాను, దృక్పథం పరంగాను బలోపేత పరచడానికి సహకారాన్ని అందిస్తూ, ప్రజలలో సామాజిక మార్పుకై పని చేయడమే మా ఉద్దేశం.
ఇందుకుగాను ఐసిడియస్, పోలీస్, రెవెన్యూ, పంచాయితీ అధికారులతో పాటు మహిళా సంఘాల ప్రతినిధులతో ఒకవైపు; బాలబాలికలతో, వారి తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో మరోవైపు విస్తృతంగా పని చేయడం ప్రారంభించాము. మండల, గ్రామ అధికారులంతా మా యీ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించి మాకు సహకరిస్తున్నారు. ఈ ప్రయత్నం ద్వారా ఈ రెండు మండలాలు రాష్ట్రంలోనే బాల్య వివాహ విముక్తి మండలాలుగా నిలిచిపోవాలనిది మా ఆశయం… లక్ష్యం…