వ్యవసాయంలో పెట్టుబడులు రోజు రోజుకు పెరిగిపోతుం డడం మనకందరికీ తెలిసిన విషయమే. దీని వలన చిన్న, సన్నకారు రైతుల జీవనోపాదులు/జీవనాలు, ఆహార భద్రత ఒడిదుడుకులలో వున్న విషయం జగమెరిగిన సత్యం. ఈ కారణాల వలన చిన్న, సన్న కారు రైతులు వ్యవసాయం లాభసాటి కాదని భావించి వ్యవసాయాన్ని వదలి చిత్తూరు, అనంతపురం జిల్లాలలో కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాలకు వలసలుపోతున్నారు. ఈ వలసలకు ముఖ్యంగా కుటుంబంలోని మగ రైతులు, కొన్ని ప్రాంతాలలో భార్య భర్త కలసిపోతున్నారు. ఈ వలసలు వలన మహిళలలో ఆహార భద్రత కరువై, పౌష్టికాహార లోపాలు, రక్త హీనతకు లోనై తక్కువ బరువున్న పిల్లలను ప్రసవించడం, ప్రసవించిన పిల్లలు కొద్దిరోజుల లోనే చనిపోవడం జరుగుతున్నది. కాలానుగుణంగా రైతులు ఆహార పంటల సాగు నుండి వాణిజ్య పంటల సాగుకు మళ్లడం వలన ఆహార భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. పై వాటికి కారణాలు విశ్లేషిస్తే వ్యవసాయంలో సమీకృత వ్యవసాయ విధానాలు/ వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు ఆచరణలో లోపాలు వలన వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదనేది కొందరు మార్గదర్శక రైతుల వ్యవసాయ విధానాలు పరిశీలిస్తే మనకు అర్థమైన విషయం. సమీకృత వ్యవసాయ విధానాల ద్వారా మహిళల ఆహార భద్రత పెరిగిన విషయం మహిళా అభివృద్ధి సొసైటీ, హైదరాబాద్ బి యఫ్ టి డబ్ల్యు – జర్మని సహకారంతో గత 1.5 సంవత్సరాలుగా అమలు పరుస్తున్న జి4 ప్రాజెక్ట్ విజయాలు ఈ క్రింది విధంగా వున్నాయి.
చిరుధాన్యాలు/అంతర పంటల సాగు ద్వారా పెరిగిన ఆహార భద్రత : చిత్తూరు, అనంతపురం జిల్లాలలో ఖరీఫ్ 2015-16 సం||లో చిరుదాన్యాలైన సామ (లిటిల్ మిల్లెట్), కొర్ర (ఫాక్స్ టైల్ మిల్లెట్), ఆరిక (కొడ్ మిల్లెట్), పరిగలు (కామన్ మిల్లెట్) విత్తనాలు 180 ఎకరాలు విస్తీర్ణం గాను నల్లమాడ, వి.కోట మరియు రామ సముద్రం మండలాలలో పంపిణి చేయడం జరిగింది. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వలన దాదాపు 120 ఎకరాలలో వర్షాధారంగా సాగు చెయ్యడం జరిగింది. చిరుధాన్యాలు భూసారం తక్కువ వున్న నేలలలో కూడ బాగా పండుతాయి. చీడ పీడలు తక్కువ. తక్కువ వర్ష పాతంలోనైన పండగలవు అని రైతులకు వివరించడం జరిగింది. చిరు ధాన్యాలు పండించే భూములలో జీవ వైవిధ్యం బాగా కనిపిస్తుంది. అదే విధంగా వేరుశనగలో, చిరుధాన్యాలలో అంతర పంటగా కంది, పెసర, అనుములు (అనప), జొన్న, అలసందలు, వెర్రి నువ్వులు మరియు ఆముదం విత్తనాలు 180 ఎకరాలకు పంపిణి చెయ్యడం జరిగింది.
వరి, గోధుమతో పోలిస్తే చిరుధాన్యాలలో పోషకాల వివరాలు
పంట మాంస పీచు(గ్రా) ఖనిజ ఇనుము కాల్షియం
కృత్తులు లవణాలు (గ్రా) (గ్రా)
(గ్రా)
సజ్జలు 10.6 1.3 2.3 16.9 38
రాగులు 7.3 3.6 2.7 3.9 344
కొర్రలు 12.3 8 3.3 2.8 31
పరిగలు 12.5 2.2 1.9 0.8 14
ఆరికలు 8.3 9 2.6 0.5 27
సామలు 7.7 7.6 1.5 9.3 17
వరి 6.8 0.2 0.6 0.7 10
గోధుమ 11.8 1.2 1.5 5.3 41
చిరుధాన్యాలు మరియు అంతర పంటల సాగు వలన పెరిగిన ఆహార భద్రత వారి మాటలలో: శ్రీమతి సరస్వతి, బసిరెడ్డిపల్లి – నల్లమాడ మండలం.” మేము చిరుధాన్యాల సాగును క్షేత్ర సందర్శన ద్వారా టింబక్టు సంస్థ కార్యక్రమాలు ద్వారా చూసి, ఆ ప్రేరణతో ఈ సంవత్సరం నా భర్తను ఒప్పించి 1 ఎకరం విస్తీర్ణంలో కొర్ర, అంతర పంటగా కంది, అలసంద, వెర్రి నువ్వులు, ఆముదం వెయ్యడం జరిగింది. వర్షాభావం వలన పంట తొలిదశలో ఎదుగుదల తక్కువగా ఉన్నప్పటికీ తరువాత వచ్చిన వర్షాల వలన పంట ఎదుగుదల చాలా బాగుంది, అంతర పంటలు కూడా బాగున్నాయి. పై పంటల సాగువలన మా కుటుంబానికి 6 నెలల ఆహారం లోటు వుండదు. అదే విధంగా పప్పు ధాన్యాల సాగు వలన ఆదనంగా సంవత్సరం పాటు పప్పు దినుసులు కొనే ఖర్చు ఆదా అవుతుంది. మొదట మా పొలంలో పెసర, తరువాత అలసంద కోతకు వచ్చినవి. దీని ద్వారా పౌష్టికాహారం, తాజా కూరగాయలు తింటున్నాము. ప్రతిరోజు ప్రక్క గ్రామాల రైతులు వచ్చి మా పొలం చూసుకొని వచ్చే సంవత్సరానికి మేము కూడా సాగు చేస్తామని విత్తనాలు ఇవ్వమని అడుగుతున్నారు.
పెరటి కోళ్ళ పెంపకం: జి4 ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు ప్రాజెక్ట్ ఏరియాలో 1124 రాజశ్రీ పెరటి కోళ్ళు భూమిలేని 128 కుటుంబాలకు పంపిణి చేయ డం జరిగింది. ఈ రాజశ్రీ
కోళ్ళు సంవత్సరంలో 6 నెలలు పాటు గుడ్లు పెడతాయి. ఈ పెరటి కోళ్ళు ద్వారా కుటుంబం లోని పిల్లలకు, మహిళలకు పౌష్టికాహారంతో పాటు గుడ్లు అమ్మడం ద్వారా కూడా అదనపు ఆదాయం వస్తున్నది. ఒక కోడి గుడ్డును రూ.5/-లకు అమ్ము తున్నారు.
రమణమ్మ, గుంత ఎంబాడి: నేను గాంధీ శక్తి సంఘం సభ్యురాలను, ప్రతి నెల సమావేశాలు పెట్టుకొంటూ వ్యవసాయ జీవనోపాధులు గురించి చర్చించుకొంటాము. మా గ్రూపులో ప్రతి సభ్యురాలికి 8 రాజశ్రీ కోడి పిల్లలు ఇవ్వడం జరిగింది. అవి ఇప్పుడు ప్రతి రోజు గుడ్లు పెడుతున్నాయి. కోడి పెట్టిన గుడ్లలో కొన్ని పిల్లలకు, బాలింతలకు (మహిళలకు) ఇస్తూ కొన్నింటిని పొదగడానికి పెడుతున్నాము. దీనివలన కోళ్ళ సంతతి పెంచుకొంటాము. నేను కొన్ని గుడ్లను రూ. 5/- లు చొప్పున అమ్ముతూ కూలి కాక అదనపు ఆదాయం సంపాదిస్తున్నాను.
పెరటి తోటల పెంపకం: జి4 ప్రాజెక్ట్‌లోని కుటుంబాల పౌష్టికాహార లోపాలను సవరించటానికి, తాజా కాయగూరలు తినడానికి పెరటి తోటల కార్యక్రమం చేపట్టడం జరిగింది. పెరటి తోటలు పెంచటానికి ప్రాజెక్ట్ నుండి మునగ, పందిరి చిక్కుడు, సొర, క్యారట్, పొద చిక్కుడు, బీర విత్తనాలు ఇవ్వడం జరిగింది.
పద్మిని బాయి, యస్.వి.తాండ : నాకు జి4 ప్రాజెక్ట్ ద్వారా కూరగాయల విత్తనాలు ఇవ్వడం జరిగింది. నేను ఇంటి దగ్గర గుంత తీసి మాగిన పశువుల పెంట వేసి పందిరి చిక్కుడు వెయ్యడం జరిగింది. చీడకు కూడ వేప ఆకు నూరి గంజిలో కలిపి చల్లడం జరిగింది. చిక్కుడు కాయలను మా ఇంటికి సరిపోగా ప్రక్క ఇంటి వారికి కూడా ఇస్తున్నాము. మాకు కావలసిన కూరగాయలను ప్రక్క ఇంటివారు కూడా ఇస్తుంటారు. ఈ కార్యక్రమం వలన తాజా కూరగాయలు తింటూ ఖర్చు తగ్గించుకొంటూ, ఆహార భద్రత పెంచుకొంటున్నాము.
చిన్న జీవాల పెంపకం: జి4 ప్రాజెక్ట్‌లో భూమిలేని వ్యవసాయ కూలీల జీవనోపాధుల పెంపుకోసం గొర్రెలు మరియు పొట్టేళ్ళు పెంపకం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా గొర్రెలు, పొట్టేళ్ళు, చేపల పెంపకం, కుండల తయారీ, బుట్టల అల్లకం కోసం శక్తీ సంఘాలలో 23 కుటుంబాలను ప్రోత్సహించడం జరిగింది.
భారతి, సుద్దులకుప్పం: నేను చాముండేశ్వరి శక్తి సంఘంలో సభ్యురాలను. జి4 ప్రాజెక్ట్/సంఘం ద్వారా నాకు గొర్రె కొనుక్కోవడానికి రూ.3500 లు ఇ్వడం జరిగింది. ఈ లోన్ ద్వారా ఒక గొర్రెను కొనుక్కోవడం జరిగింది. దీని ద్వారా సంవత్సరంలో 2 గొర్రె పిల్లలు పుడుతాయి. ఇదే విధంగా సంఖ్య పెంచుకొంటాము. ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు కుటుంబంలో విలువ, ఆదనపు ఆదాయం ద్వారా ఆహార భద్రత పెరుగుతుంది.